Archives

                     జీవితం న్యాయమా ?అన్యాయమా ? 

విలువ : ధర్మం

ఉపవిలువ : సత్ప్రవర్తన .

కర్ణుడు , కృష్ణుడి తో ఇలా అన్నాడు – “జీవితం లో నాకు చాలా అన్యాయం జరిగింది . వివాహం కాని యువతికి జన్మించటం నా తప్పా ?నేను పుట్టిన తక్షణమే నా తల్లి నన్ను విడిచి పెట్టింది . రాజభవనం లో పెరగవలసిన నేను సూతుని ఇంట పెరగ వలసి వచ్చింది. సూత పుత్రునిగా పరిగణించ బడటం వలన ద్రోణాచార్యుల వారి వద్ద ధనుర్విద్య పూర్తిగా నేర్చుకోలేక పోయాను . “ పరశురాముని వద్ద విద్య సంపూర్ణంగా నేర్చుకున్న ప్పటికీ నేను క్షత్రియుడను కావడం వలన యుద్ధ సమయంలో తాను నేర్పిన విద్య నాకు గుర్తు రాకుండా ఉండాలి అని శాపం పొందవలసి వచ్చింది . ఇది నా తప్పేనా? అసలు విద్య నేర్చుకుంటున్నప్పుడు నేను క్షత్రియ వంశం లో పుట్టానని నాకు తెలియదు .

      “ఒక బాలుడు పరుగున వచ్చి నా రథం క్రింద పడినాడు ,అది ఒక ప్రమాదం (ఆక్సిడెంట్ ) అయినప్పటికీ ఆ పిల్లవాని తండ్రి నన్ను శపించాడు”.  ద్రౌపది  స్వయంవరం లో కూడా నేను సూర్య పుత్రుడిని అయినప్పటికీ సూతపుత్రుడినని అవమానించ బడ్డాను. 

               కుంతీ దేవికి  తన మిగతా సంతానం పైన వాత్సల్యం ఎక్కువ. ఆమె నాకు ఎన్నడూ నేను తన కుమారుడిని అన్న సత్యం చెప్పలేదు. ఆఖరికి నిజం చెప్పినప్పటికీ తన పిల్లలపైన  రెండవసారి ఆయుధం ప్రేయోగించ వద్దని కోరింది . ఒక తల్లిగా ఆవిడ నా పట్ల అలా  ప్రవర్తించినప్పటికీ  నేను ఆమె కోరినవన్నీ నెరవేరుస్తానని  ఒప్పుకున్నాను .  నాకు   “కురుకుల ” సింహాసనం లభించవలసి ఉన్నప్పటికీ దుర్యోధనుడి దయా దాక్షిణ్యాల వలన లభించిన చిన్న రాజ్యాన్ని మాత్రమే పరిపాలిస్తున్నాను . “ భీష్మాచార్యుల వారు కూడా నా శక్తి సామర్ధ్యములను గుర్తించకుండా నన్ను శంకించటమే  కాకుండా  తాను సైన్యాధ్యక్షుడిగా  ఉండగా నేను యుద్ధరంగానికి వచ్చి యుద్ధం చేయకూడదని అన్నారు”. 

          ఈ నాడు నేను ఈ దుస్థితి లో కూడా ఇలా ఉన్నానంటే దానికి కారణం దుర్యోధనునితో  నాకు గల స్నేహమే . మీకందరికీ అతను దుష్టుడిగా కనిపించవచ్చేమో కానీ అతను నాకు ఎప్పుడు మంచే చేశాడు . దేవతలందరూ నన్ను విడిచిపెట్టినప్పటికీ అతను మాత్రం నాతోనే ఉన్నాడు . అందువల్ల నేను అతని పక్షాన ఉండటంలో తప్పు ఏముంది? అని శ్రీ కృష్ణుడిని ప్రశ్నించాడు. 

కర్ణుడు అడిగిన ప్రశ్నలకి శ్రీ కృష్ణుడి సమాధానాలు :

   కర్ణా ! నేను జైలులో పుట్టాను నా పుట్టుకకు ముందే మృత్యువు నా కోసం వేచి ఉన్నది . నేను పుట్టిన రాత్రే తల్లి నుండి వేరు చేయబడ్డాను . సూతుడి ఇంట్లో నీకు కొంతైనా విద్యాభ్యాసం జరిగింది . చిన్నప్పటినుండీ నువ్వు కత్తులు ,రథాలు ,గుర్రాలు ,ధనుర్భాణాల ధ్వనుల మధ్య పెరిగావు . మరి నేనేమో పశువుల పాకలోనే పెరిగాను .అక్కడ కత్తులు ,రథాలు ఏమి లేవు ఉన్నదల్లా ఆవు పేడ ,ఆవులు ,గొల్లభామలు . మరొక పక్కన నా మీద సొంత మేనమమమామ అయిన కంసుడి  హత్య యత్నాలు . వాళ్ళ సమస్యలన్నిటికీ నేను కారణ మంటూ ప్రజలు అనటం నాకు వినిపిస్తూనే  ఉంటుంది. తప్పించుకు పారిపోయే పిరికిపంద అని కూడా నన్ను అంటూ ఉంటారు . మీరందరు గురువుల  చేత మెప్పును పొందుతూ ఉంటే నేనసలు గురుకులానికి వెళ్ళనే లేదు . పదహారేళ్ళు వచ్చాక మాత్రమే నేను సాందీప  మహర్షి గురుకులంలో చేరాను . 

       నాకు ఏ సైన్యమూ లేదు . అతి చిన్న వయసులో మేనమామ ను చంపినందుకు నిందింప బడ్డాను . జరాసంధుని భయం వలన యమునా నదీ తీరం నుంచి చాలా దూరం సముద్రపు ఒడ్డున మొత్తం నా జాతి ప్రజలందరితో కలిసి పారిపోయి బ్రతకవలసి వచ్చింది . అది మాకు చాలా కొత్త చోటు . నీకు ఒక రాజ్యంమైనా ఉన్నది . మరి నాకేది రాజ్యం ? నాకు ఎంత మాత్రం పరిచయం లేని ఆడపిల్లలు తమని పెళ్ళి  చేసుకోమని ,కాపాడమని ప్రార్థిస్తే , చేస్తున్న పనులన్నిటినీ  ఎక్కడికక్కడ వదిలి పెట్టి , వారిని రక్షించి ,పెళ్ళాడవలసివచ్చింది . నేను ప్రేమించిన అమ్మాయి నాకు ఎన్నడూ దక్కలేదు . కానీ, నన్ను  ప్రేమించిన వాళ్ళందరూ నన్ను పొందగలిగారు . 

      ఒకవేళ దుర్యోధనుడు యుద్ధం లో గెలిస్తే నీకు చాలా గొప్ప పేరు ,మరింత కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి . మరి నేనో  ! కేవలం ఒక సారధిని ! ధర్మజుడు యుద్ధంలో గెలిస్తే నాకు ఏమి వస్తుంది?ఇప్పటికే ఈ యుద్ధానికి ,ఎదురైన సమస్యలకి  నేనే కారణమని నన్ను నిందిస్తున్నారు . ధర్మరాజు గెలిచినా, ఓడినా నాపై పడిన ఈ నింద పోదు . 

ఒక్క విషయం బాగా గుర్తుంచుకో కర్ణా ! జీవితం లో ప్రతి ఒక్కరికి అనేక సవాళ్ళు ఎదురవుతాయి . జీవితం ఎవ్వరికీ పూల పాన్పు కాదు దుర్యోధనుడికి జీవితంలో అనేక విధములుగా అన్యాయం జరిగింది అదే విధంగా యుధిష్ఠిరుడికి కూడా . ఏది ధర్మమో అది నీ అంతరాత్మకే తెలుసు .మనకి ఎంత అన్యాయం జరిగింది , మనం ఎన్ని సార్లు తిరస్కరించబడ్డాము? అన్నది ముఖ్యం కాదు ఆ సమయాల్లో మీరు ఏవిధంగా స్పందించారు అన్నదే చాలా ముఖ్యమైన విషయం. అదే మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది . ఊరికే రచ్చ చేయటం మానుకో కర్ణా ! అంతరాత్మ ప్రభోధించిన మార్గం లో మనం నడుద్దాము . జీవితంలో అన్యాయం జరిగిందంటే అది తప్పు త్రోవలో నడవటానికి అనుమతిని మంజూరు చేసినట్లు కాదు .

నేర్వవలసిన నీతి :జీవితం ఎప్పుడు సాఫీగా ఉండదు . మన పరిస్థితులను ఎదురుకోవటానికి చక్కదిద్దు కోవటానికి యధా శక్తి ప్రయత్నం చెయ్యాలి . పరిస్తుతులు మన చేయి దాటి పోయినప్పుడు నిరాశతో క్రుంగి పోవడం వలన ఇతరులను నిందించడం వలన తప్పుడు మార్గంలో వెళ్ళటం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు . అలా కాకుండా తప్పొప్పులను చక్కగా విచారించుకు ని విచక్షణతో సరైన మార్గాన్ని అనుసరిస్తే మనలోనే మనకి శాంతి లభిస్తుంది .

ధర్మాచరణ

విలువ : ధర్మము   

ఉప విలువ : బాధ్యత

ప్రహ్లదుడు, శ్రీమన్ నారాయుని భక్తుడే కాకుండా,ధర్మపరాయణుడు . ఆయన అందరికీ, సహాయం చేసేవారు.

ఒక రోజు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో, ప్రహ్లాదుని పరీక్ష చెయ్యడానికి వచ్చారు. ప్రహ్లాదుడు బ్రాహ్మణుడికి తగిన మరియాదలు చేసి, ‘నేను మీకు ఏమి ఇవ్వగలను ? మిమ్మల్ని ఎలా సంతోష పెట్టగలనో తెలుపండి”, అని అడిగాడు.

అప్పుడు బ్రాహ్మణుడు ప్రహ్లాదుడిని, తన శీలాన్ని బహుమతిగా ఇమ్మని కోరాడు.
అతను కోరినట్లే ప్రహ్లాదుడు తన శీలాన్ని సంతోషంగా దానం చేశాడు .

బ్రాహ్మణుడు వెళ్ళగానే అతని వెనకాలే ఎంతో తేజస్సు గల ఒక పురుషుడు బయలుదేరాడు.
అతడే శీలము. వెంటనే అతని వెనుక మరొక మనోహరమైన వ్యక్తి, దర్బారు నుంచి వెళ్ళిపోతున్నాడు, ‘మీరు ఎవరు?”, అని ప్రహ్లాదుడు అతనిని అడిగారు ‘
“నా పేరు కీర్తి, శీలము నిన్ను విడిచి పెట్టింది కనుక, నేను ఇక నీతో ఉండలేను” అని జవాబు చెప్పారు,ఆయన.

కొద్ది క్క్షణాలలో ఇంకో మనోహరమైన వ్యక్తి, దర్బారు నుంచి వెళ్ళిపోతున్నాడు. “మీరు ఎవరు?” అని ప్రహ్లాదుడు అడిగారు . “నా పేరు, ధైర్యము, నిన్ను శీలము, కీర్తి విడిచి పెట్టాయి కనుక, నేను నీతో ఉండలేను.” అని వెళ్ళిపోయాడు.ఇదే విధంగా తన రాజ్యానికి దేవత అయిన “రాజ్య లక్ష్మి “కూడా తనని వదిలి వెళ్ళిపో సాగింది.

కొద్ది క్షణాలలో ఒక దేవత కంట తడితో దర్బారు నుంచి వెళ్వెళ్ళిపోతోంది. అప్పుడు ప్రహ్లాదుడు ఎంతో వినమ్రంగా ” అమ్మా ! మీరు ఎవరు?”, అని అడిగారు . “నా పేరు ధర్మ దేవత శీలము , కీర్తి , ధైర్యము ,రాజ్యలక్ష్మి ఉన్నచోటే నేను నివసిస్తాను . వారంతా నిన్ను విడిచి పెట్టి వెళ్ళిపోయారు కనుక , నేను కూడా వెళ్ళిపోతున్నాను “ ,అని అంది ధర్మ దేవత.

అప్పుడు ప్రహ్లాదుడు, “ శీలము, కీర్తి , ధైర్యము, లేకపోయినా నేను ఉండగలను.కాని నేను రాజుని కనుక ,ధర్మంగా ప్రజలని చూసుకోవడం నా బాధ్యత. నువ్వు నన్ను వదిలి వేళ్ళకు”, అని ప్రాధేయ పడ్డారు ప్రహ్లాదుడు.

అప్పుడు ధర్మ దేవత సంతోషంగా ఉండిపోయింది. శీలము, కీర్తి, ధైర్యము, రాజ్యలక్ష్మి అందరూధర్మ దేవత తో పాటు ఉండిపోయారు.

లోకానికి , ప్రహ్లాదుడి ధర్మమూ, నీతి ఎలాంటిదో చెప్పడానికి, ఇంద్రుడు అతనిని ఇలా పరీక్ష చేశారు.

నీతి:
మహానుభావులు, నడిచే విధానము, వాళ్ళు చెప్పిన పాఠాలు మనల్ని మంచి మార్గంలో పెడతాయి.
మనము వాటిని మన జీవితంలో అమలు పరుచుకుంటే, భౌతిక విషయాలలోనే కాకుండా, ఆధ్యాత్మిక విషయాలలో కూడా మంచి ఫలము, లాభము పొందుతాము.

https://saibalsanskaar.wordpress.com/2017/04/12/practice-of-dharma/

బ్రహ్మ జ్ఞానమును పొందుట

.

    విలువ :   ధర్మ 

ఉప విలువ :  ఆత్మ జ్ఞానము.

ఒకానొకప్పుడు ఒక శిష్యుడు , ఒక గురువుగారి వద్దకి వెళ్ళి  బ్రహ్మ జ్ఞానమును     బోధించమని అర్ధించాడు. గురువుగారు అతనికి ఒక మంత్రాన్ని ఉపదేశించి ఎటువంటి స్వార్ధపూరితమైన కోరిక  లేకుండా  ఆ మంత్రాన్ని ఏడాది పాటు జపించి ఆ తరువాత బ్రహ్మ జ్ఞానమును పొందటానికి రమ్మని చెప్పారు.   ఒక సంవత్సర కాలం ఆ మంత్ర జపం చేసిన తరువాత శిష్యుడు గురువు దగ్గరకి వచ్చి “గురుదేవా సంవత్సరమంతా  మంత్రం జపం చేసి వచ్చాను”. అన్నాడు. గురువుగారు ఏమి చెపుతారో అని ఆసక్తితో  ఎదురు చూస్తూన్నాడు . గురువుగారు తనకి  తప్పకుండ  బ్రహ్మ జ్ఞానము గురించి  బోధిస్తారని ఆశ పడ్డాడు. అదే సమయంలో అక్కడి పరిచారిక, ఆశ్రమం ఆవరణ అంతా తుడిచి చూసుకోకుండా ఆ దుమ్మంతా శిష్యుడి మీద పోసింది. శిష్యుడు ఆ పని మనిషి పైన కోపంతో మండి పడ్డాడు అప్పుడే శుభ్రంగా స్నానం చేసి వచ్చిన అతని బట్టలు మొత్తం మట్టి కొట్టుకు పోయాయి.అతను కోపంగా చూడటం వలన ఆ పరిచారిక చాలా భయపడింది. గురువుగారు  జరుగుతున్న సంఘటనను గమనిస్తున్నారు . 

                                బ్రహ్మ జ్ఞానమును బోధించటానికి నీవు  అర్హుడవు కాదు . చూసుకోకుండా దుమ్ము పోసినందుకే నీవు పని అమ్మాయి పైన కోపించావు. ఆ పాటి సహనం లేని వాడికి బ్రహ్మ జ్ఞానము ఎలా బోధించగలరు ? “వెనుకకు వెళ్ళిపోయి మళ్ళీ ఒక సంవత్సరం  పాటు మంత్రం జపం చేసి రా “,  అని గురువుగారు చెప్పారు . 

                         రెండవ సంవత్సరం ఆ శిష్యుడు మంత్రం జపం ఏడాది పాటు చేసి ఆశ్రమం లోకి ప్రవేశించబోతున్నాడు . గురువుగారి ఆదేశం మేరకు ఆ పనిమనిషి మళ్ళీ  ఆ శిష్యుడి మీద దుమ్ము పోసింది . కోపం లో రెచ్చిపోయిన ఆ శిష్యుడు ఆ పనిమనిషిని కొట్టబోయి ఎలాగో తమాయించుకున్నాడు . శిష్యుడు గురువుగారి దగ్గరకు వెళ్ళి  నమస్కరించాడు . బ్రహ్మ తత్వమును ఉపదేశించటానికి ఇంకా నీకు అర్హత రాలేదు . క్రిందటి సంవత్సరం నీవు పాము లక్షణాలను ప్రదర్శించావు . ఇప్పుడు నీవు కుక్క  లక్షణాలను ప్రదర్శించావు  . నీలో ఈ పశు లక్షణాలు పోయిన తరువాతనే నీవు నా దగ్గరకి రా! అని అన్నారు . గురువుగారు . 

                       మూడవ సంవత్సరం లో చివరలో శిష్యుడు శుభ్రంగా  స్నానం చేసి ఆశ్రమానికి వెళ్ళాడు. గురువుగారు ఆదేశం మేరకు పనిమనిషి మళ్ళీ శిష్యుని మీద మురికి నీళ్ళు  పోసింది . శిష్యుడు ప్రశాంతంగా ఆ పరిచారికకు నమస్కారం చేసి,”తల్లీ  !నీకు నా ప్రణామములు అర్పిస్తున్నాను . క్షమ అనే గొప్ప సుగుణాన్ని అలవరించుకోవటానికి నీవు నాకు ఎంతగానో సహాయపడ్డావు . ఇప్పుడు నేను నా గురువు అనుగ్రహాన్ని పొందటానికి అర్హుడనైనాను . ఇక ఎప్పటికీ  నేను నీకు ఋణపడి ఉంటాను , కృతజ్ఞతతో ఉంటాను.”అని చెప్పాడు . 

                      శిష్యుడు గురువుగారికి సాష్టాంగ దండ ప్రణామం చేయగానే గురువు గారు  ఎంతో ప్రేమతో,”నాయనా ! బ్రహ్మ జ్ఞానాన్ని పొందటానికి ఇప్పుడు నీవు పూర్తిగా ఆర్హుడవు అని చెప్పాడు. 

నేర్వవలసిన నీతి : భగవంతుని నామస్మరణ  చేయటం , నిస్స్వార్ధ సేవ చేయటం ,శాస్త్రములను అధ్యయనం చేయటం ,ఆదర్శవంతమైన జీవితం గడపటం వంటి అంశములన్నీ  ఆధ్యాత్మికత ప్రయాణములో చేసేటువంటి సాధనలు  మాత్రమే. ప్రతి ఒక్కరు (సాధకులైనవారు ) ముందుగా అంటే స్వీయ నియంత్రణను అలవరచుకోవాలి  ,ఆహంకారమును పోగొట్టుకోవటం , తనను తాను  అదుపులో పెట్టుకోగలగటం లో పరిణితి సాధించగలిగినప్పుడు ఆత్మ సాక్షాత్కారమునకై  తపన ప్రారంభం అవుతుంది.  సరైన సమయం వచ్చినప్పుడు అటువంటివారికి ఆత్మ జ్ఞానం కలుగుతుంది . కాయ ఇంకా పండకుండా పచ్చిగా ఉన్నప్పుడు ఎంత  బలం గా గాలి వీచినప్పటికీ అది రాలి క్రింద పడదు. కానీ పండు బాగా పండినప్పుడు రాత్రి నిశ్శబ్ద వేళలో కూడా నేలపై పడిపోతుంది . 

https://saibalsanskaar.wordpress.com/2017/02/22/receive-the-knowledge-of-the-supreme/

నిజమైన స్నేహితుడు

విలువ  : ధర్మము 

ఉప విలువ  :  సత్ప్రవర్తన. 

     అతను తన స్నేహితునికి ఫోను చేసి “నాకు డబ్బు చాలా అవసరం ఉంది . మా అమ్మకి చాలా అనారోగ్యంగా ఉన్నది. ఆవిడకి చికిత్స  చేయించటానికి నా దగ్గర డబ్బు లేదు.” 

అప్పుడు ఆ స్నేహితుడు , “అలాగే ఫ్రెండ్ ! కొద్దిసేపటి తరువాత మళ్ళీ నాకు ఫోన్ చెయ్యి. అన్నాడు. కొద్దిసేపటి తరువాత ఫోన్ చేస్తే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది.  ఇతను మళ్ళీ ,మళ్ళీ తన స్నేహితుడికి ఫోన్  చేస్తూనే  ఉన్నాడు అలసట వచ్చేదాకా. కానీ అవతలనుంచి సమాధానం రాలేదు.            

             ఇంకొక స్నేహితుని దగ్గరకి వెళ్ళి తన తల్లి చికిత్స కి డబ్బు అడుగుదామంటే సాయం చేసేవాళ్ళు ఎవరూ దొరకలేదు . నిరాశతో  ఇంటికి తిరిగి వచ్చాడు . ఇంటికి వచ్చేసరికి అతని తల్లి నిద్ర పోతూ ఉన్నది. ఆవిడ తలగడ పక్కన ఒక సంచి నిండా మందులు ఉన్నాయి. అతడు తన సోదరుడిని అడిగినప్పుడు “నీ స్నేహితుడు వచ్చి మందుల ప్రిస్క్రిప్షన్ తీసుకుని వెళ్ళి  ఈ మందులు తీసుకుని వచ్చి ఇచ్చాడు . ఇప్పుడే బయటకు వెళ్ళాడు. ఎంతో సేపు కాలేదు అతను వెళ్ళి ” అని చెప్పాడు. 

                     అతను ఎంతో సంతోషంతో ,నీళ్ళు  నిండిన కళ్ళతో తన స్నేహితుని వెతకటానికి వెళ్ళాడు. ఆ స్నేహితుడు కనిపించగానే “నీవు ఎక్కడికి వెళ్ళావు ?” ఎన్నో సార్లు నీకు ఫోన్ చేసినా  నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అన్నాడు . అప్పుడు ఆ స్నేహితుడు “నేను నా ఫోన్ అమ్మేసి మీ అమ్మగారికి మందులు తెచ్చి ఇచ్చాను అని చెప్పాడు. 

నీతి :

 అవసరంలో  ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. ఆపదలో , అవసరంలో ఉన్నప్పుడు ఆదుకుని సహాయపడేవాడు అసలైన స్నేహితుడు

మూలము: వాట్స్ఆప్ 

https://saibalsanskaar.wordpress.com/2017/02/08/a-true-friend-2/

అరుణి భక్తి

విలువ     :    ధర్మ 

ఉప విలువ :   గురువు పట్ల శిష్యునికి ఉండవలసిన ప్రేమ ,భక్తి . 

                        పూర్వం పాంచాల దేశంలో ధౌమ్యుడు అనే ఒకఋషికి  ఆరుణి అనబడే అంకిత భావం గల మంచి శిష్యుడు ఉండేవాడు. ఆరుణి  గురువు ఆశ్రమంలోనే  ఉంటూ నిత్యం ఆశ్రమం లో జరిగే కార్యక్రమములు  అన్నింటిలో పాల్గొని తన సేవలను అందిస్తూ గురువుగారి వద్ద దివ్యజ్ఞానమును పొందాలని అభిలషించేవాడు. 

                    ఒక రోజున చలి చాలా తీవ్రంగా ఉన్నది. ఆ రోజన ఆరుణి అడవి నుంచి సేకరించిన  కట్టెలను ఆశ్రమానికి తీసుకొస్తున్నాడు .  ఆశ్రమంలో తన గురువుగారి పొలం పక్కనుంచి వస్తూ పొలం గట్టున ఉన్న కాలువ ఒడ్డుకు గండి పడటం గమనించాడు . అలా గండి పడటం వలన

 పొలంలో నీరంతా బయటకు పోతున్నది. అలా మొత్తం నీరంతా పొతే నీరు లేక పొలం ఎండిపోతుంది ,పంట పూర్తిగా నష్టమైపోతుంది.  ఆరుణి ఈ విధంగా ఆలోచించాడు“ఇపుడు నేను ఏమి చేయాలి? నేను గండి పూడ్చటం కోసం ఇక్కడ ఉండిపోతే ఆశ్రమానికి కట్టెలు చేర్చలేను. కట్టెలు అందించలేకపోతే హోమం  లేక, ఆశ్రమం లో  అంతా చల్లగా అయిపోతుంది. అందువల్ల నేను త్వర,త్వరగా ఆశ్రమానికి వెళ్ళి  కట్టెలు ఇచ్చేసి మళ్ళీ  తిరిగి వచ్చి ఈ కాలువ గట్టును బాగు చేస్తాను.” 

                     ఈ లోగా ఆశ్రమంలో గురువుగారు పిల్లలకు పాఠాలు నేర్పటానికి సిద్ధంగాకూర్చుని ఉన్నారు . ఆరుణి  పాఠం నేర్చుకోవటానికి ఇంకా రాలేదు. ఇంతలో ఆరుణి హడావుడిగా వచ్చి ఆశ్రమంలో కట్టెలు అందచేసి గురువుగారికి కాలువ గండి పడిన విషయాన్ని చెప్పి వెంటనే తిరిగి పొలం దగ్గరకి వెళ్ళాడు.  అంత  భాద్యత గల శిష్యుడిని చూసి గురువు ధౌమ్యుడు చాలా ఆనందించాడు. 

                   వేగంగా పొలానికి తిరిగి వెళ్ళిన   ఆరుణి కాలువకు పడిన గండిని పూడ్చడానికి కొన్ని కట్టెలను  ,మట్టిని అడ్డుపెట్టాడు. అయినాకాని  నీరు కారిపోవడం ఆగలేదు. నీరు బాగా వేగంగా,ఉధృతంగా   ఉండటం వలన ఆరుణి కట్టిన తాత్కాలిక ఆనకట్ట కొట్టుకు పోయింది. 

ఆరుణికి ఏం చేయాలో తోచలేదు.  సమయం వ్యవధి తక్కువగా ఉంది. ఆ నీటిని ఆపటం ఎలాగో ఆరుణికి అర్థం కాలేదు. అతనికి వెంటనే ఒక ఆలోచన స్ఫురించింది  . నీరు కాలువ నుండి బయటికి పోకుండా ఆపటానికి  అతనికి ఒక ఉపాయం తోచింది. ఇంతలో సాయంకాలం అయింది, చీకటి పడింది. ఆరుణి  ఇంకా ఆశ్రమానికి తిరిగి రావకపోవటంతో ఆశ్రమంలో అందరూ కంగారు పడసాగారు. ధౌమ్యుడు తన శిష్యులందరితో కలిసి ఆరుణి ని వెదకటానికి బయలుదేరాడు. పొలం వద్దకు వెళ్ళి  “ఆరుణి !” అంటూ గట్టిగా  ధౌమ్యఋషి పిలిచారు. అప్పుడు ఆయనకు  బలహీనంగా ఉన్న ఒక గొంతు “ఇక్కడ ఉన్నాను గురువుగారు”అనటం వినిపించింది. అందరూ ఆ ధ్వనివినపడిన వైపుగా పరిగెత్తారు. తీరా చూస్తే నీరు బయటకు పోకుండా ఆరుణి ఆ కాలువ గండికి అడ్డముగా పడుకునున్నాడు. నీటిని ఆపటం అసాధ్యం కావటంతో , తానే  స్వయంగా  గండికి  అడ్డంగా పడుకున్నాడు అని గురువుగారికి అర్ధమైంది . శిష్యులంతా కలిసి ముందుగా, ఆరుణిని ఆ గడ్డ కట్టించే ఆ చల్లని నీటి నుండి  బయటకు  లాగేసారు.  కాలువ  గండిని  మనం కలిసి  పూడ్చివేద్దాం …  విచారించవద్దు “ఆరుణి “ అన్నారు  శిష్యులంతా .           

                 ఆరుణితో “,  బిడ్డా ! ఈ పంట కంటే నీవే విలువైనవాడివి”,అని  అన్నారు గురువుగారు . ఆరుణిని ఒక కంబళి లో వెచ్చగా చుట్టి ఆశ్రమానికి తీసుకొచ్చారు . ఆరుణి ని దగ్గరకు తీసుకుని  అతనిని  ఆశీర్వదిస్తూ ధౌమ్యుడు ,”గురువు పట్ల నీకు గల సాటిలేని భక్తి వినమ్రత నీకు శాశ్వత కీర్తిని ప్రసాదిస్తాయి” అన్నారు . 

నీతి :  గురువు అనుగ్రహాన్ని పొందటం కోసం ఆరుణి తన గురువు పట్ల చూపిన భక్తి , వినయం  సాటిలేనివి . గురువు మెచ్చుకునే  గుణాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎటువంటి గట్టి ప్రయాతాన్ని చేయాలో  దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. ఇటువంటి గుణానికి  నిదర్శనం ,ఉదాహరణ ఏమిటంటే మన తల్లి తండ్రులను ,గురువులను గౌరవించటం . 

https://saibalsanskaar.wordpress.com/2016/06/02/arunis-devotion/

మనం చేసుకొనే స్నేహం

  

విలువ :      ధర్మము

ఉప విలువ :విచక్షణ

ఒకానొకప్పుడు ఒక హంస ,ఒక కాకి స్నేహం గా ఉండేవి. ఒక రోజున కాకి హంసను తన ఇంటికి తీసుకోని వెళ్ళింది. ఒక ఎండిన చెట్టు మోడుపై అవి కూర్చున్నాయి. ఆ ప్రేదేశమంతా పేడ మాంసము ,ఎముకలు అన్ని చెల్లా చెదురుగా పది ఉండి దుర్వాసన వస్తున్నది. హంస కాకితో సోదరా ! ఇటువంటి మురికి ,దుర్గంధ ప్రదేశం లో నేను క్షణికాలం కూడా ఉండలేను. నన్ను ఏదయినా పవిత్రమైన ప్రదేశానికి తీసుకెళ్ళు అని అడిగింది.

అందువల్ల కాకి హంసను రాజుకు చెందిన ఒక చెట్టు తొర్రలో రహస్యంగా కూర్చోబెట్టి తాను కూడా హంస పక్కనే కూర్చుంది. క్రిందికి చూస్తే హంసకి రాజుగారు చెట్టుకింద కూర్చొని ఉండటం ఆయనకి తలకి బాగా ఎండతగులుతూ ఉండటం కనిపించింది. సాదు స్వభావం కల హంస ఎంతో దయతో తన రెక్కలు విప్పి రాజుకు ఎండతగలకుండా నీడను కల్పించింది. దానివల్ల రాజు కి కాసేపు సుఖం కలిగింది. ఈ లోగా కాకి తన సహజ నిర్లక్ష్య స్వభావంతో రెట్ట వేసింది. అది సరిగ్గా రాజు గారి తలమీద పడింది. రాజు కోపంతో వెంటనే పైకి బాణం వేసేసరికి అది హంసకి తగిలి అది క్రింద పడిపోయంది. 

                                      హంస చనిపోతూ ఓ రాజా ! నీపైన రెట్ట వేసింది కాకి నేను కాదు.  ఎప్పుడు నిర్మలమైన స్వచ్ఛమైన నీటిలో జీవించే హంసను నేను .కానీ చెడ్డ కాకితో చేసిన స్నేహం వలన నా జీవితం కూడా నాశనం అయిపోయింది అని ధుఃకించింది. 
            నీతి : మంచితనము ప్రజలను ఎంతగా ప్రభావితం చేస్తుందో అదే విధంగా చెడ్డతనం కూడా మనుషులను ప్రభావితం చేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు మంచివారితో మాత్రమే స్నేహం చేసి సత్సాగత్యం లో మెలగాలి. మంచివారితో సాంగత్యం మనుషులపై మంచి ప్రభావాన్ని కలిగిస్తుంది. చెడ్డవాతావరణం లో తిరిగే మంచి వారి లోని మంచి గుణాలను ఎవరు గుర్తించరు. చెడ్డవ్యక్తి తోటి స్నేహం వలన మంచివారు కూడా చెడుఫలితాలను అనిభవించవలసి వస్తుంది. 

https://saibalsanskaar.wordpress.com/2016/04/06/the-company-one-keeps/

అహంకారం అతి పెద్ద శత్రువు

విలువ:  ధర్మం, సత్ప్రవర్తన
అంతర్గత విలువ : అహంకారం లేకుండా ఉండడం

images
ఒకప్పుడు ఇద్దరు అబ్బాయిలు చాలా స్నేహంగా ఉండేవారు.  పెరిగి పెద్దయిన తరువాత జీవితంలో స్థిరపడడానికి ఎవరి దారిన వారు వెళ్ళిపోయేరు.  ఒక అబ్బాయి తన కాలాన్నంతా ఆధ్యాత్మిక సాధనలో గడిపి ఋషిగా మారి ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు.  ఇంకొక అబ్బాయి   బాగా డబ్బు సంపాదించి ధనవంతుడై విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.

 ఒకసారి ఈ ధనవంతుడికి తన మిత్రుడు ఎలా ఉన్నాడో , ఎక్కడ ఉన్నాడో  తెలుసుకోవాలి అనిపించింది.  ఎంతో ప్రయత్నం చేసి చివరకు వివరాలు సంపాదించాడు. తన మిత్రుడు తపస్సు చేసి ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడని తెలుసుకుని ఎంతో సంతోషించాడు.  ఋషిగా మారిన మిత్రుణ్ణి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ఋషి కూడా అందుకు అంగీకరించాడు.

ధనవంతుడు తన మిత్రుడు వస్తున్నాడని ఆనందంతో ఇల్లంతా అలంకారం చేయించాడు.  నడవడానికి సౌకర్యంగా ఉండేలా ఇల్లంతా ఖరీదైన తివాచీలు పరిచాడు.  ఋషి వచ్చి ఈ ఏర్పాట్లు అన్నీ చూసి ఆశ్చర్యపోయాడు.  సంతోషంతో లోపలికి వస్తుండగా ఒక వ్యక్తి వచ్చి ఋషితో, మీ మిత్రుడు తనకి డబ్బు ఉందని అహంకారంతో, మిమ్మల్ని అవమానించడానికే  ఇవన్నీ చేసాడు అని చెప్పాడు.  ఈ మాట విన్న ఋషికి చాలా కోపం వచ్చింది.  వెంటనే రోడ్డు మీదకి వెళ్ళి మురికి కాలువలో కాళ్ళు పెట్టి వచ్చి ఆ మురికిని తివాచీల నిండా అంటించాడు.  ధనవంతుడు తన స్నేహితుడిని సాదరంగా ఆహ్వానించాడు. కానీ ఋషి, ధనవంతుడితో నీకు ఎంతో డబ్బువుండవచ్చు కానీ, నాకున్న జ్ఞానం చాలా గొప్పది. ఏ  విధంగా చూసినా నేనే నీకంటే గొప్పవాడిని అన్నాడు. కావాలనే నీ తివాచీలకు మురికి అంటించాను అని చెప్పాడు. 


అది విన్న ధనవంతుడు ఓ స్నేహితుడా; నిన్నుచూసి నేను చాలా గర్వపడ్డాను. నా స్నేహితుడు ఇంత జ్ఞానం సంపాదించాడు అని సంతోషించాను. కానీ ఎంత జ్ఞానం ఉన్నా కోపాన్ని జయించలేకయావు. నేను ధనవంతుడిని కాబట్టి డబ్బు సంపాదించానన్న గర్వం ఉండడం సహజం కానీ ఋషి అంటే ఇంద్రియాలను జయించి, మనసుని గెలిచినవాడు అని అర్థం కదా. ఇన్ని  సంవత్సరాలు సాధన చేసి కూడా నీ మనసులోని వ్యతిరేక భావాలకు లొంగిపోయావు  అంటే నీవు  నిజమైన ఋషివి  కాదు అన్నాడు. 

   నీతి: మనకున్న జ్ఞానం, సంపద అంతా భగవంతుడి దయ వలన వచ్చినవే.  ఆ విషయం గుర్తు పెట్టుకుని భగవంతుడి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. అహంకారం అనేది అతి పెద్ద శత్రువు. మనమే అన్నీ చేసాము అనుకోవడమే అహంకారం. ఇతరులను చూసి అసూయ పడకుండా మనకి ఉన్నదానితో తృప్తిగా ఉండాలి. భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యవంతమైన శరీర,మనసు, ఆత్మల వల్ల  మాత్రమే మన జీవితం సాగించగలుగుతున్నాము.

మూడు రకాల మనుషులు

 

EE8F1EE1-DC1F-426B-A4BA-DAE5DF00F5CD.jpeg

విలువ: సత్యము

అంతర్గత విలువ: నమ్మకము, వినయము 

ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యార్థికి 3 బొమ్మలు ఇచ్చి వాటిలో గల తేడాలు కనిపెట్టమన్నారు. ఆ 3 బొమ్మలు ఆకారం,పరిమాణంలో చూడడానికి ఒకేలా ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించిన తరువాత ఆ బొమ్మలలో  రంధ్రాలు ఉన్నాయని గమనించాడు ఆ విద్యార్థి. మొదటి బొమ్మకు రెండు చెవులలో రంధ్రాలు ఉన్నాయి. రెండవ బొమ్మకు ఒక చెవిలో మరియు నోటిలో రంధ్రాలు ఉన్నాయి. మూడవ బొమ్మకు ఒక చెవిలో మాత్రమే రంధ్రం ఉంది.
                                       ఆ విద్యార్ధి ఒక సన్నని పుల్ల తీసుకుని మొదటి బొమ్మ  చెవిలో దూర్చాడు. ఆ పుల్ల ఆ బొమ్మ రెండవ చెవిలో నుండి బయటకు వచ్చింది. రెండవ బొమ్మ చెవిలో పుల్ల దూర్చి చూసాడు. అది బొమ్మ నోటిలో నుండి బయటకు వచ్చింది.మూడవ బొమ్మ చెవిలో పుల్ల దూర్చి చూసాడు. అది బయటకు రాలేదు.
అదంతా గమనించిన ఉపాధ్యాయుడు విద్యార్థికి ఈ విధంగా వివరించారు. ఈ మూడు బొమ్మలు మనచుట్టూ ఉండే మనుషుల వ్యక్తిత్వాలను తెలియజేస్తున్నాయి. మొదటి బొమ్మ చెవిలో పుల్ల దూరిస్తే రెండవ చెవిలో నుండి బయటకు వచ్చింది, అంటే కొంతమంది మనం చెప్పేది వింటున్నట్టే ఉంటారు, కానీ అదేమీ పట్టించుకోకుండా ఒక చెవితో విని, రెండవ చెవితో వదిలేస్తుంటారు. ఇలాంటి వాళ్ళతో అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి.
          రెండవ బొమ్మ చెవిలో పుల్ల దూరిస్తే నోటిలో నుండి బయటకు వచ్చింది. వీళ్ళు మనం చెప్పేది అంతా  విని ఇతరులకు మన విషయాలు చెప్పేస్తూ ఉంటారు. వీళ్ళని నమ్మి సొంత విషయాలు చెప్పడం ప్రమాదకరం.
                        మూడవ బొమ్మ చెవిలో పుల్ల దూరిస్తే అది బయటకు రాలేదు. ఈ రకం మనుషులు నమ్మకస్తులు. వీరు విన్నదానిలో ఏది అవసరమో అదే మాట్లాడతారు, మనకు హాని కలిగిచే విధంగా ఎక్కడా మాట్లాడరు.
నీతి:  
ఎల్లప్పుడూ మంచివారితో ఉండే ప్రయత్నం చెయ్యాలి. నమ్మకంగా మరియు నిజాయితీగా ఉండేవాళ్ళ  మద్య ఉంటే మన ప్రవర్తన మెరుగుపరచుకోవచ్చు మరియు అవసమైన సమయాల్లో ఇలాంటివాళ్ళు మనకు సరైన సలహాలిచ్చి దారి చూపించగలుగుతారు.

గర్భవతి అయిన ఒక జింక కథ !

విలువ: ధర్మం

అంతర్గత విలువ: ఆలోచనల్లో స్పష్టత, శరణాగతి

ఒక అడవిలో గర్భవతి అయిన  జింక ఉంది. దానికి ఏ సమయంలో అయినా ప్రసవం జరుగవచ్చు, అది ప్రసవానికి అనువైన స్థలం కోసం వెతుకుతూ అడవిలో తిరుగుతోంది. ఒక నది ఒడ్డున దట్టంగా గడ్డి ఉన్న ప్రాంతం కనిపించింది. అదే తగిన చోటు అని భావించి అక్కడికి  చేరుకుంది. ఇంతలో లేడికి పురిటి నెప్పులు మొదలయ్యాయి. అకస్మాత్తుగా ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకుని, ఉరుములు,మెరుపులు రాసాగాయి అడవిలో నిప్పు అంటుకుని మంటలు మొదలయ్యాయి. లేడి తన ఎడమవైపు చూస్తే ఒక వేటగాడు తనకి బాణం గురిపెట్టి ఉన్నాడు.  కుడివైపు చూస్తే ఆకలితో ఉన్న సింహం లేడి వైపే వస్తోంది. ఆ జింకకి చాలా భయం వేసింది. ఇప్పుడు ఏమి చెయ్యాలి అని ఆలోచించుకుంది. ఒక వైపు వేటగాడు, సింహం ఇద్దరూ తనని చంపడానికి సిద్ధంగా ఉన్నారు.  తాను బిడ్డకు జన్మనిచ్చినా అడవిలో అంటుకున్న మంటలకి తట్టుకోలేక ఆ జింక పిల్ల బ్రతుకుతుందో లేదో తెలీదు. ఇన్ని ఆలోచనల మధ్య జింక తన ప్రస్తుత కర్తవ్యం జింకపిల్లకు జన్మనివ్వడం కాబట్టి ఆ పని మీదే దృష్టి పెట్టాలి అని నిర్ణయించుకుంది.

                     ఆకాశంలో మెరుపుల  వెలుగుకి వేటగాడి బాణం గురి తప్పింది. అది జింకకి బదులు దూరంగా ఉన్న సింహానికి తగిలి అది చనిపోయింది. చాలా పెద్ద వర్షం రావడంతో అడవిలో మంటలు ఆరిపోయాయి. జింక తన బిడ్డకు క్షేమంగా జన్మనిచ్చింది.

నీతి:పై కథలో జింక ఎదుర్కొన్నలాంటి  పరిస్థితులు మనకి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. రకరకాల సమస్యలు మనని చుట్టుముట్టినప్పుడు, వాటిని అధిమించే ప్రయత్నం లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. దానికి తోడు ప్రతికూల ఆలోచనలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన చేతిలో లేని వాటిని వదిలిపెట్టి మనం చెయ్యవలసిన పని మీద దృష్టి పెట్టి చేసుకుంటూ పోతే మిగిలిన సమస్యలకు కూడా పరిష్కార మార్గాలు వాటంతటవే దొరుకుతాయి.  

 

https://saibalsanskaar.wordpress.com/2015/09/30/the-pregnant-deer/

ఒక మహా యుద్ధము

 

విలువ : ధర్మ

ఉప విలువ : పరనింద,పరదూషణ మానుట

 

wizard

అనగనగా ఒక దుష్ట మాంత్రికుడు ఉండేవాడు.అతడు, ఒకరోజు ఒక ఊళ్ళో దూరి, అక్కడ నివసించే ఒక వెయ్యిమంది నాలుకులను కోసుకుని వచ్చాడు. తన మంత్రం శక్తితో ఆ నాలుకలు ఇక మీట పరుల గురించి చెడు మటుకే మాట్లాడగలవని శాసించాడు .తరువాత అతని మాయలోపడి గాఢ నిదురపోతున్న వారికి వారి నాలుకలను తిరిగిచ్చేశాడు . ఎవరికీ ఏ అనుమానము కూడా రాలేదు.

రానున్న రోజుల్లో “వీడిలా చేశాడు , ఆమె అలా చేసింది , ఆతను ఒక సుత్తి మనిషి ఇతను ఒక మొద్దు “ వంటి పరనింద, పరదూషణలతో ఆ ఊరంతా హోరెత్తింది.ఎక్కడ విన్నా , ఇవే మాటలు.దాంతో ఒకరి పై ఒకరికి కోపం పెరిగిపోయింది.ఇదంతా చూసి ఆ దుష్ట మాంత్రికుడికి అంతులేని ఆనందం కలిగింది .
అప్పుడు ఊరిని బాగు పరచాలన్న ఉద్దేశంతో ఒక మంచి మాంత్రికుడు తన మంత్ర శక్తితో వారి చెవులు ఇక మీట ఇతరుల గురించి చెడు విన్నప్పుడల్లా మూతబడాలి అని ఆదేశించాడు.దాంతో నాలుకలుఇతరుల గురించి చెడు పలికినప్పుడల్లా చెవులు గట్టిగా మూసుకుపోయేవి .

ఈ విధంగా నాలుకలు చెవులకు మధ్య ఒక పెద్ద యుద్ధము మొదలైంది.ఇందులో ఎవరు గెలిచారు?

ఏముంది, కాలం గడిచిన కొద్దీ , నాలుకలు చెవులు చేస్తున్న అవమానమును
తట్టుకోలేకపోయాయి. అవి పలికే చేదుమాటలను చెవులు అలక్ష్యం చేయడంతో నాలుకలు మంచి మాటలను పలకడం మొదలుపెట్టాయి.దాంతో చెవులు తిరిగి నాలుకలు పలికే మాటలను వినటం
మొదలుపెట్టాయి. ఇక నాలుకలు పరదూషణ,పరనిందలు పూర్తిగా మానేసి హాయిగా మంచి మాట్లాడటం మొదలు పెట్టాయి.

చెడు ప్రభావం వల్ల ప్రపంచమంతటా పరనింద ,పరదూషణ ఎక్కు అయిపోయింది . ఈ కథలోలాగా మంచితనంతో మనం ఇతరుల గురించి చెడు మాట్లాడటం గాని వినటం కాని మాని, పరనిందను అరికట్టాలి.
నీతి :
మంచి మాటలను వినండి, మంచి మాటలను పలకండి. నిత్య జీవితంలో పరనింద చేసేవారు ఎదురవుతూనే ఉంటారు. వారినుండి మనము తప్పించుకోలేకపోవచ్చు కాని,
పర దూషణలను పట్టించుకోకపోవటం ,తిరిగి అదే పని మనము చేయకపోవటం మన చేతుల్లోనే ఉంది.

 

https://saibalsanskaar.wordpress.com/2015/10/07/the-great-battle/