Archive | October 2017

మంత్రి -కుక్కలు

AA2BE27A-CDBE-4590-B879-468A03517081
విలువ: ధర్మం
ఉపవిలువ: కృతజ్ఞత, దయ

అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆయన దగ్గర పది అడవి కుక్కలుండేవి.
వాటిని ఆయన తప్పులు చేసిన మంత్రులని శిక్షించటానికి వాడేవాడు.

అయితే ఒక సారి తన దగ్గర పని చెసే మంత్రి ఒకడు ఇచ్చిన సలహా ఆయనకి తప్పుగా అనిపించింది. రాజుగారికి అది నచ్చలేదు.అందువల్ల అలవాటు ప్రకారం మంత్రి మీదకి ఆయన వేట కుక్కలని పంపమని సేవకులని ఆజ్ఞాపించాడు.

అప్పుడు ఆ మంత్రి రాజుని ఇలా వేడుకున్నాడు ,”మహారజా ! నేను మీ వద్ద పది సంవత్సరాలుగా పని చేస్తున్నాను కదా, చేసిన తప్పుని దిద్దుకోటానికి మీరు నాకు కనీసం పది రోజుల గడువును ఇవ్వలేరా” అని బ్రతిమాలాడు.దానికి రాజు అంగీకరించాడు.

70784450-D048-4FCE-B18F-2066C2697968.png

చక్కటి అవకాశం దొరికిన మంత్రి  ఆ కుక్కలకు ప్రేమగా ఆహారం తినిపించి శుభ్రపరచి, ఆ పది రోజులు వాటిని  ప్రేమగా చూసుకున్నాడు.

ఇచ్చిన గడువు పూర్తి అయ్యాక, రాజు మళ్ళీ మంత్రిని కుక్కల ద్వారా దండించమని భటులను  ఆజ్ఞాపించాడు.

తీరా రాజు గారు ఊహించినట్లు జరగ లేదు.
అక్కడున్న వారందరికీ ఆశ్చర్యం కలిగేలా ఆ కుక్కలు మంత్రి పాదాల పై వాలి వాటిని ముద్దాడడం మొదలు పెట్టాయి.

మహారాజు గారికి ఆగ్రహం కలిగి ” అసలు ఏం జరుగుతోంది ఇక్కడ”,అని కోపగించారు.”నా కుక్కలు ఎందుకిలా వింతగా  ప్రవర్తిస్తున్నాయి ” అని ప్రశ్నించారు.

అప్పుడు ఆ మంత్రి ,” పది రోజులు ప్రేమగా నేను చూసుకున్నందుకే , జంతువులైన ఈ వేట కుక్కలు కూడా వాటికి నేను చేసిన సేవలను మర్చిపోలేదే! మరి మీరో?
నేనేదో తెలియక ఒక్క చిన్న తప్పు చేస్తే అదొక్కటే గుర్తుపెట్టుకుని , పది సంవత్సరాలుగా నేను మీకు చేసిన సేవలన్నీ ఎలా మర్చిపోయారు మహారాజా ? అని వినయపూర్వకంగానే రాజుగారిని ప్రశ్నించాడు.

అప్పుడు మహారాజుకి కూడా తను చేస్తున్న  తప్పు స్పష్టంగా అర్ధమయ్యింది.దాంతో మంత్రిని విడిచిపెట్టమని తన బంటులను ఆజ్ఞాపించాడు.

నీతి :
సమస్య ఎదురైనప్పుడు ఇతరులు తమకి చేసిన మంచిని మరచిపోయేవారందరికీ, ఈ కథ చక్కటి గుణపాఠాన్ని నేర్పిస్తుంది.మనకి నచ్చని చిన్న చిన్న విషయాల వల్ల గతంలో జరిగిన మంచిని, మర్చిపోకుండా ఉండడం అలవాటు చేసుకుందాము. ఇతరులు చేసే తప్పులని కాకుండా వారు మనకి చేసిన మంచిని మటుకే గుర్తుపెట్టుకుందాము.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

పంచ కోశములు

పంచ కోశములు

విలువ:సత్యం
ఉప విలువ: పరిశుద్ధత

IMG_0660

పూర్వ కాలంలో గురుకుల వ్యవస్థ ఉండేది. భృగు అనే శిష్యుడు విద్యాభ్యాసం
పూర్తి కాగానే తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.
అతని తండ్రి అయిన వరుణుడు భృగుని ఇలా అడిగాడు “నాయనా! ఇన్నేళ్ళుగా చక్కగా గురుకులంలో ఉండి గురువు వద్ద చదువుకున్నావు కదా,”నీలోని పరమ సత్యాన్ని గుర్తించగలిగావా?” నిన్ను నువ్వు తెలుసుకోగలిగావా?”అని సూటిగా ప్రశ్నించాడు.

భృగు ,”నాకు తెలియదు తండ్రి,అటువంటి విషయములేవి నేను తెలుసుకోలేకపోయాను అని జవాబు ఇచ్చాడు “

“అదేంటి నాయనా అన్నిటికంటే ముఖ్యమైన సత్యాన్ని గుర్తించనప్పుడు ఇన్నేళ్ళుగా నువ్వు నేర్చుకున్నదంతా వ్యర్థమే కదా!”అని అన్నాడు.

“మరి ఇప్పుడు మార్గమేంటి తండ్రి?” అని అడిగినప్పుడు, వరుణుడు,”తపస్సు నాయనా! ఓర్పు వహించు,ప్రశాంతంగా అరణ్యంలోకి వెళ్లి తపస్సు చేసుకో,నిదానంగా నీవే అన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. “అని చక్కటి మార్గాన్ని చూపించాడు.

 

IMG_0659

తండ్రి ఆజ్ఞ మేరకు కొంత కాలం తపస్సు చేసి తిరిగి వచ్చిన భృగు,వరుణుడితో,”తండ్రీ!ఈ దేహము అనగా అన్నమయ కోశమే అంతిమ సత్యమని గ్రహించాను.ఎందుకంటే దేహం ఆరోగ్యవంతంగా ఉన్నంత వరకే నేను ఏ కార్యమునైన చేయలేము కదా.సుష్కించిన శరీరము దేనికి ఉపయోగపడుతుంది” అని ఉత్సాహంగా చెప్పాడు.

ఇది విన్న వరుణుడు నిరుత్సాహంతో,”లేదు నాయనా మళ్ళీ వెళ్లి ఈ సారి సరైన సమాధానముతో తిరిగిరా!”అని పంపించాడు.అప్పుడు భృగు తిరిగి అరణ్యానికి వెళ్ళాడు.

ఇంకొంత కాలం నిష్ఠగా తపస్సు చేసి తిరిగి వచ్చి,ఈ సారి,”ప్రాణమయ కోశమని తెలుసుకున్నాను తండ్రీ, ఎందుకంటే శరీరము ఒకటే ఉండి ప్రయోజనమేంటి? అందులో ప్రాణము ఉండాలి కదా.అందుకే ప్రాణమయ కోశమే పరమ సత్యము అని గ్రహించాను” అని జవాబు చెప్పాడు.
వరుణుడు ఈ సారి కూడా ,”లేదు నాయనా ఎంత మాత్రం కాదు!”అని అతనిని మళ్ళీ అరణ్యానికి పంపిస్తాడు.

ఈ సారి భృగు,” ఇది వరకు నేను చెప్పింది తప్పు తండ్రీ,శరీరము ప్రాణము కన్నా మనస్సు మిన్న. ఎందుకంటే మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు ప్రాణమున్న శరీరమేమీ సాధించలేదు.కనుక మనోమయ కోశమే అన్నిటికన్నా ప్రధానమైనదని తెలుసుకున్నాను అని జవాబిస్తాడు.” వరుణుడు,ఇది కూడా సరైన సమాధానము కాదు, ఇంకొంచం శ్రద్ధతో ప్రయత్నించు నిదానంగా నీకే నిజం తెలుస్తుంది”అని పంపించేస్తాడు.

ఈ సారి భృగు,”విజ్ఞానమయ కోశము కదా తండ్రీ. ఎందుకంటే తప్పు ఒప్పులను
తెలిపే ఎరుకయే విచక్షణా శక్తి.అది ఉండాలి అంటే విజ్ఞానము కలిగి ఉండాలి. కనుక విజ్ఞానమయ కోశము చాలా ముఖ్యము అని గ్రహించాను “ అని ఎంతో గర్వంగా తెలియపరుస్తాడు.”ఈ సారి వరుణుడు,నీకు నాలుగు అవకాశాలను ఇచ్చాను,అయినా కూడా నీవు “మనలోని పరమ సత్యాన్ని తెలుసుకోలేక పోయావు.”పోనీలే ఇంక నీ ప్రయత్నములను ఆపు.సమయమొచ్చినప్పుడు నీకే సత్యము బోధ పడుతుంది! బాధ పడకు “ అని అతనికి ధైర్యం చెప్తాడు.

 

పట్టు వదలని భృగు,” లేదు తండ్రీ!నాకు ఇంకొక చివరి అవకాశాన్ని ఇవ్వండి.నేను ఈ సారి తప్పక విజయవంతంగా తిరిగి వచ్చి మిమ్మల్ని ఆనందపరుస్తాను అని చెప్పి,ఇంకొంత కాలం కఠోరమైన తపస్సు చేయటానికి అరణ్యానికి బయకుదేరతాడు.

కానీ ఈ సారి అంతకుముందు కంటే ఎక్కువ కాలం వరుణుడు భ్రిగు కోసం ఎదురు చూడవలసి వచ్చింది. రోజులు గడిచాయి ,అలాగే ఏళ్ళు,దశాబ్దాలు కూడా గడిచాయి…భృగు తిరిగి రాకపోయే సరికి కంగారు పడి అతనిని వెతుక్కుంటూ వరుణుడు బయలుదేరాడు.కొంత దూరం వెళ్లే సరికి అతనికి అరణ్యంలో ఒక వైపు నించి ఎంతో ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది.తీరా చుస్తే అతనికి పద్మాసనంలో ధ్యానముద్ర లో కూర్చున్న భృగు కనిపించాడు అతని శరీరము నుండి కోటి సూర్యుల వెలుగు రావటం చూసిన వరుణుడికి ఎంతో ఆనందం కలిగింది. తన సత్యాన్ని తాను గుర్తించిన పుతృడిని చూసిన వరుణుడికి ఎంతో తృప్తి కలిగింది.పుత్రోత్సాహంతో ఎంతో గర్వపడ్డాడు.

ఆనంద భాష్పాలతో నిండిన తన కళ్ళను తుడుచుకుని అత్యున్నతమైన స్థితిలో ఉన్న తన పుత్రుడి ముందు ఎంతో మర్యాదతో తన శిరస్సు వంచి నమస్కరించి ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు.

మొత్తానికి పట్టుదలతో భృగు తన తండ్రి అడిగిన ప్రశ్నకు సమాదానమును తెలుసుకున్నాడు.అంతేకాకుండా అందులో మునిగి పోయి తిరిగి వచ్చి తండ్రికి సమాధానము చెప్పాలన్న విషయం కూడా మర్చిపోయాడు.

ఎందుకంటే ఆతను ఆనందమయ కోశము ముందు ఇతర కోశములు స్వల్పమైనవని అనుభవపూర్వకంగా గ్రహించాడు. ఆనందమయకోశమే పరమ సత్యమని,అంతకు మించి తెలుసుకోవలసినదేమీ లేదని గ్రహించాడు. అంతేకాకుండా ఆ ఆనందము తనలోనే ఉందని తెలుసుకున్న భృగు దానిని అనుభవిస్తూ సమాధి స్థితిలో ఉండిపోయాడు.

నీతి: సరియైన గురువు ,బాహ్యమైన ప్రాపంచిక విద్య వల్ల కలిగే జ్ఞానము కంటే ఉన్నతమైన ఆత్మా జ్ఞానం కలిగే మార్గం వైపు మనని నడిపిస్తాడు.

అన్నమయ కోశము:మనము తినే ఆహరంతో ఏర్పడే కోశము.
ప్రాణమయ కోశము: అన్నమయకోశము కంటే సూక్ష్మమైనది. మనము పీల్చే గాలి ద్వారా కలిగే శక్తే ఈ కోశముకు ఆధారము.
మనోమయ కోసము: మనకు కలిగే ఆలోచనలు,తద్వారా కలిగే భావోద్వేగాలతో ఏర్పడే కోశము.
విజ్ఞానమయ కోశము: మంచి చెడు,శాశ్వతము,తాత్కాలికమైన విషయములను గుర్తించ కలిగే విచక్షణా శక్తి ఈ కోశము వలెనే మానవుడికి లభ్యమౌతోంది.
ఆనందమాయ కోశము: అన్ని కోశములకంటే అతి సూక్ష్మమైన కోశము ఇదే. పరభ్రహ్మ స్వరూపమైన ఈ కోశమును తెలుసుకుని అనుభవించకలగడం సాధకునికి సులభమైన విషయము కాదు.

దానికి ఈ కథలో భృగుకి ఉన్న నిష్ఠ ,పట్టుదల,ఓర్పు ఉండాలి.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu