శాంతిని ప్రతిబింబించే చిత్రము

విలువ: శాంతి 
అంతర్గత విలువ: నిశ్శబ్దం, మనసు శాంతంగా ఉంచుకోవడం 

98498670-CC98-4921-A130-11B61B18717B
ఒక రాజు శాంతిని చూపించగలిగే చిత్రాన్ని వేయమని కోరాడు. చాలామంది చిత్రాలు గీసి తెచ్చారు. రాజు వరుసగా వాటిని పరిశీలించసాగాడు.

అన్ని చిత్రాల్లో రెండు చిత్రాలు చాలా బాగున్నాయి. ఆ రెండింటిలో ఒక దానిని ఎంపిక చేసి బహుమతి ప్రకటించాలి.
మొదటి చిత్రంలో ప్రశాంతంగా ఉన్న నది ఉంది. దాని చుట్టూ ఎత్తైన కొండలు ఉన్నాయి. పైన ఆకాశం, మేఘాలు గీయబడి ఉన్నాయి. అందరు ఆ చిత్రమే ఎంపిక చేస్తారు అని అనుకున్నారు. రెండవ చిత్రంలో కూడా కొండలు ఉన్నాయి కానీ అవి అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఆకాశంలో మేఘాలు చాలా గంభీరంగా ఉరుములు,మెరుపులతో ఉన్నాయి. కొండలమీద నుండి ఒక జలపాతం ప్రవహిస్తోంది. ఆ చిత్రంలో ఎక్కడా ప్రశాంతత కనిపించట్లేదు.
D6101859-6F32-493E-934E-062E789537AA
రాజు జాగ్రత్తగా పరిశీలించి చూసాడు. జలపాతం పక్కన కొండ పగుళ్లలో నుండి ఒక చిన్న పొద  ఉంది. ఆ పొదలో ఒక పక్షి తన పిల్లలతో ప్రశాంతంగా కూర్చుని ఉంది.   రాజు రెండవ చిత్రానికి బహుమతి ప్రకటించాడు.
నీతి
పరిస్థితులు, వాతావరణం  అనుకూలంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం సులభమే కానీ ప్రతికూల పరిస్థితులలో కూడా ప్రశాంతంగా ఉండడం సాధన చెయ్యాలి. మన మనసులోనే శాంతిని వెతుక్కోవాలి. ఎల్లప్పుడూ ఆనందంగా, ప్రశాంతంగా ఉండడం సాధన చేస్తూ ఉంటే చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ప్రభావితం చెయ్యలేవు.

Advertisements

ధనవంతుడు మరియు ముగ్గురు బిచ్చగాళ్ళు

విలువ: ప్రేమ
అంతర్గత విలువ: భగవంతుని శరణు వేడుట

3559F3E9-3015-42E8-9290-3CD20154771A.png

ఒక ఊరిలో మంచి వ్యక్తిత్వం కలిగిన ధనవంతుడు ఉండేవాడు.  ముగ్గురు బిచ్చగాళ్ళు ఆ ధనవంతుడిని సహాయం అడగాలని అనుకున్నారు. మొదటి బిచ్చగాడు ధనవంతుడి దగ్గరకు వెళ్ళి నాకు 5 రూపాయలు ఇవ్వండి అని అడిగాడు. ధనవంతుడికి కోపం వచ్చి నేనేదో నీకు అప్పు ఉన్నట్టు అడుగుతున్నావే, ఈ 2 రూపాయలు తీసుకుని వెళ్ళు అని పంపించేసాడు.
రెండవ బిచ్చగాడు ధనవంతుడి దగ్గరికి వెళ్ళి అయ్యా; నేను 10 రోజులుగా సరైన తిండి లేకుండా ఉన్నాను, నాకు సహాయం చెయ్యండి అని వినయంగా అడిగాడు.  నీకు ఎంత డబ్బు కావాలి అని ధనవంతుడు అడిగాడు. మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి అన్నాడు బిచ్చగాడు. ధనవంతుడు 10 రూపాయలు ఇచ్చి ఈ డబ్బుతో 3 రోజులు కడుపునిండుగా భోజనం చెయ్యవచ్చు అని చెప్పి పంపించాడు.

మూడవ బిచ్చగాడు ధనవంతుడి దగ్గరకు వెళ్ళి అయ్యా; మీ గురించి చాలా మంచిగా విన్నాను. మిమ్మల్నిఒక్కసారి చూసి పోదామని వచ్చాను. మీలాంటి మంచి గుణాలు ఉన్న వ్యక్తులు భగవంతుడితో సమానం అన్నాడు. అది విన్న ధనవంతుడు బిచ్చగాడిని కూర్చోమని  కుర్చీ చూపించాడు. చాలా అలసటగా కనిపిస్తున్నారు అని చెప్పి తినడానికి ఆహారం అందించాడు. మీకోసం నేను ఏమి చెయ్యగలను అని అడిగాడు. దానికి సమాధానంగా బిచ్చగాడు అయ్యా కడుపునిండా తిండి పెట్టేరు, ఆప్యాయంగా మాట్లాడేరు అది చాలు.నేను మీ నుండి ఏమీ ఆశించట్లేదు అన్నాడు.  ధనవంతుడు బిచ్చగాడి ప్రవర్తనకు సంతోషించి జీవితాంతం తన దగ్గరే ఉంచుకుని ప్రేమగా చూసుకున్నాడు.

నీతి:
——-
భగవంతుడు కూడా పై కథలో ధనవంతుడిలాంటివాడు.  ముగ్గురు బిచ్చగాళ్ళ వలే మూడు రకాల వ్యక్తులు ప్రపంచంలో ఉంటారు. మొదటిరకం వాళ్ళు భగవంతుడి మీద పెత్తనం చేసి తమ పనులు నెరవేర్చుకోవాలని చూస్తారు. రెండవరకం వాళ్లు ప్రాపంచిక సుఖాలకోసం భగవంతుడిని ఆశ్రయిస్తారు. మూడవరకం వాళ్ళు ఉన్నంతలో తృప్తిగా ఉంటూ భగవంతుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారు  మూడవరకం వాళ్ళు ఉత్తములు. వారికి భగవంతుడు బాధని తగ్గించి జాగ్రత్తగా కాపాడుకుంటాడు.

https://saibalsanskaar.wordpress.com/2015/12/08/a-millionaire-and-three-beggars/

మూడు రకాల మనుషులు

 

EE8F1EE1-DC1F-426B-A4BA-DAE5DF00F5CD.jpeg

విలువ: సత్యము

అంతర్గత విలువ: నమ్మకము, వినయము 

ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యార్థికి 3 బొమ్మలు ఇచ్చి వాటిలో గల తేడాలు కనిపెట్టమన్నారు. ఆ 3 బొమ్మలు ఆకారం,పరిమాణంలో చూడడానికి ఒకేలా ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించిన తరువాత ఆ బొమ్మలలో  రంధ్రాలు ఉన్నాయని గమనించాడు ఆ విద్యార్థి. మొదటి బొమ్మకు రెండు చెవులలో రంధ్రాలు ఉన్నాయి. రెండవ బొమ్మకు ఒక చెవిలో మరియు నోటిలో రంధ్రాలు ఉన్నాయి. మూడవ బొమ్మకు ఒక చెవిలో మాత్రమే రంధ్రం ఉంది.
                                       ఆ విద్యార్ధి ఒక సన్నని పుల్ల తీసుకుని మొదటి బొమ్మ  చెవిలో దూర్చాడు. ఆ పుల్ల ఆ బొమ్మ రెండవ చెవిలో నుండి బయటకు వచ్చింది. రెండవ బొమ్మ చెవిలో పుల్ల దూర్చి చూసాడు. అది బొమ్మ నోటిలో నుండి బయటకు వచ్చింది.మూడవ బొమ్మ చెవిలో పుల్ల దూర్చి చూసాడు. అది బయటకు రాలేదు.
అదంతా గమనించిన ఉపాధ్యాయుడు విద్యార్థికి ఈ విధంగా వివరించారు. ఈ మూడు బొమ్మలు మనచుట్టూ ఉండే మనుషుల వ్యక్తిత్వాలను తెలియజేస్తున్నాయి. మొదటి బొమ్మ చెవిలో పుల్ల దూరిస్తే రెండవ చెవిలో నుండి బయటకు వచ్చింది, అంటే కొంతమంది మనం చెప్పేది వింటున్నట్టే ఉంటారు, కానీ అదేమీ పట్టించుకోకుండా ఒక చెవితో విని, రెండవ చెవితో వదిలేస్తుంటారు. ఇలాంటి వాళ్ళతో అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి.
          రెండవ బొమ్మ చెవిలో పుల్ల దూరిస్తే నోటిలో నుండి బయటకు వచ్చింది. వీళ్ళు మనం చెప్పేది అంతా  విని ఇతరులకు మన విషయాలు చెప్పేస్తూ ఉంటారు. వీళ్ళని నమ్మి సొంత విషయాలు చెప్పడం ప్రమాదకరం.
                        మూడవ బొమ్మ చెవిలో పుల్ల దూరిస్తే అది బయటకు రాలేదు. ఈ రకం మనుషులు నమ్మకస్తులు. వీరు విన్నదానిలో ఏది అవసరమో అదే మాట్లాడతారు, మనకు హాని కలిగిచే విధంగా ఎక్కడా మాట్లాడరు.
నీతి:  
ఎల్లప్పుడూ మంచివారితో ఉండే ప్రయత్నం చెయ్యాలి. నమ్మకంగా మరియు నిజాయితీగా ఉండేవాళ్ళ  మద్య ఉంటే మన ప్రవర్తన మెరుగుపరచుకోవచ్చు మరియు అవసమైన సమయాల్లో ఇలాంటివాళ్ళు మనకు సరైన సలహాలిచ్చి దారి చూపించగలుగుతారు.

ఎవరిని లేక దేన్ని ఎక్కువ ప్రేమిస్తాము ?

 

CF08C74E-001F-434D-998C-562DCFAE5BDD

విలువ: శాంతి,సహనము

అంతర్గత విలువ: నిగ్రహం
ఒక వ్యక్తి తన కారును శుభ్రం చేసుకుంటున్నాడు. అక్కడే ఆడుకుంటున్న అతని  4 సంవత్సరాల చిన్న పాప, ఒక రాయి తీసుకుని కారు మీద ఏదో రాసింది. కారు మీద గీతలు చూసి తండ్రికి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలోనే  చేతిలో ఉన్న రెంచ్ తో పాప అరచేతిలో కొట్టడం మొదలుపెట్టేడు. కొంచెంసేపటికి కోపం తగ్గేక, పాప చెయ్యి చూసి కంగారు పడి పాపను హాస్పిటల్ కు తీసుకువెళ్ళాడు. కానీ అప్పటికే పాప చేతి వేళ్ళు విరిగిపోయేయి.
70D2B2C0-6FD8-463E-B801-2EA5C2562439
                హాస్పిటల్లో ఉన్న పాప తండ్రిని ” నాన్నా; నా వేళ్ళు ఎప్పుడు తిరిగి వస్తాయి” అని అడిగింది. దానికి తండ్రి ఏమీ సమధానం చెప్పలేక బాధతో మౌనంగా ఉండిపోయాడు.  కారు దగ్గరికి వెళ్ళి  తన చేసిన తొందరపాటు పనికి బాధపడుతూ, కారును కాలితో తన్నసాగాడు. కొంసేపటికి అసలు కారు మీద తన కూతురు ఏమి రాసిందో చూడాలి అనిపించి దగ్గరగా వెళ్లి చూసాడు.
“నేను నాన్నను ప్రేమిస్తున్నాను” అని రాసి ఉంది.
నీతి:  కోపానికి మరియు ప్రేమకు హద్దులు ఉండవు. మనం ఎప్పుడూ మనుషుల్ని ప్రేమించాలి, వస్తువులను వాడుకోవాలి. కానీ ఈ రోజుల్లో వస్తువుల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అందరినీ  ప్రేమిస్తూ పరిస్థితుల్ని అవగాహన చేసుకుని సహనంతో వ్యవహరించగలిగితే తరవాత బాధపడక్కర్లేదు.

 

కలియుగ ప్రభావము

8987EE2D-BE47-4BDA-9CF9-DE2A7E611690
విలువ: భక్తి
అంతర్గత విలువ: నామస్మరణ

ధర్మరాజు రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో అతని తమ్ముడైన భీముడు ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడంలో సహాయం చేసేవాడు. ఒక రోజు ఒక వ్యక్తి వచ్చి తన పొలంలో వింత జరుగుతోందని, వేసిన కంచె తనకు తానుగా కదలి వెళ్ళిపోతోందని చెప్పాడు.  సామాన్యంగా భీముడు ప్రజలను , రాక్షసుల బారి నుండి కాపాడేవాడు. కానీ ఈ సమస్య వింతగా ఉండడంతో పరిష్కారం కోసం ధర్మరాజు వద్దకు వెళ్ళమని చెప్పి పంపించేసాడు.
తరువాత ఇంకొక వ్యక్తి వచ్చి తన దగ్గర ఒక పెద్ద కుండ ఉందని దానిలో రోజు మొత్తానికి కావలసిన నీటిని నిల్వచేసుకుంటామని, ఈ రోజు ఎన్ని నీళ్ళు తెచ్చి పోసినా ఆ పెద్ద కుండా సగం వరకే నిండుతోందని చెప్పాడు. ఈ విషయం కూడా ధర్మరాజుని అడగమని భీముడు ఆ వ్యక్తిని పంపించేశాడు. మూడవ వ్యక్తి వచ్చి ఒక ఏనుగు సూది కన్నంలో నుండి దూరి బయటకు వస్తోంది కానీ,దాని తొండం మాత్రం బయటకు రావట్లేదని చెప్పాడు. భీముడు ఇతనిని కూడా ధర్మరాజు వద్దకు పంపించాడు. నాలుగవ వ్యక్తి వచ్చి ఒక పెద్ద బండరాయి రోడ్డుకి అడ్డంగా ఉందని ఎంతమంది బలవంతులు ప్రయత్నించినా దాన్ని కదపలేకపోయారని, కానీ ఒక సాధువు తన దండంతో దాన్ని తీసి తేలికగా పక్కన పడేసాడని చెప్పాడు. భీముడు ఈ వింత సమస్యలకు పరిష్కారం కోసం నాలుగవ వ్యక్తిని వెంటబెట్టుకుని ధర్మరాజు వద్దకు వెళ్ళాడు.

అన్ని సమస్యలు విని ధర్మరాజు ఈ వింతలన్నీ కలియుగం రాబోతోంది అనే సంకేతాన్ని సూచిస్తున్నాయి అని చెప్పేడు.
మొదటి వ్యక్తి చెప్పిన కంచె కదిలి వెళ్ళిపోవడానికి అర్థం, కలియుగంలో ప్రజలు తమకు ఎంత ఉంది అన్నది వదిలిపెట్టి, ఇతరులవద్ద ఏమున్నదో తెలుసుకోవాలని తాపత్రయపడుతూఉంటారు. తమ స్థితిని ఇతరులతో పోల్చుకుని ఎల్లప్పుడూ అసంతృప్తితో బాధపడుతూ ఉంటారు.
రెండవ వ్యక్తి చెప్పిన ఎన్ని నీళ్ళు  పోసినా కుండా సగం వరకే నిండడం అంటే మనుషులు, ఇతరులకు చేసిన సహాయం, చూపించిన ప్రేమ మొదలైనవాటిలో 50% తిరిగి ఆశిస్తారు. పరోపకారం కూడా స్వార్థంతోనే చేస్తారు.
మూడవ వ్యక్తి చెప్పిన సూది కన్నంలోకి ఏనుగు దూరుతోంది కానీ ఏనుగు తొండం బయటికి రాకపోవడం అంటే, మనుషులు డబ్బును, శక్తిని, ఉన్న సౌకర్యాలను తమకోసం,తమ కుటుంబం కోసం విచ్చలవిడిగా ఖర్చుపెడతారు కానీ భగవంతుడి కోసం  మరియు భగవత్సంబంధమైన పనులు కోసం ఖర్చు చెయ్యటానికి ఇష్టపడరు.
నాలుగవ వ్యక్తి చెప్పిన బండరాయిని సాధువు దండంతో తీసి పక్కన పెట్టడం అంటే కలియుగంలో భగవంతుని నామస్మరణ మాత్రం చేతనే ప్రజలు పాపవిముక్తులవుతారు.

అని నాలుగు వింతలకు అర్థాలు వివరించి అయితే కలియుగంలో ఇన్ని దోషాలు ఉన్నప్పటికీ కేవలం భగవన్నామస్మరణ  చేత ప్రజలు పాపవిముక్తులవుతారు అని ధర్మరాజు చెప్పేడు.

నీతి: కృతయుగం, త్రేతాయుగం,ద్వాపరయుగాల్లో చేసినట్లు తపస్సు,యజ్ఞం, కష్టమైన సాధనలు కలియుగంలో అవసరం లేదు. కేవలం నామస్మరణ చేతనే తరించవచ్చు.

 

https://saibalsanskaar.wordpress.com/2015/10/14/the-kali-age/

గర్భవతి అయిన ఒక జింక కథ !

విలువ: ధర్మం

అంతర్గత విలువ: ఆలోచనల్లో స్పష్టత, శరణాగతి

ఒక అడవిలో గర్భవతి అయిన  జింక ఉంది. దానికి ఏ సమయంలో అయినా ప్రసవం జరుగవచ్చు, అది ప్రసవానికి అనువైన స్థలం కోసం వెతుకుతూ అడవిలో తిరుగుతోంది. ఒక నది ఒడ్డున దట్టంగా గడ్డి ఉన్న ప్రాంతం కనిపించింది. అదే తగిన చోటు అని భావించి అక్కడికి  చేరుకుంది. ఇంతలో లేడికి పురిటి నెప్పులు మొదలయ్యాయి. అకస్మాత్తుగా ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకుని, ఉరుములు,మెరుపులు రాసాగాయి అడవిలో నిప్పు అంటుకుని మంటలు మొదలయ్యాయి. లేడి తన ఎడమవైపు చూస్తే ఒక వేటగాడు తనకి బాణం గురిపెట్టి ఉన్నాడు.  కుడివైపు చూస్తే ఆకలితో ఉన్న సింహం లేడి వైపే వస్తోంది. ఆ జింకకి చాలా భయం వేసింది. ఇప్పుడు ఏమి చెయ్యాలి అని ఆలోచించుకుంది. ఒక వైపు వేటగాడు, సింహం ఇద్దరూ తనని చంపడానికి సిద్ధంగా ఉన్నారు.  తాను బిడ్డకు జన్మనిచ్చినా అడవిలో అంటుకున్న మంటలకి తట్టుకోలేక ఆ జింక పిల్ల బ్రతుకుతుందో లేదో తెలీదు. ఇన్ని ఆలోచనల మధ్య జింక తన ప్రస్తుత కర్తవ్యం జింకపిల్లకు జన్మనివ్వడం కాబట్టి ఆ పని మీదే దృష్టి పెట్టాలి అని నిర్ణయించుకుంది.

                     ఆకాశంలో మెరుపుల  వెలుగుకి వేటగాడి బాణం గురి తప్పింది. అది జింకకి బదులు దూరంగా ఉన్న సింహానికి తగిలి అది చనిపోయింది. చాలా పెద్ద వర్షం రావడంతో అడవిలో మంటలు ఆరిపోయాయి. జింక తన బిడ్డకు క్షేమంగా జన్మనిచ్చింది.

నీతి:పై కథలో జింక ఎదుర్కొన్నలాంటి  పరిస్థితులు మనకి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. రకరకాల సమస్యలు మనని చుట్టుముట్టినప్పుడు, వాటిని అధిమించే ప్రయత్నం లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. దానికి తోడు ప్రతికూల ఆలోచనలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన చేతిలో లేని వాటిని వదిలిపెట్టి మనం చెయ్యవలసిన పని మీద దృష్టి పెట్టి చేసుకుంటూ పోతే మిగిలిన సమస్యలకు కూడా పరిష్కార మార్గాలు వాటంతటవే దొరుకుతాయి.  

 

https://saibalsanskaar.wordpress.com/2015/09/30/the-pregnant-deer/

మనం ఎప్పుడూ ఒంటరివాళ్ళం కాదు

విలువ: విశ్వాసం

అంతర్గత విలువ: నమ్మకం, శరణాగతి 

 

BC62451B-C82A-4C95-ACDD-1C0A1F212B1F

       ఒక తండ్రి తన కొడుకుని, అడవిలోకి తీసుకునివెళ్ళి కళ్ళకు గంతలు కట్టి ఒంటరిగా వదిలిపెట్టాడు.  ఆ అబ్బాయి రాత్రి అంతా కళ్ళగంతలు విప్పకుండా ఒక చోట కూర్చుని ఉండాలి. ఎవరి సహాయం కోసం ఎదురుచూడకూడదు, భయపడి ఏడవకూడదు.అలా ధైర్యంగా ఉండగలిగితేనే ఆ అబ్బాయి “నిజమైన మనిషి/మగవాడు” అనిపించుకుంటాడు. ఈ సంఘటన గురించి ఇతని స్నేహితులతో చెప్పకూడదు, ఎందుకంటే ప్రతివాళ్ళూ పరిస్థితుల్ని ఎదుర్కొని బైటికి వచ్చినప్పుడే వాళ్ళలోని ధైర్యం పెరుగుతుంది.
     సహజంగానే ఆ అబ్బాయి భయపడ్డాడు. ఆ అడవిలో రాత్రిపూట రకరకాల శబ్దాలు, అరుపులు వినిపించాయి. జంతువులన్నీ వచ్చి తన చుట్టూ నిలబడినట్లుగా ఊహలు వచ్చాయి. అడవిలో వీస్తున్న్న ఈదురు గాలులకి తను ఏమైపోతానో అని చాలా భయం కలిగింది. అయినా ఆ అబ్బాయి మొండిగా అలాగే రాత్రంతా కళ్ళగంతలు విప్పకుండా కూర్చుని ఉన్నాడు. భయపడుతూనే రాత్రి అంతా గడిపి, ఉదయం  సూర్యుడు వచ్చిన తరువాత కళ్ళగంతలు విప్పి చూసాడు. తండ్రి అతని పక్కనే కూర్చునిఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. తండ్రి రాత్రంతా అక్కడే కూర్చుని తనను కాపాడుతున్నాడని గ్రహించాడు.
 
నీతి
మనం ఎప్పుడూ ఒంటరివాళ్ళం కాదు. మనకి కనిపించకపోయినా భగవంతుడు మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు.భగవంతుడి మీద  నమ్మకంతో మన కర్తవ్యం నిర్వర్తించడమే మన పని. మనకి కంటికి కనిపించనంత మాత్రాన భగవంతుడు లేడు అని అనుకోకూడదు. నమ్మకంతో మనం అడుగులు వేస్తే ఆయన తప్పకుండా దారి చూపిస్తాడు.