Archive | June 2018

భజగోవిందం-బాలగోవిందం-నాల్గవ శ్లోకము

 

నాల్గవ శ్లోకము -ఉనికి యొక్క అనిశ్చితత్వాన్ని అర్థం చేసుకోవాలి.

bg4

నళినీ దళగత జలమతి తరళం
తద్వజ్జీవిత మతిశయ చపలమ్ |
విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం
లోకం శోకహతం చ సమస్తమ్
భజగోవిందం భజగోవిందం || 4|| .

 

 
తాత్పర్యము: “ఓ మందబుద్దీ!; తామరాకు మీద నీటి బొట్టు ఎలా చలిస్తుంటుందో అలాగే జీవితం కూడా, ఎంతో చంచలమైనది, అశాశ్వతమైనది. లోకమంతా రోగాలతో, బాధలతో, శోకంతో బాధపడుతూ ఉంటే, లోకులంతా దేహాభిమానం వదలక బాధపడుతూ ఉంటారు. కనుక భగవంతుని చేరి, గోవింద గానం చేస్తూ జీవితం గడపరా!

 

 విద్యార్థులకొరకు కథ   

bg5

ప్రేమను పెంచు — ద్వేషము తెంచు.  

విలువ : సత్ప్రవర్ధన

ఉప విలువ : క్క్షమించుట ,క్షమాగుణము .

 

ఒక కిండర్ గార్డెన్ టీచర్ క్లాస్ లో పిల్లలతో తాను ఒక కొత్తరకం ఆట ఆడిస్తాను అని చెప్పింది .    

      పిల్లలతో ,క్లాస్ లో తమకు ఎవరైతే ఇష్టం లేదో వారి పేరు ఒక అలుగడ్డ మీద వ్రాసి ,ఎంత మంది ఇష్టం లేదో అన్ని అలూగడ్డలు ఒక కవర్  లో వేసి తీసుకురమ్మని చెప్పింది.  మరునాడు టీచర్ చెప్పిన విధంగానే పిల్లలు  అలుగడ్డల కవర్లతో వచ్చారు. కొంతమంది 3,5,7 ఇట్లా వారికిష్టం లేనివాళ్ళ  పేర్లతో అలుగడ్డలు మరియు అవి ఉన్న కవర్లతో వచ్చారు.

టీచర్,ఆ రోజు నుంచి ఆట మొదలు అవుతుందని ,వారం తరువాత ముగుస్తుందని చెప్పింది.కానీ పిల్లలు వాళ్ళ (బ్యాగులు ) ఆలుగడ్డ కవర్లు   వారు ఎక్కడకి వెళ్లినా వారితో తీసుకోని వెళ్ళాలి . ఇంటికి , స్కూల్ కి, స్కూల్ లో టాయిలెట్ కి వెళ్లినా సరే వాటిని విడిచి వెళ్లకూడదని చెప్పింది. రోజులు గడిచే కొద్దీ పిల్లలు మెల్ల-మెల్లగా ఆలుగడ్డలు, కుళ్ళిన వాసన వస్తున్నాయని కంప్లైంట్ చేయసాగారు . అంతే కాదు, ఎక్కువ ఆలుగడ్డలు  ఉన్న కవర్లు మోయటం కూడా వారికి బరువుగా ఉందని చెప్పారు. వారికి ఎక్కువమంది నచ్చని వాళ్ళున్నారు కాబట్టి. దాని వలన , ఆలుగడ్డల బరువు మరియు వాటి నుండి వచ్చిన కుళ్ళిన వాసన భరించలేక పోయారు.

   మొత్తానికి అనుకున్న  రోజు, రానే వచ్చింది . పిల్లలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూడసాగారు. ఆలుగడ్డ కవర్లు  ప్రక్కన పెట్టి ,ఒక్కక్కరు వారు పడ్డ బాధ చెప్పసాగారు . టీచర్ ఎంతో ఓర్పుగా శ్రద్ధగా వారందరూ  చెప్పేది విన్నది .

తరువాత టీచర్ పిల్లలతో ,        

     “ఎవరిమీద అయినా  మీరు ద్వేషం పెంచుకుంటే ఇలాగే జరుగుతుంది. మీ హృదయం లోపల వారి పట్ల కలిగే  ద్వేషం, మీ హృదయాన్ని మలిన పరచి, మీరు ఎక్కడకి వెళితే అక్కడ కుళ్ళిన ఆలుగడ్డ  లాగా వెంట వస్తుంది . ఒక వారం రోజులకే క్రుళ్ళిన వాసనను , బరువును మీరు ఓర్చుకోలేక కష్టపడ్డారు గదా ! అదే జీవితమంతా భరించాలంటే ఎట్లా ఉంటుంది ?”కాబట్టి  ఇతరుల ఎడల ద్వేషం వద్దు .నచ్చకపోతే స్నేహం చేయవద్దు ,అంతేకాని ఎవరినీ ద్వేషించవద్దు” హితవు పలికారు .

 

 నేర్చుకోవలసిన విషయము:  

   మీ హృదయంలో ఎవరిపైన అయినా  ద్వేషం ఉంటే వెంటనే తీసి బైట పడేయండి . దానివల్ల ఆ మాలిన్యం ,బరువు  జీవితాంతం ఉండదు . ఎవరైనా తప్పు చేసినా, వారిని క్షమించే గుణం ఉంటే చాలు . నిజమైన ప్రేమ మంచి వాళ్ళని ప్రేమించటమే కాదు .సరిగా లేని వారిపై కూడా ప్రేమ కలిగి ఉండటం.

                పిల్లలు భగవంతుని ప్రతిరూపాలు . వారు అమాయకులు.  స్వభావ రీత్యా ,ఎపుడూ సంతోషంగా ఉంటారు . 5,6 ఏళ్ళ వరకు పిల్లలు వాళ్లలో వాళ్ళు పోట్లాడుకున్నా , -వాళ్లలో ఎవరన్నా పడితే ,అంతకుముందు వైరం మరచిపోయి వెంటనే ఒకటైపోతారు . ఒకళ్ళనొకళ్ళు  పడ్డ వాళ్ళని లేవదీసి ,జాలి చూపి వారికి చేతనైన మాటలతో ఓదారుస్తారు . కోపంలో తిట్టుకున్నవి ,కొట్టుకున్న విషయాలు తొందరగా మర్చిపోతారు . అంతలో కొట్టుకుంటారు, వాదించుకుంటారు .మళ్ళీ అంతలోనే  కలుస్తారు, ఆడతారు ,సంతోషంగా ఉంటారు. వాళ్ళకి ఆ వయసులో పగ ,ప్రతీకార చర్యలు చేపట్టాలనే ఆలోచనా ,ఇవేవీ ఉండవు.

               వయసు పెరుగుతున్న కొద్దీ బుద్ధి ,తెలివితేటలు  పెరుగుతూ వస్తాయి . అపుడు బైట ప్రపంచం చూసి రియాక్ట్ అవటం నేర్చుకొని ఇగో (అహంకారం) పెంచుకుంటారు . గమ్మత్తుగా ప్రవర్తిస్తూవుంటారు .కొన్ని కావాలని కొన్ని వద్దని అంటారు, తోటి విద్యార్ధి  పై ప్రేమ, ద్వేషం మొదలు అవుతాయి . అంటే మన నిజతత్వం నుండి దూరంగా వెళుతుంటాము. మన నిజతత్వం ఏమిటి? మనము శాంతి స్వరూపులము , ఆనందరూపులము. కానీ ఈ వ్యతిరేక భావనలు పెంచుకుంటూపోతాము . కష్టాలు ఎదురుకుంటూ ఉన్నప్పుడు కూడా, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ” ఇది  కూడా తొలగి పోతుంది అనుకోవాలి” . ఏదైనా టెంపరరీ(తాత్కాలికం) .ఈ కష్ట- సుఖాలు శాశ్వతంగా నిలిచేవి కాదు. “

 

   “మనం పిల్లలుగా ,యువతగా ,పెద్దగా మార్పు చెందుతున్నప్పుడు ,ఎన్నో విషయాలను  మర్చిపోతాము “. క్రమ క్రమంగా మనకు తెలీకుండానే శారీరక ,మానసిక మార్పులొస్తాయి. అన్నీ  టెంపరరీ . ఎందుకు కక్షలు పెంచుకోవాలి?గడిచిన కాలపు జ్ఞాపకాల బరువును జీవితాంతం మోస్తూవుంటాము.  ఎందుకు? ప్రతిదీ మారుతూవుంటుంది .ఏదీ శాశ్వతం కాదు “. ఈ భావాలను చిన్నప్పటినుండీ, పిల్లలకి ఎరుక పరిస్తే వారికి పెరుగుతున్న కొద్దీ ఒక నిర్దుష్టమైన మార్గం కనపడి జీవితం లోని సవాళ్ళను  ధైర్యంగా ఎదురుకుంటారు .

 

Advertisements

భజగోవిందం-బాలగోవిందం:మూడవ శ్లోకము

మూడవ శ్లోకము

భ్రమ ,మాయ నుడి బయట పడాలి.
BG3

నారీ స్తనభర నాభీదేశం

దృష్ట్వా మా గా మోహావేశమ్ |

ఏతన్మాంస వసాది వికారం

మనసి విచింతయా వారం వారమ్

భజగోవిందం భజగోవిందం || 3|| .

 

తాత్పర్యము

ఓ బుద్ధిహీనుడా! స్త్రీ శరీరంలోని అందాలు చూసి మోహ పరవశుడివి కావద్దు. శరీరము మాంసము,కొవ్వు,రక్తములతో తయారయినది.ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకో. భౌతిక శారీరక అందములు అశాశ్వతము. శాశ్వతమైన ఆనందం కోసం గోవిందుడిని భజించు.

విద్యార్థుల  కొరకు కధ :

నమ్మకము వలన కలిగే శక్తి .

 విలువ : ఆశావాదము  

ఉపవిలువ :ఆత్మవిశ్వాసము

ఒక వ్యాపారస్తుడు  తన వ్యాపారంలో చాలా నష్టాలు వచ్చి అప్పులపాలు అయ్యాడు . బయిటకు పడే మార్గం లేక నిరాశవాది అయ్యాడు. పార్కుకు వచ్చి బెంచీ మీద దిగులుగా కూర్చున్నారు . తనను ఎవరైనా ఈ కష్టము నుంచి బైట పడేస్తారా అని విచారిస్తూ కూర్చున్నాడు .

ఇంతలోనే  ఒక ముసలాయన వచ్చి అతను దిగులుగా వుండటం చూసి విషయం ఏంటని అడిగి, సంగతి తెలుసుకున్నాడు . తరువాత ముసలాయన ఇలా  అన్నాడు .

“నేను  నీకు సహాయపడగలనని అనుకుంటున్నాను. ” వెంటనే  తన జేబు లో ఉన్న చెక్ బుక్ తీసి వ్యాపారి పేరు అడిగి కొంత పైకం చెక్ మీద వ్రాసి దాన్ని,  వ్యాపారి చేతిలో పెడుతూ ఇలా అన్నాడు .”ఈ డబ్బు తీసుకో! సరిగ్గా , ఏడాది తరువాత మనము ఇదే పార్కులో ఈ బెంచీ దగ్గరే  కలుసుకుందాం . అపుడు నా ధనం చెల్లించుదువు గాని ” అన్నాడు . వెంటనే ఆ పెద్దమనిషి అక్కడనుంచి వెళ్ళిపోయాడు . 

    ఆ చెక్ పై 5000,000 డాలర్స్ అమౌంట్ వేసివుంది. క్రింద సంతకం, ప్రపంచ ప్రఖ్యాత ధనవంతుడైన రాక్ ఫెల్లర్   అని ఉంది . వ్యాపారి “నా బాధలు ఇప్పుడీ నిమిషంలో తీరిపోతాయి “అని అతనికి ఆస కలిగింది.కానీ,అతడు ఆ చెక్ ని వాడదలుచుకోలేదు . తన పెట్టలో భద్రంగా దాచుకున్నాడు.”   “ఈ చెక్ నాకు అవసరం అయినప్పుడు వాడతాను . ” ఈ చెక్ వున్నదని నమ్మకమే నా ఆలోచనా ధోరణి మార్చివేసింది . నాకు ధైర్యము వచ్చింది .

                   ” నా శక్తి మీద నాకు నమ్మకంకలిగింది.”అని  అనుకున్నాడు. తన వ్యాపారం నిలుపుకునే మార్గాల గురించి  చేయవలసిన పనుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎంతో ఆశతో , ధృడ  సంకల్పంతో , ఆత్మవిశ్వాసంతో ,ఎన్నో కొత్త ప్రతిపాదనలు రూపొందించి ఆ దిశగా పని ప్రారంభించాడు . క్రమంగా కొన్ని నెలలు తిరగాక ముందే వ్యాపారంలో లాభాలు చవిచూశాడు. అప్పులు తీర్చాడు. రాబడి ఎంతో  పంచుకున్నాడు,స్థిరపడ్డాడు.   సరిగ్గా ఒక సంవత్సరం  తర్వాత , అదే రోజున తను ఉపయోగించకుండా  దాచిన చెక్ ను ఆ పెద్దమనిషికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో పార్కులో ,ఆయనను కలవాలిసిన బెంచ్ మీద కూర్చొని అతని కోసం నిరీక్షించసాగాడు.  

                             సరిగ్గా అక్కడకి  ఆ పెద్దమనిషి వచ్చాడు.వ్యాపారి చెక్ తిరిగి అతని చేతిలో పెడుతుండగా, వెనుక నుంచి నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా  పట్టుకుంది . ” హమ్మయ్యా దొరికాడు,మిమ్మల్ని ఏమి కష్టపెట్టలేదు కదా? ఈయన హాస్పిటల్ నుంచి తప్పించుకొని వచ్చాడు.తాను ప్రపంచంలో గొప్ప ధనవంతుడైన జాన్ రాక్ ఫెల్లర్  అనే భ్రమ లో ఉంటాడు.”అంటూ ఆ పెద్దమనిషి చెయ్యి పట్టి లాకెళ్తున్నట్టు వడివడిగా అక్కడినుండి వెళ్ళిపొయంది .

వ్యాపారి ఒక్కసారిగా దిగ్భ్రాంతి  చెందాడు. ఆ చెక్ డబ్బులు ఉన్నాయిలే అనే ధైర్యంతో ఎన్నో ప్రతిపాదనలు చేశాడు. కొన్ని కొన్నాడు ,అమ్మాడుకూడా . క్రొత్త పద్ధతులు ప్రెవేశపెట్టాడు. దివాలా  తీసిన పరిస్థితులనుంచి బైట పడి పూర్వం కంటే గొప్ప ధనవంతుడయ్యాడు. తరువాత ఆలోచిస్తూ ఇలా అనుకున్నాడు. నిజానికి, ఆ చెక్ చెల్లదు .తన పురోగమనవృద్ధికి ఆ డబ్బు కారణం కాదు. ఆతను ఆ చెక్కు ని ఉపయోగించి విజయవంతుడు అవ్వలేదు. ఆ చెక్కు మీద నమ్మకంతో వచ్చిన ఆత్మవిశ్వాసము వల్లనే  విజయాన్ని సాధించగలిగారు. తనకు ఆ సామర్ధ్యము ముందునుంచే ఉంది. కానీ, కృంగిపోయిన మనస్సుతో ఏ ప్రయత్నము చేయలేదు. తనమీద తనకున్న నమ్మకమే తన ఆత్మవిశ్వసాన్ని పెంచి వ్యాపారం లో తిరిగి ధనవంతుడిని చేసింది. తనపై తనకు నమ్మకామూ మరియు శక్తే దీనికి కారణం అనుకున్నాడు.

 నేర్చుకోవలసిన విషయము:  ఎవరికైనా వారిపై వారికి విశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యము కలది. మనమీద మనకి నమ్మకం లేకపోతే ఎవరూ మనకేమీ  చేయలేరు. చాలా  సార్లు, మనం మానని  మన స్నేహితులతో పోల్చుకుంటాం. అందమైన వారిని ,పేరుప్రఖ్యాతలున్న వారిని చూసి వారిని అనుకరించటానికి ప్రయత్నిస్తాం .ఎందుకంటే మనమీద మనకు నమ్మకం ఉండదు. మనకంటే అవతలి వారు గొప్పవారనుకుంటాము. మనలని మనం తక్కువగా భావిస్తాము’. బైట కనపడేదంతా నిజం అనుకుంటాం. అది అన్ని సార్లు కరెక్ట్ కాదు. చిన్నప్పటినుంచీ మనమీద మనకి నమ్మకం ఉండాలి.            

ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం మనలో మంచి లక్షణాలను పెంచుకుంటూ ఉండాలి . ఎంతో మనోనిబ్బరంగా, గట్టిగా  ఉండాలి. బాహ్య ఆకృతి వయసు పెరిగే కొద్దీ మార్పు చెందుతుంది.

 కానీ మనలో ఉన్న  ఆత్మవిశ్వాసం ,ఆత్మగౌరవం మన మానసిక శక్తి వయసుతో పాటు వృద్ధి చెందుతాయి. క్రమంగా అంతరంగ పరివర్తన లో మార్పుకలిగి “నేను” అనేది ఏమిటో తెలిసుకొంటాం .

 

భజగోవిందం -బాలగోవిందం:రెండవ శ్లోకము

నిజాయతీతో చేసే కర్మల వలన కలిగే ఫలితములతో తృప్తి చెందాలి

BG2

మూఢ జహీహి ధనాగమతృష్ణాం

కురు సద్బుద్ధిం మానస వితృష్ణాం

యల్లభసే నిజకర్మోపాత్తం

విత్తం తేన వినోదయ చిత్తం

భజగోవిందం భజగోవిందం ||2|| .

 

తాత్పర్యము: ఓ మూఢుడా ఏ విధంగానైనా సరే డబ్బు వచ్చి పడాలన్నకోరికను విడిచిపెట్టు. కోరిక లేకపోవడం అనే సద్బుద్ధిని అలవరచుకో. నీ చేతల వల్ల నీకు న్యాయంగా ఎంత ధనం లభిస్తే అంత ధనంతో  తృప్తిపడు. గోవిందుడిని ఆశ్రయించు.

 

విద్యార్థుల  కొరకు  కథ  :  బీదవాని ధ నము

విలువ : శాంతి

ఉప విలువ : తృప్తి

BG2a

 

రాంచంద్, ప్రేమ్ చంద్ ఇద్దరివీ ఇరుగు పొరుగు ఇళ్ళు. రామచంద్  ఒక బీద రైతు ప్రేమచంద్ ధనవంతుడైన భూస్వామి .రామచంద్ ఎప్పుడూ  ప్రశాంతంగా ,తీరికగా సంతోషంగా  ఉండేవాడు . రాత్రిళ్ళు తలుపులు ,కిటికీలు కూడా వేసుకొనేవాడు కాదు .హాయిగా నిదురించేవాడు .డబ్బు లేకపోడము వలన  ప్రశాంతంగా ఉండేవాడు .ప్రేమచంద్ గొప్ప ధనవంతుడైనా, ఎప్పుడూ ఆందోళనగా ,కంగారు పడుతూ ఉండేవాడు .రాత్రి అయ్యిందంటే చాలు, కిటికీ తలుపులు ,ఇంటి తలుపులు అన్ని గట్టిగా వేసి ఒకటికి  రెండు సార్లు చూసుకునేవాడు . ఎవరన్నా దొంగలు వచ్చి ధనము దోచుకెళ్తారేమో అని అతనికి భయం . రామచంద్ వాలకం చూసి ఈర్ష్య పది ఒక రోజు ప్రేమచంద్ ,రామచంద్ ఆర్ధిక పరిస్థితి కి జాలిపడి ,ఒక పెట్టనిండా డబ్బులు పెట్టి   ” మిత్రమా! నా దగ్గర చాలా డబ్బు ఉంది .నీకు ఈ పెట్టేలో, డబ్బులు పెట్టి ఇస్తున్నాను . ఈ డబ్బును తీసుకోని నీ పేదరికం పోగొట్టుకో అన్నాడు .”

                    రామచంద్ ఎంతో సంతోషంతో ఆ డబ్బును ఇంటికి  తెచ్చుకున్నాడు. ఆ రోజంతా సంతోషంగా ఉన్నాడు రాంచంద్  .రాత్రి వేళ అయింది .రామచంద్ కి నిద్ర పట్టలేదు. వెంటనే ఇంటితలుపులు, కిటికీ తలుపులు వేసేశాడు .అయినా కూడా  రాత్రంతా ఆ పెట్టె వైపు చూస్తూనే పడుకున్నాడు. అతనికి సరిగ్గా నిద్ర పట్టలేదు .మరునాడు పొద్దున్నే రామచంద్ ఆ డబ్బుల పెట్టెని తీసుకోని ప్రేమచంద్ దగ్గరకి వచ్చాడు. ఆ పెట్టెని ప్రేమచంద్ కి తిరిగి ఇస్తూ   ” ప్రియమిత్రమా ! నేను బీద వాడినని ధనము ఇచ్చి సహాయపడాలి అనుకున్నావు కానీ, నీవు ఇచ్చిన ధనము నాకు ప్రశాంతత లేకుండా చేసింది .దయచేసి నీవు ఏమి అనుకోకుండా, నీ డబ్బుల పెట్టెని నీవే తీసేసుకో “అని, ఆ డబ్బుల పెట్టె అతనికి ఇచ్చి తన ఇంటికి తిరిగి వచ్చేసాడు రామచంద్ .  

 నేర్చుకోవలసిన విషయము:         

ధనము అన్నీటినీ   ఇవ్వజాలదు. కష్టపడి నీ శాయ శక్తులా, పని చెయ్యి.  బాహ్య సంబంధ మైన సుఖ వంతమైన జీవితం గడపటం కోసం విద్యార్థులు  నిజాయితీగా , శ్రమించటం అలవాటు చేసుకోవాలి .శక్తి మేరకు కష్ట పడితేనే మంచి ఫలితములు వస్తాయి . కొన్ని విషయములు మన ఆధీనములో ఉండవు .ఎంత కష్ట పడ్డా, ఒక్కో సారి  ఆశించిన ఫలితములు రాకపోవచ్చు .మనం దానికి నిరాశ పడితే అసహాయులమనే భావన వస్తుంది .అలాంటి భావనని రానీ కూడదు . “ప్రతిదీ తాత్కాలికమే” .అట్లా ఆలోచిస్తే ,మనసు తేలిక పడి  మనము ఇంకా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తాము. అలా ముందుకి సాగితే తరువాతి ప్రయత్నం విజయవంతం అవ్వచ్చు. చిన్న పిల్లలు ఎంతో ఆశగా ఇంకొకరికి ఇవ్వకుండా,  బొమ్మలని వారివే అనుకోని చేతిలో గట్టిగా పట్టుకున్నంతకాలము, క్రొత్త బొమ్మలని పట్టుకోలేరు .పాతవి వదిలేస్తేనే క్రొత్త వాటితో ఆడుకోవచ్చు . మనలో దురాశ ఉంటే అది మనలని గ్రుడ్డి వాళ్ళను చేస్తుంది .వస్తువులు కూడబెట్టి ఎవరితో పంచోకోక స్వార్ధంతో ఉంటే చుట్టాలు , స్నేహితులు దూరమవుతారు అప్పుడు సంతోషం ఉండదు .

 

భజగోవిందం -బాలగోవిందం :మొదటి శ్లోకము

BG2భజ గోవిందం భజ గోవిందం

గోవిందం భజ మూఢమతే

సంప్రాప్తే సన్నిహితే కాలే

నహి నహి రక్షతి డుకృం కరణే

భజగోవిందం భజగోవిందం || 1|| .

 

 

తాత్పర్యము :

ఓ మూఢుడా : గోవిందుని భజన చెయ్యి. మరణ కాలము ఆసన్నమైనపుడు, డుకృం కరణే అని నీవు వల్ల వేసే వ్యాకరణ పాఠం నిన్ను రక్షించదు.

 

విద్యార్థుల  కొరకు  కధ :  క్యాబ్ డ్రైవర్- నిజాయితీ        

BG3

శివఖేర్  అనే అతను ఒక గొప్ప రచయిత ,మానేజ్మెంట్ ట్రైనర్. ఈ కథ  సింగపూర్ వెళ్ళినప్పుడు ఆయనకి కలిగిన అనుభవం గురించిన కధ.

ఆరేళ్ళ క్రిందట నేను, ఒక పని మీద సింగపూర్ వెళ్ళాను. అక్కడ ఒక క్యాబ్ ని మాట్లాడుకొని, నేను వెళ్ళ వలసిన అడ్రస్ కార్డు ఆ క్యాబ్  డ్రైవర్ కి ఇచ్చి ఆ అడ్రస్ కి నన్ను తీసుకోని వెళ్ళమన్నాను .

                         ఆ కార్డు లో అడ్రస్ చూసుకుంటూ ఆతను ఆ ప్రదేశమునకు  నన్ను తీసుకోని వెళ్ళాడు .కాని,అక్కడ ఉన్న పెద్ద భవంతి చుట్టూరా రెండు సార్లు తిరిగిన  తరువాతే, నేను వెళ్ళవలసిన అడ్రస్ కనుక్కో గలిగాడు. క్యాబ్ మీటరు- 11 డాలర్స్  ఛార్జ్ ని చూపంచింది . నేను 11 డాలర్స్ ఇవ్వగా అతను 10 డాలర్స్ మాత్రమే తీసుకోని ఒక డాలర్ తిరిగి ఇచ్చాడు.

  అప్పుడు నేను , “హెన్రీ  నీ మీటర్ లో ఛార్జ్ 11 డాలర్స్ చూపిస్తుంటే నువ్వు 10 డాలర్స్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నావు? అని అడిగాను.దానికి  హెన్రీ ఈ విధంగా జవాబు చెప్పాడు” సార్ ! నేను క్యాబ్ డ్రైవరును! మిమ్మల్ని, మీరు చేర్చమన్న చోటికి తిన్నగా తీసుకెళ్ళాలి. కానీ, నేను సరైన ఇంటిని గుర్తించలేక ఆ భవంతుల చుట్టూ మిమ్మల్ని తిప్పాను  . అట్లా కాకుండా తిన్నగా సరైన ఇంటికి వచ్చి ఉంటే మీటర్ చార్జి 10 డాలర్లు మాత్రమే అయ్యివుండేది కదా. అడ్రస్ తెలుసుకోలేకపోవటం నా తప్పు . అందువల్లే కదా ఎక్కువ చార్జి అయింది. సరిగ్గా తీసుకుని వెళ్తే  10 డాలర్స్ మాత్రమే అయ్యేది.

           నా తప్పుకు మీరెందుకు ఎక్కువ పైకం చెల్లించాలి” ? నిజానికి మీటర్ ఎంత చూపిస్తే అంత తీసుకోవాలి. నిజాయితీగా, నీతివంతంగా  నాకు రావలసింది 10 డాలర్లు మాత్రమే”.

   అదీ కాకుండా ” సర్! నేను ఒక క్యాబ్ డ్రైవర్ ని . సింగపూర్, టూరిజం కు  ప్రాధాన్యత ఉన్న చోటు. ఎంతో మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. కనీసం 4 ,5 రోజులు ఉంటారు .

 వారు వేరే వేరే దేశాల నుంచి వచ్చినపుడు ఇమిగ్రేషన్ ,కస్టమ్స్  పూర్తివుతేగాని బైటకురారు . ఎయిర్పోర్ట్ బైటకు వస్తూనే , వారికి  ముందుగా అనుభవం, క్యాబ్ డ్రైవర్ తోనే అవుతుంది . ఆ మొదటి అనుభవం వారికి సంతోషాన్ని ఇవ్వకపోతే, ఆ ప్రభావం వారు ఉండే

మిగతా 4,5 రోజులు  మీద ఉంటుంది.

        కాబ్ డ్రైవర్ సమాధానము విన్న తరువాత శివశేఖర్ కి  అతని గురించి ఇలా అనిపించింది -” ఇతను ఎక్కువ చదువుకుని ఉండకపోవచ్చు కానీ ఒక గొప్ప ఆదర్శవాది  ,మరియు సంస్కారవంతుడు. అతని ప్రవర్తన , అణుకువ గా ఉంది .ఎంతో ఆత్మ విశ్వాసం కలిగి ఉన్నాడు.” అంతే  కాకుండా ఆ రోజు శివఖేర్ ఒక ఉద్యోగికి , క్వాలిఫికేషన్ కంటే సంస్కారం ముఖ్యమని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు.

 

నేర్చుకోవలసిన విషయము:                              

                                  వృత్తి పరంగా ఏ వృత్తి ని ఎంచుకున్నా, దానికి మానవతా  స్పందన ,విలువ , అవసరం. జ్ఞానము ,నైపుణ్యము, ధనం, చదువు, అన్నీ, విలువలు తరువాతనే వస్తాయి. ముందుగా  మానవతా విలువలు, నిజాయితీ , నేర్చుకోవలసిన విషయము:అవసరం. క్యాబ్ డ్రైవర్ కి నైతికత ఉంది . సంస్కరావంతుడు, మంచి ఆలోచనలు ,నడవడి కలిగి ఉన్నాడు . మనిషి అనేక మార్గాల ద్వారా ఎంతో ధనం కూడ బెట్టవచ్చు , బ్రహ్మాండమైన  సంపద కలిగి ఉండవచ్చు. కానీ, సంతోషం లేకపోతే అవన్నీ ఎందుకు?మంచి నడత ఉండాలి అంటే , సుగుణాలు కలిగి ఉండాలి. గుణవంతునికి లేనిదంటూ ఏమియు లేదు .గుణవంతుడు కాని జీవితం వ్యర్థము. మంచి నడవడి సక్రమమైన జీవితానికి పునాది .చదువు  జీవితాన్ని సార్ధక పరచాలి కానీ, దానిని యాంత్రికంగా మార్చకూడదు .చదువు వల్ల మనిషికి తెలివి తేటలు ,జ్ఞానం, మేధాశక్తి ,లభించవచ్చు.

జీవితానికి అవి మాత్రమే చాలా ? అవి ,ఈ ప్రపంచంలో జీవించటానికి మాత్రమే పనికి వస్తాయి .కానీ, అంతరంగ ప్రపంచం మాట ఏమిటి ?

                  కాబట్టి , విద్యార్థులారా ! ఎంతైనా సంపాదించండి ,విలాసవంతమైన జీవితాన్ని గడపండి కానీ, ఆధ్యాత్మిక జ్ఞానాన్నితప్పక పెంచుకోండి .దానివల్ల మీ అంతరంగ శక్తి ,మానసిక శక్తి పెరిగి, మీ సామర్థ్యం మీద మీకు అపారమైన విశ్వాసం పెరుగుతుంది. అటువంటి జ్ఞానం మీకు, భౌతిక జీవితానికి మాత్రమే కాక జీవిత పరమార్థం తెలుసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది.

 

 

 

 

 

 

భజగోవిందం-బాలగోవిందము

 

bhajagovindam -1.png

జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు రచించిన గొప్ప వేదాంత గ్రంధములలో అత్యంత అద్భుతమైనది, తేట తెల్లంగా ,స్వచ్ఛముగా ,వేదాంత సారాన్ని అందించేది ‘భజగోవిందం’.

ఈ రచనకు మరో పేరు “మోహముద్గరము”. సంస్కృతంలో ‘మోహము’ అంటే “మాయ” అని అర్ధము. “ముద్గరము” అంటే “సమ్మెట లేక సుత్తి”. “మోహముద్గరము అంటే మాయను తొలగించేది, నశింపచేసేది అని అర్ధం.” భజగోవిందం ఈ ప్రపంచమనే సంసారంలో ,దేహభావనతో జీవించేవారి మోహమును పోగొట్టి ,మాయను తొలగింపచేసి  సత్యమును భోదిస్తుంది. కనుక దీనిని “మోహముద్గరము” అని కూడా  అంటారు.

ఒక రోజున శంకరాచార్యులు వారి శిష్యులతో కలిసి కాశీపుర వీధులలో పర్యటిస్తూ ఉండగా , దారిలో ఒక ముసలి పండితుడు పాణినీ వ్యాకరణ సూత్రములు వల్లె వేస్తూ కనిపించాడు. ఆ పండితుడి యొక్క దృష్టి, ఆసక్తి వ్యాకరణ సారాంశము మీద కాకుండా, కేవలము వ్యాకరణమును వల్లె వేయుటయందు, కంఠస్తము చేయుటయందు పరిమితమై ఉండుట గమనించారు ఆచార్యుల.అది చూసిన మరుక్షణమే ప్రేరణ పొందిన ఆచార్యుల వారిచే ప్రకటితమైన మహత్తరమైన భక్తి, జ్ఞాన సంపన్నమైన శ్లోకముల సముదాయమే భజగోవిందం.

భజగోవిందం యొక్క సందేశాన్ని, తెలికగా అర్ధమయ్యే నీతికధల రూపంలో విద్యార్థులకు,సాధకులకు అందచేయటంకోసం “సాయి బాలసంస్కా ర్ బృందం “వారు చేసిన వినయపూర్వక ప్రయత్నం , ఈ భజగోవిందం-బాలగోవిందము .

ఇంత గొప్ప వేదాంత రచన చేసిన “జగద్గురువులు ఆది శంకరాచార్యుల” వారికి  హృదయపూర్వక మైన,వినయపూర్వకమైన సాష్టాంగ ప్రణామములు అర్పిస్తున్నాము . తమ తమ వాఖ్యానములు  ,ప్రవచనముల ద్వారా ఈ వేదాంత సందేశమును సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన గురువులందరికీ హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రణామములను సమర్పిస్తున్నాను.

మేము చేసినటువంటి ఈ చిన్న ప్రయత్నం- చదివినవారందరికీ ప్రయోజనకరంగా ఉండి ,దైవాన్ని చేరుకోవటంలో వారి ప్రయాణానికి చిన్న మైలురాయిగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము.

       సాయి బలసంస్కార్ బృందం.

https://m.facebook.com/neetikathalu