Archive | June 2021

శ్రీ రామావతారం – అవతారపురుషుని నుంచి నేర్చుకుందాం.

విలువ :   సత్యం 

    ఉపవిలువ : సత్ప్రవర్తన. 

శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం శ్రీ రాముడు. ధర్మమునకు గ్లాని సంభవించినపుడల్లా భగవంతుడు మానవ ఆకారం ధరించి అవతరిస్తాడు. ఆయన ఏ రూపంలోనైనా అవతరించవచ్చును కానీ ,ఎక్కువ సార్లు మానవ ఆకారం ధరించే వస్తాడు . మానవ శరీర పరిధికి లోబడి ఉండి తన ప్రవర్తనతో జీవితంలో ఎదురయ్యే  సమస్యలను, కష్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలో తన నడవడి ద్వారా మానవ జాతికి ఉదాహరణ గా  జీవితం గడుపుతాడు . 

                 శ్రీ రాముడు సామాన్య మానవుల వలె జన్మించలేదు . చతుర్భుజములతో శ్రీ మహా విష్ణువు లాగా   తల్లి కౌశల్య ముందు ప్రత్యక్షమైనాడు . ఆమె కోరిక మేరకు సామాన్య మానవ శిశువు రూపంలో కనిపించాడు . చిన్న వయసులో వశిష్ఠుని గురుకులానికి వెళ్ళి , విద్యను అభ్యసించాడు. ఆదర్శప్రాయమైన కుమారునిగా ,సోదరునిగా ,విద్యార్థిగా  మెలిగాడు.తల్లి దండ్రులను ,గురువును గౌరవించేవాడు. వారు చెప్పినట్లుగా  నడుచుకునేవాడు. అనేకమంది ఋషుల ఆశ్రమానికి వెళ్ళి వారి ఆశీర్వాదములను పొందేవాడు . ఈ ఋషులంతా శ్రీ మహావిష్ణువు ను భూమి పై అవతరించమని ప్రార్ధించినవారే.  కానీ ,  శ్రీ మహావిష్ణువు నరునిగా భూమి పై అవతరించినప్పుడు తన మానవాతీత శక్తులను ఏవీ ప్రదర్శించలేదు . తానే స్వయంగా వారి నుండి అనేక విషయములను తెలుసుకుంటూ వారిని గౌరవించేవాడు.  

        సీతను తిరిగి దక్కించుకోవడం కోసం చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేశాడు. ఆఖరికి వానరులతో స్నేహం కూడా చేశాడు. ఆదర్శవంతుడైన కుమారునికి ఉదాహరణ శ్రీరాముడు. తండ్రి అనుమతి  తీసుకుని గురువు విశ్వామిత్రునితో  అడవికి వెళ్ళి  వారి యాగమును కాపాడి  ఆపై సీతా స్వయంవరము కోసం మిథిలకు వెళ్ళాడు . తండ్రి మాటను నిలబెట్టడం కోసం భార్య  సీత తో  వనవాసానికి వెళ్ళాడు . సోదరుడు లక్ష్మణునితో , భార్య సీతతో  కలిసి అడవులలో ఎన్నో కష్టాలను అనుభవించాడు. తండ్రిని కానీ ,కైకని కానీ ఒక్క మాట కూడా అనలేదు . 

             సీత కోరిక మేరకు  బంగారు జింక వెంటబడి వెళ్ళిన సమయంలో  రావణుడు సీతను అపహరించటం తో చాలా విచారించాడు ,దుఃఖించాడు . సాక్షాత్తు తాను శ్రీ మహావిష్ణువు యొక్క  అవతారం అయి ఉండి   కూడా  తన కున్న  మహాశక్తిని  తన సమస్యలను పరిష్కరించు కోవడం కోసం ఉపయోగించుకోలేదు . తన శక్తులను ఉపయోగించుకోకుండా క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని  తన సమస్యలను తానే చక్కగా పరిష్కరించుకున్నాడు . తల్లిదండ్రులను ,గురువులను వారి యెడల తన కర్తవ్యమును నిర్వహించటంలో తన దివ్యత్వమును తెలియపరచాడు. రాక్షసులను సంహరించి మంచివారిని రక్షించాడు. శబరి వంటి భక్తులను కాపాడాడు జంతువులకు కూడా తన ప్రేమను సమానంగా పంచాడు . రాముని అవతార లక్ష్యం లో జంతువులు కూడా తమ వంతు సహాయాన్ని అందించాయి . 

నేర్వవలసిన నీతి : 

     నీతి వంతులను ఉద్ధరించడానికి  భగవంతుడు మానవ రూపం ధరించి అవతరిస్తాడు . సామాన్య మానవుని వలనే జీవితంలో ఎత్తు ,పల్లాలను ,కష్ట నష్టాలను ఎదుర్కొంటాడు . కానీ ధర్మ బద్దంగా జీవితం గడిపి మానవజాతికి ఆదర్శప్రాయుడిగా ,ఒక ఉదాహరణగా నిలుస్తాడు . మహా శక్తి కలిగి ఉండి కూడా అందులో కొద్దిపాటి శక్తి ని మాత్రమే మానవ జాతి ఉద్దరణకు ఉపయోగిస్తాడు . 

https://saibalsanskaar.wordpress.com/2017/04/06/lord-rama-learning-from-the-avatar/

జాంబవంతుడు -హనుమంతుడు.

 

విలువ:     సత్యము 

ఉప విలువ :     మీ అంతర్గత బలాన్ని ,మీ నిజ స్వరూపాన్ని గుర్తించండి . 


                  రామాయణ మహాకావ్యంలో శ్రీ రాముడు బంగారు లేడిని వెదుకుతూ వెళ్ళినప్పుడు రావణాసురుడు సీతాదేవిని అపహరించిన విషయం మనకి  తెలుసు  . శ్రీ రాముడు, లక్ష్మణుడితో  కలిసి  సీతా దేవిని అన్వేషిస్తూ వెళుతున్నప్పుడు వారికి హనుమ పరిచయం కావటం ,హనుమ వారిని తమకు వానర రాజైన సుగ్రీవుని వద్దకు తీసుకు వెళ్లడం జరిగింది . రాముడు వాలిని చంపి,సుగ్రీవుడు కిష్కిందకు రాజు కావటానికి సహాయం చేసినప్పుడు సుగ్రీవుడు కూడా తన వానర సైన్యాన్ని పంపి సీతని వెతికించటానికి సహాయపడతానని మాట  ఇచ్చాడు .పక్షి జటాయువు సోదరుడైన సంపాతి ద్వారా,  రావణాసురుడు సీత ని అపహరించి లంకకు తీసుకువెళ్లాడని వానరులకు తెలిసింది . అందువలన వానర బృందం అంతా కలిసి లంకను ఏ విధంగా చేరుకోవాలి ? సీతా  దేవిని ఏ విధంగా కాపాడుకోవాలి అని చర్చించారు.

                   కిష్కిందకు  యువరాజైన అంగదుడు “నేను ఇంకా చిన్నవాడిని కావటం వలన ఇంత దూరాన్ని సముద్రం పై నుంచి దాట లేను  అన్నాడు”. తన శక్తిని గురించి తెలియని హనుమ మౌనముగా కూర్చున్నాడు . అప్పుడు వానరులలో అందరికంటే వయసులో పెద్దవాడైన జాంబవంతుడు ,(పెద్ద ఎలుగు బంటి)  చాలా  తెలివైనవాడు. ఆ జాంబవంతుడు హనుమంతుని శక్తి ని గురించిన రహస్యమును వానర సైన్యానికి వెల్లడించాడు. 

            వాయు దేవుని కూమారుడైన హనుమంతుడు చిన్నతనం లో చాలా వేగంగా ,తేలికగా ఎగురుతూ సూర్యుని కూడా చేరగలిగేవాడు . సూర్య భగవానుడి నుండి నేరుగా హనుమంతుడు వేదములన్నిటిని నేర్చుకున్నట్లుగా  మన పురాణాలలో ,ఇతిహాసములలో చెప్పబడింది. చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే హనుమంతుడు  సకలవిద్యలను అభ్యసించటమే కాకుండా  చాలా  బలవంతుడిగా ఉండేవాడు . అల్లరిగా తన బలం పట్ల గర్వముతో విర్రవీగుతూ ఉండేవాడు. ఈ పొగరుబోతు అల్లరి చేష్టలను ఆపటం కోసం తన శక్తిని తానే మరచి పోయేలా శాపం ఇవ్వబడింది హనుమంతుడికి . అయితే దీనికి ఒక ఉపాయం కూడా చెప్పబడింది. ఇతరులు అతని శక్తిని ,బలాన్ని గురించి హనుమంతునికి గుర్తు చేసినప్పుడు ,అతనిని పొగిడినప్పుడు అతని బలం ,శక్తి హనుమంతునికి గుర్తువస్తుంది . ఈ రహస్యం గురించి తెలిసిన జాంబవంతుడు హనుమంతునికి అతని శక్తి ,సామర్ద్యముల గురించి తెలియచేశాడు . తన నిజ శక్తి సామర్ధ్యముల గురించి తెలుసుకున్న హనుమంతుడు ఒంటరిగా సముద్రమును లంఘించి , విఘ్నములన్నింటిని జయించి , రాక్షస రాజైన రావణుడితో జరిగిన యుద్దములో చాలా ప్రముఖ పాత్రను పోషించాడు . రామ రావణ యుద్దములో అనేక క్లిష్ట సమయాలలో హనుమంతుడు శ్రీరామునికి  ,రామదండుకి సహాయం చేసి రావణుడిని జయించటం లో ముఖ్యమైన విధిని నిర్వహించాడు . 

 నీతి : పవిత్రమైన భక్తికి ఎటువంటి అహంకారం  లేని శరణాగతి కి ప్రతీక హనుమంతుడు . ఒక వానరునిగా (కోతిగా  ఉన్నప్పుడు హనుమంతుడు తాను కొన్ని పరిమితులతో కూడిన దేహముగానే భావించి అందుకు తగినట్లుగా ప్రవర్తించాడు . కానీ అతను ఎవరో ,అతని శక్తి సామర్ధ్యములు ఏమిటో తెలియచేయగానే అతను దుర్లభమైన కార్యములను సాధించగలిగాడు . మనలో కూడా గొప్ప అంతర్గత శక్తి దాగి ఉంది  .అట్టి శక్తిని గుర్తించగలిగినప్పుడు భౌతిక ప్రపంచములోనే కాక ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఘన విజయములను సాధించగలుగుతాము.

https://saibalsanskaar.wordpress.com/2017/04/07/jambavan-and-hanuman/