Archive | June 2016

భాగ్యవంతుడు -ప్రశాంతత

 

విలువ — శాంతి
అంతర్గత విలువ — కృతజ్ఞత, ఉన్నదానితో తృప్తి చెందడం.

image

 

ఒక భాగ్యవంతుడికి జీవితం అంటే చికాకు కలిగింది. డబ్బుతో చాలా సంతోషము,సుఖము అనుభవించాడు, కాని తృప్తి కలగలేదు. నిజమైన సంతోషాన్ని వెతుకుతూ చాలా మంది సాధువులని కలిసి, పూజలు, వ్రతాలు చేశాడు. కాని,ఏమీ పని చెయ్యలేదు.

ఆఖరికి ఒక సాధువు దగ్గరకి వెళ్లి చాలా యాతన పడ్డాడు. “సమయం గడిచి పోతోంది, నీవు ఎలాంటి సాధువువి ? నాకు సరైన దారి చూపించలేకపోతున్నావు?నేను మీకు 24 గంటల గడువును ఇవ్వగలను, నాకు పిల్లలు లేరు, 10 తరాలకు కావాలసినంత డబ్బు సంపాదించుకున్నాను” అన్నాడు.
అప్పుడు ఆ సాధువు ఇతన్ని ఇంకో స్వామీజీ దగ్గరికి పంపించారు. ఆ స్వామీజీ కొంచం వెర్రిగా ఉంటారు కాని చాలా స్థిరచిత్తం గలవారు.

ఈ భాగ్యవంతుడు ఒక సంచీ నిండుగా వజ్రాలు తీసుకుని చెట్టు కింద ఉన్న స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. స్వామీజీతో తనకి నిజమైన సంతోషం కావాలి అని చెప్పాడు. తను చాలా భాగ్యవంతుడుని అని సంచీ లో ఉన్న డబ్బు ఇచ్చి, మనసుకు శాంతి కావాలి అని అడిగాడు. అప్పుడు స్వామీజీ “తయారుగా ఉండు వెంటనే ఇస్తాను” అని అన్నారు. భాగ్యవంతుడు ఆశ్చర్యపోయాడు, పూజలు, వ్రతాలు ఏమీ చెప్పలేదే, నిజంగా ఈ స్వామిజీ వెర్రివాడేమో అని అనుకున్నాడు. అప్పుడు స్వామీజీ “తయారుగా ఉండు, ఆలస్యము చెయ్యకు ” అన్నారు.

భాగ్యవంతుడు భయంతో సరే అన్నాడు. అప్పుడు స్వామి ఆ డబ్బుల సంచీ తీసుకుని పరిగెత్తసాగారు.. భాగ్యవంతుడు అప్పుడు పెద్దగా అరుస్తూ ‘నేను మోసపోయాను’ అని స్వామీజీ వెనకాల ఆ చిన్న ఊరిలో కష్టపడి పరిగెత్తి ఆఖరికి స్వామిజీ కూర్చున్న చెట్టు కిందకి నెమ్మదిగా చేరాడు. స్వామిజీ తన కంటే ముందరే వచ్చి కూర్చున్నారు.

స్వామీజీ ఆ డబ్బుల సంచీని భాగ్యవంతుడికి ఇచ్చి, ఇప్పుడు “ఎలా ఉన్నావు” అని అడిగారు. అప్పుడు భాగ్యవంతుడు”చాలా సంతోషంగా, ఉన్నాను”. అని అన్నాడు.

అప్పుడు స్వామీజీ అన్నారు “ఎప్పుడు ఎవ్వరిని తృప్తి, సంతోషం కావాలి అని అడగవద్దు” నువ్వు డబ్బుని చాలా ప్రేమిస్తున్నావు. దూరం చేద్దామని అనుకున్నాను కాని ,డబ్బు మీద వ్యామోహంతో నా వెంట పడ్డావు.”

నీతి:

భవనాలలో ఉండేవాళ్ళు అవి శాశ్వతం అనుకుంటారు. భాగ్యవంతులు, పేదవాళ్ళ కష్టాల గురించి ఆలోచించరు.

మంచి, చెడు చెప్పే గురువు ఉంటే దాన్ని భాగ్యంగా తీసుకోవాలి. గురువు మాట నిర్లక్ష్యం చెయ్యకూడదు.

http://saibalsanskaar.wordpress.com

తాడు కథ

image

విలువ — నమ్మకం
అంతర్గత విలువ — వదిలి పెట్టడం
ఒక వ్యక్తికి కొండలు ఎక్కడం అంటే చాలా సరదా. తన స్నేహితుల వద్ద తన ప్రావీణ్యం చూపించాలని అనుకున్నాడు. దానికి చాలా సాధన చేసాడు కూడా!ఎటువంటి కొండలు అయినా ఎక్కగలను అని అనుకున్నాడు.
ఒకసారి తన ఐదుగురు స్నేహితులతో కలిసి ఒక పెద్ద కొండ ఎక్కడం మొదలుపెట్టాడు.
శిఖరం చేరడానికి ఇంకా కొంచం దూరమే ఉంది. ఐదుగురు స్నేహితులు విశ్రాంతి తీసుకుంటున్నారు, అప్పుడు తను ఒక్కడే శిఖరాన్ని చేరడానికి బయలుదేరాడు.
రాత్రి చీకటిలో మూర్ఖంగా బయలుదేరాడు. చీకటిగా ఉన్నా , చంద్రుడు ఇచ్చే వెన్నెల సహాయంతో ఎక్కగలిగాడు. కొంచం సేపటికి మబ్బు వల్ల నెమ్మదిగా మొత్తం చీకటిగా అయిపోయింది. ఏమీ కనపడలేదు.
నెమ్మదిగా ఎక్కుతూ అదృష్టం కొద్దీ ఒక పెద్ద శిలని పట్టుకోగలిగాడు. ఆ శిలనుంచి జారి పోయి, శిల చివర పట్టుకుని, తాడుతో గాలిలో వేళ్ళాడుతున్నాడు. అప్పుడు ‘భగవంతుడా నన్ను రక్షించు’ అని ప్రాధేయపడ్డాడు.
హటాత్తుగా ‘ఆ తాడు వదిలివెయ్యి ‘ అని వినిపించింది. తాడు ఎలా వదిలివేస్తాను అని అనుకున్నాడు.
మళ్ళీ ‘ఆ తాడు వదిలి వెయి’ అని వినిపించింది.
కాని ,రాత్రి అంతా చలిలో అలాగే తాడుని పట్టుకుని వేళ్ళాడుతూనే ఉన్నాడు.

మరునాడు ఐదుగురు స్నేహితులు కొండ ఎక్కే టప్పుడు శిఖరానికి ఎనిమిది అడుగుల దూరంలో తాడుని పట్టుకుని వేళ్ళాడుతున్న అతని శవాన్ని చూశారు.
భగవంతుడు చెప్పినట్టు తాడు వదిలి ఉంటే బ్రతికేవాడు.

నీతి.
ఈ కధ నుంచి ఏమి నేర్చుకున్నాము?
మనకి భద్రత (రక్షణ) తాడు నుంచి వస్తుందా ?
మనకి ఉన్న జ్ఞానము, నియంత్రణ పక్కన పెట్టుకుని, భగవంతుని మీద నమ్మకం పెంచుకోవాలి.

ఇది గుర్తుపెట్టుకుందాము.
“నేను ఈశ్వరుడిని, పరమేశ్వరుడిని, చెయ్యి పట్టుకుని చెప్తున్నాను, భయ పడకు, నేను నీకు సహాయం చెస్తాను”
ఐసయ్య : ౪౧:౧౩

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

రామయ్య ఎడ్డ్లు

పెద్దలు చెప్పిన నీతికథ

 

485203139

రామయ్య ఒక సాధారణ రైతు. దైవికముగా తనకి ఉన్నంతలో సంతృప్తిగా ఉండేవాడు. అతని వద్ద మంచి నాగౌరు గిట్టులుండేవి. వాటిని తన కన్నబిడ్డలవలె కంటికి రెప్పలాగా చూసుకునేవాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా మానవ జీవనానికి సహాయపడే పశుసంపదను పూజించడం భారతీయుల కృతజ్ఞతా వైభవానికి తార్కాణం. ఆ భారతీయ తత్త్వానుసారముగా రామయ్య తన ఎడ్లను పూజించేవాడు. నాగౌరు గిట్టలు అవడంచేత రామయ్య ఎడ్లలో సత్తా బాగా ఉండేది. అవి ఉత్తమ జాతి అశ్వాలకన్నా వేగముగా పరుగెత్తగలిగేవి! వాటి వేగము చూసి పుత్రోత్సాహ భావముతో రామయ్య మురిసిపోయేవాడు.

ఇలా ఉండగా ఒక రోజు రామయ్య ఎడ్డ్లను   కొందరు  దొంగలు అపహరించారు. తన ఎద్దులు లేవని తెలుసుకొన్న రామయ్య దుఃఖానికి అంతులేదు. పాపం! సొంత కొడుకు దూరమైనట్లు బాధపడ్డాడు. “రామా! నేనేమి పాపంచేశానయ్యా? ఎందుకింత పెద్ద శిక్ష? నా ఏడ్లు లేకుండా నేనెట్లా బ్రతికేది? ఆ దొంగలు నా ధనాం తీసుకుని నా ఎడ్లను వదిలిపెట్టుంటే బాగుండేది. పశుసంపద లేని ఇంట్లో లక్షీదేవి ఉంటుందా? (ఉండదు)”

ఇలా పరిపరి విధాల విచారించి  రామయ్య రక్షకభటులకు ఫిరియాదు చేశాడు. తనుకూడా వారితో కలిసి దొంగలను వెదుక సాగాడు. చివరికి రామయ్య పాలిటి దేవతలైన వృషభాలను ఆ దొంగలు ఒక బండికి కట్టి పారిపోవడం రామయ్య రక్షకభటులు చూశారు. రామయ్య కళ్ళు సూర్యుని చూసిన పద్మాల్లాగా విచ్చుకున్నాయి. ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంతలో ఆ రక్షకభటులు రామయ్య ఓ బండి ఎక్కి దొంగల వెనకాల పడ్డారు. దొంగల ఎడ్లబండిని త్వరగా అందుకుంటున్నారు రామయ్య రక్షకభటులు.

ఇంతలో రామయ్య వాయువేగంతో వెళ్ళే తన నాగౌరుగిట్టలను వాళ్ళు వెళ్ళే గుఱ్ఱబ్బండి అందుకోవడమేవిటి? అని అనుకున్నాడు. తన ఎడ్లు ఆ గుఱ్ఱాలతో ఓడిపోవటం ఇష్టంలేక పొయిన రామయ్య “ఆ ముక్కుత్రాటిని రెండు  సార్లు లాగండిరా”! అని ఆ దంగలకు ఎడ్లు పూర్తి వేగముతో వెళ్ళే కిటుకు చెప్పాడు. దొంగలు ఆ కిటుకు తెలుసుకుని తీవ్రవేగాన్ని అందుకున్నారు. కొద్ది సేపటిలోనే కను మరుగైపోయారు. వచ్చిన ఒక్క అవకాశము పోయిందని విచారిస్తాడేమో అనుకున్న రక్షకభటులు రామయ్య ఆనందాన్ని చూసి ఆశ్చర్య పోయారు. ఆనందానికి కారణమేమిటని అడిగిన రక్షకభటులతో ఇలా అన్నాడు ఔదార్యముగల రామయ్య

“అయ్యా! నా గిట్టలు ఎప్పుడూ పరుగు పందెంలో ఓటమిని చవిచూడలేదు. వాటి పేరు ప్రతిష్ఠలే నాకు ముఖ్యం. నాకు దొరికి అపజయం పొందడం కన్నా అవి విజేతలుగా నాకు దూరమైనా మేలు కదా! అవి నాకు దక్కాయనే స్వార్థబుద్ధి కన్నా అవి గెలిచాయనే విషయం నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది”. తోటి మనుషులనే కాకుండా పశుపక్షాదులను వృక్షములను ప్రేమభావంతో చూసే భారతీయతను రామయ్యలో నిండుగా చూసిన రక్షకభటులు రామయ్యకు నమస్కరించి వెళ్ళిపోయారు.

నీతి: 

పశుసంపదను ప్రేమించి పూజించే భారతీయ తత్త్వాన్ని మనకు గుర్తుచేసిన రామయ్య ధన్యజీవి. పసుసంపదను  కాపాడుకుందాము.

https://neetikathalu.wordpress.com

పద్మపాద బయన్నల కథ

thAPC10058జగద్గురువులైన ఆది శంకరాచార్యులవారికి సనందుడనే శిష్యుడుండేవాడు. ఆ సనందుడు మిక్కిలి గురుభక్తి విద్యలపై ఆసక్తి కలవాడు. తన ఎకాగ్రత వినయవిధేయతల వలన కొద్దికాలం లోనే విద్యలునేర్చి శంకరభగవత్పాదులకు ప్రియ శిష్యుడైనాడు పద్మపాదుడు. “ఏ కారణముగా సనందుడు గురువుగారికింత ప్రియుడైనాడో” అని చర్చించుకుంటున్న తన శిష్యులను విన్నారు శంకరులు. వారికి సనందుని అపారమైన గురుభక్తిని చూపాలని నిశ్చయించుకున్నారు.

ఒకసారి ఆది శంకరులు తమ శిష్యసమేతముగా గంగాతీరమునకు వెళ్ళినప్పుడు ఆవలి గట్టునున్న సనందుని చూచి “నాయనా! సనందా శీఘ్రముగా ఇటు రా!” అని పిలిచినారు. గురు ఆజ్ఞయే తప్ప ఇతరము గూర్చి ఆలోచించని సనందుడు వెంటనే కళ్ళుమూసుకుని అనన్యమైన గురుభక్తితో ఇవతలి గట్టుకి నీటి మీద నడచి వచ్చాడు! అప్పుడు సనందుడు నీటిలో మునిగిపోకుండా అతని పాదాల క్రింద పద్మాలను మొలిపించింది గంగాభవానీ. ఆ ఆశ్చర్యకరమైన సంఘటన చూసి ముగ్ధులైన శిష్యులు సనందుని గురుభక్తి తెలుసుకున్నారు. అప్పటి నుంచి సనందుడు పద్మపాదుడనే పేరుతో ప్రసిద్ధుడైనాడు.

చోళదేశంలో పుట్టిన పద్మపాదుడు బాల్యము నుంచి అఖండ నృసింహభక్తుడు. స్వామి సాక్షాత్కారము కోసం పవిత్రమైన అహోబిల అడవులలో ఎన్నో ఏండ్లు తీవ్ర తపస్సును చేసినాడు. కాని నరహరి కరుణించలేదు. శిష్యుని భక్తి పరిపక్వమైనదని గ్రహించిన ఆది శంకరులు ఒకనాడు పద్మపాదుని పిలిచి దగ్గరలో ఉన్న చెంచుగుడెం లోని కొండగుహలో నృసింహస్వామికై తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. గురు ఆజ్ఞపై పద్మపాదుడు కొండగుహ చేరి ఘోర తపస్సు ప్రారంభించాడు.

image

తాపసి వచ్చాడని తెలియగానే పరుగు పరుగున సాధుసేవ చేదామని వచ్చాడు చెంచుగుడెం దొర బయన్న. “సామీ! నేను బయన్నను. ఈ నేల ఏలికను. దేని కోసం నీవు ఇక్కడికి వచ్చావు దొరా”? అని అడిగాడు. “సింహం ముఖముతో మనిషి శరీరంతో ఉండే దేవుని వెదుకుతున్నా” అన్నాడు పద్మపాదుడు. అడవినంతా ఎఱిగిన ఆ బయన్న తానెన్నడూ అట్టి వింత జంతువును చూడలేదన్నాడు. బయన్న మూఢభక్తుడు. ఉంది అని రూఢిగా చెప్పిన పద్మపాదుని మాటలువిని “సామీ! ఆ ముగము నిజంగా ఉంటే కట్టేసి తెస్తా లేకుంటే పానాలు వదిలేస్తా” అని ఆ నరసింహమును వెదుక బయలుదేరాడు బయన్న!

పద్మపాదుడు వర్ణించిన నృసింహస్వామి అద్భుత రూపాన్ని మనస్సులో ముద్రించుకున్నాడు బయన్న. ఏకాగ్రచిత్తంతో నిద్రాహారాలు మాని అడవంతా తిరిగాడు బయన్న. ఎంత శ్రమించినా అణువణువూ పరీక్షగా చూచినా ఎక్కడా కనబడలేదు స్వామి. “నీవు కనిపించని ప్రాణమెందులకు?” అని బయన్న ప్రాణాత్యాగం చేయబోయాడు. బయన్న నిస్వార్థ నిష్కల్మష మూఢభక్తికి మెచ్చి నృసింహుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే స్వామిని తీగలతో కట్టేసి పద్మపాదుని ముందర నిలబెట్టాడు బయన్న!

కళ్ళముందరే బయన్నకు కనబడుతున్న నృసింహుడు పద్మపాదునకు కనబడలేదు. “స్వామీ! ఏమి నా పాపము?” అని ఆక్రోశించాడు పద్మపాదుడు. “నాయనా! పద్మపాదా! కోటి సంవత్సరములు నా రూపాన్ని ధ్యానం చేసినా అలవడని ఏకాగ్రత భక్తి ఈ బయన్న ఒక్కరోజులో సాధించాడు. ఈ సత్పురుషుని సాంగత్యం వలనే నీకు నా మాటలు వినబడుతున్నాయి. నీవు విచారించకు. నీ అఖండ గురుభక్తికి మెచ్చాను. అవసరమైనప్పుడు నేనే నీకు దర్శనమిచ్చి నిన్ను కాపాడెదను” అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు స్వామి.

నీతి:

పద్మపాదుని గురుభక్తి అనన్యము. గురుకృప లేని ఏవిద్య రాణించదు. ఏకాగ్రత నిశ్చల భక్తి యొక్క గొప్పతనము మనకీ కథలో బయన్న ద్వారా తెలిసినది. నిద్రాహారాలు మాని ఏకాగ్రచిత్తంతో స్వామిని వెదకిన బయన్నను కరుణించాడు నృసింహుడు.

http://www.neetikathalu.wordpress.com