Archive | August 2021

రంతిదేవ మహారాజు కథ

విలువ — సరైన ప్రవర్తన
అంతర్గత విలువ — దానం

రంతిదేవ మహారాజు గొప్ప విష్ణు భక్తుడు.

ప్రజలందరినీ సమానంగా చూసుకునే వారు. రాజు గారిలో మరోక మంచి గుణం-అందరిలోనూ దేవుడిని చూడగలగటం . ప్రజలకు సేవ చెయ్యడంలో ఎంతో ఆనందాన్ని చూపించేవారు.రాజ్యంలోని ప్రజలు అందరూ, సంతోషంగా, తృప్తిగా జీవించేవారు

ఆయన పాలనలో ఒక సారి- అకాల వర్షాల వల్ల, దేశంలో పంటలు ధ్వంసం అయిపోయాయి. ప్రజలు తిండికి, బట్టకి, వసతికి కష్ట పడ్డారు. అందరూ రాజుగారి సహాయం కోరారు. రాజుగారు తన ప్రజల సంతోషం కోసం, తన దగ్గర ఉన్నది అంతా దానం చేశారు. తన ప్రజలని కాపాడుకోగలిగే శక్తిని తనకి ప్రసాదించమని విష్ణు భగవానుని ప్రార్థించారు. రాజుగారి కుటుంబం, ప్రజలు అందరూ కష్టాలు అనుభవిస్తున్నారు. కాని ,రాజుగారు భగవంతుని మీద నమ్మకం తో ఉన్నారు. తినడానికి సరియైన ఆహారం లేక, రాజుగారు బలహీనులయ్యారు .

ఒక రోజు, హఠాత్తుగా, ఎవరో తెలియని ఒక వ్యక్తి, రాజుగారికి ఆహారం ఇచ్చాడు. ఆహారాన్ని , తన కుటుంబంతో సహా స్వీకరించే సమయానికి, ఒక బ్రాహ్మణుడు ఆకలితో రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారు వెంటనే మరియాదగా ఆ బ్రాహ్మణుడికి భోజనం పెట్టారు.
బ్రాహ్మణుడు వెళ్ళగానే, ద్వారం దగ్గర ఆకలితో ఉన్న ఒక ముష్టి వాడిని చూసిన రాజుగారు, బ్రాహ్మణుడు తినగా మిగిలిన భోజనాన్ని, ముష్టి వాడికి దయతో పెట్టారు. ముష్టివాడు వెళ్ళగానే, ఒక మనిషి, కుక్కలతో, ఆకలితో వచ్చాడు. వాళ్ళకి కూడా రాజుగారు దయతో, తను తినకుండా, భోజనం పెట్టారు.

అందరూ వెళ్ళాక, తన ఆకలిని మంచినీటితో సరిపెట్టుకుందామని, నీరు త్రాగే సమయంలో , ఒక చండాలుడు వచ్చి దాహముగా ఉందని, మంచి నీరు అడుగుతాడు. రాజుగారు సంతోషంగా ఇచ్చి, భగవంతుడు , తనకి డబ్బు, పేరు, ప్రఖ్యాతల కంటే, ఇతరుల బాధని అర్ధం చేసుకునే శక్తిని ఇవ్వమని వేడుకుంటారు. ఛండాలుడు నీరు త్రాగగానే,అతని కళ్ళు కాంతి తో ప్రకాశంతో మెరిసాయి . రాజుగారు కూడా ఎంతో సంతోషించారు.

ఇంతలో విష్ణు భగవానుడు, ప్రత్యక్షమయ్యారు. రాజు గారి భక్తిని మరియు ఆయనకు ప్రజల పట్ల కల ప్రేమని ఎంతో మెచ్చుకుని ,” మహారాజా! నీ కష్టాలన్నీ తీరినట్టే ,ఇక నీవు సుఖ సంపదలతో జీవితాన్ని గడుపుతావు” అని ఆశీర్వదించాడు. దానికి రాజుగారు, తనకు భోగభగ్యాల మీద ఏ ఆసక్తి లేదని ,ఎప్పటికీ భగవంతుడినే ధ్యానిస్తూ ఉండాలని కోరుకున్నాడు. ఈ విధంగా విష్ణు మూర్తి అనుగ్రహాన్ని పొంది రంతి దేవుడు గొప్ప ధ్యానగా యోగి పేరు పొంది మోక్షాన్ని సాధించారు.

నీతి:
మానవ సేవయే మాధవ సేవ!
పేదవారిని సేవించడం, మరియు అవసరం ఉన్నవారికి దానధర్మాలు చెయ్యడం వల్ల, భగవంతుడి అనుగ్రహాన్నీ పొందగలము.ఆందరిలో ఉన్న భగవంతుడిని గుర్తించి ,సేవ చేసుకునే అవకాశాన్ని పొందగలగడం గొప్ప వరం. ఏదీ ఆశించకుండా సేవ చేసే వారు ఏదీ కోరుకుండానే జీవితంలో ఉత్తమైనవన్నీ పొందుతారు.

మూలం:
Apnisanskriti.com
https://saibalsanskaar.wordpress.com/2017/07/28/king-rantideva/