Archive | June 2019

గర్భవతి అయిన ఒక జింక కథ !

విలువ: ధర్మం

అంతర్గత విలువ: ఆలోచనల్లో స్పష్టత, శరణాగతి

ఒక అడవిలో గర్భవతి అయిన  జింక ఉంది. దానికి ఏ సమయంలో అయినా ప్రసవం జరుగవచ్చు, అది ప్రసవానికి అనువైన స్థలం కోసం వెతుకుతూ అడవిలో తిరుగుతోంది. ఒక నది ఒడ్డున దట్టంగా గడ్డి ఉన్న ప్రాంతం కనిపించింది. అదే తగిన చోటు అని భావించి అక్కడికి  చేరుకుంది. ఇంతలో లేడికి పురిటి నెప్పులు మొదలయ్యాయి. అకస్మాత్తుగా ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకుని, ఉరుములు,మెరుపులు రాసాగాయి అడవిలో నిప్పు అంటుకుని మంటలు మొదలయ్యాయి. లేడి తన ఎడమవైపు చూస్తే ఒక వేటగాడు తనకి బాణం గురిపెట్టి ఉన్నాడు.  కుడివైపు చూస్తే ఆకలితో ఉన్న సింహం లేడి వైపే వస్తోంది. ఆ జింకకి చాలా భయం వేసింది. ఇప్పుడు ఏమి చెయ్యాలి అని ఆలోచించుకుంది. ఒక వైపు వేటగాడు, సింహం ఇద్దరూ తనని చంపడానికి సిద్ధంగా ఉన్నారు.  తాను బిడ్డకు జన్మనిచ్చినా అడవిలో అంటుకున్న మంటలకి తట్టుకోలేక ఆ జింక పిల్ల బ్రతుకుతుందో లేదో తెలీదు. ఇన్ని ఆలోచనల మధ్య జింక తన ప్రస్తుత కర్తవ్యం జింకపిల్లకు జన్మనివ్వడం కాబట్టి ఆ పని మీదే దృష్టి పెట్టాలి అని నిర్ణయించుకుంది.

                     ఆకాశంలో మెరుపుల  వెలుగుకి వేటగాడి బాణం గురి తప్పింది. అది జింకకి బదులు దూరంగా ఉన్న సింహానికి తగిలి అది చనిపోయింది. చాలా పెద్ద వర్షం రావడంతో అడవిలో మంటలు ఆరిపోయాయి. జింక తన బిడ్డకు క్షేమంగా జన్మనిచ్చింది.

నీతి:పై కథలో జింక ఎదుర్కొన్నలాంటి  పరిస్థితులు మనకి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. రకరకాల సమస్యలు మనని చుట్టుముట్టినప్పుడు, వాటిని అధిమించే ప్రయత్నం లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. దానికి తోడు ప్రతికూల ఆలోచనలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన చేతిలో లేని వాటిని వదిలిపెట్టి మనం చెయ్యవలసిన పని మీద దృష్టి పెట్టి చేసుకుంటూ పోతే మిగిలిన సమస్యలకు కూడా పరిష్కార మార్గాలు వాటంతటవే దొరుకుతాయి.  

 

https://saibalsanskaar.wordpress.com/2015/09/30/the-pregnant-deer/

మనం ఎప్పుడూ ఒంటరివాళ్ళం కాదు

విలువ: విశ్వాసం

అంతర్గత విలువ: నమ్మకం, శరణాగతి 

 

BC62451B-C82A-4C95-ACDD-1C0A1F212B1F

       ఒక తండ్రి తన కొడుకుని, అడవిలోకి తీసుకునివెళ్ళి కళ్ళకు గంతలు కట్టి ఒంటరిగా వదిలిపెట్టాడు.  ఆ అబ్బాయి రాత్రి అంతా కళ్ళగంతలు విప్పకుండా ఒక చోట కూర్చుని ఉండాలి. ఎవరి సహాయం కోసం ఎదురుచూడకూడదు, భయపడి ఏడవకూడదు.అలా ధైర్యంగా ఉండగలిగితేనే ఆ అబ్బాయి “నిజమైన మనిషి/మగవాడు” అనిపించుకుంటాడు. ఈ సంఘటన గురించి ఇతని స్నేహితులతో చెప్పకూడదు, ఎందుకంటే ప్రతివాళ్ళూ పరిస్థితుల్ని ఎదుర్కొని బైటికి వచ్చినప్పుడే వాళ్ళలోని ధైర్యం పెరుగుతుంది.
     సహజంగానే ఆ అబ్బాయి భయపడ్డాడు. ఆ అడవిలో రాత్రిపూట రకరకాల శబ్దాలు, అరుపులు వినిపించాయి. జంతువులన్నీ వచ్చి తన చుట్టూ నిలబడినట్లుగా ఊహలు వచ్చాయి. అడవిలో వీస్తున్న్న ఈదురు గాలులకి తను ఏమైపోతానో అని చాలా భయం కలిగింది. అయినా ఆ అబ్బాయి మొండిగా అలాగే రాత్రంతా కళ్ళగంతలు విప్పకుండా కూర్చుని ఉన్నాడు. భయపడుతూనే రాత్రి అంతా గడిపి, ఉదయం  సూర్యుడు వచ్చిన తరువాత కళ్ళగంతలు విప్పి చూసాడు. తండ్రి అతని పక్కనే కూర్చునిఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. తండ్రి రాత్రంతా అక్కడే కూర్చుని తనను కాపాడుతున్నాడని గ్రహించాడు.
 
నీతి
మనం ఎప్పుడూ ఒంటరివాళ్ళం కాదు. మనకి కనిపించకపోయినా భగవంతుడు మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు.భగవంతుడి మీద  నమ్మకంతో మన కర్తవ్యం నిర్వర్తించడమే మన పని. మనకి కంటికి కనిపించనంత మాత్రాన భగవంతుడు లేడు అని అనుకోకూడదు. నమ్మకంతో మనం అడుగులు వేస్తే ఆయన తప్పకుండా దారి చూపిస్తాడు.

నీ మాటల్లో నువ్వేమిటో నాకు కనిపిస్తూఉంటుంది

 

AF1501CC-79BC-4F51-B0D3-08FCAFCE6E6E

విలువ : శాంతి

ఉపవిలువ: సరైన నిర్ణయం
నేను అప్పుడు నెవెడా యూనివర్సిటీ లో సోమవారం ఉదయం 8 గంటలకు క్లాస్ తీసుకుంటున్నాను. నెవెడా యూనివర్సిటీ లాస్ వేగాస్ లో ఉంది. పిల్లలందర్నీ శని,ఆదివారాలు ఎలా గడిచాయి అని అడిగేను. ఒక విద్యార్ధి లేచి నిలబడి, గడచిన రెండు రోజులు తనకు మంచిగా లేవని, తన జ్ఞానదంతం ఒకటి తీసివేసారని చెప్పాడు. మీకు ఎల్లప్పుడూ ఉత్సాహంగా, ఆనందంగా ఉండడం ఎలా సాధ్యమౌతోంది? అని నన్ను అడిగాడు. అతని ప్రశ్నకు సమాధానంగా నేను ఒకసారి చదివిన విషయం ఒకటి గుర్తుకువచ్చింది.
మనం ప్రతిరోజూ ఉదయం లేవగానే, ఆ రోజు ఎలా గడపాలి అని నిర్ణయించుకునే అవకాశం మనకి ఉంటుంది. నేను ఎప్పుడూ ఉత్సాహంగా, ఆనందంగా ఉండాలి అనుకుంటాను అని చెప్పేను. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను అని ఇలా చెప్పడం మొదలుపెట్టేను. నేను ఇవాళ మన యూనివర్సిటీ దాకా వచ్చేసరికి నా కారు ఆగిపోయింది. గ్యారేజ్ కి ఫోన్ చేసి నా కారు రిపేరు వచ్చిందని, దానిని తీసుకువెళ్ళడానికి వేరే ట్రక్ పంపించమని అడిగేను. అదేంటి, మీ కారు దారిలో ఆగిపోతే మీరు అంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు అని అడిగేరు. నేను ఇక్కడికి 17 మైళ్ళు దూరంలో ఉంటున్నాను. కారు మధ్యలో ఎక్కడైనా ఆగిపోవచ్చు, కాని సరిగ్గా యూనివర్సిటీ ముందే ఆగింది. నాకు 8 గంటలకు క్లాస్ ఉంది. ఇప్పుడు నేను ఆ క్లాసు కు వెళ్ళి
నా విధులు నిర్వర్తించగలను. అదే దారి మధ్యలో ఎక్కడైనా కారు చెడిపోయి ఉంటే నాకు చాలా ఇబ్బంది కలిగేది, అని చెప్పి క్లాసు కి వచ్చేను.   జరిగింది చెప్పడం ముగించి విద్యార్థులందరి ముఖాలు పరీక్షగా చూసేను. అందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు. వాళ్ళందరికీ నేను ఆనందంగా ఉండడానికి కారణం అర్థమైంది అనిపించింది.
నీతి: 
ప్రతీ విషయంలోనూ మంచినే చూసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఎల్లప్పుడూ ఆనందంగా, ఉత్సాహంగా ఉండవచ్చు.