Archive | September 2016

ఈశ్వరుడే ఐశ్వర్యానికి కారకుడు

ఐశ్వర్యానికి కారకుడు ఈశ్వరుడు
విలువ : ప్రేమ
అంతర్గత విలువ: వినయం

img_9950

ఈశ్వరుడి(శివుడు) అనుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహంకారం కలిగింది. అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలి అనుకున్నాడు.దేవతలందరినీ ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళేడు. “శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు, నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్య పోతాడు. ఎంత బాగుందో! “అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతలలో నా కీర్తి పెరుగుతుంది అనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు.

శివుడు సర్వాంతర్యామి. అందరి ఆలోచనలను గ్రహించగలడు. కుబేరుడి పిలుపులో ఉన్న ఆంతర్యాన్ని పసిగట్టాడు.పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్థం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి, మహాదేవా! మీరు , పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తానుకూడా రానన్నది పార్వతీ దేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే ‘అమ్మా! ఆకలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు’ అన్నాడు గణపతి. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి ‘కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు’ అనగా, శివుడు ‘ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు’ అన్నాడు పరమశివుడు.

“ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకోచ్చేది!”ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని
అలకాపురిలో ఉన్న తన భవనంలోకి తీసుకెళ్ళి,అక్కడ ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపించసాగాడు.”ఇవన్నీ వ్యర్థం! ఆహారం పెట్టండి “అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారిని ఆజ్ఞాపించాడు.

వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్ధలు, పానీయాలు, కూరలు, పండ్లు గణపతికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞాపించాడు.సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు.

వంటవారికి ఆహారం వండడం, గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. విషయం కుబేరునికి తెలిసింది. తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్ అంటూ పలికాడు. కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్నీ ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.

శివా! శంకరా! నీవే దిక్కు. ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు “కుబేరా! నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకుని, అహంకారం విడిచి, చేసిన తప్పు ఒప్పుకుని పరమ భక్తితో గణపతికి సమర్పించు ” అన్నాడు.
కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు.

నీతి:మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. కుబేరుడి అహకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని అహకారాన్ని కూడా పటాపంచలు చెయ్యాలని కోరుకుందాం.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

ప్రతిరోజూ ఒక బహుమతి!!

ప్రతిరోజూ ఒక బహుమతి

విలువ: శాంతి
అంతర్గత విలువ: సరైన ప్రవర్తన

img_9905

ఒక 92 సంవత్సరాలున్న మామ్మగారు ఉండేవారు.ఆవిడ బాగా ధనవంతురాలు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ ప్రతిరోజూ ప్రొద్దున్న 8గంటలు అయ్యేసరికి చక్కగా ముస్తాబు అయ్యేవారు. ఆమెకు ఈమధ్య కళ్ళు కూడా సరిగా కనిపించడంలేదు.
ఈరోజు ఆవిడ ఇంటిని వదిలిపెట్టి వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతున్నారు. ఈమధ్యనే ఆవిడ భర్త చనిపోవడంతో, ఆమెకు కూడా ఆరోగ్యం బాగుండకపోవడం వల్ల మిగిలిన జీవతం వృద్ధాశ్రమంలో గడపాలని నిశ్చయించుకున్నారు.

వృద్ధాశ్రమానికి వెళ్ళి చేరిన తరువాత ఒక ఆయా గది చూపించడానికి తీసుకువెళ్ళింది. ఆ గదిలోకి వెళ్ళగానే ఈ గది నాకు ఎంతో నచ్చింది అన్నారు మామ్మగారు.
ఆయా ఆశ్చర్యంతో మీరు ఇప్పుడే వచ్చారు. గది ఇంకా పూర్తిగా చూడలేదు, అయినా ఇది చాలా చిన్నగది , ఇందులో మీరు సంతోషించే అంతగా ఏముంది? అని అడిగింది.

అప్పుడు మామ్మగారు ఇలా చెప్పారు” సంతోషం అనేది మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఉండదు.మన ప్రవర్తనలో ఉంటుంది. అందుకే నేను ఎప్పుడూ నా మనసుని అందుకు తగినట్లుగా మలచుకుంటూ ఉంటాను. ప్రతిరోజూ నేను ప్రొద్దున్న లేవగానే ఇలా అనుకుంటాను. నా సమస్యలు, శారీరక బాధలు ఎప్పుడూ ఉంటాయి. అవి తలుచుకుంటూ రోజంతా బాధపడితే అవేమి తగ్గవు,దాని బదులు అవన్నీ పక్కనపెట్టి జీవితంలో గడిపిన సంతోష క్షణాలు తలుచుకుంటూ రోజంతా ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేస్తే సంతోషంగా గడపవచ్చు. ప్రతిరోజునీ భగవంతుడు ఇచ్చిన బహుమతిగా భావించి,ఆశాభావంతో మొదలుపెట్టాలి.

మామ్మగారు ఇంకా ఇలా చెప్పసాగారు” ముసలితనం అనేది బ్యాంకు ఖాతా వంటిది. అంతవరకు చేసిన పనుల ఫలితమే మనకు లభిస్తుంది. అందుకే ఎప్పుడూ మంచిపనులు చేస్తూ ఉండాలి. చేతనయినంత వరకూ తోటివారికి సహయం చేస్తూ ఉండాలి”.

మన మనసు ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే 5 నియమాలు ఖచ్చితంగా పాటించాలి.

1. మనసులో ఎవరిపట్లా ద్వేషం ఉంచుకోకూడదు.

2. మనసులో బాధకి చోటివ్వకూడదు.బాధపడితే మనలో ఉన్న శక్తి తగ్గిపోతుంది.

3. గొప్పలకు పోకుండా సాధారణ జీవితం గడపాలి.

4. తోటివారికి వీలయినంత వరకూ సహాయం చేస్తూ ఉండాలి.

5. ఎదుటివారినుండి తక్కువ ఆశించాలి.

నీతి; మానవ జీవితంలో ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. ప్రతీవారిలోనూ మంచి,చెడు ఉంటాయి. మనలో ఉన్న మంచిని గుర్తించి దానిని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తే మంచి ప్రవర్తన అలవర్చుకోవచ్చు. మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆశావహ ధృక్పదంతో చూడడం అలవాటు చేసుకుంటే సంతోషంగా ఉండవచ్చు.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

బలము-బలహీనత

విలువ — నమ్మకము

అంతర్గత విలువ — వాస్తవమైన దృష్టి

image

 

ఒక రాజు గారికి ఒకటే కన్ను మరియు ఒకటే కాలు ఉండేవి.

రాజ్యంలో ఉన్న చిత్రకారులందరినీ పిలిచి తన చిత్రం అందంగా వెయ్యమని అడిగారు. రాజుగారిలో ఉన్న లోపం వల్ల ఎవ్వరూ చిత్రం గీయలేకపోయారు.

ఒక చిత్రకారుడు ముందుకు వచ్చి చాలా అందమైన చిత్రం గీశాడు. అంత అందమైన చిత్రాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

రాజుగారు వేటకి వెళ్ళి గుర్రం మీద కూర్చుని, ఒక కన్ను మూసుకుని మరొక కన్ను లక్ష్యంమీద గురి పెడుతున్నట్లు అందమైన చిత్రం గీసాడు.

రాజుగారి శరీరంలో ఉన్న లోపాలు కనిపించకుండా, రాజుగారి మనసు నొప్పించకుండా చిత్రం గీశాడు.

నీతి

మనం కూడా మనలో ఉన్న బలహీనతలు పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో ఉండగలగాలి. అలాగే ఎదుటివారిలోని బలహీనతలు చూపించి వారిని నొప్పించకుండా వారి బలాలను వారికి గుర్తు చేస్తూ అందరికి ఆనందాన్ని పంచగలగాలి.

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

ఉన్న దాంతో తృప్తిగా ఉండాలి.

ఉన్న దానితో తృప్తిగా ఉండాలి

image

విలువ — శాంతి

అంతర్గత విలువ — కృతజ్ఞత, సరైన ప్రవర్తన

ఒక రాజుగారు ఒక రోజు ఉద్యానవనానికి వెళ్ళారు. వనంలో వృక్షాలు , పుష్పాలు రోజు రోజుకీ క్షీణించిపోతున్నాయి.

అక్కడ ఉన్న,

సింధూర చెట్టు ఇలా బాధపడుతోంది” నేను దేవదారు వృక్షము వలె పొడవుగా ఎదగలేను,అందుకని మరణించాలని ఉంది.”

దేవదారు వృక్షము ఇలా బాధపడుతోంది “నేను ద్రాక్ష వృక్షము వలె మంచి పానీయం ఇవ్వలేను అందుకని మరణించాలని ఉంది.”

ద్రాక్ష వృక్షము ఇలా బాధపడుతోంది “నేను గులాబీ వృక్షము వలె పుష్పములు ఇవ్వలేను అందుకని మరణించాలని ఉంది.”

అప్పుడు రాజుగారికి వనంలో ఒక పక్కగా, మనసుకి ఆహ్లాదకరంగా ఉన్న చిన్న వృక్షము కనిపించింది. రాజుగారు ఆ వృక్షాన్ని ” నీవు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు ? ” అని అడిగారు.అప్పుడు చిన్న వృక్షము ఈ విధంగా జవాబు చెప్పింది , “నేను నాలాగానే ఉండగలను, నాలో ఉన్న మంచి గుణాలని పెంచుకుంటాను. మరొకరిలాగా ఉండడానికి నేను ప్రయత్నించను.”

నీతి

మనల్ని మనం ఎప్పుడూ గమనించుకుంటూ ఉండాలి. బాధపడితే మనలో ఉన్న శక్తి తగ్గిపోతుంది. మంచి గుణాలని పెంచుకోవాలి . మరొకరిలాగా ఉండడానికి ప్రయత్నించరాదు.అప్పుడే మనము సంతోషంగా, శాంతంగా ఉండగలము.

http://saibalsanskaar.wordpress.com