Archive | September 2018

 పద్మపాద — గురుభక్తి

padmapada

విలువ — విశ్వాసము

అంతర్గత విలువ — భక్తి

జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య గారి నలుగురు శిష్యులలో ఒకరైన పద్మపాదుల వారి అసలు పేరు సనందన . మిగతా ముగ్గురు శిష్యుల పేర్లు హస్తమలక,తోటకాచార్య,సురేశ్వర. ఈ కథ సనందులవారి గురుభక్తిని చాటి చెప్తుంది.  

ఒక రోజు శంకరాచార్యుల వారు కాశిలో ఉన్నప్పుడు, గంగా నది ఒడ్డున సనందనుడు గురువుగారి తడి బట్టలను ఆరేస్తున్నారు. మరొక వైపు శంకరాచార్యుల వారు నదిలో

స్నానం చేసి తడి బట్టలతో బయటికి వచ్చి నిలబడ్డారు. పొడి బట్టలను తెమ్మని శిష్యుడిని పిలిచారు

సనందుడు గురువుగారిని తడి వస్త్రములతో చూడలేకపోయాడు.ఆయన పట్ల ఉన్న అమితమైన భక్తి ,ప్రేమల కారణంగా సనందుడు, ఎక్కడ ఉన్నాడో ఆలోచించకుండా,వెంటనే వెళ్ళి ఆయనకి పొడి బట్టలని అందించాలని అనుకున్నాడు.

గంగా నది దాటాలి  అంటే పడవలో వెళ్ళాలి, అనికూడా ఆలోచించించ లేదు.

సనందుడికి ఒక్కటే ఆలోచన ఏమిటి అంటే గురువువుగారికి పొడి వస్త్రములు అందించడం. అంతే !

అలలని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా హుటాహుటిన బయలుదేరాడు.  

నేలమీద నడిచినట్టు , గంగా నదిలో నడుచుకుంటూ , గురువుగారి దగ్గరకి వెళ్ళిపోయాడు.

ఒక వేళ తాను నదిలో మునిగిపోతే ఉన్న పొడి బట్టలు కూడా తడిసిపోతాయని కూడా అతనికి తట్టలేదు. మరి అటువంటి భక్తులకి భగవంతుడు అండగా నిలవడా ?

సరిగ్గా అదే జరిగింది.

సనందుడు నడుస్తుండగా  గంగా దేవి నది పొడుగునా తామర పువ్వులతో దారి పరిచింది.

తాను వేసే ప్రతి అడుగుకి ఒక తామర పువ్వు వికసించడం చూసి అందరూ ఆశ్చర్య పోయారు.

ఈ విధంగా సనందన సునాయాసంగా నదిని దాటి, గురువుగారి దగ్గరకి స్వయంగా వచ్చి  పొడి వస్త్రములను అందించాడు.

అప్పుడు శంకరాచార్యులు “నదికి ‘అవతల ఉన్న నువ్వు ఇంత తొందరగా నదిని  ఎలా దాటగలిగావు’?అని ప్రశ్నించారు. సనందనడు ‘గురువుగారు !మిమ్మల్ని తలుచుకుంటేనే , ఈ సంసారం అనే సముద్రంలో నీరు, మోకాళ్ళ లోతుకి వెళ్ళిపోతుంది.’ అటువంటి మీరు ఆజ్ఞాపించినప్పుడు నేను నదిని దాటడంతో ఆశ్చర్యమేముంది “ అని వినయంగా సమాధానము ఇచ్చాడు.  

శంకరాచార్యులు వారు, సనందుడికి  తామరపువ్వులు పరిచిఉన్న త్రోవని చూపిస్తూ

సనందుడి అడుగులకి తామరపువ్వులు వికసించాయి.  కాబట్టి అతనికి ‘పద్మపాదా ‘ అని పిలిచారు.

నీతి:

ఎవరైతే అచంచల  భక్తి, విశ్వాసములతో గురుపాదములను శరణు వేడుతారో వారి మంచి చెడ్డలన్నీ గురువు చూసుకుంటారు.

https://saibalsanskaar.wordpress.com/2015/07/31/padmapada-guru-bhakti/

htps://facebook.neetikathalu.com

Advertisements

ఆచరణ ఒక గొప్ప లక్షణం.

ramakrishna
విలువ — సత్యము
అంతర్గత విలువ — మాట, ఆలోచన, పని ఒకటిగా ఉండాలి.

ఋషులు, గొప్ప సాధకులు, వాళ్ళు ఆచరించిందే మనకి బోధిస్తారు. అందుకనే వాళ్ళు మనకి ఏమైనా సలహా ఇస్తే, అది మనము ఆచరిస్తే, గొప్ప ఫలితాన్ని పొందుతాము.

శ్రీ రామకృష్ణ పరమహంస ఒక గొప్ప గురువు.
శిష్యురాలు అయిన ఒక బీద మహిళ, తన కుమారుడికి తియ్యని పదార్థాలు రోజు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు అని సలహా ఇవ్వమని తన గురువుగారైన రామకృష్ణుడిని ప్రాధేయ పడింది.

శ్రీ రామకృష్ణ పరమహంస, పిల్లవాడిని దెగ్గిరకి పిలిచి, రెండు వారములు అయ్యాక మళ్ళీ రమ్మని చెప్పారు.
తల్లి పిల్లవాడిని తీసుకుని రెండు వారములు అయ్యాక వచ్చింది .

అప్పుడు శ్రీ రామకృష్ణ పరమహంస, పిల్లవాడిని దెగ్గిరకి పిలిచి ‘ నువ్వు రోజు మీ అమ్మని మిఠాయి కొనమని అడుగుతావుట కదా ?’ ప్రశ్నించారు. అప్పుడు పిల్లవాడు ‘అవును గురువుగారు ‘ సిగ్గుతో తల ఒంచుకుని సమాధానమిచ్చాడు.
శ్రీ రామకృష్ణ పరమహంస ఆ పిల్లవాడికి ఈ విధంగా ప్రేమతో నచ్చచెప్పారు.
నాయనా ,’నువ్వు చాలా తెలివైన వాడివి. మిఠాయి రోజు తినడం వల్ల, నీ పళ్ళు పాడయిపోతాయి. మీ అమ్మ కూడా నీ గురించి బెంగ పడుతోంది. ఉన్న కొంచం డబ్బుతో, రోజూ నీ కోసం మిఠాయి కొంటే ,అప్పుడు నీకు పుస్తకాలూ, కొత్త బట్టలు ఏలా కొంటుంది. తప్పు చేస్తున్నావు అని నీకు తెలియట్లేదా?’

‘అలాగే గురువుగారు, నేను ఈరోజు నుంచి మిఠాయి అడగను , జాగ్రత్తగా ఉంటాను ‘ అని ఆ బాలుడు అన్నాడు.

శ్రీ రామకృష్ణ పరమహంస గారికి పిల్లవాడిలో మార్పు కనిపించింది. చాలా సంతోషంతో దెగ్గిరకి తీసుకుని ‘ఇప్పుడు నీకు ఏడి మంచో,ఏది చెడో మంచి తెలుసుకున్నావు. ఇంక జీవితంలో చాలా సంతోషంగా ఉంటావు ‘ అని ఆశీర్వదించారు.

పిల్లవాడు వెళ్ళిపోయాక, తల్లి గురువుగారి దెగ్గిరకి వచ్చి ‘గురువుగారు,ఈ సలహా ఇవ్వడానికి , రెండు వారములు అయ్యాక ఎందుకు రమ్మన్నారు ‘ అని అడిగింది.

అప్పుడు శ్రీ రామకృష్ణ పరమహంస నవ్వుతూ ఇలా అన్నారు.

‘నేను భక్తులు తీసుకుని వచ్చిన మిఠాయి రోజు తింటాను. రెండు వారాల క్రిందట నువ్వు మీ అబ్బాయికి సలహా ఇవ్వమని అడగడానికి వచ్చి నప్పటినుంచి, నేను మిఠాయి తినడం మానేసాను. ఇప్పుడు నీ పిల్లవాడికి సలహా చెప్పడానికి అర్హతను సంపాదించుకున్నాను . ‘
మనము ఎవరికైనా సలహా ఇస్తున్నాము అంటే, దాన్ని ముందు ఆచరిస్తేనే దానికి విలువ ఉంటుంది.

ఇది విని పక్కనే ఉన్న శిష్యులు అందరూ కూడా, గొప్ప పాఠము నేర్చుకున్నాము అని అనుకున్నారు.

నీతి:
కథలో చూసినట్టుగా, ఆచరించడం వల్ల, మన మాటకి విలువ పెరుగుతుంది.
కనుక మంచి సలహాలు విందాము, మరియు వాటిని ఆచరిద్దాము !

 

htps://facebook.neetikathalu.com

https://saibalsanskaar.wordpress.com/2015/07/22/practice-what-you-preach/

 

 

బాలగోవిందం -ఆరవ శ్లోకము

ఏడవ శ్లోకము

bg7

మానవ జీవితంలోని నాలుగు ముఖ్యమైన దశలు. వాటిని తెలివిగా సద్వినియోగం చేసుకోవాలి

బాల స్తావత్ క్రీడాసక్తః

తరుణ స్తావత్ తరుణీసక్తః |

వృద్ధ స్తావత్-చింతామగ్నః

పరమే బ్రహ్మణి కో‌உపి న లగ్నః

భజగోవిందం భజగోవిందం || 7||

అనువాదం

ఆటలు పాటల బాల్యం గడిచెను

ప్రేమని పెండ్లని ప్రాయం నడిచెను

చింతలు వంతలు చీకున ముసిరెను

పరబ్రహ్మ కాబట్టక పోయెను

భజగోవిందం భజగోవిందం || 7||

తాత్పర్యం: బాల్యం లో ఆటల యందు ఆసక్తి ,యవ్వనంలో యువతులపై ఆసక్తి , ముసలి తనంలో మనసునిండా  చింతలే. పరమేశ్వరుని  యందు ఆసక్తి ఎవరికీ ఉండదు.

గోవిందుని భజించు ,గోవునందుని కీర్తించు . ఓ మందమతి ! గోవిందుని సేవించు .

విద్యార్థులకొరకు  కథ:

కుళ్ళిన  అరటిపండ్లు .

bg7b

విలువ :   సత్ప్రవర్తన :

ఉపవిలువ :  ఎపుడు చేయవలసిన పనిని అప్పుడు చెయ్యకుండా వాయిదా వేస్తుండటం.

నారిమన్  చాలా  మంచివాడు . ఎప్పుడూ దేవుని నామము స్మరించుకుంటూ ఎంతో సేపు ధ్యానం చేస్తూ  దేవునితో అనుసంధానం చెంది ఎంతో శక్తిని , ప్రేరణని  పొందుతుండేవాడు.  అతని జీతంలో కొంత భాగమును ,తన సమయంలో కొంత భాగమును బీదప్రజలకి  సహాయపడటానికి కేటాయంచేవాడు.  ఉచితంగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నపుడు అక్కడకి వెళ్లి సహాయం చేసేవాడు. తాను పండ్లను కొనుక్కొని, ఆసుపత్రులలో బీద రోగులకు పంచుతుండేవాడు.  బీద ప్రజలు నివసించే కాలనీలకు వెళ్లి అక్కడి పిల్లలకి ఐస్ క్రీంలని కొనివ్వటం , లేక ఏదన్నా సినిమా చూపించటం చేసేవాడు . అతను   చేసే ప్రతి సేవ  భగవంతుడి సేవగా భావించేవాడు. ఒక రోజు యువకుడైన తన కొడుకు మణిత్ ని ” మణిత్,  నేను గుడికి వెళ్తున్నాను. అరటిపండ్లను  అక్కడ గుడి బైట కూర్చుని  ఉండే   బిచ్చగాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు వచ్చి ఆ పనిలో నాకు సహాయం చేస్తావా”?  అని అడిగాడు. మణిత్ ” ఓహ్ !ఏంటి నాన్నా “?   నాకు ఇట్లాంటి పనులు చెప్తావు?. నేను ఏమన్నా ముసలి వాడినా?  గుడికి వెళ్ళటం, పండ్లు పంచటం ఇట్లాంటి పనులు  చేయటానికి. ఇవి నేను చెయ్యవలసిన పనులు  కాదు. నీవు  పెద్దవాడివి. ఇట్లాంటి  పనులన్నీ పెద్దవాళ్ళు చేయవలసినవి, నాలాంటి యువకులు  కాదు.  నాకీ  పనులు చెయ్యాలని లేదు. నీ  అంత  అయినపుడు చేస్తాలే . కానీ ఎప్పుడు కాదు అని చెప్తూ , వాక్ మాన్ ,హెడ్ఫోన్స్  చెవిలో పెట్టుకొని రాక్ మ్యూజిక్ వింటూ డాన్స్ చేస్తూ ఉండి పోయాడు.

నారిమన్  కొడుకు ధోరణి చూసి , ఏమీ  మాట్లాడకుండా తాను అనుకున్న ప్రకారం గుడికి అక్కడున్న బిచ్చగాళ్ళలో  పండ్లను  పంచేశాడు.  కొన్నాళ్ల తరువాత ఒక పెద్ద బుట్టనిండా అరటిపండ్లు తెచ్చి వరండాలో పెట్టి  స్నానం చేసిరావటానికి లోపలకి వెళ్ళాడు , ఇంతలో అటుగా వచ్చిన మణిత్ ఆ  పండ్లను చూశాడు. అవి బాగా క్రుళ్ళి పోయి ఉన్నాయి . వాటిమీద చిన్న దోమలు ముసిరి ఉ న్నాయి. పండ్లు ఏమాత్రం బాగాలేవు. ఇంతలో నారిమన్ తెల్లని దుస్తులు ధరించి ,చక్కగా తయారయ్యి  ఆ అరటిపండ్ల బుట్టని కారు డిక్కీ లో పెడుతుంటే, మణిత్, ” నాన్నా! ఈ పండ్లని ఎక్కడకి తీసుకెళ్తున్నావు” అని అడిగాడు. నారిమన్,  గుడికి  తీసుకెళ్తున్నాను  అని చెప్పాడు.   అప్పుడు మణిత్ ” అదేంటి నాన్నా తాజా  పండ్లు కొని  గుడికి తీసుకెళ్ళు. ఈ క్రుళ్ళిన పండ్లు ఎందుకు కొన్నావు? దేవుడికి  ఇలాంటివి ఇవ్వటం సిగ్గు చేటు”. అన్నాడు.అప్పుడు తండ్రి , నీవు కూడా , బాగా పెద్దవాడైన తర్వాత దేవుని పూజిస్తానంటే నీ వల్ల  దేవునికి ఏమి ఉపయోగం? ముసలి వాడివి అయ్యాక ,ఏమి చేయగలవు? అట్లాగే అతిగా పండిన ,మగ్గిన  పండ్లని ఉపయోగించవచ్చులే”అని బదులు చెప్పాడు. అది విని  కొడుకు సిగ్గుతో తలవంచుకున్నాడు.  సిగ్గుతో తండ్రి  వైపు  చూడలేక పోయాడు. తండ్రి సరైన సమయంలో సరైన కారణం చెప్పగలిగిగాడు.

తండ్రి ,”నీవు యువకుడిగా ఉన్నప్పుడు ,భగవంతునికి  ఎంతయినా సేవ చేయగలవు, ఆపదలో ఉన్న  వారికి సేవలందించగలవు . నీ  సమయాన్ని , డబ్బును కూడా బీదవారి కోసం ఖర్చుపెట్టవచ్చు.  ఆపదలో ఉన్నవారిని  ఆదుకోవచ్చు . కానీ, నువ్వు ముసలివాడవైతే  నీ  శరీరం లో అనేక రుగ్మతలు వస్తాయి. అప్పుడు, నీకే ఎవరన్నా సేవ చెయ్యాలి.  ధన సంపాదన లేకపోతే ఆర్థిక బాధలుంటాయి ,ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఎవరికి తెలుసు? వయసుతో వచ్చే కాళ్ళ నొప్పులు , మోకాళ్ళ నొప్పులతో కొద్ది గంటలైనా కూర్చొని దైవ   ప్రార్ధన  చేయగలవా? నీవు దేవునికి ఏమి సమర్పించగలవు? ఆ సమయంలో నీకు  ఇప్పటికంటే కూడా , దైవానుగ్రహం చాలా  అవసరం”, అన్నాడు.  ఈ మాటలన్నీ చెప్పి తండ్రి బుట్టని  కారు  డిక్కీ లో పెట్టుకొని వెళ్ళిపోయాడు. కొడుకుకు చెప్పాల్సినవి  చెప్పాడు. కానీ  గుడికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ పళ్ళు  దేవుడికి సమర్పించటానికి పనికిరావని ఆయనకీ తెలుసు . ఆ బుట్టలో ఉన్న పండ్లని గుడికి తుసుకెళ్ళకుండా , గోశాలకు తీసుకెళ్లి ఆవులకు తినిపించాడు. క్రుళ్ళిన  అరటిపండ్లు ఆ  రాకంగా మణిత్ కి బుద్ధి చెప్పటానికి,ఆవుల ఆకలిని తీర్చటానికి పనికొచ్చాయి .

నేర్చుకోవలసిన విషయము:

మానసికంగా, శారీరకంగా , ఆర్ధికంగా ఇంకొకరికి సహాయ  పడే స్థితిలో వున్నపుడు  తప్పక సహాయం చెయ్యాలి. దానివల్ల అతనికి, ఇతరులకి కూడా ఉపయోగదాయకం. ఏ పనైనా సరే సరైన సమయంలో చేస్తేనే అది అర్ధవంతం అవుతుంది. దాని ప్రయోజనము నెరవేరుతుంది. తప్పక నిర్వహించవలసిన   కర్తవ్యములను రేపు, రేపంటూ వాయిదా వేయవద్దు. ఆలస్యము చేయవద్దు. తగిన సమయంలో చెయ్యాలి . సాక్షత్ యుగ పురుషులైన   భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు  ఇలా అన్నారు,” మ్రొక్కను వంచవచ్చు ,అదే చెట్టును వ్రంచితే  అది విరిగి పోతుంది. పిల్లలు యువకులుగా పరివర్తన చెందే కాలంలో  వారు  ప్రపంచ ఆకర్షణ , ఉద్యోగం ,  కుటుంబ విషయములలో పూర్తిగా నిమగ్నం అవుతారు. చిన్నతనం లోనే పిల్లలను, మానవతా విలువలను బోధిస్తూ పెంచితే  వారు పెరిగిన కొద్దీ ప్రపంచ ఆకర్షణలకు లొంగి  దారిని  తప్పినా కూడా ,మళ్ళి ఖచ్చితంగా చిన్నప్పటి మంచి దారికే  వస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ  తప్పని సరిగా  దైవ  ప్రార్ధన చెయ్యాలి ,భగవంతునికి కృతజ్ఞతలను సమర్పిస్తూ ఉండాలి.

ఇలాంటి  అలవాటును చిన్నప్పటినుండి ఎవరు అనుసరిస్తారో , వారు వారి వయస్సు పెరుగుతున్నకొద్దీ, ఎంతో   నిబ్బరంగా  ప్రశాంతంగా  ఉంటూ ,జీవితంలో  ఎదురయ్యే ఒడిదుడుకులను ,ఒత్తిడిని  ఎదురుకొనగలుగుతారు.  అటువంటివారు భౌతిక సుఖములు ,ఆధ్యాత్మిక పురోగమనం పొందుతారు.

 

 

 

తాబేలు కథ

 

tortoise

విలువ — సరైన నిర్ణయం

ఉపవిలువ  — ధైర్యము / సాహసము.

ఒక తాబేలు ఓడలో నివసించేది.ఒకరోజు  హఠాత్తుగా  ఓడ మునిగిపోయింది. తాబేలు నెమ్మదిగా ఈదుకుంటూ  ఒక పర్వతం దగ్గరికి  చేరుకుంది. అలిసిపోయిన తాబేలు ఆహారం కోసం వెతక సాగింది. ఆహారం ఏమీ దొరకలేదు.పర్వతం పైన ఏమైనా దొరుకుతుందేమో అన్న ఆశతో పర్వతం పైకి నెమ్మదిగా ఎక్కడం మొదలుపెట్టింది. పర్వత శిఖరం వద్దకి చేరుకుంది. పర్వత శిఖరం అంతా మంచుతో కప్పేసి ఉంది. అక్కడి చలి భరించలేకపోయింది తాబేలు. ఇంతలో హఠాత్తుగా మంచు తుఫాను మొదలయింది. కష్టపడి, నెమ్మదిగా దారి చేసుకుని బైటపడింది తాబేలు.
కానీ దారిలో ఒక రాక్షసుడు కనిపించాడు. వాడి రూపం,పెద్ద పెద్ద  అరుపులు విని, తాబేలు భయపడి తన శరీరం పైన ఉన్న డిప్ప లోపలికి  వెళ్లి దాక్కుందాము అని అనుకుంది.  తన చుట్టూ పరిశీలిస్తే చాలా  తాబేళ్ళు, చలికి తమ శరీరం పైన ఉన్న డిప్ప లోపలికి  దాక్కుని చనిపోయాయి. ఇది గమనించిన తాబేలు, చలి తట్టుకుని జాగ్రత్తగా ఉంది. తాబేలు, రాక్షసుల వైపు నడుస్తుండగా, రాక్షసుల ఆకారం మారుతూ కనిపించింది. అప్పుడు తాబేలు ధైర్యం  తెచుకుని నెమ్మదిగా రాక్షసుడి దగ్గరికి వెళ్లి చూస్తే, అది రాక్షసుడు కాదు. పర్వతం దగ్గర ఉన్న శిల. తాబేలుకి విపినించిన అరుపు ఈదురు గాలి చప్పుడు. ఇవన్నీ చూసాక, తాబేలు ఇంకొంచం ధైర్యంగా  ముందుకు నడవడం మొదలుపెట్టింది. ఆ కొండల సందులో చాలా ఆహారం కనిపించింది. అక్కడే సంతోషంగా ఉండిపోయింది.
చుట్టుపక్కల అందరి దగ్గర, ధైర్యం గల తాబేలు అని పేరు తెచ్చుకుంది.

నీతి

జీవితంలో ఒకోసారి  కష్టాలుఎదుర్కోవలసివస్తుంది. పిరికిగా తప్పించుకోవడానికి చూడకూడదు. ధైర్యంగా, భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుని ఎదుర్కోవాలి. ప్రయత్నం చేస్తే ప్రతి కష్టానికి ఒక
జవాబు దొరుకుతుంది.

https://saibalsanskaar.wordpress.com/2015/07/22/brave-little-tortoise/

htps://facebook.neetikathalu.com