Archive | April 2019

చివరి సవారి

విలువ :దయ
ఉప విలువ: మర్యాద,సమయ స్ఫూర్తి

 

taxi

ఒక టాక్సీ డ్రైవర్ ఆ రోజుకి తన చివరి సవారీని ఎక్కించుకోటానికి ఒక ఇంటికి వెళ్ళాడు .సవారీని కావాలని పురమాయించిన వారు, ఎంతకీ బైటికి రాలేదు. అదే తన చివరి బేరమవడంతో అతను వెళ్ళిపోదామనుకున్నాడు. కాని, ఎందుకనో కార్ ని పక్కకి ఆపుకుని ఆ ఇంటి తలుపుని కొట్టాడు .

“ఒక్క నిమిషం “ అని లోపటి నుండి ఒక వృద్ధురాలి గొంతు వినిపించింది. ఇంతలో
తొంబై ఏళ్ళ పెద్దావిడ తలుపు తెరిచి బైటికి వచ్చి నిలబడింది. ఆవిడ పక్కన ఒక పెట్టి కూడా
ఉంది. కొన్నేళ్ళగా ఆ ఇంట్లో ఎవరూ నివసించడం లేదని అతనికి అర్ధమయింది . ఎందుకంటే ఆ ఇంట్లో కుర్చీలన్నిటినీ ఒక బట్టతో కప్పారు. గోడ మీద గడియారాలు కాని , వంటింట్లో గిన్నెలు కాని , ఏమీ లేవు . గది మూలలో ఒక అట్టెపెట్టి ఉంది. దాని నిండా చిత్ర పటాలు మరియు గాజు సామాన్లు సద్ది ఉన్నాయి.

ఆవిడ డ్రైవర్ ని తన పెట్టెను బైట పెట్టమని సహాయము కోరింది. డ్రైవర్ ఆమె పెట్టెను టాక్సీలో పెట్టి ,వెనుకకు వచ్చి ఆవిడను జాగ్రత్తగా చేయి పట్టుకుని తీసుకెళ్ళి, కార్ లో కూర్చో పెట్టాడు. తన పట్ల డ్రైవర చూపిన దయకి ఆవిడ ఎంతో సంతోషించింది. అతనికి ఎన్నో సార్లు తన కృతజ్ఞతలను తెలుపుకుంది . డ్రైవర్ ఎంతో వినయంగా ,” అయ్యో! పర్లేదండి .ప్రయానీకులందరినీ నేను మా అమ్మని చూసూకున్నట్టే మర్యాదగా చూసుకుంటాను . ” అని చెప్పాడు . అతని వినయ విధేతలను ఎంతో మెచ్చుకుంటూ ఆవిడ తనని పలానా చోటుకి తీసుకుని వెళ్ళమంది .పైగా, తనకు ఏమీ తొందర లేదు నాయనా ! నిదానంగనే వెళ్దాము” అని చెప్పింది .

“నాకెవరూ లేరు .నేను ఒంటరిదాన్ని అయిపోయాను ,డాక్టర్ కూడా నేను ఎక్కువ కాలం బ్రతకను అని చెప్పారు .” అని అతనితో ఆమె మనసులోని బాధను పంచుకుంది . మాట్లాడుతున్నప్పుడు ,ఆవిడ కళ్ళు చమ్మగిల్లడం గమనించాడు ,డ్రైవర్. అతను కార్ మీటర్ ను ఆపేసి ఆవిడను ఫ్రీగా డబ్బు తీసుకోకుండా తిప్పదల్చుకున్నాడు.

అలా మాట్లాడుకుంటూ రెండు గంటల పాటు ప్రయాణం చేశారు వాళ్ళిద్దరూ .దారిలో ఆవిడ డ్రైవర్ కి తను పూర్వం ఉద్యోగము చెసిన చోటుని ,పెళ్ళైన కొత్తల్లో తన భర్తతో కలిసి ఉన్న ఇల్లును చూపించింది . ఇలా దారిలో చాలా చోట్లు కార్ ను ఆపి తన గత స్మృతులను గుర్తు తెచ్చుకుంది .

ఇలా తెల్లవారేదాకా వాళ్ళిద్దరూ కొంత తిరిగాక అవిడ అలిసిపొయి అతన్ని ఒక వృద్ధాశ్రమం దగ్గెర ఆపమంది .అక్కడి వాళ్ళొచ్చి ఆవిడని చేయి పట్టుకుని తీసుకెళ్ళారు . డ్రైవర్ కార్ వెనుక ట్రంక్ లో (డిక్కీ )ఉన్న ఆమె పెట్టిని లోపలి దాకా తీసుకెళ్ళి పెట్టారు. వీల్ చైర్లో కూర్చుని లోపలికి వెళ్తూ పెద్దావిడ ,డ్రైవర్ ని “మీటర్ ఎంతైంది నాయనా ! నీకు నేను ఎంత డబ్బు ఇవ్వాలి?” అని అడిగింది. డ్రైవర్ ,” ఏమీ లేదండి! మీరు నాకేమి డబ్బు ఇవ్వక్కర్లేదు ,అని బదులు చెప్పాడు. “అదేంటి నాయనా! బ్రతుకు తెరువు కోసం టాక్సీ ని నడుపుతున్నావు.ఇలా డబ్బులు తీసుకోపోతే
నీకు కష్టం కదా”, అని అడిగింది. దానికి డ్రైవర్ ,పరవాలేదండి అని ఆవిడ దీవెనలను తీసుకుని వెళ్ళిపోయాడు.

అతని మంచితనాన్ని మెచ్చుకుంటూ ఆవిడ,”బాబూ ! ఒక వృద్దురాలికి కొన్ని మధుర క్షణాలను గడిపే అవకాశాన్ని ఇచ్చావు”, అని అంటూ లోపలికి వెళ్ళిపోయింది.
ఆ తరవాత ఆ క్యాబ్ డ్రైవెర్ వేరే పాసెంజర్స్ ని (సవారీలను) ఎక్కించుకోకుండా ,ఎంతో తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు. దారిలో ,పాపం ఆ పెద్దావిడని ఎవరన్నాకోపం ఎక్కువగా ఉన్న డ్రైవర్ కాని ఓర్పు లేని వారు కాని ఎక్కించుకుని ఉంటే ఆవిడ ఎంత ఇబ్బంది పడి ఉండేవారు అని అనుకున్నాడు . నేను కూడా హార్న్ కొట్టినాఎవరూ తలుపు తియ్యలేదని వెళ్ళిపోయుంటే ఎంత చక్కటి అవకాశాన్ని పోగొట్టుకునే వాడిని . నా జీవితంలో నేను ఇంత మంచి పని ఎప్పుడూ చెయ్యలేదు. ఒక పెద్దావిడకి సహాయ పడి ,ఆవిడకి కొన్ని క్షణాలైనా ఆనందాన్ని కలిగించగలిగాను.

నీతి :

మనమందరము కూడా జీవితంలో మధుర క్షణాలకోసం ఎదురు చూస్తూ ఉంటాము. కాని ,అవి ఎప్పుడు ఎలా అనుభూతిలోకి వస్తాయో చెప్పలేము. కథలోలా కొన్ని సార్లు చిన్న చిన్నపనులు కూడా ఎంతో తృప్తిని ,ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతి క్షణం కూడా విలువైనది , చట్టి అనుభూతులను తప్పక సొంతం చేసుకోవాలి.

రచయిత: న్యూ యార్క్ టాక్సీ డ్రైవర్ అనుభూతి

మూలం :రాజర్ డార్లింగ్టన్ కథలు
https://saibalsanskaar.wordpress.com/2015/09/30/the-last-ride/

ఒక పులి మీసాల కథ

 

విలువ : ప్రేమ
ఉపవిలువ : ఓర్పు,పట్టుదల

 

tiger-whisker.png
అననగానగా యూనస్ అనే ఒక యువతి ఉండేది. ఆమె భర్త ఆమెతో ఎంతో ప్రేమగా ఉండే వాడు .
కాని అతను ఒక యుద్ధంలో పోరాడి తిరిగి వచ్చాక ఆమెతో కోపంగా ఉండటం మొదలుపెట్టాడు.
ఎప్పుడు ఎలా ఉంటాడో ఆమెకి అర్ధమయ్యేది కాదు.

ఆ ఊరి అవతల కొండలలో ఒక సన్యాసి ఉండే వాడు. ఊళ్ళో వాళ్ళు ఏ కష్టము వచ్చినా అతని దగ్గెరకి వైద్యం కోసం పరిగెట్టుకుంటూ వెళ్ళే వారు . యూనస్ ఎప్పుడూ ఎవరి సహాయం కోరేది కాదు , తన సమస్యలను తనే పరిష్కరించుకునేది. ఈ సారి మటుకు తన వల్ల కాక ఆ సన్యాసిని సహాయం కొరటానికి వెళ్ళింది. ఆయనకి తన పరిస్థితిని వివరించింది.అన్నీ విన్న సన్యాసి ,”యుద్ధం నించి తిరిగి వచ్చిన సైనికులు ఇలా ప్రవర్తించటం మామూలే. నేను నీకు ఏ సహాయం చేయగలను అని అడిగాడు.

యూనస్ ,”స్వామీ మా ఆయనని మళ్ళీ ఇది వరకులా నాతో ప్రేమగా ఉండేలా మార్చండి,అవసరమైతే ఆయనకు ఏదన్నా ఔషధం ఇస్తారా అని అర్ధించింది.సన్యాసి ఆమెని మూడు రోజులు తరవాత రమ్మని ఆదేశించారు. యూనస్ సరిగ్గా మూడు రోజులు తరువాత ఎంతో ఆశగా ముని ఆశ్రమానికి వచ్చింది. అప్పుడు ఆయన యూనస్ తో తన సమస్యని పరిష్కారించటానికి మందు తయారు చెయ్యాలంటే ఒక సజీవ పులి యొక్క మీసాన్ని తీసుకురావాలని పట్టుబట్టాడు .

వేరే దారి లేక యూనస్ మరునాడు పొద్దున్నే పులి మీసం కోసం అడవిలోకి వెళ్ళింది. అన్న మాంసాలను ఒక గిన్నెలో పట్టుకెళ్ళి పులి ఉండే గుహ బయట ఉన్న గడ్డిపైనా ఉంచుంది. ఆహారం కోసం పులి బతికి వస్తుందని పొదల వెనక దాక్కుని ఎదురుచూసింది . పులి ఎంతకీ రాక పోయే సరికి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది . మరునాడు సరిగ్గా అదే సమయానికి పులికి ఆహారం తీసుకుని వచ్చింది. ముందు రోజు తను అక్కడ పెట్టిన గిన్నె ఖాళీగా ఉండటం గమనించింది. తాను ఉండగా పులి బయిటికి వస్తుందని ఆశగా ఎదురు చూసింది. కానీ,పులి బయిటికి రాలేదు. ఇలా కొన్ని నెలలు గడిచాయి కానీ యూనస్ కి పులి మీసం దొరకలేదు. యూనస్ లేని సమయంలో పులి రోజు తాను తెచ్చి పెట్టే ఆహారాన్ని స్వీకరించేది.

కొన్నాళ్ళకి యూనస్ కి అర్ధమయింది ఏమిటంటే ,పులి యూనస్ అడుగుల చప్పుడు వినగానే తను దాక్కున్న సమయం చూసి ఆహారం తిని వెళ్లిపోయేది. ఇలా రోజు యూనస్ , పులి తను తెచ్చిన ఆహారాన్ని ఇష్టాంగా తినడం గమనించేది. క్రమేణా యూనస్ కి ఆ పులి మీద ప్రేమ కలిగింది.పులి అందమైన మేనుని ప్రేమగాతాకాలని తనకి కోరిక కలిగింది.కొన్ని రోజులకి పులి పిల్లిలాగా ఒళ్ళు విరిచి యూనస్నితన మేనుని తాకనిచ్చింది .ఇలా పులి నమ్మకాన్ని గెలుచుకుంది యూనస్. సరైన సమయం చూసి పులి అనుమతితో తన మీసంలో ఒక వెంట్రుకను జాగ్రత్త్తగా దాన్ని బుజ్జగిస్తూనే లాక్కోగలిగింది యూనస్.

మొత్తానికి విజయం సాధించిన యూనస్ ఎంతో గర్వంగా ముని ఆశ్రమానికి పులి మీసంతో వెళ్ళింది .అప్పుడు ముని యూనస్ ని ఆశ్చర్యంతో “ ఇదెలా నీకు సాధ్యమైంది, సజీవమైన పులి మీసాన్ని నీవు ఎలా తేగలిగావు,” అని ప్రశ్నించాడు?అప్పుడు యూనస్ ,” మహాత్మా ఆరు నెలలుగా కష్టపడి నేను ఆ పులి నమ్మకాన్ని సంపాదించుకోగలిగాను . ఈ విధంగా పులి నన్ను దాని మీసాన్ని తీసుకునేందుకు అనుమతించింది” అని సమాధానం చెప్పింది . అది విన్న సన్యాసి ఆ మీసాన్ని మంటల్లోకి విసిరేసి, యూనస్ నీకు ఇంక దీంతో పని లేదు ! నువ్వే చెప్పు, అంత క్రూరమైన మృగాన్ని నీ ప్రేమతో ఓర్పుగా దారికి తెచ్చుకోగలిగావు. అటువంటప్పుడు ఒక సాధారణమైన మనిషి అయిన నీ భర్తని నువ్వు ప్రేమతో దారికి తెచ్చుకోలేవా ?” అని అడిగాడు.

ముని మాటలకి మౌనంగా ఉండి పోయింది యూనస్. ఇంటికి తిరిగి వెళ్తూ తన భర్తని ,పులిని తలుచుకుని తన భర్తను మార్చుకోవటం తన వల్ల సాధ్యమవుతుందని ఆత్మవిశ్వాసంతో వెళ్ళింది.

నీతి :
ఈ విధంగా ప్రేమ ఉన్న చోట బండ రాళ్లు కూడా కరుగుతాయి .

మూలం :ఒక కొరియన్ కథ
https://saibalsanskaar.wordpress.com/2015/09/30/the-tigers-whisker/

ఉద్ధవ గీత :శ్రీ కృష్ణ- ఉద్ధ వుల మధుర సంభాషణ

విలువ :ధర్మం ,విశ్వాసము
ఉప విలువ : శరణాగతి

 

krishna

ఉద్ధవుడు శ్రీ కృష్ణుడికి చిన్ననాటి నుంచే ఎన్నో సేవలు చేసేవాడు. ఆయనే కృష్ణుడికి రథసారధి కూడా . కాని ,తను చేసే సేవలకు ఎప్పుడూ ఏ ప్రతిఫలము ఆశించలేదు.

ద్వాపర యుగంలో తన అవతారం చాలించే ముందు, శ్రీ కృష్ణుడు ఉద్ధవుడిని పిలిచి ,”ఉద్ధవా! నా అవతార కాలంలో ఎంతో మంది నా నుంచి ఎన్నో వరాలను ,బహుమతులను పొందారు. కాని ,నీవు ఎన్నడూ నన్ను ఏదీ కోరలేదు . కనుక నీకు ఏదన్నా ఇవ్వాలని ఉంది ,ఏమి కావాలో కోరుకో ?” అని ప్రేమగా అడిగారు.

అప్పుడు ఉద్ధవుడు ,”దేవా! నీ లీలలను అర్ధం చేసుకోవటం మా తరం కాదు, నాకు ఏ వరము వద్దు కాని,నిన్ను ఓక ప్రశ్న అడుగుదాము అనుకుంటున్నాను,అడుగవచ్చునా? “,అని వినయంగా ఇలా అడిగాడు ,“కృష్ణా !నీవు మా అందరికీ జీవించటానికి ఇచ్చిన సందేశము ఒకటి కాని నీవు జీవించిన విధానము మరొకటి.మహాభారత యుద్ధములో,నీవు పోషించిన పాత్ర ,తీసుకున్న నిర్ణయములు ,చేపట్టిన పనులు నాకేమి అర్ధం కాలేదు.దయచేసి నా సందేహములను తీర్చి నన్నుఅనుగ్రహించండి అని కోరుకున్నాడు.

దానికి కృష్ణుడు ,” “ఉద్ధవా ! ఆనాడు యుద్ధభూమిలో అర్జునుడికి గీతను బోధించాను. ఈ నాడు నీకు ఉద్ధవ గీతను బోధించటానికి ఈ అవకాసాన్ని కలిపిస్తున్నాను. నన్ను ఏమి అడగాలనుకుంటున్నావో
తప్పకుండా అడుగు.” అని ఉద్ధవుడిని ప్రోత్సహించాడు.ఇక ఉద్ధవుడు తన ప్రశ్నలను అడగటం మొదలు పెట్టాడు.”కృష్ణా పాండవులు నీ ప్రాణ స్నేహితులు కదా!నిన్ను గుడ్డిగా నమ్మారు కూడా . నువ్వు వారి వర్తమానము ,భవిష్యత్తు తెలిసినవాడివి . అటువంటప్పుడు వారిని జూదము ఎందుకు ఆడనిచ్చావు?మంచి మిత్రుడు అలాంటి వ్యసనములను ఎక్కడన్నా ప్రోత్సహిస్తాడా ?” పోని, ఆడనిచ్చావే అనుకో ,కనీసం వారిని గెలిపించి ఆ కౌరవులకి బుద్ధి చెప్పి ఉండ కూడదా ? అది కూడా చెయ్యలేదు. ధర్మజుడు ఆస్తంతా పోగొట్టుకుని వీధినపడ్డాడు . ఆఖరికి తన తమ్ముళ్లను కూడా ఓడిపోయాడు. అప్పుడైనా నీవు అడ్డుపడి వాళ్ళని కాపాడుండచు కదా?

కౌరవులు దుర్బుద్ధితో పరమ సాధ్వి అయిన ద్రౌపదిని, జూదంలో మోసం చేసి గెలిచారు.
కనీసం అప్పుడైనా నువ్వు నీ మహిమతో పాండవులని గెలిపించలేదు… ఎప్పుడో ఆవిడ
గౌరవానికి భంగం కలిగినప్పుడు ,ఆమెను ఆఖరి క్షణంలో అనుగ్రహించావు.సమయానికి ఆదుకున్న ఆపద్భాందవుడవని గొప్ప పేరుపొందావు. కాని ముందే నీవు కలుగచేసుకుని ఉంటే ఆమెకి
నిండు సభలో జరిగిన అవమానం తప్పేది కదా .సమయానికి ఆదుకునేవాడే మంచి మిత్రుడని పించుకుంటాడు . నీవు చేసినదేమిటి స్వామి?, అని ఉద్ధవుడు ఎంతో బాధతో కృష్ణిడిని తన ఆంతర్యమేటో తెలుపమని ప్రార్ధించాడు.

నిజానికి ఈ సందేహములు మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారందరికీ కలుగుతాయి. కనుక కృష్ణుడు ఎంతో ప్రేమతో ఉధవుడి ద్వారా మనందరికీ ఉద్ధవ గీతను ఈ క్రింది విధంగా బోధించాడు.“ఉద్ధవా! ప్రకృతి ధర్మ ప్రకారం అన్ని విధాలా జాగ్గ్రత్త పడేపది తగిన చర్యలను తీసుకునే వాడే గెలుపుకు అర్హుడు. దుర్యోధనుడికి జూదములో ప్రావీణ్యము లేకపోయినా ఆస్తిపరుడు. కనుక తన అర్హత ప్రకారం ఆస్తిని పణంగా పెట్టాడు.ఎంతో తెలివిగా తన మామ చేత పందెమును వేయించాడు., ధర్మరాజు మాత్రం , పందెములను నా చేత వేయించాలి అని అనుకోలేదు ,నా సహాయమును కోరలేదు.

శకుని , నేను ఆడి ఉంటె జూదము ఎవరు గెలిచేవారు? నేను కోరిన పందెమును శకుని వేయగలిగేవాడా? లేక అతను చెప్పిన పందెము నాకు పడేది కాదా ? నీవే చెప్పు ?సరే ఇదిలా ఉంచు, ధర్మరాజు అజ్ఞానంలో మరొక క్షమించరాని నేరం చేశాడు. అదేమిటంటే, “నేను చేసుకున్న కర్మ వలన ఈ ఆటలో ఇరుక్కున్నాను . కృష్ణుడికి ఈ సంగతి తెలియకూడదు ,ఇటువైపు ఎట్టి పరిస్థితిలో కూడా కృష్ణుడు రాకూడదు.” అని ప్రార్ధించాడు. దాంతో ఏమీ చేయలేక చేతులు కట్టుకుని ,తన పిలుపుకోసం ఎదురు చూస్తూ నిలబడిపోయాను.ధర్మజుడు సరే భీముడు,అర్జునుడు,నకుల సహదేవ్వులు కూడా ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారేకాని ఏ మాత్రము నా సహాయము కోరలేదు. అలాగే ద్రౌపది కూడా. దుస్సాసనుడు తనను సభలోకి ఈడ్చినప్పుడు కూడా నన్ను స్మరించకుండా నిండు సభలో అందరితో తనకు న్యాయం చెయ్యమని వాదించింది. తన బుద్ధి కుశలతలనే నమ్ముకుంది.

చివరికి తన ప్రయత్నములన్నీ విఫలమయ్యాక గొంతెత్తి నన్ను పిలిచింది, సంపూర్ణ శరణాగతితో నన్ను శరణు వేడింది. అప్పుడు వెంటనే ప్రత్యక్షమయ్యి నేను ద్రౌపదిని ఆ నాడు రక్షించలేదా? అని కృష్ణుడు ఉద్ధవుడిని తిరిగి ప్రశ్నించాడు.కృష్ణిడి సమాధానములకి ఉద్ధవుడు భక్తితో చెలించి ,కృష్ణా !అలాగైతే మాలాంటి సామాన్యులు సంగతి ఏంటి ? మేము చేసే కర్మలలో కూడా నీవు కోరితే కల్పించుకుని సహాయం చేస్తావా?అవసరమైతే మమల్ని చేదు కర్మలు చేయకుండా కాపాడుతావా? అని చక్కటి ప్రశ్న వేశాడు ఉద్ధవుడు .దానికి శ్రీ కృష్ణుడు చిన్నగా నవ్వుతూ ,”ఉద్ధవా ! మానవ జీవితం, వారు చేసుకున్న కర్మల ద్వారా సాగుతుంది. నేను వారి కర్మలను నిర్వర్తించను , వాటిలో కలుగ చేసుకోను. కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటాను అదే భగవంతుని ధర్మము “ అని వివరించాడు.

ఉద్ధవుడు ఆశ్చర్య చెకితుడై “ అయితే కృష్ణా ! మేము తప్పుదారి పట్టి పాపములను మూట కట్టుకుంటుంటే నువ్వలా దగ్గెరుండి చూస్తూ ఉంటావా? మమ్మల్ని అడ్డుకోవా ,ఇదెక్కడి ధర్మము అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు “ఉద్ధవా ! నీ మాటలను నీవే జాగ్రత్తగా గమనించు . నీకే అర్ధమవుతుంది.భగవంతుడు నీతోనే ,నీలోనే ఉన్నాడని , నిన్ను దగ్గెరుండి గమనిస్తున్నాడని గుర్తించినప్పుడు, నీవు తప్పులు ఎలా చేయగలుగుతావు చెప్పు ?”ఈ సత్యాన్ని మరిచినప్పుడే మానవుడు తప్పు దారి పడతాడు అనర్ధాలని కొని తెచ్చుకుంటాడు . ధర్మరాజు జూదము గురించి నాకు తెలియదనుకోక పోవడమే తాను చేసిన మొదటి తప్పు. నేను అంతటా ఉన్నాను అని అతను గుర్తించి ఉంటే ఆట పాండవులకు అనుగుణంగా సాగేది “ అని ఉద్ధవుడికి చక్కగా బోధించాడు శ్రీ కృష్ణుడు.కృష్ణుడు బోధించిన మధురమైన గీతను విని ఉద్ధవుడు ఎంతో ఆనందించి తన సంశయములన్నిటినీ తీర్చినందుకు కృతజ్ఞతా భావంతో కృష్ణుడిని నమస్కరించాడు.

నీతి:

పూజలు ,ప్రార్థనలు భగవంతుడి సహాయమును కొరటానికి చేసే కర్మలే కదా! కాని, సంపూర్ణ విశ్వాసము వీటికి తోడైతే అంతటా ఆయనే కనిపిస్తాడు. భగవద్ గీతలో కూడా శ్రీ కృష్ణుడు ఇదే బోధించాడు .

యుద్ధములో అర్జునిడికి కృష్ణుడు రథ సారధిలా వ్యవహరించి అతనికి కర్తవ్యమును బోధ చేసాడే కాని , అతని బదులు స్వయంగా యుద్ధము చేయలేదు . అలాగే మనలో ఉన్న భగవంతుడిని గుర్తించి ఆయనని మన జీవిన రథసారధి చేసుకుంటే మనకి కూడా అర్జునిడిలా అన్నిట్లో తప్పక విజయం కలుగుతుంది. మన మంచి చెడులను ఆ భగవంతుడే చూసుకుంటాడని నమ్మాలి. ఆ నమ్మకమే మనని అన్ని వేళలా కాపాడుతుంది!
http://patriotsforum.org/uddhav-gita-illuminative-dialogue-between-uddhav-and-shri-krishna-why-he-did-not-protect-pandavs/

https://saibalsanskaar.wordpress.com/2015/09/29/uddhava-gita-beautiful-conversation-between-krishna-and-uddhava/