నిజాయితీగా ఉండే అవకాశాన్నిఎప్పుడూ వదులుకోవద్దు!

విలువ: సత్యం 

అంతర్గత విలువ: అంగీకారము

“ఈ పని ఎవరు చేశారు?” అని టీచర్ పిల్లల్ని అడిగింది. ఆ ముప్పై మంది పిల్లలూ  , తాము చేసిన పని గురించి మాత్రమే కాకుండా, మా టీచరు ఇంకా ఏమన్నా కనుగొని ఉండవచ్చా “,అని భయపడ్డారు

“ఈ పని ఎవరు చేశారు?” అని టీచర్ మరోసారి అడిగింది. ఆమె నిజానికి ఊరికే అడగడం లేదు, ఆమె సమాధానం కావాలని గట్టిగా నిలదీసింది. ఆవిడ కోపంగా  ఉండడం చాలా అరుదు, కానీ ఇప్పుడు చాలా కోపంగా ఉంది.

ఆమె పగిలిన ఒక గాజు ముక్కను చేతితో ఎత్తి పట్టుకుని, “ఈ కిటికీ అద్దాన్ని ఎవరు పగలగొట్టారు?” అని అడిగింది. “ఓహ్, ఓహ్,కిటికీ పగలగొట్టింది నేనే కదా” అని కిటికీ పగలగొట్టిన బాలుడు అనుకున్నాడు. “కానీ  నేను దానిని ఉద్దేశపూర్వకంగా చేయలేదు. ఇది బేస్ బాల్ తప్పుగా విసిరిన కారణంగా జరిగింది, అది నేను చేసినట్లు ఎలా అవుతుంది? ఇది నిజంగా నా తప్పు కాదు. నేను ఈ నేరాన్ని అంగీకరిస్తే, నేను చాలా ఇబ్బందుల్లో పడతాను. అలాంటి పెద్ద కిటికీ యొక్క అద్దం విలువ నేను ఎలా చెల్లించగలను? నాకు భత్యం కూడా లేదు కదా. మా నాన్నకు ఈ  విషయం తెలిస్తే ఆయనకు మూర్ఛ వస్తుంది” అని అనుకున్నాడు.

అతను తన చేతిని పైకి లేపడానికి ఇష్టపడలేదు, కానీ అతని కంటే చాలా బలమైన శక్తి ఏదో తన చేతిని ఆకాశం వైపుగా లేవనెత్తింది .

 “నేనే చేశాను” అని నిజం చెప్పి, మౌనంగా ఉండిపోయాడు. అది చెప్పడం కూడా చాలా కష్టం కదా.

టీచర్ లైబ్రరీ షెల్ఫు వద్దకు వెళ్లి ఒక పుస్తకాన్ని కిందకు దింపింది. ఆ తర్వాత ఆమె ఆ పిల్లవాడి డెస్కువైపుకు నడవ సాగింది. తన టీచర్ విద్యార్థులను కొట్టడం తాను ఎప్పుడూ చూడలేదు, కానీ ఆమె తనతోనే కొట్టడం మొదలు పెడుతుందేమోనని, అందుకు బహుశా ఆ పుస్తకాన్ని ఉపయోగించబోతోందేమోనని అతను భయపడ్డాడు.

అపరాధభావంతో నిండిన పిల్లవాని ముఖం వైపు చూస్తూ, “నీకు పక్షులంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు,” అని దగ్గరగా నిలబడి చెప్పింది. “నీవు ఎప్పుడూ వెతికే పక్షుల సమాచారం అంతా ఈ  ఫీల్డ్ గైడ్ పుస్తకంలో ఉంది. ఇది ఇక ఇప్పుడు నీది. పాఠశాలకు ఎలాగైనా ఇప్పుడు కొత్త పుస్తకం తేవలసిన సమయం వచ్చింది. ఈ పుస్తకం ఇకమీదట  నీదే కానీ, నీవు చేసిన తప్పుకు నేను బహుమానం ఇవ్వడం లేదని, నీ నిజాయితీకి మెచ్చి మాత్రమే ఇస్తున్నాను అని నీవు గుర్తుపెట్టుకున్నంత వరకు నీకు ఏ శిక్షా ఉండదు.”

ఆ పిల్లవాడు నమ్మలేకపోయాడు! తను శిక్షించబడలేదు, పైగా తన స్వంత పక్షి ఫీల్డ్ గైడ్‌ని అందుకుంటున్నాడు. అది కొనడానికే తాను డబ్బులను పోగు చేసుకుంటున్నాడు. ఆ డబ్బుకాస్తా కొత్త కిటికీ అద్దం కొనడానికి పాఠశాలకు వెళుతుందేమోనని భయపడ్డాడు కూడా.

అనేక సంవత్సరాల తర్వాత, పుస్తకం పోయినా, ఆ అద్భుతమైన టీచరు కూడా పోయినా, ఆ అబ్బాయిలో ఉండిపోయింది ఆ రోజు జరిగిన  అద్భుతమైన సంఘటన ఇంకా  ఆ టీచరు నేర్పిన పాఠం   –  మీ తప్పులను ఒప్పుకొనే  అవకాశాన్ని ఎప్పుడూ కోల్పోకండి; నిజాయితీగా ఉండటం వల్ల దాని ప్రతిఫలాలు దానికి ఉంటాయి.

ఆ పాఠం అతనితోనే ఉండిపోయి ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది.

నీతి :

ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు కానీ జీవితంలోని గొప్ప పాఠాలు చాలా కష్టమైన సమయాల్లో మరియు తరచుగా చాలా తీవ్రమైన తప్పుల నుండి నేర్చుకుంటామని గుర్తుంచుకోవాలి. సానుకూల మనస్తత్వంతో మన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటే మనం మంచి మనుషులుగా పరిణామం చెందుతాము. ప్రతి పరిస్థితిలోనూ పూర్తి నిజాయితీతో మరియు నేర్చుకోవాలనే సంకల్పంతో ఉండడమే లక్ష్యం. అందువల్ల ఆధ్యాత్మిక మార్గంలో మనశ్శాంతితో మరియు సరైన మార్గంలో వెళ్తున్నామన్న సంతృప్తితో పురోగమించగలము.   

తమ తప్పులను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికోసమే ఎరేజర్లు తయారు చేయబడతాయి – స్వామి వివేకానంద

Leave a comment