Archive | May 2015

హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ విలువ: ధర్మము, అంతర్గత విలువ: పరోపకారం

telugu-7

ఒక రోజు ఒక తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు తన తరగతి లో కూర్చుని ఉండగా తన కాళ్ళక్రింద చిన్న నీటి మడుగుని గమనిస్తాడు. అంతేకాక తన బట్టలు కూడా కొంత తడుస్తాయి. ఈ దృశ్యం చూడగానే పిల్లవాడికి గుండె జారినంత పని ఔతుంది.

అరే “ఇలా ఎప్పుడూ జరగలేదే, ఏవరన్నా చూస్తే ఎంత అవమానం నాకు. నేనే నా బట్టలు తడుపుకున్నానని అపహాస్యం చేయటమే కాక తోటి బాలబాలికలు నాతో మాట్లాడటం కూడా మానేస్తారేమో” అని చిన్నబుచ్చుకుని గమ్మున కూర్చుంటాడు.

ఏ దిక్కూ తోచక తలదించుకుని తనలో తానే చిన్నగా భగవంతుణ్ణి ఈ విధంగా వేడుకుంటాడు. “భగవంతుడా, నేను చాలా ఇబ్బందికరమైన పరిస్తితిలో ఇరుక్కున్నాను, నాకు నీవు తప్ప ఎవరూ దిక్కు లేరు. మహా అయితే ఇంకో ఐదు నిముషాలు, నన్ను అనుగ్రహించి ఇందులోనించి నన్ను బయటికి లాగవా స్వామీ!” నాకు త్వరగా సహాయం చేయవా అని ఆర్తితో వేడుకుంటాడు.

ఇలా భగవంతుడిని మనస్పూర్తిగా ప్రార్ధించి తల ఎత్తి చూసేసరికి, అతనికేసి అధ్యాపకురాలు చూడటం గమనిస్తాడు. ఇంకంతే నాపని అయిపోయిందిరా బాబూ! అని నిరాశతో తలదించుకుంటాడు.అతని వైపు టీచర్ వచ్చేలోగా, “అటుగా వస్తున్న సూజీ (SuZi) అనే ఒక తోటి విధ్యార్ధిని, తన చేతిలో చిన్న చేప పిల్ల ఉన్న గిన్నేలోని నీటిని కావాలని ఈ పిల్లవాడి మీద ఒంపుతుంది.help ever hurt never

పైకి కోపంగా నటించినా ఈ పిల్లవాడు మటుకు లోపల అమ్మయ్యా నన్ను సమయానికి ఆ దేవుడు సూజీ రూపంలో ఆదుకున్నాడు అని తాను అప్పటివరకు ప్రార్ధించిన ఆ స్వామికి మనసారా కృతజ్ఞతను తెలుపుకుంటాడు.

చివరికి అవమానకరమైన పరిస్థితిలో ఇరుక్కొవలసిన ఈ పిల్లవాడు తరగతిలో ఉన్న అందరి సానుభూతిని పొందుతాడు. అంతేకాక ఆ టీచర్, వెంటనే వెళ్ళి ఆ పిల్లవాడికి మరొక జత బట్టలను తెచ్చి ఇస్తుంది వేసుకోవటానికి.

పిల్లలు కూడా, ఆ పిల్లవాడి బల్లకింద పడిన నీళ్ళను చకచకా క్లీన్ చేస్తారు. అదేదో సామెత చెప్పినట్లు హేళనకి గురికావలసిన ఈ పిల్లవాడు కొంతలో తప్పించుకుంటాడు. కాని, ఇతని బదులు సూజీ అనే పిల్ల నిందల పాలు ఔతుంది.

పాపం, “నేను కూడా సహాయం చేస్తాను తరగతిని శుభ్రపరచటంలో” అని అంటూ ముందుకి వచ్చినా ఎవరూ ఆమెను లెక్కచేయరు. ఆమెని ఉత్తపుణ్యాన విసుక్కుంటారు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా సూజీ ని ఆ పిల్లవాడు,”నువ్వు నాకు సహాయం చేయటం కోసమే నీ చేతిలో ఉన్న నీళ్ళను క్రింద పడేశావు కదా” అని అడుగుతాడు.

సూజీ చిన్నగా “సరిగ్గా నాకు కూడా ఇలాగే జరిగింది ఒకసారి, నా బట్టలను కూడా నేను ఇలాగే పొరపాటున తడిపేసుకున్నాను. అలాంటి పరిస్థితిలో ఎంత చిన్నతనంగా ఉంటుందో నాకు బాగా తెలుసు, నేను ఊహించగలను” అని చిరునవ్వుతో జవాబు ఇస్తుంది.

నీతి: వీలైనంత వరకు మనము అవతలవారికి సహాయం చేసే అవకాశంకోసం భగవంతుడిని ప్రార్ధించాలి, అలాంటి చక్కటి అవకాశం దొరికినప్పుడు తప్పక మనస్పూర్థిగా సహాయం చేసేందుకు ముందుకి రావాలి. అంతేకాని ఎవరినీ తలంపు చేతకాని, మాటల చేతకాని, చేతల చేతకాని ఏమాత్రం బాధపెట్టకూడదు.

ముఖ్యంగా మనంకూడా అటువంటి ఇబ్బందులను స్వయంగా ఎదుర్కొంటే, ఆ బాధ ఏమిటో మనం కూడా రుచి చూశాము కనుక తప్పక ఎదుటి వారికి సహాయపడాలి.

http://saibalsanskaar.wordpress.com
https://www.facebook.com/neetikathalu

అద్భుత శిల్పి, విలువ: ధర్మం, అంతర్గత విలువ : ధర్మాచరణ

ఒక పెద్దమనిషి ఇంకా నిర్మాణ దశలో ఉన్న ఒక ఆలయానికి వెళ్ళాడు. అక్కడ ఒక శిల్పి భగవంతుని విగ్రహాన్ని చెక్కుతున్నాడు.ఇంతలో సరిగ్గా అతడు చెక్కుతున్న విగ్రహం పక్కనే అలాంటి ఇంకో విగ్రహాన్ని చూస్తాడు. ఒకే మూర్తివి రెండు ప్రతిమలు ఎందుకు చెక్కుతున్నాడా అని ఆశ్చర్యంతో శిల్పి దగ్గరకు వెళ్ళ్ళి ఇలా అడుగుతాడు.

ఒకేలాంటి శిల్పాలను ఎందుకు చెక్కుతున్నారండి? ఆలయం ఒక్కటే అయినపుడు ఒకే మూర్తికి చెందిన రెండు విగ్రహాలు అవసరం అంటారా ? అని అడుగుతాడు.దానికి ఆ శిల్పి శ్రద్ధగా తన పని తాను చేసుకుంటూనే, తల కూడా ఎత్తకుండానే ఇలా అన్నాడు.

IMG_0855

అవసరంలేదండీ,    కాని నేను ఇంతకుముందు చెక్కిన విగ్రహం చివరిదశలో ఒక చిన్న గీతవల్ల దెబ్బతింది.అందుకని సరిగా అటువంటిదే మరో విగ్రహాన్ని చెక్కుతున్నాను అని వినయంగా సమధానం ఇస్తాడు.

వెంటనే ఆ పెద్దమనిషి లోపం ఉన్న విగ్రహాన్ని పైకి, కిందకీ ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి చూసి , అదేంటి నాకు ఏ లోపము కనిపించడంలేదే అని అడుగుతాడు. అప్పుడు ఆ శిల్పి ఆ విగ్రహం ముక్కువైపు చూపుతూ ఇక్కడ చూడండి నేను ఈ విగ్రహాన్ని చెక్కుతుండగా , ఇదిగో ముక్కుమీద ఇలా పొరపాటున ఒక గీత పడింది, అందుకని అటువంటిదే మరో విగ్రహాన్ని చెక్కుతున్నాను అని జవాబు చెప్పాడు.

అంతటితో ఊరుకోక ఆ పెద్దమనిషి ఈ విగ్రహాన్ని ఆలయంలో ఎక్కడ ప్రతిష్టిస్తున్నారు అని అడుగుతాడు. దానికి ఆ శిల్పి అదిగో ఆ 20అడుగుల స్తంభం పైన నేను చెక్కడం పూర్తిచేస్తే ఈ రెండో విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు అని చెప్పాడు.  అప్పుడు ఆ పెద్దమనిషి ఆశ్చర్యపోతూ ఏమిటీ? అంత ఎత్తున విగ్రహం ఉంటే ఇంత చిన్న లోపం ఎవరికి కనిపిస్తుందండీ అని అడుగుతాడు.

దానికి ఆ శిల్పి ఒక నిమిషం చెక్కడం ఆపి చిరునవ్వుతో నాకు తెలుసు, సాక్షిగా నిలబడి అన్నీ చుస్తున్న ఆ భగవంతుడికి కూడా తెలుసు కదండీ అని జవాబు చెప్తాడు.

నీతి: ఏ పని అయినా సమర్ధవంతంగా పూర్తిచేసి విజయాన్ని సాధించాలనుకోవడం మంచిదే కాని దానికి కావలసిన ప్రేరణ మన లోపలినుండే రావాలి. అది బైట ప్రపంచంలో నుండి రాదు.

ఏ పని కూడా ఒకరి మెప్పుని పొందడంకోసం లేదా ఎవరైనా గుర్తిస్తారని చెయ్యకూడదు. ఏదిచేసినా మన సంతృప్తి కోసం శ్రద్ధ పెట్టి  సమర్ధవంతంగా పూర్తి చేసి విజయాన్ని సాధించాలి. ఇదే ఉత్తమ కళాకారుని లక్షణం.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

ప్రతిబింబం (Reflection) విలువ : సత్యం, అంతర్గత విలువ : ఆశావాదం

reflection తండ్రీ కొడుకులు ఇరువురు కొండ ప్రాంతంలో నడుస్తుండగా, పిల్లవాడు అకస్మాత్తుగా కింద పడిపోతాడు. దానితో ఆ నొప్పిని తట్టుకోలేక “అయ్యో” అని గట్టిగా అరుస్తాడు. అతని అరుపు అతనికే తిరిగి వినిపించేసరికి అతడు ఆశ్చర్యపోతాడు. ఆసక్తితో అతడు “అయ్యో” అన్న అరుపు వినపడగానే “నీవు ఎవరు” అని ప్రశ్నిస్తాడు. జవాబుగా అతనికి తిరిగి అతని ప్రశ్నే వినిపిస్తుంది. “నీవు ఎవరు” అన్న ప్రశ్న తిరిగి వినపడగానే పిల్లవాడు కోపంతో “ఓ పిరికివాడా” అని అరుస్తాడు. మళ్ళీ తను అన్న మాటలే వినిపిస్తాయి. ఇక విసిగిపోయిన ఆ పిల్లవాడు తండ్రి వైపు తిరిగి చూస్తూ, “నాన్నగారు ఏమి జరుగుతున్నది ఇక్కడ? నాకు ఏమీ అర్ధం కావటంలేదు,” అని అమాయకంగా ప్రశ్నిస్తాడు. తండ్రి నిదానంగా “నాయనా, నేను చెప్పేది శ్రద్థగా విను” అని అంటూనే “నేను నిన్ను అభినందిస్తున్నాను” అని గట్టిగా అరుస్తాడు. తిరిగి “నేను నిన్ను అభినందిస్తున్నాను” అని వినపడుతుంది. మరి ఒక మారు తండ్రి “నీవు విజేతవు” అని అరవగా మళ్ళీ”నీవు విజేతవు” అని వినపడుతుంది. ఇదంతా గమనిస్తున్న పిల్లవాడు ఆశ్చర్యంతో  మౌనంగా ఉండిపోతాడు. images (1) అప్పుడు నిదానంగా ఆ తండ్రి దీనినే “ప్రతిధ్వని” అనగా “ECHO” అంటారు నాయనా. సరిగ్గా గమనిస్తే ఇదే జీవితం. మన భావాలు మనకి ఎదుటి వారిలో “మన ప్రతిబింబంగా” కనిపిస్తాయి. అలాగే మన మాటలు కూడా తిరిగి మనకి మన పతిధ్వనిగా వినిపిస్తాయి. మన చేతలు కూడా అంతే. (Everything is reflection, resound and reaction of what we think, say and do). మనం ఒక వంతు మంచి చేస్తే దానికి స్పందనగా వెయ్యిరెట్లు మనకి మంచి జరుగుతుంది. చెడు కూడా అంతే. చెడ్డ భావాలు కాని, మాటలు కాని తిరిగి మననే మరింత బాధిస్తాయి. labrador-mother-son కనుక మన జీవితమనే అద్దంలో మనకి మన ప్రతిబింబం కనిపిస్తుంది. అందుచేత ప్రేమని బైట ప్రపంచంలో పొందాలి అంటే, అంత కంటే ఎక్కువ ప్రేమని మన హృదయమంతటా నింపుకోవాలి.మన జట్టులో మంచి స్పర్ధను పెంచాలి అంటే, మన సమర్ధతని ముందు మనం పెంచుకోవాలి. ఈ రకమైనటువంటి అనుబంధం ప్రపంచంలో ప్రతి చిన్న విషయానికి వర్తిస్తుంది. జీవితం మనం ఏది ఇస్తే దానిని మనకి మళ్ళీ తిరిగి ఇస్తుంది.

నీతి:  మన జీవితం యాదృచ్చికం (Coincidence) కాదు.అది ఖచ్చితంగా మన ప్రతిబింబమే! మంచి ఉత్తమమైన భావాలను, ఆలోచనలను మనలో పెంపొందిచుకుంటే తప్పక ఏరంగంలో అయినా విజయాన్ని సాధిస్త్తాము. https://saibalsanskaar.wordpress.com https://www.facebook.com/neetikathalu

స్వచ్చమైన ప్రేమకి సంకేతం ఏమిటి? విలువ:ధర్మము అంతర్గత విలువ: తాదాత్మ్యం (Empathy)

imageస్వచ్చమైన ప్రేమకి సంకేతం ఏమిటి, జాలిపడటమా? లేక సానుభూతి చూపటమా?

ఈ ప్రశ్నకు సమాధానం సూచిస్తూ మదర్ తెరెసా తమ జీవితంలో అనుకొకుండా జరిగిన ఒక సంఘటనని ఈ క్రింది విధంగా వివరిస్తున్నారు.
ఒకరోజు రాత్రి సమయంలో ఒక వ్యక్తి తెరెసా గారి ఇంటికి వచ్చి “అమ్మా ఇక్కడ దగ్గరలో ఒక బీద కుటుంబం ఉంది, అందులో ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు, చాలా రోజుల నుండి వారు పట్టెడు అన్నం కూడా తినలేదు.అందుచేత వారి ఆకలి తీర్చటానికి నేను వాళ్ళ ఇంటికి భోజనం తీసుకుని వెళ్ళాను”.నేను వెళ్ళినప్పుడు ఆకలికి వాళ్ళ మొహాలు నీరసం తో పీక్కు పోయి ఉన్నాయి. అయినా కూడా వారిని చూస్తే ఆకలి బాధ తప్ప ఏరకమైన నిరుత్సాహం కాని, ఇతర ఏ చింతలు కూడా నాకు వారిలో కనిపించలేదు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన తల్లికి, నేను తీసుకెళ్ళిన అన్నం ఇచ్చాను. దానిని ఆవిడ రెండు భాగములుగా విభజించి, అందులో ఒక భాగాన్ని ఇంట్లో వాళ్ళకి ఉంచి మరొక భాగాన్ని తీసుకుని బయటికి వెళ్ళింది. ఆవిడ తిరిగి రాగానే నేను, “అమ్మా మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు?” అని అడిగాను.ఆవిడ చాలా సరళమైన మాటలతో “మా పక్కింటికి వెళ్ళి వస్తున్నా బాబు, వాళ్ళు కూడా మాలాగే ఎంతో ఆకలితో బాధ పడుతున్నారు.” అని చెప్పారు. నాకు ఆవిడ ఉదార స్వభావం గొప్పగా అనిపించటమే కాక, అసలు ఆవిడకి ఇంత బీదరికంలో, పక్కింటి వాళ్ళ బాధల గురించి కూడా ఎట్లా తెలిసింది! అని ఆశ్చర్యం కలిగింది.
image
సాధారణంగా మనము కష్టాలలో ఉన్నప్పుడు, మన గురించి మనమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము.మనలాగే బాధలో ఉన్న తోటివారిని పట్టించుకునే తీరిక మనకి ఉండదు.
ఈవిధముగా నిజమైన ప్రేమ త్యాగాన్ని సూచిస్తుందే కాని జాలి లేదా, సానుభూతి కాదు.అని పై సంఘటన ద్వారా మదర్ తెరెసా మనకి చక్కగా అర్ధమైయ్యేలా చెప్పారు.
నీతి: నిజమైన, నిస్వార్ధ ప్రేమ గనుక మనలో అంటే, ఎన్ని బాధల్లో ఉన్నాసరే, కష్టాలలో ఉన్నా తోటివారిని మనము గుర్తించి, వారికి చేతనైనంత సహాయం మనవంతు మనం చేయగలుగుతాము. అన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు చేసే దాన ధర్మాల కంటే, మనకి ఉన్నదానితో తృప్తి పడి దాన్ని తోటి, లేని వారితో పంచుకోవటమే శ్రేష్టమైన లక్షణం.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

సృష్టి అంతా భగవంతుని స్వరూపమే (God Is Everywhere) ! విలువ : సత్యము అంతర్గత విలువ : జ్ఞానము

Summer_School

ఒక పిల్లవాడు స్కూలు నుండి ఇంటికి తిరిగి వస్తున్నాడు. గడ్డిపైన నడుస్తుండగా అతడికి ఒక గొంగలి పురుగు కనిపించింది.మరికొంత దూరం నడిచాక అతనికి చెట్టు పైన భద్రంగా ఒన్న ఒక పక్షి గూడు కనిపిస్తుంది. అలా పిల్లవాడికి దారిలో కనిపించే ప్రతి అందమైన దృశ్యం భగవంతుని సృష్టియొక్క గొప్పతనాన్ని గుర్తించేలా చేస్తాయి.

ప్రకృతి లోని ఇన్ని అందాలని చూస్తూ ఆ చిన్న పిల్లవాడు ఆనందంగా హుషారుగా గెంతుకుంటూ వెళుతుండగా, పొరుగింటి ఒక పెద్దమనిషి అతనికి ఎదురు వచ్చి, “ఏమిటి నాయనా ఎక్కడినించి వస్తున్నావు, ఈరొజు ఉదయమునించి ఏమి చేసావు” అని ఆప్యాయంగా పలకరిస్తారు.”నేను చర్చి స్కూలు నించి వస్తున్నానండి, అక్కడ భగవంతుడి గురించి బోలెడు విషయాలని తెలుసుకున్నాను”, అని వినయంగా బదులు చెప్తాడు.

images

ఇంతటి చక్కని సమాధానం విన్న పెద్దమనిషి ఎంతో మురిసిపోయి,”చాలా మంచిది నాయనా! అంతకంటే మంచి కాలక్షేపం ఏమి ఉంటుంది: సరే కాని దేవుడి గురించి ఎన్నొ మంచి విషయాలను తెలుసుకుని వస్తున్నావు కదా, “మరి ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడో చెప్పగలవా? “నువ్వు గనక ఈ ప్రశ్నకి జవాబు చెప్పగలిగితే నేను నీకు బహుమతిగా పది పైసలను ఇస్తాను”. అని అంటాడు.  అప్పుడు ఆ పిల్లవాడు చురుకుగా, “భగవంతుడు లేని చోటు ఒకటైనా మీరు నాకు చూపించగలిగితే నేనే మీకు తిరిగి రూపాయి ఇస్తాను.” అని చక్కటి సమాధానం, ఆ పెద్దమనిషి ఆశ్చర్యపోయేలా ఇస్తాడు.

నీతి:  అంతా మన దృష్టి లోనే ఉంటుంది. కల్లాకపటం లేని  హృదయంతో ,పవిత్రమైన మనస్సుతో చూస్తే అంతటా మనకి తప్పక భగవంతుడు కనిపిస్తాడు.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

అహింస యొక్క శక్తి, విలువ: అహింస ,అంతర్గత విలువ: మౌనం

image

మహాత్మా గాంధీ గారి మనవడు డా. అరుణ్ గాంధీ; MK గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాన్ వైలెన్సె స్తాపకులు. వారు తాము యూనివెర్సిటి ఆఫ్ పోరొటోరికో లో ఇచ్చిన ఒక ప్రసంగంలో విచ్చేసిన తల్లితండ్రులకు అహింస యొక్క శక్తిని గురించి చెప్పటానికి, తన జీవితంలో జరిగిన ఒక ప్రత్యక్ష సంఘటన గురించి ఈ క్రింద విధంగా వివరించారు.

“నాకు అప్పుడు పదహారు సంవత్సరములు, నేను చెరుకు పంట మధ్య మా తాతగారు గాంధి గారు స్థాపించిన ఇన్స్టిట్యుట్ లో మా తల్లితండ్రులతో నివసించేవాడిని. సౌత్ ఆఫ్రికా (South Africa) దేశంలో డర్బన్ అనే ఊరికి సుమారు ఒక పద్దెనిమిది మైళ్ళ దూరంలో ఉందేవాళ్ళము.
ఊరికి బాగా దూరంగా ఉండటంవల్ల మా చుట్టు పక్కల ఎవరూ ఉండేవారు కాదు. దాంతో నేనూ నా ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళి మా స్నేహితులను కలవాలని లేదా సినిమాలకు సరదాగా వెళ్ళాలని ఎంతో ఎదురు చూసేవారము.
ఒకరోజు మా నాన్నగారు నన్ను పట్టణానికి బండి మీద తీసుకెళతానని చెప్పారు. ఆయనకు అక్కడ ఏదో మీటింగు ఉందట. నేను చాలా ఉత్సాహంగా గెంతులేస్తూ తయారయ్యాను. అయితే నాన్నగారు మీటింగు అయ్యేంతవరకు నేను ఖాళీనే కనుక మా అమ్మ కొన్ని సరుకులు తెమ్మని ఒక లిస్ట్ రాసి ఇచ్చింది. అలాగే నాన్నగారు నన్ను పనిలోపని కారుని సర్వీసింగ్ కూడా చేయించమని చెప్పారు.
మరునాడు, అనుకున్న విధంగానే నేను నాన్నగారిని టైముకి దింపేశాను. అయితే వారు నన్ను సాయంత్రం సరిగ్గా అయిదింటికి అదే చోటికి వస్తే కలిసి ఇంటికి వెళదాము అని చెప్పారు. నేను కూడా సరే అని చెప్పి గబగబా పనులన్నీ ముగించుకుని అక్కడ దగ్గరలో ఉన్న టాకీస్ (Theatre) లో జాన్ పెయిన్ చిత్రం చూస్తూ అందులో బాగా మునిగిపోయి టైముని పట్టించుకోలేదు. సడన్ గా అయిదున్నర గంటలకి గుర్తువచ్చి గరాజ్ కి పరుగులు పెట్టి వెళ్ళి , అక్కడ కారుని తీసుకుని నేరుగా దాంట్లో నాన్నగారిని రిసీవ్ చేసుకుందామని వెళ్ళాను.
పాపం వారు నన్ను చూడగానే ఎంతో ఆదుర్దాతో నేను ఆలస్యంగా రావటానికి కారణం అడిగారు.నాకు సినిమా చూస్తూ ఉండిపోయానని చెప్పటానికి ఎంతగానో చిన్నతనంగా అనిపించింది. దాంతో అప్పటికప్పుడు ఏమీ తోచక, కారు సర్వీసింగ్ కి ఇచ్చాకదా నాన్నగారు అక్కడ వాళ్ళు కొంచం ఆలస్యం చేసారు అని తప్పించుకోటానికి అబద్ధం చెప్పేసాను. కాని అప్పటికే నాన్నగారు గరాజ్ కి ఫోన్ చేసారని నాకు తెలియదు. నేను అబద్దం చెప్పానని తెలిసి చాల బాధ పడ్డారు.
ఖచ్చితంగా నాపెంపకంలోనే ఏదో పొరపాటు జరిగింది. అందుకే నువ్వు ధైర్యంగా నిజాన్ని దాచకుండా చెప్పలేక పొయావు. ఎక్కడ తప్పు జరిగిందో నేను తెలుసుకోవాలి. నేను ఇప్పుడు నీ వెంట రాను, నేను ఇంటికి 18 మైళ్ళు నడుచుకుంటూ వెళతాను, దారిలో నాపెంపకంలో ఒక తండ్రిగా నావల్ల ఏమి పొరపాటు జరిగిందో ఆలోచిస్తూ వెళతాను అని అవే ఆఫీసు బట్టలతో వారు అంత చీకటిలో నడుచుకుంటూ వెళ్ళిపొయారు. దారిలో రోడ్డుమీద ఏక్కడా లైట్స్ కూడా లేవు. వారిని ఒక్కరిని అలా ఒంటరిగా పంపటానికి నా మనస్సు ఒప్పుకోలేదు. అందుచేత నేను వారి వెనకాలే చిన్నగా అయిదున్నరగంటలు, కారుని నడుపుకుంటూ వెళ్ళాను.కాని నేను అబద్ధం చెప్పటం వల్ల వారు ఎంత బాధ పడ్డారో నేను చూడలేక పొయాను.
ఆరోజే అప్పటికప్పుడే జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నాను. అయితే ఈ సంఘటన గుర్తు వచ్చినప్పుడల్లా ఆరోజు నాన్నగారు, ఈ కాలంలో మనం తప్పు చేస్తే మన పిల్లలని ఏవిధంగా శిక్షిస్తున్నామో మా నాన్నగారు కూడా ఆరోజు నన్ను శిక్షించి ఉంటే నేను తగిన గుణపాఠం నేర్చుకోగలిగేవాడినా అని అనిపిస్తుంది. నేను అబద్ధం చెప్పటం మానగలిగే వాడిని కాదేమో. నాన్నగారు ఎన్నుకున్న ఈ అహింసా మార్గం చాలా శక్తివంతమైనది.నన్ను జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పకుండా చేసింది.
నీతి: అహింసలో చాల శక్తి ఉంది. మహాత్మా గాంధీ గారి జీవితమే అహింసా మార్గం. మన భారత దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టింది. మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యలకి శాంతి ప్రేమ చక్కటి మార్గాలు. చాలా సార్లు కఠినమైన శిక్షలకంటే మౌనం చాలా గుణపాఠాలను నేర్పుతుంది. పిల్లలకి మంచి బుద్ధులు నేర్పటానికి వారిలో మార్పును తీసుకురావటానికి వారిని భయపెట్టనవసరం లేదు. అహింస తో కుడా మనం వారికి సర్ది చెప్పవచ్చు. వాదనల వల్ల, అరుపుల వల్ల, ఆవేశం ,కోపం ఎక్కువ ఔతాయేకాని పిల్లలలో ఈ మార్పును తీసుకురావు. కేవలం అహింస వల్లనే వారికి ఎప్పటికి మనస్సుకు హత్తుకు పొయే విధంగా నచ్చచెప్పవచ్చు

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

మాటలకంటే చేతలే మేలు, విలువ: ధర్మం, అంతర్గత విలువ: చొరవ, బాధ్యత

ఒక చిన్న పట్టణంలో దారినపోయే రైతుకి ఒక పెద్ద రాయి అడ్ద్దు తగులుతుంది. దానిని చూసి ఆ రైతు విసుక్కుంటూ ” ఎవరు ఇంత నిర్లక్ష్యంగా ఇంత పెద్ద రాయి రోడ్డుమీద అడ్డంగా పడేసి ఉంటారు. ఎందుకు ఎవరూ దానిని పట్టించుకోవడంలేదు,కనీసం ఇలా మధ్యలో వదిలేయకుండా ఒక పక్కకు తోయచ్చుకదా ” అని తనలో తాను మట్లాడుకుంటూ  వెళ్ళిపోతాడు.

మర్నాడు ఒక పాలవాడు ఆ రాయిని చూసి ఆ రైతులాగానే పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళకి ఒక విద్యార్థి ఆ రాయిని చూసి ” అయ్యో, దీనిని ఇలా వదిలేస్తే అడ్డు తగిలి ఎవరయినా కింద పడతారు, అది ఎంత ప్రమాదం అని ఆలోచించి ఆ రాయిని పక్కకి నెట్టడానికి ప్రయత్నిస్తాడు. మెల్ల మెల్లగా తోసుకుంటూ మొత్తానికి అతికష్టం మీద రాయిని అడ్డు తొలగిస్తాడు.

Jellingsten_stor_1ఆ రాయి కింద అతనికి ఒక కాగితం కనిపిస్తుంది. దానిమీద నీవు ఈ దేశానికిగల అసలైన సంపదవి, బాధ్యతగల పౌరుడివి అని రాసి ఉంటుంది.

సాధారణంగా మనుషుల్లో రెండు రకాలు ఉంటారు.కేవలం మాటలు చెప్పేవారు ,చేతలు చేసి చూపేవారు !

నీతి:

నిజంగా పని చేసే వాళ్ళు ఊరికే కబుర్లు చెప్తూ సమయాన్ని వృధా చెయ్యరు. చెయ్యగలిగినంతవరకు సాయం చెయ్యాలి కాని ఉరికే కూర్చుని మిగిలినవాళ్ళు చేసే పనులను విమర్శించే హక్కు మనకి లేదు. మార్పు రావాలి అంటే ముందు అది మనతోనే మొదలవ్వాలి.

ఉండడానికి చోటు, కనీస అవసరాలను మనకి  అందిస్తున్న సమాజానికి మనం సేవ ద్వారానే ఋణం తీర్చుకోగలం.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

మనస్సును గెలవగలిగితే ప్రపంచాన్నే గెలవగలం, విలువ- ప్రేమ, అంతర్గత విలువ—భక్తి

గుజరాత్ రాష్ట్రంలో మెషో నదీ తీరంలో మహూడియా ప్రాంతంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు పేరు జీవన్ భాయ్. అతడు ఆ నది మధ్యలో తనకు గల కొద్దిపాటి లంక భూమిలో చిభాడియా పండ్లతోటను పెంచాడు. అతని భార్య కేసరి భాయ్ కుమారుడు షాలుక్ ఆ తోటను పెంచడంలో అతనికి ఎంతగానో సహాయ పడ్డారు. ఒకరోజున షాలుక్ తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా మన తోటలో ఒక పండు తీసుకొని వెళ్లి షిరిజీ మహారాజ్ స్వామీజీ కి సమర్పిస్తాను. ఆ పండు తిని ఆయన ఎంతో సంతోషిస్తారు. ఆయన నేనిచ్చిన పండు రుచి చుస్తే మనం చాలా అదృష్ట వంతులం అన్నాడు.  తల్లితో ఇలా చెప్పి షాలుక్ మరునాడు ఉదయమే ఒక పండు తీసుకొని స్వామీజీ వద్దకు  బయలు దేరాడు. కొంచెం దూరం వెళ్ళే సరికి షాలుక్ కి నోరు ఊరడం మొదలైంది.  ఆ పండు తినాలని షాలుక్ కి కోరిక పెరుగుతూ వచ్చింది.

నిజంగా నేనిచ్చే ఈ చౌక రకం పండు స్వామీజీ తీసుకుంటారా? ఆయనకు పెద్ద పెద్ద వాళ్ళు చాలా ఖరీదైన తిను బండారాలు సమర్పిస్తారు కదా అనుకున్నాడు. ఆ పండు తనే తినెయ్యాలని కోరిక ఎక్కువ కాసాగింది. ఒక చెట్టు క్రింద కూర్చొని తన సంచిలో చాకు తీసుకుని ఆ పండును ముక్కలుగా కోయాలని అనుకున్నాడు. ఇంతలో షాలుక్ కి ఎవరో ఇలా చెప్పి నట్లనిపించింది. ఓ షాలుక్ నీకు అసలు నిగ్రహం లేదు. స్వామీజీ కి అని తెచ్చిన పండు నీవెలా తింటావు. స్వామీజీ మీద నీ భక్తి ఏమైంది?  ఈ ఆలోచన రాగానే మనస్సును చిక్క బట్ట్టుకుని  పండును స్వామీజీకి సమర్పించాలని నిర్ణయించుకుని మళ్ళీ నడవడం మొదలు పెట్టాడు. మరి కొంత దూరం వెళ్లేసరికి షాలుక్ కి విపరీతంగా దాహం వేసింది. మళ్ళీ అతనికి ఇలా అనిపించింది. ఓరీ మూర్ఖుడా ఆకలి, దాహం తీర్చుకుని ఇంటికి పో. స్వామీజీకి గొప్పవాళ్ళు రుచికరమైన ఖరీదైన పళ్ళు సమర్పిస్తారు. నీవిచ్చే పండు ఏ మూలకు? ఈ చౌకబారు పండు స్వామీజీకి అసలు ఇష్టమే ఉండదు. ఈ ఆలోచన రాగానే మళ్ళీ పండు తినడానికి సిద్ధపడ్డాడు.

అతడు చెట్టు కింద కూర్చుని పండు ముక్కలు గా కోయడానికి సిద్ధపడే సరికి  నీవు నిజంగా స్వామీజీ భక్తుడవే ఐతే వెళ్లి ఆ పండు స్వామీజీకి సమర్పించు. అని చెప్పినట్లనిపించింది.  ఈసారి ఆ పండు తాను తినకూడదని స్వామీజీకే సమర్పించాలని గట్టిగా నిర్ణయించుకుని మహారాజ్ స్వామి నారాయణ్ కీ జై, మహారాజ్ స్వామినారాయణ్ కీ జై అని అనుకుంటూ స్వామీజీ ఆశ్రమానికి బయలు దేరాడు. షాలుక్ ఆశ్రమానికి వెళ్లేసరికి స్వామీజీ భక్తుల మధ్యలో కూర్చుని ఉన్నారు. ఆయన కీర్తనలు పాడుతున్నారు. స్వామీజీ దివ్యమైన ఆకారాన్ని చూసి షాలుక్ ముగ్ధుడై పోయాడు. స్వామీజీ షాలుక్ మనస్సులోని ఆలోచనలన్నీ గమనించారు. షాలుక్ ను తన దగ్గరకు రమ్మని సంజ్ఞ చేసారు. షాలుక్ ఆశ్చర్య పడుతూ తన చేతిలోని పండు స్వామీజీ కి సమర్పించేడు;. నీ చేతి సంచి లోని చాకు కూడా ఇయ్యి దీనిని నేను కోసుకుతింటాను అన్నారు. ఒక్కొక్క ముక్కనే కోసుకుని స్వామీజీ ఆ పండును పూర్తిగా తినేసారు. ఇది చూసి భక్తులంతా ఆశ్చర్యపోయారు. స్వామీజీ షాలుక్ చేతిలో బర్ఫీలతో నిండి ఉన్న ఒక పాత్రను పెట్టి మరొకసారి షాలుక్ తో పాటు అందరినీ ఆశ్చర్యం లో ముంచేశారు. తరువాత భక్తులతో ఇలా చెప్పారు.

Clipart-Of-A-Hand-Carrying-A-Shopping-Basket-Full-Of-Orange-Fruit-Royalty-Free-Vector-Illustration-10241250889ఈ పిల్లవాడు నాకోసం ఈ పండు తీసుకొని వస్తూ త్రోవలో అనేక రకమైన ఆలోచనలతో సతమత మయ్యాడు. ఎంతో మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నాడు. ఓటమిని అంగీరించక చివరకు తన మనస్సుతో పోరాడి గెలిచాడు. భగవంతుడూ, సత్పురుషులూ ఎప్పుడూ మనస్సుకు లొంగకుండా మనస్సును జయించడానికి ప్రయత్నించేవాళ్లకు సహాయ పడతారు.

స్వామీజీ ఆ పండు మీద కోరికతో దాన్ని తినలేదని షాలుక్ హృదయ పూర్వకమైన భక్తికి ముగ్ధులై మాత్రమే దాన్నితిన్నారని అక్కడ ఉన్నవాళ్ళంతా గుర్తించారు. అందరూ షాలుక్ ని మెచ్చుకున్నారు.

 

 

నీతి : మనం మన మనస్సును జయించగలిగితే ప్రపంచాన్నే జయించగలం.

 

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

మిణుగురు పురుగు, కాకి : విలువ : అహింస, అంతర్గత విలువ: సమయస్పూర్తి

అనగనగా ఒక అడవిలో ఒక మిణుగురు పురుగు వుండేది. అడవిలో సంతోషంగా తిరుగుతూ వుండేది. ఒక రోజు ఒక కాకి వచ్చి ఆ మిణుగురు పురుగును తినబోయింది.

979739-A-single-funny-little-green-smiley-grasshopper-Stock-Vector-cricket-grasshopper-insectనోరు తెరిచిన కాకి తనను మింగేలోపు, “ఆగు! నా మాట వింటే నీకే మేలు” అని అరిచిందా పురుగు.

కాకి “ఏమిటది” అని అడిగింది.

“నీకు నా లాంటి చాలా పురుగులున్న  చోటు ఒకటి  చూపిస్తాను. నన్ను తినేస్తే నీకేమీ లాభం లేదు” అన్నదా పురుగు. కాకి అత్యాశతో ఒప్పుకుంది.

ఆ పురుగు కొంత మంది మనుషులు చలిమంట కాసుకుంటున్న చోటుకు తీసుకు వెళ్ళింది. నిప్పురవ్వలను చూపించి అవన్ని మిణుగురు పురుగులని చెప్పింది.

 
Crow  కాకి ఆ అని నోరు తెరుచుకొని ఆ నిప్పు రవ్వలను మింగేసింది.  నోరు కాలింది. బాబోయి,     ఈ మిణుగురు పురుగలను మనం తినలేమని ఎగిరిపోయింది.

ఆ పురుగు “బలం కన్నా బుద్ధి గొప్పది ” అని తన సమయస్ఫూర్తిని తనే మెచ్చుకుంది.

 

 

 

నీతి:  సమయస్ఫూర్తి  అనేది ఒక కళ. దీనిని అవసరమైనప్పుడు మరియు ఆత్మరక్షణకు ఉపయోగించుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళాలి కాని తెలివితేటలు ఉన్నాయి కదా అని అహంకారంతో మన తోటివారిని ఇబ్బంది పెట్టకూడదు.

 

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

భగవంతుడిని నిజంగా చూడగలమా, విలువ: ధర్మము, అంతర్గత విలువ : దుర్గుణములను అరికట్టుట

ఒక  సూఫీ గురువు కొండపైన  నివసించేవాడు. నెలకి  ఒకసారి  కిందకి దిగి  ఊరికి  వెళ్ళేవాడు.

అలా   ఒకసారి ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ సూఫీని   ఒక వ్యక్తి”   నాకెందుకు భగవంతుని దర్శనం కావట్లేదు .   నేను  ఎందుకు   దేవుడిని చూడలేకున్నాను? మహాత్మా ,  మీరు  నాకు ఈ విషయంలొ సహాయం చేయగలరా అని వినయంగా అర్ధిస్తాడు.

సూఫీ , “తప్పక చేస్తాను నాయనా ” కానీ , దానికి బదులుగా నీవు నాకు ఒక సహాయం చేయాలి  చేస్తావా ? అని అడుగుతాడు. తప్పక   చేస్తానండి ఇంతకీ  ఏమి  చేయాలి అని అన్నాడు ఆ వ్యక్తి

సూఫి , నాయనా నీవు సమాన  పరిమాణంలొ ఉన్న ఐదు రాళ్ళను కొండపైకి ,నేను నివసించే చోటికి తేగలిగితే అక్కడ నా ఆశ్రమానికి బయట ఒక చిన్న అరుగు కట్టుకుందాము అనుకుంటున్నాను తెఛ్ఛిపెట్టగలవా ? అని  కోరతాడు.  దానికి సాధకుడు అంగీకరిస్తాడు.

సరే ఇక   ఇద్దరూ ఒకేసారి  కొండపైన ఉన్న సూఫి ఆశ్రమానికి బయలుదేరతారు. దారిలోనే  ఆ రాళ్ళ  బరువుకి ఆ వ్యక్తి అలిసిపోతాడు.

అది గమనించిన సూఫి “ఒక రాయిని ఇక్కడే వదిలెయ్యి నాయనా కొంత బరువు తగ్గి , నడక  సులువు అవుతుంది  అని సలహా ఇస్తాడు. సాధకుడు సూఫి మాటవిని ఒక రాయి వదిలేసి ముందుకు నడుస్తాడు. అయినా  కూడా కొంతదూరానికే అతను  అలసిపోతాడు. మళ్ళీ సూఫి సలహా మేరకు రెండవ రాయిని కూడా దారిలో వదిలేసి ముందుకి సాగుతాడు. ఇలా అలిసిపోయినప్పుడల్లా , ఒక్కొరాయిని పడేసుకుంటూ అన్ని రాళ్ళని కొండపైన ఉన్న ఆశ్రమానికి చేరకుండానే మార్గ మధ్యంలో వదిలేస్తాడు.

 

అప్పుడు ఆ సూఫి సాధకునితో “ఇప్పుడు నీకు నేను భగవంతుడుని  చేరేందుకు సులువు మార్గాన్ని చూపించాను” అని తెలుపుతాడు.

ఇది  విన్న సాధకుడు వెంటనే ఆశ్చర్యంతో   “నాకేమి దేవుడు కనిపించలేదే మరి?” అని నిరుత్సాహంగా జవాబు చెప్తాడు.

 

Guru-and-disciple-thumb-297x300అప్పుడు సూఫి ,”నాయనా నేను నిన్ను ఆశ్రమానికి తెమ్మన్న అయిదు రాళ్ళు –కామ, క్రోధ ,లోభ,కోరికలు, అహంకారములకు  సంకేతాలు.

వీటిని  ముందు అరికట్టే ప్రయత్నం చెయ్యి. అయితే  ముందుగానే  నేను నిన్ను హెచ్చరించాలి. నేను చెప్పే అయిదు దుర్గుణములను అణిచివేయటం అంత తేలికైన విషయం కానేకాదు. నీవంతు కృషి ఏ లోపం లేకుండా  చేస్తే నేను కూడా నావంతు సహాయం చేస్తాను అని మా ట ఇస్తున్నాను.

 

ఏనాడైతే నీవు ఈ దుర్గుణములను జయిస్తావో , అప్పుడు నీకు భగవంతునికి మధ్య ఉన్న తెరలు వీడిపోయి ,చాలా సునాయసంగా నీకు భగవంతుని దర్శనం లభిస్తుంది. సాధకుడిని సూఫి నేర్పిన గుణపాఠం  బాగా ప్రభావితం చేసింది. తిరిగి ప్రశ్నించకుడా అతడు సూఫి అడుగుజాడలలో తన ప్రయాణాన్ని కొనసాగించాడు.

 

నీతి: మనలోనే దాగి ఉన్న కామ,క్రోధ ,లోభ , మోహ ,మద ,మాశ్చర్యములనే దుర్గుణములను మనం జయించగలిగితే తప్పక దైవాన్ని సులభంగా దర్శించగలుగుతాము. తద్వారా చక్కటి దివ్యానుభూతిని  ,ఆనందాన్ని పొందగలుగుతాము.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu