Archive | December 2020

పర్సు

ఒకానొకప్పుడు ఒక వృద్ధుడు రైలులో ప్రయాణం చేస్తున్నాడు.అతను బృందావనం తీర్థయాత్రకై వెళ్తున్నాడు . ఆనాటి రాత్రి అతను నిద్ర పోతుండగా అతని జేబులో నుండి పర్సు జారి క్రింద పడిపోయంది. మరునాటి ఉదయం తోటి ప్రయాణికుడు ఒకడు ఈ పర్సు ను చూసి ఇది ఎవరిదీ ?”అని అడిగాడు. ఈ వృద్ధుడు ఆ పర్సు తనదేనని చెప్పాడు .ఆ పర్సు తనదేనని చెప్పటానికి గుర్తు అందులో కృష్ణుడి ఫోటో ఒకటి ఉంటుంది అని చెప్పాడు. తరువాత ఆ వృద్ధుడు ఆ పర్సు ను గురించిన కథను చెప్పటం ప్రారంభించాడు. అతను చెప్పబోతున్న ఆ పర్సు గురించిన కథను వినటానికి చాలా మంది ప్రయాణికులు గుమి కూడారు .అందరికీ కనబడేలా ఆ పర్సును పైకి ఎత్తి చూపుతూ ఆ వృద్ధుడు ఇలా చెప్పసాగాడు.

ఈ వాలెట్ పర్సు కి సంబంధించి ఒక పెద్ద కథే ఉన్నది. చాలా ఏళ్ళక్రిందట మా నాన్నగారు నాకు ఈ పర్సును ఇచ్చారు. నేనప్పుడు చాలా చిన్న పిల్లవాడిని . స్కూల్ కి వెళ్ళి చదువుకొనే రోజులవి. అందులో కొంచెం పాకెట్ మనీ తో పాటు నా తండ్రి తండ్రుల ఫోటో ఒకటి అందులో పెట్టుకొనేవాడిని. కొన్ని సంవత్సరాలు గడిచాయి. నేను పెద్దవాడినయ్యాను. యూనివర్సిటీ లో చదువుకుంటున్నాను. అందరు యవకుల లాగానే నేను కూడా, నా ఆకారం,అందం పట్ల శ్రద్ద పెంచుకున్నాను. పర్సులో ఉన్న నా తల్లితండ్రుల ఫోటో తీసివేసి నా ఫోటో పర్సులో పెట్టుకున్నాను . నా ఫోటో చూసుకుని నాకు నేనే మురిసిపోతూ ఉండేవాడిని. తరువాత నాకు వివాహం అయింది. నన్ను గురించిన ఆలోచన పోయి కుటుంబం వైపుకు నా ధ్యాస మళ్ళింది. నా ఫోటోను పర్సు లో నుండి తీసివేసి ఆ స్థానంలో నా భార్య ఫోటో పెట్టుకున్నాను. రోజులో చాలా సార్లు నా పర్సు తీసి అందులోని నా భార్య ఫోటో కేసి తదేకంగా చూస్తూ ఉండేవాడిని. నా అలసట అంతా పోయి మళ్ళీ ఉత్సాహంగా పనిలో నిమగ్నం అయ్యేవాడిని .తరువాత నాకు ఒక కొడుకు పుట్టాడు. తండ్రి అయినప్పుడు నేను పొందిన ఆనందం మాటలలో చెప్పలేనిది! ఆఫీస్ పని ముగుంచుకుని ఆతృతగా ఇంటికి వెళ్ళి నా బిడ్డతో ఆడుకునేవాడిని. వేరే చెప్పేదేముంది ? నా భార్య స్థానంలో నా కుమారుడి ఫోటో పెట్టేశానని వేరే చెప్పక్కర్లేదు కదా ! ఆ వృద్ధుడు ఒక్కక్షణం ఆగి నీళ్ళు నిండిన కళ్ళను తుడుచుకుంటూ చుట్టూ ఒకసారి కలియ చూసి విచారం నిండిన కంట స్వరంతో,“స్నేహితులారా ! నా తల్లితండ్రులు చాలా కాలం క్రితమే కన్ను మూసారు. ఐదు సంవత్సరాల క్రితం నా భార్య కూడా మరణించింది . ఒక్కగానొక్క కొడుక్కి వివాహం అయింది . వాడు తన ఉద్యోగం ,కుటుంభం బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. అతనికి నా కోసం సమయం లేదు. నేను ఇప్పుడు మృతువు అంచున ఉన్నాను. భవిష్యత్తులో నాకు ఏమి వ్రాసి ఉన్నదో నాకు తెలియదు. నేను ప్రేమించిన ప్రతిదీ, నా సొంతం అనుకున్న ప్రతీది నన్ను విడిచిపోయినది . ఇప్పుడు నా పర్సులో కృష్ణుడి ఫోటో ఉన్నది . అయన నన్ను ఎప్పుడూ విడిచి పెట్టడు అని నాకు తెలుసు. “కృష్ణుడి ఫోటోను నేను మొట్ట మొదటే నాపర్సులో పెట్టుకుని ఉంటే ఎంత బాగుండేది”, అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అయన ఒక్కడే సత్యం ! మిగిలినవి అన్నీ కదిలిపోయే నీడలే ! అని తన పర్సు కథను ముగించాడు.

నీతి :
భౌతికమైన దేహమునకు సంబంధించిన భంధాలన్నీ తాత్కాలికమైనవే . ఈ రోజు మనకు అవే సత్యంగా ,సర్వాంగా అనిపించవచ్చు . కానీ అవన్నీ మన జీవితం మొత్తాన్ని ముగించేస్తాయి . అవన్నీ ముందు ముందు మాయం అయిపోయేవే !

మన అసలైన బంధం భగవంతుడితోనే ! భగవంతుడు ప్రతి ఒక్కరి సొంతం. అది శాశ్వతమైన భందం . మన యోగ క్షేమములు గమనించేడి ఆయనే . విశ్వమంతా వ్యాపించించిన ఆ ప్రభువును పిలవండి! తనఆశీస్సులను ఆయన మీపై కురిపిస్తాడు . మన ఆస్తులన్నీ భూమిపై మిగిలిపోతాయి . పశువులన్ని పశుశాలలో ఉంటాయి . మన భార్య గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. మన భందువులు ,స్నేహితులు స్మశానం దాక వస్తారు. మన దేహం చితిలో కాలిపోయే వరకూ ఉంటుంది. కేవలం మన కర్మలు మాత్రమే మరణాంతరం మన వెంట వస్తాయి అందువల్ల మనం మంచి మాత్రమే చెయ్యటానికి ప్రయత్నించాలి .

https://saibalsanskaar.wordpress.com/2017/01/04/the-wallet/

ఎవరు గొప్ప భక్తుడు

విలువ: సత్యం 

ఉపవిలువ: విశ్వాసము.

                       ప్రజలందరినీ నారాయణ … నారాయణ అని పలకరించే నారద మహర్షి ఒకసారి శ్రీ  మహా విష్ణువు ను దర్శించుకోవటానికి వైకుంఠానికి వెళ్ళాడు “  మీ దృష్టిలో ఎవరు గొప్ప భక్తుడో ?చెప్పమని విష్ణు మూర్తిని ప్రశ్నించాడు. ఒక్క క్షణం అలోచించి శ్రీ మహా  విష్ణువు భారత దేశంలోని మారుమూల ఒక కుగ్రామంలో ఉన్న ఒక పేద రైతు,  గొప్ప భక్తుడు అని నారదునితో చెప్పాడు. నారదుడు చాలా ఆశ్చర్య పడి ,విష్ణువు అలా చెప్పటానికి కారణం ఏమిటని మళ్ళీ   ప్రశ్నించాడు. నిరంతరం నారాయణ,  నారాయణ నామస్మరణ చేసే తనకంటే అతను,  ఎందువల్ల  గొప్ప భక్తుడు?” అని నారదునికి చాలా ఆశర్యంగా ఉంది . జీవితకాలమంతా ప్రతి క్షణమూ  ‘నారాయణ నారాయణ’ అని  నామజపంచేస్తూ ఉంటాడన్న విషయం లొకవిదితమే.

             విష్ణువు నవ్వి”ఇది తెలుసుకోవటానికి  కొంత సమయం పడుతుంది. కనుక ఈ లోగా నారదా ,  నీకు ఒక పని చెపుతాను చేయగలవా ?” అన్నాడు . అర్థాంగీకారం గానే కొంచం అయిష్టంగానే నారదుడు తల ఊపాడు. 

                                శ్రీ మహా విష్ణువు నారదునికి ఒక గిన్నె నిండా నూనె , అంచు  వరకు నింపి ఇచ్చాడు. ఆ నూనె గిన్నె చేతిలో పట్టుకుని  ఒక్క చుక్క నూనె బొట్టు క్రింద  పడకుండా ప్రపంచంమంతా  చుట్టి రవాలి”,   అనిచెప్పాడు. నారదుడు జాగ్రత్తగా నూనె గిన్నెని  చేతిలోపట్టుకుని ప్రపంచమంతా చుట్టిరావటానికి బయలు దేరాడు. విష్ణుమూర్తి  చెప్పిన విదంగా చుక్క నూనె కింద పడకుండా ప్రపంచం అంతా చుట్టి తిరిగి వచ్చాడు.  ఆ గిన్నె               ఇస్తున్నప్పుడు విష్ణువు నారదునితో,” నారదా ! నీవు నా కోసం ఈ చిన్న పని చేసినందుకు చాలా సంతోషం.  కానీ ఈ గిన్నె చేతిలో పట్టుకుని తిరిగేటప్పుడు నీవు ఎన్ని సార్లు నా  నామం జపించగలిగావు? “ అని అడిగాడు. 

                   నారదునికి  నోట మాట రాలేదు. నూనె, ఒక్క  బొట్టు కూడా క్రింద పడకుండా జాగ్రత్త పడటంలో పూర్తిగా నిమగ్నమైన నారదుడు నామస్మరణే పూర్తిగా మరచిపోయాడు . ఒక్క సారి  కూడా అతను భగవంతుడి  నామాన్ని స్మరించలేకపోయాడు. 

“కానీ ప్రభూ ! మీరు చేయమన్న పనే కదా చేశాను, అది మీ పనే  కదా ?”, అని నారదుడు వాదించాడు. దానికి జవాబుగా,”  నారదా ! ఆ పేద రైతు కూడా నేను అతనికి అప్పగించిన పనే  చేస్తున్నాడు. నేను అనుగ్రహించిన జీవితాన్నే అతను గడుపుతున్నాడు. నేను కల్పించిన పరిస్థితులన్నిటినీ  ఎదుర్కుని జీవిస్తున్నాడు. ఇన్ని ఉన్నా ఎటువంటి పనిలో, పరిస్థితిలో ఉన్నా , క్షణం తీరిక లేక పోయినా  నన్ను స్మరిస్తూనే ఉన్నాడు . అందువల్లనే అతను గొప్ప భక్తుడు కాగలిగాడు”,  అన్నాడు శ్రీ మహావిష్ణువు. 

 నీతి : 

                       జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ మనం విడువకుండా నామస్మరణ చేయటం నేర్చుకోవాలి , అలవాటు చేసుకోవాలి. మనం చేసే ప్రతి పనినీ  భగవంతునికి  నివేదించాలి. ఆ పనిని శ్రద్ధా ,భక్తులతో నిజాయితితో నిర్వర్తిస్తే భగవంతుడు మనతోనే ఎల్లప్పుడూ ఉంటాడు. 

https://saibalsanskaar.wordpress.com/2016/12/13/who-is-a-great-devotee/

నామస్మరణ శక్తి ( పవర్ అఫ్ నామస్మరణ )

నామస్మరణ శక్తి ( పవర్ అఫ్ నామస్మరణ )

 విలువ :          సత్యం

ఉప విలువ :   భక్తి, దృఢ నమ్మకము. 

                           అక్బర్ చక్రవర్తి ఒక రోజున తన మంత్రి  బీర్బల్ ని , కొద్దిమంది సైనికులని వెంటపెట్టుకొని దగ్గరలోనే ఉన్న ఒక సామంత రాజ్యం వైపు వెళ్లారు. వాళ్ళు ఆ విధంగా గుర్రపు స్వారీ చేస్తూ వెళుతుండగా  మార్గమధ్యంలో బీర్బల్ తన పెదవులను అస్తమానం  కదిలిస్తూ ఉండటం అక్బర్ గమనించాడు . తన తల్లిదండ్రులు తనకు ఉపదేశించిన రామ నామమును జపిస్తూ ఉన్నానని అక్బర్ చక్రవర్తికి బీర్బల్ సమాధానం ఇచ్చాడు. అక్బర్ చాలా సంతోషించి తన దగ్గర అటువంటి మంత్రి ఉన్నందుకు చాలా గర్వపడ్డాడు . 

                      కొంచం సేపటి తరువాత తాము ,తమ సైన్యం నుంచి విడిపోయి వేరే త్రోవలో వెళ్తున్నట్టు ,అడవిలో వారు దారి తప్పినట్లు గ్రహించారు అక్బరు ,బీర్బల్ . అప్పటికే వాళ్ళిద్దరూ చాలా అలసిపోయి ఆకలితో ఉన్నారు. ఆహరం వెతుక్కుంటూ వెళ్ళటానికి తనతో తోడుగా రమ్మని అక్బర్ ,  బీర్బల్ ని అడిగాడు. కానీ బీర్బల్ ఒక చెట్టు కింద కూర్చుని జపమాల పట్టుకుని జపం చేస్తూ తాను అక్బర్ తో రానని ,ఒక గంట సేపు తనని నామస్మరణ చేసుకొనిమ్మని చక్రవర్తిని అడిగాడు . 

                  అక్బర్ చక్రవర్తికి చాలా ఆశ్చర్యము ,కోపము కలిగాయి. “ఈ ‘రామ నామం’ నీకు ఆహరం తెచ్చిపెడుతుందా ?చెట్టు  క్రింద కూర్చొని నామజపం చేస్తే సరిపోతుందా?మనం కూడా ప్రయత్నం చెయ్యాలి కదా? “,అని అన్నాడు. బీర్బల్ కళ్ళు మూసుకొని ప్రశాంతం గా ,మౌనంగా  నామం జపిస్తూ కూర్చున్నాడు. బీర్బల్ మాటలతో చాలా కోపం వచ్చిన అక్బర్ తానే ఆహరం కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. కొద్ది దూరం వెళ్ళిన తరువాత అక్బర్ కు ఒక చిన్న పూరి గుడిసె కనిపించింది. చక్రవర్తిని గుర్తించిన ఆ గుడిసె లోని వారు తమ చక్రవర్తిని సాదరంగా ఆహ్వానించి చక్కగా అతిధి మర్యాదలు చేసి మంచి భోజనం పెట్టారు. వారి ఆతిధ్యానికి ముగ్ధుడైన అక్బర్ చక్రవర్తి , వారికి కొన్ని బంగారు నాణెములను బహుమానంగా ఇచ్చాడు. అక్కడినుంచి వచ్చేటప్పుడు బీర్బల్ కోసం కొంత ఆహారాన్ని పొట్లం కట్టించుకొని అక్భర్ ,బీర్బల్ దగ్గరకి వచ్చాడు. 

                రామనామస్మరణ చేస్తూ కూర్చున్న బీర్బల్ దగ్గరకి అక్బర్ విజయ గర్వముతో వచ్చాడు. జపం పూర్తి అయిన  తరువాత బీర్బల్ ,అక్బర్ ను “మీకు తినటానికి ఏమైనా దొరికిందా ? ” అని  నవ్వుతూ పలకరించాడు. గర్వంగా తల ఊపుతూ  అక్బర్ చక్రవర్తి తాను తెచ్చిన ఆహారపు పొట్లాన్ని బీర్బల్ చేతిలో పెడుతూ  కొంచెం వెటకారంగా “ప్రయత్నం చేయటం వల్లనే ఆహరం తినటానికి దొరికింది. నామం జపిస్తూ కూర్చున్న బీర్బల్ జపం వలన ఈ ఆహరం దొరకలేదు” అన్నాడు . బీర్బల్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా నీళ్ళు నిండిన కళ్ళతో ఆహారాన్ని భుజించాడు. భోజనం ముగించిన తరువాత బీర్బల్ ,అక్బర్ వైపు కు తిరిగి దగ్దమైన కంఠంతో “మహారాజా “! ఈ నాడే నేను రామ నామస్మరణ యొక్క శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగాను. గొప్ప చక్రవర్తి అయి  ఉండి కూడా మీరు ఆహారాన్ని అడుక్కోవలసివచ్చింది . కానీ ఈ రామనామం కేవలం జపిస్తున్న నా కోసం, ఏమి చేసిందో తెలుసా ! ఒక గొప్ప చక్రవర్తి చేత నా కోసం ఆహరం అడుక్కొని, ఏమి లేని ,ఎందుకు పనికిరాని నాకు అందించేలా  చేసింది! చెట్టుకింద కూర్చుని కేవలం రామనామ జపం చేస్తూ ఉన్న నాకు ఆహారాన్ని అనుగ్రహించింది. ఇది కేవలం రామనామ మహిమ మాత్రమే అని బీర్బల్ ఆనందంగా చెప్పాడు. 

                  అక్బర్ చక్రవర్తి కి నోటమాట రాక నిలబడ్డాడు! 

నేర్వవలసిన నీతి : భక్తి, విశ్వాసములతో చేయు నామస్మరణ అద్భుతాలను చేస్తుంది అంటే అర్థం, ఏ పని చేయకుండా కేవలం నామజపం చేస్తే చాలని కాదు. ప్రయత్నం చేసినంతమాత్రాన ఆశించిన ప్రయోజనాలు అన్ని సమకూరటం సాధ్యం కాదు. 

                 ప్రతి ఒక్కరు మనం భగవంతుని స్మరించుకోవటానికి ,ఆయనకి కృతజ్ఞతలు తెలియచేసుకోవటానికి కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. స్వామి ఎల్లప్పుడూ మనకి రక్షగా ఉండి మన అవసరాలను గుర్తించి శ్రద్ధవహిస్తాడు. ఇందుకు కావలసింది- ప్రతి ఒక్కరికి దృఢమైన భక్తి ,విశ్వాసములు ఉండాలి. 

https://saibalsanskaar.wordpress.com/2016/11/30/power-of-chanting-the-lords-name/