Archive | December 2015

పెద్దల యెడల గౌరవం గా ప్రేమగా మెలగాలి

image

విలువ సత్ప్రవర్తన : సత్యము

అంతర్గత విలువ పెద్దలను గౌరవించుట

ఒక వృ ద్ధుడు తన కొడుకు కోడలు నాలుగేళ్ల మనుమడు వీళ్ళతో కలసి నివసిస్తున్నాడు. ఆ ముసలివానికి చూపు స్పష్టం గా కనపడేది కాదు. చేతులు వణకుతూఉండేవి. నడుస్తూంటే అడుగులు తడబడేవి. ఆ కుటుంబం సాయంకాలం భోజనం అంతాకలసి ఒకే టేబుల్ వద్ద చేసేవారు. ఆ ముసలి తాత భోజనం చేస్తుంటే చేతులు వణకడం వలన కూరలోని బటాణీలు నేల మీద దొల్లి పడుతూ ఉండేవి. ఆయన పాలు త్రాగుతూ వుంటే చేతులు తడబాటు వల్ల పాలు ఒలికి పోతూ ఉండేవి. టేబుల్ క్లాత్ జిడ్డు గా తయారయ్యేది. దీనితో ఆ ముసలి వాడి కొడుకు కోడలు చాల ఇబ్బంది పడేవారు. దీనికేదో ఏదో పరిష్కారం చూడాలని భావించారు. ఆ గది లో ఒక మూల ఒక చిన్న టేబుల్ వేసి దాని మీద ఆయనకు భోజనం పెట్టడం ప్రారంభించారు. మిగిలిన వాళ్ళంతా మామూలు గా తమ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేసేవారు. ఆ ముసలి తాత చేతి నుంచి గాజు పాత్రలు అప్పుడప్పుడు చెయ్యి జారి పగిలి పోతూ ఉండేవి. అందుచేత కర్ర పాత్రలు చేయించి పాలు మజ్జిగ మొదలైనవి వాటిలో పోసి ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ ముసలితాత భోజనం చేస్తూ అప్పుడప్పుడు కన్నీళ్లు పెట్టుకొనే వాడు. కొడుకు కోడలు ఇది గమనించక పోలేదు. అయినా ఎప్పుడయినా తాత చేతినుంచి ఏదైనా పాత్ర లేదా చంచా జారిపోతే జాగ్రత్త గా పట్టుకోవాలని తెలియదా అని గద్దించే వారు. నాలుగు సంవత్సరాల వయస్సు గల చిన్నపిల్లవాడు ఇదంతా మౌనంగా శ్రద్ధ గా గమనించేవాడు. ఒకరోజున ఆ పిల్లవాడు సాయంకాలం భోజన సమయానికి కొంచెం ముందు కొన్ని కర్ర ముక్కల తో ఆడు కుంటున్నాడు.

image.jpeg

ఆ పిల్లవాని తండ్రి ఇది గమనించ బాబూ ఏమి చేస్తున్నావు అని ప్రేమగా అడిగాడు. దానికి ఆ పిల్లవాడు అమాయకంగా అమ్మ నువ్వు పెద్దవాళ్లు అయ్యాక మీరు భోజనం చేయడానికి కర్ర పాత్రలు చేస్తున్నానని చెప్పి ఆడు కోవడానికి వెళ్లి పోయాడు. అమాయకం గా ఆ పిల్లవాడు చెప్పిన మాటలు తల్లి తండ్రులకు జ్ఞానోదయం కలిగేటట్లు చేశాయి. ఆ రోజును నుండి ఆ ముసలి తండ్రికి వాళ్లతో బాటే డైనింగ్ టేబుల్ వద్ద భోజనం పెట్టడం మొదలు పెట్టారు. ఆయన చేతినుండి పాత్రలు జారిపోయినా మజ్జిగ ఒలికి పోయినా వాళ్ళు ఎప్పుడూ విసుక్కో లేదు.

నీతి :మనం ఎటువంటి విత్తనాలు చల్లితే అటువంటి పండ్లే లభిస్తాయి అనేది పెద్దలు చెప్పే సామెత. ఇతరుల కు మనం ఏమి ఇస్తే అదే మనకు లభిస్తుంది. అందుచేత మనం మంచి గా ఉండాలి అందరికి మంచి చెయ్యాలి. ముఖ్యం గా తల్లి తండ్రుల విషయం లో పెద్దల విషయం లో మన ప్రవర్తన మన పిల్లలకు ఆదర్శం గా ఉండాలి. అది మన నైతిక బాధ్య

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

 

పరీక్ష

 

image

 

విలువ : సత్యము

అంతర్గత విలువలు :నిజాయితీ ప్రయోజనము

గ్రీసు దేశానికి చెందినా సోక్రటీస్ ఎంతో పేరుపొందిన తత్త్వవేత్త ఒక రోజున ఆయన కు పరిచితుడైన ఒక వ్యక్తి సోక్రటీస్ వద్దకు వచ్చి ఇలా అన్నాడు. ఇప్పుడే మీ మిత్రుని గురించి ఒక వార్త విన్నాను. మీకు తెలుసా? సోక్రటీస్ అతనిని ఒక్క నిముషం ఉండండి అని ఇలా చెప్పాడు మీరు నాకు ఒక విషయాన్ని చెప్పే ముందు మీకు నేను పెట్టే ఒక పరీక్ష లో పాస్ కావలి. ఆ పరీక్ష మూడు విధములయిన వడపోత పరీక్ష. ఏమిటి మూడు విధములైన వడపోత పరీక్షా ? అడిగాడు ఆ వ్యక్తీ. అవును. మా మిత్రుని గురించి మీరు చెప్పేటప్పుడు ఆ విధంగా మీరు చెప్పే విషయం మూడు విధములుగా పరీక్షకు నిలబడుతుందో చూసి చెప్పండి అన్నాడు.

మొదటిది. మీరు చెప్పేది పూర్తిగా నిజామోకాదో ముందు నిర్ధారించుకోండి. నిజమైతేనే చెప్పండి. అప్పుడు ఆవ్యక్తి నేను కేవలం ఆ విషయాన్ని విన్నాను అంతే, పూర్తిగా నిజమో కాదో నాకు తెలియదు అన్నాడు. మీరు చెప్పబోయే నిజామోకాది మీకు తెలియదు మంచిది ఇక రెండవ విషయానికి వద్దాం.అది మంచిదో కాదో చూద్దాం . మీరు నామిత్రుని గురించి చెప్పే విషయం మంచి విషయమేనా? అని అడిగాడు సోక్రటీస్. ఆవ్యక్తి కాదు మీ మిత్రునికి వ్యతిరేకం గా చెప్పబోతున్నాను అన్నాడు. అప్పుడు సోక్రటీస్ మీరు నాకు మా మిత్రుని గురించి ఏదో ఒక చెడ్డ విషయం చెప్ప బోతున్నారు అది నిజమో కాదో మీకు తెలియదు. ఇక మూడవ విషయానికి వద్దాం మీరు నా మిత్రుని గురించి చెప్ప బోయే విషయం నాకేమైనా ఉపయోగ పడుతుందా? ఎంత మాత్రమూ ఉపయోగపడదు అన్నాడు అవతలి వ్యక్తీ. అప్పుడు సోక్రటీస్ మీరు చెప్పే విషయం నిజమో కాదో మీకు తెలియదు, అది మంచిదా అంటే అంతకంటే కాదు నాకెంత మాత్రమూ ఉపయోగపడదు. అటు వంటప్పుడు దానితో నాకేమిలాభం. అలాంటి విషయాన్ని నా కెందుకు చెబుతారు ? అని ముగించాడు.

అందుచేతనే సోక్రటీస్ గొప్ప తత్త్వవేత్త

నీతి :– ప్రతి వారు ఎప్పుడు నిజామే మాట్లాడాలి అది కూడా అవసరమైనప్ప్పుడే మాట్లాడాలి సమయాన్ని ప్రయోజనకరంగా అర్ధవంతం గా వాడుకోవాలి అబద్ధాలను నీలివార్తలను ప్రచారం చేయడానికి సమయాన్ని శక్తిని వృ ధా చేసుకోకూడదు.

 

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

 

భగవంతుని అనుగ్రహం పొందడం లో రహస్యం

image

విలువ:ప్రేమ

అంతర్గత విలువలు :తనను తానూ అర్పిం చుకోవడం మరియు విశ్వాసం

శ్రీ కృష్ణుడు ఎల్లప్పుడూ తన చేతిలో ఒక వేణువును పట్టుకుని ఉంటాడని మనకు తెలిసిన విషయమే. కాని దీని వెనుక ఒక కధ ఉంది అనే విషయం చాలామందికి తెలియని విషయం. శ్రీ కృష్ణుడు ప్రతి రోజూ ఉద్యానం లోకి వెళ్లి ప్రతి మొక్కలేదా చెట్టు వద్దకు వెళ్లి అవి అంటే తనకు ఎంతో ప్రేమ అని వాటి తో ప్రేమ గా పలికేవాడు. అవి కూడా కృష్ణా మేము కూడ నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాము అని సమాధానం చెప్పేవి.

ఒక రోజున శ్రీ కృష్ణుడు చాల ఆత్రుత గా తొందరగా ఒక వెదురు బొంగు వద్దకు వెళ్ళాడు. ఆ వెదురు బొంగు ఎంతో కంగారుగా కృష్ణా నావల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అని అడిగింది. వెంటనే కృష్ణుడు ఆ వెదురు బొంగు తో నేను నిన్ను ఒకటి అడగాలని అనుకుంటున్నాను. కాని దానిని నీవు ఇవ్వడం చాల కష్టం తో కూడుకోన్నపని లేదా అసాధ్య మైనది అన్నాడు. దానికి ఆ వెదురు బొంగు కృష్ణా పరవాలేదు అడుగు నేను ఇవ్వగలిగి నదయితే తప్పకుండా ఇస్తాను అని చెప్పింది. వెంటనే కృష్ణుడు నాకు నీ ప్రాణం కావాలి. నేను నిన్ను నరకాలి అనుకుంటున్నాను అన్నాడు. దానికి ఆ వెదురు బొంగు కృష్ణా నీకు మరొక మార్గం లేదా అని అడిగింది. లేదు అన్నాడు కృష్ణుడు. వెంటనే ఆ వెదురు బొంగు కృష్ణా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అని పలికింది. కృష్ణుడు ఆ వెదురు బొంగును నరకి దానికి చిల్లులు పెడుతుంటే అది బాధ తో అరిచింది. చివరకు అది వేణువు గా రూపాంతరం చెందిది.

 

image

 

ఆ వేణువు ను నిరంతరం తన వెంట ఉంచు కుంటున్నాడు శ్రీ కృష్ణుడు. ఆ వేణువు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని వెంట ఉండడం గోపికలకు చాల అసూయ కలిగించింది. మేము శ్రీకృష్ణుని తో కొంత కాలమే గడప గలుగుతున్నాము. కాని ఈ వేణువు శ్రీ కృష్ణుని తో ఇరువది నాలుగు ఉండగలుగు తోంది. కృష్ణుడు దాని తోటే నిద్ర పోతున్నాడు దానితో తేనే నిద్ర లేస్తున్నాడు. రోజంతా దానినే తన చేతిలో నే ఉంచుకుంటున్నాడు. అని గోపికలు ఆ వేణువు దగ్గరికి వెళ్లి నీవు ఇరువదినాలుగు శ్రీ కృష్ణుని తో నీ ఉండగలుగు తున్నావు. దీల్లో రహస్యం ఏమిటో మాకు చెప్పు అని అడిగారు దానికి ఆ వేణువు ఇలా సమాధానం చెప్పింది. నీను లోపల అంతా ఖాళీ అంటే నాకంటూ ఏమీ లేదు నన్ను నేను పూర్తి గా ఆ ప్రభువునకు సమర్పించుకున్నాను. . ప్రభువైన శ్రీకృష్ణుడు తానూ ఎప్పడైతే అప్పుడు నాతో ఎలా కావాలనుకుంటే అలా ఉంటాడు. దీనిని పూర్తిగా ఆత్మార్పణం అంటారు. నిజానికి మీరెవరు? నేనెవరు? అంతా భగవంతుని రూపాలమే. అందుచే భగవంతుని అనుగ్రహం పొందడానికి మనం మనని భగవంతునికి సమర్పించుకోవడం ఒకటే మార్గం. ఈ మాటలను విన్న గోపికలకు కనువిప్పు కల్గింది.

నీతి :మనకు ఏమి కావాలో భగవంతుడీకే మనకంటే బాగా తెలుసు. అందుచే మనల్ని మనం పూర్తి గా ఆయనకు సమర్పించు కుంటే మనకేది మంచిదో అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. భగవంతుని అనురహం పొందడానికి అది మాత్రమే ఏకైక మార్గము.

 

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

శ్రీ గర్గభాగవతము లోని వ్యోమాసురుని కథ

image.png

 

విలువ :ధర్మము

అంతర్గర్త విలువ :సత్ప్రవర్తన

ఒకరోజు నందనందనుడు గోపాలురతో కలిసి ఆడుచుండెను. కొందరు  గోవులుగా మరికొందఱు మేకలుగా కొందరు చోరులుగా మరియు కొందరు పసులకాపరులుగా విడివడి ఆడుచుండిరి. కంసప్రేరితుడైన వ్యోమాసురుడు చోరుల గుంపులో చేరి గోవులుగా మేకలుగా గోపాలురుగా నటిస్తున్న బాలులను ఎత్తుకొని పోయి ఒక బిలమున దాచి బిలద్వారము మూసివేసెను. పరమాత్మ అది గ్రహించి రక్కసుని రెండుకాళ్ళు పట్టుకొని గిరగిరా త్రిప్పి నేలపై విసిరిగొట్టెను. మృతుండైన వ్యోమాసురుని లోని తేజస్సు పరమాత్మలో లీనమయ్యెను.

వ్యోమాసురుని చరిత్ర

పూర్వం మహాపుణ్యక్షేత్రమగు భవ్య కాశీనగరమును భీమరథుడు అను రాజేంద్రుడు పరిపాలించెడివాడు. అతడు మేధావి దానశీలి ధర్మజ్ఞుడు పైగా శ్రీహరి భక్తుడు. రాజ్యభారమును యోగ్యుడైన కుమారునికి అప్పగించి రమేశుని పై అనురక్తుడై తపముకై మలయపర్వతమునకు ఏగెను. అక్కడ ఆశ్రమములో నివసించి తపమును సాగించుచుండెను.

ఒకనాడు బ్రహ్మమానస పుత్రుడు పరమపూజ్యుడు అయిన పులస్త్య మహర్షి శిష్యవర్గముతో భీమరథుని ఆశ్రమమునకు వచ్చెను. త్రిలోకపూజ్యుడైన పులస్త్యునకు రాజు నమస్కరించెనే కానీ యథావిధి అతిథి సత్కారము చేయలేదు. ధర్మము తప్పినందుకు మహర్షి “రాజా! ఇంటికి వచ్చిన వానిని సత్కరింపకుండుట అసురలక్షణము. కావున నీవు రాక్షసుడివి కమ్ము”! అని శపించెను. పశ్చాత్తాపముతో శరణువేడిన రాజును కరుణించి పులస్త్యుడు “నీ దుష్కర్మకు ఫలితమనుభవించక తప్పదు. కానీ నీవు అఖండ విష్ణుభక్తుడవగుటచే నీకు ద్వాపరయుగములో శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహము కలుగును. భగవంతుడు భక్తుల కెన్నడు అపజయము కలిగించడు కదా!” అని ఆశీర్వదించెను. ఆ భీమరథుడే వ్యోమాసురుడు.

నీతి :మనమెన్నడు ఇంటికి వచ్చిన అతిథిని సత్కరింపక ఉండరాదు. అభ్యాగతః స్వయం విష్ణుః అన్న సూక్తిని మరువరాదు.

 

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

వివేకం

imageవిలువ : సత్యం

అంతర్గత విలువ: తృప్తి

ఒక అడవిలో ఒక కోతికి అద్దం దొరికింది. అది ఆ అద్దాన్ని అడవిలో జంతువులన్నిటికీ చూపించింది.

ఎలుగుబంటి అందులో తన ప్రతిబింబం చూసుకుని, “అయ్యో, నేను ఇంత కురూపినా” అనుకుంది.

తోడేలు తన ప్రతిబింబం చూసుకుని నేను కూడా జింకలాగా ఉంటే బాగుండేది, అనుకుంది.

ఇలా అన్ని జంతువులు వాటి ప్రతిబింబాలు అద్దంలో చూసుకుని ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది అనుకున్నాయి.

చివరికి కోతి ఆ అద్దం ఒక వివేకవంతమైన గుడ్లగూబ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. ఆ గుడ్లగూబ, “వద్దు నాకు చూపించవద్దు. ఆ అద్దం చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి పడడం తప్ప దాని వల్ల వాళ్ళకు వచ్చిన జ్ఞానము లేదు, విచక్షణ లేదు. అలాంటి దాన్ని చూసి బాధపడడం అనవసరం” అని అంది.

కోతి ఒప్పుకుని ఆ అద్దాన్ని నదిలోకి విసిరేసింది.

నీతి: భగవంతుడు మనల్ని ఎలా సృష్టిస్తే అలాగే తృప్తిగా ఉండాలి. సృష్టిలో ప్రతిజీవిలోనూ ప్రత్యేకత ఉంటుంది మనలో ఉండే ప్రత్యేకతని గుర్తించి దాన్ని నిలబెట్టుకుంటూ మన విధులు నిర్వర్తిస్తూ సంతోషంగా జీవించడమే వివేకం.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

 

 

సాధన

image

విలువ: శాంతి
అంతర్గత విలువ: మౌనం

ఒక రైతు తన పొలం పనిలో ఉండగా అతని చేతికున్న వాచీ పోయింది.అది అతనికి చాల ఇష్టమైన వాచీ. దానికోసం పొలం అంతా వెతికి దొరకలేదని బాధపడుతున్నాడు. అక్కడే ఆడుకుంటున్న పిల్లల్ని పిలిచి వాచీ వెతికిపెట్టమని , అది దొరికిన వాళ్ళకి మంచి బహుమతి ఇస్తానని చెప్పాడు. అది విన్న పిల్లలందరూ ఉత్సాహంతో గెంతులు వేస్తూ పొలంలోకి పరుగుపెట్టారు. కాని ఎంత వెతికినా వాళ్ళెవరికి వాచీ దొరకలేదు.దానితో నిరాశపడిన రైతు , ఇంక అది దొరకదు అనుకున్నాడు.
ఇంతలో ఒక అబ్బాయి ముందుకు వచ్చి ఇంకొక్క అవకాశం ఇస్తే చివరిసారి ప్రయత్నిస్తాను అని అడిగాడు. ఆ అబ్బాయి నిజాయితీ చూసి ముచ్చటపడిన రైతు సరేనన్నాడు. కొంతసేపటికి ఆ అబ్బాయి వాచీ పట్టుకొచ్చి రైతుకి ఇచ్చాడు. ఆశ్చర్యపోయిన రైతు ఎలా దొరికింది అని అడిగాడు.ఆ అబ్బాయి నేను ఏమి ఆలోచించకుండా ఒకచోట కూర్చున్నాను. అలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వాచీలో సెకండ్ల ముల్లు టిక్ టిక్ మని తిరగడం వినిపించింది. ఆ శబ్దం వచ్చిన దిశగా వెళ్తే వాచీ కనిపించిది అని చెప్పాడు.

నీతి: మనస్సుఆలోచనలతో చంచలంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేము. ప్రశాంతంగా ఉంటే బుద్ధి చురుకుగా పనిచేస్తుంది.ప్రతి రోజు కొంచం సేపు నిశ్సబ్దంగా ఉండడం సాధన చేస్తే ప్రశాంతమైన జీవితం గడపడానికి సహాయపడుతుంది.

 

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

 

 

 

 

 

మానవత్వం

image

విలువ : ప్రేమ
అంతర్గత విలువ: దయ

ఒక గ్రామంలో రామన్న అనే రైతు ఉండేవాడు. అతను మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి. రామన్న భార్యాపిల్లలతో కలిసి ఒక చిన్న ఇంటిలో నివసిస్తూ తనకున్న కొద్దిపాటి పొలంలో పంటలు పండించి వాటిని అమ్ముకుని జీవనం సాగించేవాడు. గ్రామంలో ఎవరికి సమస్య వచ్చినా రామన్న తను చెయ్యగలిగిన సాయం చేసి ఆదుకునేవాడు. ఈ విధమైన మంచి ప్రవర్తన వల్ల అందరూ అతన్ని గౌరవించేవారు. అదే గ్రామంలో ఉన్న సూరన్న అనే రైతు రామన్న పట్ల అసూయతో ఉండేవాడు.అందరూ అతన్ని గౌరవించడం చూసి తట్టుకోలేకపోయేవాడు .సూరన్న సోమరి. ఎక్కువ కష్టపడేవాడు కాదు.అందువల్ల అతని పొలంలో దిగుబడి సరిగా వచ్చేది కాదు. రామన్న కష్టపడి సాగు చెయ్యడంవల్ల మంచి దిగుబడి సాధించేవాడు.
ఒక సంవత్సరం పంట కోసిన తరువాత రాత్రి ఎవరు లేని సమయం చూసి సూరన్న , రామన్న పంటకు నిప్పు అంటించాడు. రామన్న స్నేహితులు చూసి నీళ్ళు పోసి మంటలు ఆర్పేసారు.అయితే అప్పటికే సగం పంట కాలిపోయింది. రామన్న మంటలు ఎక్కడనుండి వచ్చాయో పరిశీలించి సూరన్న ఇదంతా చేసాడని గ్రహించాడు.
కాలిపోగా మిగిలిన పంటని మంచిధరకి అమ్ముకున్నాడు. జరిగిన నష్టానికి బాధపడ్డాడు కానీ ఎవరికీ చెప్పలేదు. ఒక రోజు రాత్రి ఏవో అరుపులు వినిపించి లేచి బయటకు వచ్చి చూసాడు.సూరన్న కొడుకు ఆరోగ్యం బాగోలేదు.ఊరి జనం అంతా సూరన్న ఇంటిదగ్గర చేరారు. ఊరి డాక్టరుకు కూడా ఆ అబ్బాయి పరిస్థితి అంతు చిక్కడం లేదు. రామన్న వెంటనే తన గుర్రాన్ని బండికి కట్టి పక్క ఊరెళ్ళి డాక్టరుని తీసుకువచ్చాడు.ఆయన వెంటనే అవసరమయిన మందులు ఇవ్వడంతో సూరన్న కొడుకు కోలుకున్నాడు.
మర్నాడు సూరన్న , రామన్న వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పి తనను క్షమించమని వేడుకున్నాడు.అతని పంటకు తనే నిప్పు పెట్టానని ఒప్పుకున్నాడు . రామన్న వెంటనే నాకు తెలుసు అన్నాడు. సూరన్న ఆశ్చర్యపోయి , నేను నీకు అన్యాయం చేసానని తెలిసి కూడా నిన్న రాత్రి నాకు ఎలా సాయం చేసావు అని అడిగాడు. దానికి రామన్న ఒక మనిషిగా నా ధర్మం నేను నిర్వర్తించాను అంతే అన్నాడు. ఈ సంఘటన తరవాత సూరన్న పూర్తిగా మారిపోయాడు. రామన్న లాగానే అందరికి సాయం చెయ్యడం మొదలుపెట్టాడు.ఎవరైనా ఈ మార్పుకి కారణం అడిగితే రామన్న మంచితనం , ప్రేమ నన్ను మనిషిని చేసాయి అని చెప్పసాగాడు.
నీతి: మన విధులు మనం సక్రమంగా నిర్వర్తిస్తూ తోటి వారికి సహాయపడడం మన ధర్మం. మనకి అపకారం చేసినవాళ్ళకి కూడా సహాయం చెయ్యాలంటే మంచి మనసు ఉండాలి. అలాంటి మంచిమనసు ఉన్న మనుషులలోనే మానవత్వం ఉంటుంది. మనుషులుగా పుట్టినందుకు మానవత్వంతో జీవిస్తేనే మన ఉనికికి అర్థం ఉంటుంది.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu