Archive | August 2016

పని -శ్రద్ధ

 

పని – శ్రద్ధ

విలువ — ధర్మం

అంతర్గత విలువ — సరైన ప్రవర్తన

 

image
ఒక పెద్ద వయసులో ఉన్న వడ్రంగి పదవీ విరమణ తీసుకుని భార్యా పిల్లలతో సమయం గడపాలి అనుకున్నాడు. యజమానికి తన నిర్ణయం తెలియజేశాడు.

యజమానికి మంచి అనుభవము గల పనివాడు వెళ్ళిపోతున్నాడు అని అనిపించింది. వడ్రంగిని ఆఖరి సారి తన కోసం ఒక ఇల్లు కట్టమని అడిగాడు.
వడ్రంగి ఒప్పుకున్నాడు, కాని పని మీద ఇదివరకు ఉన్నంత శ్రద్ధ లేదు. ఏదో ఒక విధంగా పని పూర్తి చేశాడు.
పని పూర్తి అవ్వగానే యజమాని ఇల్లు చూడడానికి వచ్చాడు.
ఇంటి తాళము వడ్రంగికి ఇచ్చి “ఇది నీ ఇల్లు. ఇన్నిరోజులు నా దగ్గర నమ్మకంగా పని చేసినందుకు ఇది నేను నీకు ఇచ్చే బహుమానం ” అన్నాడు.
యజమాని ఔదార్యానికి వడ్రంగి ఆశ్చర్యపొయాడు
పని పట్ల తన నిర్లక్ష్యానికి సిగ్గుపడ్డాడు. ముందే తెలిసి ఉంటే ఇల్లు చాలా శ్రద్ధగా కట్టుకునేవాడిని అని అనుకున్నాడు.

నీతి:

ఏ పని అయినా శ్రద్ధగా చేస్తే తృప్తిగా ఉంటుంది. మన జీవితాన్ని కూడా ఒడిదుడుకులు తట్టుకుంటూ ఓర్పుగా శ్రద్ధతో మలుచుకుంటే ఆనందంగా ఉండవచ్చు.

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

Advertisements

అద్భుతం

image

 

 

అద్భుతం.
విలువ — ప్రేమ

అంతర్గత విలువ — విశ్వాసం, పట్టుదల
ఒక ఎనిమిదేళ్ళ పాప, తన తలితండ్రులు తన తమ్ముడి గురించి మాట్లాడుకుంటుంటే విని తమ్ముడికి ఒంట్లో బాగోలేదు అని తెలుసుకుంది. హాస్పిటల్ ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఉన్న ఇల్లు కూడా ఖాళీ చేసి చిన్న ఇంటికి మారదాము అని అనుకుంటున్నారు

పిల్లవాడి ఆరోగ్యం బాగుపడాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి అని తల్లిదండ్రులు అనుకోవడం పాప విని, ఆ అద్భుతాన్ని ఎలాగయినా తెచ్చి తమ్ముడిని కాపాడాలి అనుకుంది.

ఒక మందుల కొట్టుకి వెళ్ళి మా తమ్ముడి పేరు ఆండ్రూ, వాడి తలలో ఏదో పెరుగుతోంది, అది తగ్గాలి అంటే అద్భుతం కావాలి అని మా నాన్నగారు అనడం విన్నాను అది మీ దగ్గర ఉందా అని అడిగింది. మా దగ్గర లేదు అని ఆ మందుల కొట్టు యజమాని సమాధానం చెప్పేడు.

పక్కనున్న వ్యక్తి అది విని,”పాపా నీ దగ్గర ఎంత డబ్బు ఉంది?”అని అడిగారు. దానికి ఆ పాప నా దగ్గర ఒక రూపాయి ఉంది, ఇంకా కావాలంటే తెస్తాను, మీరు నాకు అద్భుతం ఇవ్వగలరా అని అమాయకంగా అడిగింది.

అప్పుడు ఆ వ్యక్తి పాప చెయ్యి పట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు. పాప తల్లిదండ్రులని కలిసి ఆండ్రూ కి చికిత్స ప్రారంభించారు. కొద్ది రోజులలోనే ఆండ్రూ ఆరోగ్యం బాగుపడింది.

ఒకరోజు తల్లిదండ్రులిద్దరూ ” నిజంగానే అద్భుతం జరిగింది, చికిత్సకి ఎంత అయిందో కూడా తెలియదు, ఆండ్రూ ఆరోగ్యం బాగుపడింది” అని సంతోషపడడం పాప చూసింది.

వాళ్ళ దగ్గరకు వెళ్లి నాకు తెలుసు అద్భుతం ఖరీదు ఎంతో “ఒక రూపాయి”అంది. తల్లిదండ్రులిద్దరూ పాప అమాయకత్వానికి నవ్వుకున్నారు.

నీతి

ప్రేమ , విశ్వాసం మరియు పట్టుదల ఉంటే అద్భుతాలు జరుగుతాయి. పై కథలో పాపకి తన తమ్ముడి మీద ప్రేమ, ఎలాగయినా కష్టపడి తమ్ముడిని కాపాడుకోవాలనే పట్టుదల కనిపిస్తాయి.ప్రేమ,విశ్వాసం ఉన్నవాళ్ళకి భగవంతుడు దారి చూపిస్తాడు.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

పేదరికం

 

విలువ — శాంతి
అంతర్గత విలువ –తృప్తి / కృతజ్ఞతా భావం

Countryside landscape illustration with hay, field, village and windmill. Farml landscape icon set.

 

 

ఒక గొప్ప ధనవంతుడు అయిన తండ్రి, తన కొడుకుని తీసుకుని ఒక పల్లెటూరుకి వెళ్ళాడు . ఆ ప్రయాణంలో ముఖ్యంగా పేదవాళ్ళ జీవితం ఎంత కష్టంగా ఉంటుందో చూపించాలి అనుకున్నాడు.

ఇద్దరూ ఒక పంట పొలంలో రెండు రోజులు గడిపారు.
అక్కడనుండి తిరిగి వచ్చే సమయంలో తండ్రి ఈ రెండురోజులు పొలంలో గడపడం ఎలా ఉంది, ఏమి నేర్చుకున్నావు అని అడిగాడు .
కొడుకు చాలా బాగుంది అని చెప్తూ, ఇలా అన్నాడు” మనకి ఇంటి మధ్య ఒక చిన్న నీటి మడుగు ఉంది కాని వాళ్ళకి చాలా పెద్ద చెరువు ఉంది. మన దగ్గర ఖరీదు అయిన లాంతర్లు ఉన్నాయి, కాని వాళ్ళ దగ్గర ఆకాశంలో నక్షత్రాల వెలుగు ఉంది. మనం ఉంటున్న స్థలం చాలా చిన్నది, కాని వాళ్ళ పంట పొలం చాలా పెద్దది. మనకి పనివాళ్ళు ఉంటారు, కాని వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. మనం భోజనం కొనుక్కుంటాము, కాని వాళ్ళు, వాళ్ళకి కావలిసినవి స్వయంగా పండించుకుని వంట చేసుకుని తింటారు. మనం ఆస్తులు కాపాడుకోవడానికి గోడలు కట్టుకుంటాము. కాని వాళ్ళ మధ్య ఉండే ఆప్యాయత, అభిమనాలు మరియు మంచి స్నేహితులు వాళ్ళ ఆస్తులు.

Isometric farm scene. Village setting with buildings, tractor, combine, pickup, pond and mill. Vector illustration
కొడుకు మాటలకి తండ్రి చాలా ఆశ్చర్యపోయాడు
“మనం ఎంత పేదవాళ్ళమో చూపించారు, ధన్యవాదాలు” అన్నాడు కొడుకు.

నీతి:

మనం చాలా సార్లు మన దగ్గర ఏమి లేదో దానిమీదే ఎక్కువ దృష్టి పెడతాము. ఎప్పుడూ మనకి ఉన్న దాంతో తృప్తి పడాలి. కృతజ్ఞతా భావంతో ఉండటం నే ర్చుకోవాలి. తృప్తిగా జీవించగలిగిన వాళ్ళే నిజమైన ధనవంతులు.

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

విశ్వాసం

విశ్వాసం

విలువ : ప్రేమ
అంతర్గత విలువ: నమ్మకం

 

image.jpeg

 

ప్రసాద్ అనే వ్యక్తి విమానంలో ప్రయాణిస్తున్నాడు. కొంత సేపటి తరువాత వాతావరణం సరిగా లేనందున సీట్ బెల్ట్ పెట్టుకోమని హెచ్చరిక వినిపించింది.మరికొంత సమయం తరువాత ఆహరం సరఫరా చెయ్యడం కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని వాతావరణం ప్రతికూలంగా ఉండడం వల్ల సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రయాణీకులందరూ జాగ్రత్తగా కూర్చోవాలని మరో హెచ్చరిక వినిపించింది. తుఫాను వాతావరణం వల్ల ఆకాశంలో విమానం కంపించసాగింది.

ప్రసాద్ కి భయం వేసింది. తన భయాన్ని ఎవరితో అయినా పంచుకుందామని చూస్తే ప్రయాణీకులందరి పరిస్థితి అలాగే ఉంది. కొంతమంది ఆందోళన పడుతున్నారు మరికొందరు దైవాన్ని ప్రార్థిస్తున్నారు.
అయితే ఒక చిన్న పాప మాత్రం ప్రస్తుత పరిస్థితితో సంబంధం లేకుండా చాలా ప్రశాంతంగా కూర్చొని పుస్తకం చదువుకుంటోంది.కాసేపు కళ్ళు మూసుకుంటోంది, మళ్లీ పుస్తకం చదువుతోంది. ఆ పాప ప్రవర్తన ప్రసాద్ కి చాలా ఆశ్చర్యం కలిగించింది.పెద్దవాళ్ళందరూ భయపడుతుంటే ఈ పాప ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతోంది అనుకున్నాడు. విమానం సురక్షితంగా గమ్యస్థానం చేరుకుంది. ప్రయాణీకులందరూ దిగడానికి హడావిడి పడుతున్నారు. ప్రసాద్ కి ఆ పాపతో మాట్లాడాలి అనిపించింది.దగ్గరికి వెళ్లి ఆ పాపని అడిగాడు , ఇందాక విమానం కంపిస్తుంటే నీకు భయం వెయ్యలేదా ? అంత ప్రశాంతంగా ఎలా కూర్చున్నావు?

దానికి ఆ పాప అమాయకంగా ఇలా సమాధానం చెప్పింది” అంకుల్ మా నాన్నగారు ఈ విమానం నడిపే పైలట్. ఆయన నన్ను మా ఇంటికి తీసుకువెళ్తున్నారు.”

నీతి: మనకి మన మీద నమ్మకం ఉంటే ఎక్కడయినా ప్రశాంతంగా ఉండి మన పని మీద దృష్టి పెట్టగలుగుతాము. ఆత్మవిశ్వాసంతో పాటు భగవంతుడిపట్ల కృతజ్ఞత మరియు నమ్మకం జీవితంలో చాలా ముందుకి తీసుకువెళ్తాయి. పై కథలో పాప వాళ్ళ నాన్నగారి మీద నమ్మకంతో ప్రతికులపరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా , ధైర్యంగా ఉండగలిగింది. భగవంతుడు మనందరికీ తండ్రి. ఆయన మీద నమ్మకంతో మన కర్తవ్యం నిర్వహిస్తే జీవిత ప్రయాణంలో సురక్షితంగా గమ్యస్థానం చేరుస్తాడు.

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu