Archive | March 2018

ప్రేమంటే ఏమిటి

విలువ: ప్రేమ
ఉపవిలువ: నిస్వార్థ సేవ/బాధ్యత

 

473D39F4-30F3-40A3-9FC1-7F2C59963CDF

 

ఆ రోజు ఉదయం ఏమ్మాత్రం తీరిక లేనంత హడావిడిగా ఉంది. అటువంటి సమయంలో 80 సంవత్సరాలు ఉన్న వ్యక్తి తన బొటనవేలుకి కుట్లు విప్పించుకోవడం కోసం వచ్చాడు. అతనికి 9 గంటలకి ముఖ్యమైన పని ఉంది తొందరగా వెళ్ళాలి అని చెప్పాడు. ముఖ్యమైన పరీక్షలు చేయడం ముగించిన తరువాత అతనిని కూర్చోమని, ఎవరైనా వచ్చి అతనిని చూసి కుట్లు విప్పడానికి సుమారు గంట సమయం పట్టవచ్చునని చెప్పాను. అతను తన వాచీకేసి చూసుకోవడం గమనించి, నేను ఎలాగా మరొక రోగిని చూడాల్సిన పని లేకపోవడం వలన అతని కుట్లు నేనే విప్పుదామని నిశ్చయించుకున్నాను.
కుట్లు విప్పి చూస్తే గాయం నయమయింది. గాయానికి అవసరమైన డ్రెసింగ్ చేసాను.

కుట్లు విప్పుతున్నపుడు అతనితో కొంతసేపు మాట్లాడేను. మీకు ఎవరయినా డాక్టరుతో ముందస్తు అపాయింట్మెంట్ ఉందా అడిగేను. ఎందుకంటే అతను చాలా కంగారుగా వెళ్ళాలన్న ఆతృతతో ఉన్నాడు. అటువంటిది ఏమీ లేదని 9 గంటలకి నర్సింగ్ హోమ్ కి వెళ్లి తన భార్యకు అల్పాహారం తినిపించాలని చెప్పాడు. ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాను. కొంతకాలంగా ఆమె అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ నర్సింగ్ హోమ్ లో ఉన్నదని చెప్పాడు. ఒకవేళ మీరు వెళ్ళడం ఆలస్యమయితే ఆవిడ కంగారు పడతారా అని అడిగాను. తాను ఎవరో ఆవిడకి తెలియదని, గత ఐదేళ్లుగా ఆవిడ తనని గుర్తుపట్టడం లేదని చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మీరు ఎవరో ఆమెకు తెలియనప్పటికీ, గుర్తుపట్టనప్పటికీ రోజూ ఆమె దగ్గరికి వెళ్తున్నారా అని అడిగెను. ఆయన నవ్వుతూ, నా చేతిపైన తడుతూ ” ఆమెకు నేను ఎవరో తెలియదు, కానీ నాకు ఆమె ఎవరో తెలుసు కదా” అన్నాడు.

నీతి: స్వచ్చమైన ప్రేమలో ఎటువంటి వాంఛలు ఉండవు. అటువంటి వ్యక్తి మాత్రమే ప్రతిఫలమేదీ ఆశించకుండా ప్రేమిస్తాడు. ఇటువంటి పవిత్రమైన ప్రేమ ఉన్నవారు ఎటువంటి మెచ్చుకోలు, ప్రతిఫలం, కృతజ్ఞత, గుర్తింపు ఆశించరు. ఈ కథలో చెప్పిన ముసలాయన లాగా ప్రేమించి, సేవించగలవారు ధన్యజీవులు.

https://saibalsanskaar.wordpress.com/?s=What+Love+is+all+about&submit=Search

https://m.facebook.com/neetikathalu

 

నీవు వెతుకుతున్న దేవుడు నీలోనే ఉన్నాడు

విలువ: సత్యము

ఉపవిలువ: అంతరంగ పరిశీలన

C180DA61-5B52-4EAF-B460-899C2AF9E5A0

ఒకతనికి దేవుణ్ణి చూడాలన్న కోరిక కలిగింది. అతను ఎన్నోతీర్థయాత్రలు చేసాడు. ఎన్నో పురాణాలు, గ్రంధాలు చదివాడు. కానీ అవి ఏవీ అతనికి తృప్తి ఇవ్వలేదు. అతని కోరిక తీరలేదు. భగవంతుడిని వెతుకుతూ అతను ఒక చోటి నుండి మరొక చోటికి తన ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు.

ఒక చలికాలం సాయంత్రం వేళ అతను ఒక ముసలవ్వ పొయ్యిలో కర్రలు కదుపుతూ ఉండడం చూసాడు. అస్తమానూ ఆ బొగ్గులపైన బూడిద కప్పి వేస్తున్నది. ముసలవ్వ తన చేతిలోని చువ్వతో బొగ్గులను కదుపుతూ వాటిపైన బూడిదని రాల్చి వేస్తున్నది. ఆమె అలా చువ్వతో కట్టెలను కదుపుతూ, వాటిపైన బూడిదను నెట్టి వేస్తుండడం అతను శ్రద్ధగా గమనించాడు. ఆమె బూడిదని తీసినప్పుడల్లా మరింత ఎక్కువగా ఉండడం కూడా అతను చూస్తున్నాడు

మర్నాడు అతను ఒక చెట్టు కింద కూర్చుని అలసట తీర్చుకుంటూ బాగా ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడిని చూసాడు.” ఓ సూర్యుడా! నీవు ప్రపంచం అంతటినీ గమనిస్తూ ఉంటావు కదా. దేవుడు ఎక్కడ ఉంటాడో నీకు తప్పకుండా తెలిసే ఉంటుంది. దేవుడు ఎక్కడ దాక్కున్నాడు? అన్నిచోట్లా ఆయన కోసం వెతికాను కానీ నాకు ఎక్కడా కనిపించలేదు” అన్నాడు. ఇంతలో ఒక మేఘం అలా వస్తూ సూర్యుడిని కప్పివేసి కనబడకుండా చేసింది. కొంతసేపటి తరువాత మబ్బు దాటిపోయింది. సూర్యుడు మళ్ళీ మరింత కాంతివంతంగా, ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించాడు. ఆ మనిషి నిట్టూరుస్తూ ” ఎప్పటికైనా నేను దేవుడిని చూడగలనా?” అని అడిగాడు.

నాచుతో పూర్తిగా నిండి ఉన్న ఒక చెరువు పక్కనే అతను నడుస్తూ వెళ్తున్నాడు. కొంతమంది గ్రామస్థులు ఆ చెరువులోని నాచును తొలగించి చెరువును శుభ్రం చేసే పని చేస్తున్నారు. ” ఈ మురికి నాచును చెరువులో ఎవరు వేసారు?” అని ఆ వ్యక్తి గ్రామస్థులను అడిగాడు. “ఎవరూ వెయ్యలేదు. నీటిలో నుండే నాచు పుట్టి పెరుగుతుంది. ఎక్కువ కాలం నీరు ఒకచోట నిలవ ఉంటే ఆ నీటిలో ఆల్గే(నాచు) పెరుగుతుంది. ఇప్పుడు మేము ఆ నాచునంతా తొలగించి శుభ్రం చేస్తున్నాము కనుక త్వరలోనే చెరువు తేటగా, శుభ్రంగా తయారవుతుంది అన్నారు గ్రామస్తులు.

ఆ మనిషి ఇదంతా తలుచుకుని ఆలోచించసాగాడు.నాచు నీటిలో నుండే వచ్చింది కాని అది ఎంత దట్టంగా పెరిగి నీటిని కప్పివేసిందంటే అదంతా తొలగిస్తేగాని నీరు శుభ్రపడి పైకి కనిపించలేదు. అలాగే సూర్యుని వేడి వలన ఏర్పడే మేఘాలు ఆ సూర్యుడినే కప్పివేసి సూర్యప్రకాశాన్ని బయటకు కనిపించకుండా చేస్తున్నాయి. గట్టిగా గాలి వీచి మేఘాలు చెదిరిపోయినప్పుడు మళ్ళీ సూర్యుడు మనకి కనిపిస్తున్నాడు.

అదే విధంగా నిప్పు నుండే బూడిద ఏర్పడుతున్నది. కాని ఆ బూడిద నిప్పును కప్పివేసి ఇంచుమించు ఆరిపోయేలా చేస్తున్నది. బూడిదను తొలగించినప్పుడు మళ్ళీ నిప్పు రాజుకుని మంట కనిపిస్తున్నది. పైన చెప్పిన ప్రతి ఉదాహరణలోనూ నీరు,నిప్పు,సూర్యుడు ఇంతకు ముందే ఉన్నాయి. కొత్తగా ఏర్పడలేదు, కాని అవి కనబడాలంటే మనం కూడా కొంత ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది.

స్పష్టంగా చూడడానికి అతను ప్రయత్నం చేసినప్పుడు అతనికి సత్యం బోధపడింది. వయసు మళ్ళిన అతని కళ్ళకు శుక్లాలు కంటిలో నుండే ఏర్పడ్డాయి. ఆ శుక్లాలు ఎవరో బయట నుండి పెట్టలేదు.

నీతి : మనిషి దేవుడు నుండే పుట్టాడు. ప్రపంచమనే దుప్పటిని కప్పుకోవడం వలన మనిషి తాను ఎక్కడ నుండి వచ్చాడో మరచిపోతున్నాడు. ప్రపంచం అనే దుప్పటిని పక్కకి తొలగించి హృదయంలోకి తొంగి చూస్తే భగవంతుడిని చూడగలుగుతాము.

 

https://saibalsanskaar.wordpress.com/2014/06/19/where-does-god-live/

https://m.facebook.com/neetikathalu

 

భగవంతుడి పాదాలచెంత సర్వస్యశరణాగతి చేయుట

EBC7221D-0C78-4B45-BB91-78DE0B4F1DA5

 

విలువ: ప్రేమ

ఉపవిలువ: విశ్వాసము, భక్తి

ఒకానొకప్పుడు ఒక చెరువులో చాలా చేపలు ఉండేవి. ప్రతిరోజూ ఆ చేపలు జాలరి వలను తలుచుకుని భయంతో నిద్రలేచేవి. క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఉదయం చేపలు పట్టడానికి జాలరి వల వేసేవాడు. ప్రతి ఉదయం చాలా చేపలు వలలో చిక్కుకునేవి. ఆశ్చర్యంతో కొన్ని, నిద్రపోతూ కొన్ని,తప్పించుకోవడం చేతకాక కొన్ని చేపలు జాలరి వలలో చిక్కుతూ ఉండేవి. అపాయం గురించి తెలిసినప్పటికీ మృత్యురూపమైన ఆ వల బారినుండి అవి తప్పించుకోలేకపోయేవి.

ఆ చేపలలో ఒక చిన్నచేప ఎప్పుడూ ఆనందంగా, ఉల్లాసంగా ఆడుతూ ఉండేది. ఆ చేపకి జాలరి వాని వల అంటే భయం ఉండేది కాదు. దానికి జీవించడం ఎలాగో బాగా తెలిసినట్లుగా కనిపిస్తూ, ఉత్సాహంగా జీవిస్తూ ఉండేది. పెద్ద చేపలన్నీ చిన్న చేప రహస్యం ఏమిటా అని ఆశ్చర్యపడుతూ ఉండేవి. పెద్ద చేపలన్నింటి అనుభవం, తెలివి కలిపి ఆలోచించినా అవి తమను తాము వల నుండి కాపాడుకోలేకపోతున్నాయి. మరి ఈ చిన్నచేప ఎలా తనని తాను కాపాడుకుంటున్నదని వాటికి చాలా ఆశ్చర్యంగా ఉండేది.

తమ కుతూహలాన్ని, వల నుండి ఎలా తప్పించుకోవాలన్న రహస్యం తెలుసుకోవాలన్న ఆతృతను ఆపుకోలేక ఒకరోజు సాయంకాలం చేపలన్నీ చిన్నచేప దగ్గరికి వెళ్ళాయి. ” ఓ చిన్ని చేపా! మేమంతా నీతో మాట్లాడడం కోసం వచ్చాము” అన్నాయి.

“నాతోనా? దేనిగురించి మీరందరూ నాతో మాట్లాడాలని అనుకుంటున్నారు?” అని అడిగింది చిన్నచేప.

రేపు పొద్దున్న జాలరివాడు వల వేసుకుని వస్తాడు కదా! వాడి వలలో పడతానేమోనని నీకు భయంగా లేదా? అని అడిగాయి.

చిన్నచేప నవ్వుతూ ” లేదు! నేను ఎప్పటికీ వాడి వలలో చిక్కను” అంది.

“చిన్నచేపా! నీ ఆత్మవిశ్వాసానికి, విజయానికి వెనుక రహస్యం ఏమిటో మాకు కూడా కొంచెం చెప్పవా? అని అడిగాయి పెద్దచేపలు.

చాలా సులభం. జాలరి వల విసరడానికి రాగానే నేను పరుగున వెళ్ళి అతని పాదాల దగ్గర ఉంటాను. జాలరి వల వెయ్యాలన్నా ఆ చోటులో వెయ్యలేడు. అందువల్ల నేను ఎప్పటికీ వలలో చిక్కను అని చెప్పింది చిన్నచేప.

చిన్నచేప తెలివితేటలను చూసి పెద్దచేపలన్నీ ఆశ్చర్యపడ్డాయి.

నీతి: మీ గురువు లేదా భగవంతునియందు పరిపూర్ణవిశ్వాసంకలిగిఉండాలి. భగవంతుడినే మన యజమానిగా భావించాలి. భగవంతునియందు విశ్వాసం
నమ్మకం కలిగిఉండాలి.మనం ఏమి చేసినా శక్తివంచన లేకుండా చేసి భారం భగవంతుని మీద వెయ్యాలి. ఆయననే నమ్ముకుని విడువకుండా ఉండాలి. అప్పుడు భగవంతుడు మన బాధ్యతను తాను తీసుకుని మనకి ఏది మంచో అది చేస్తాడు. అప్పుడే మనం కలతలను,కల్లోలాలను ఎదుర్కొని కష్టాల బారినుండి కాపాడతాము.

ఎవరు గొప్పదాత

విలువ: సత్ప్రవర్తన
ఉపవిలువ: దాతృత్వము

 

FE1B4518-7964-4A97-BCEF-166D3D5CD1B5

ఒక రోజున కృష్ణుడు, అర్జునుడు ఒక గ్రామం వైపు నడుచుకుంటూ వెళుతున్నారు. దానగుణంలో తనని కాకుండా కర్ణుడినే ఎందుకు ఆదర్శంగా చెబుతారో చెప్పమని అర్జునుడు, కృష్ణుడిని పదే పదే అడగసాగాడు. కృష్ణుడు, అర్జునుడికి పాఠం నేర్పాలని అనుకున్నాడు. కృష్ణుడు తన చేతి వేళ్ళను వేగంగా కదపగానే వాళ్ళు నడుస్తున్న త్రోవ పక్కన గల రెండుకొండలు బంగారుకొండలుగా మారిపోయాయి. “అర్జునా; ఈ రెండు కొండల బంగారం మొత్తం చివరి ముక్క వరకు ఈ గ్రామస్తులకు పంచిపెట్టు అని చెప్పాడు కృష్ణుడు. అర్జునుడు గ్రామంలోనికి వెళ్ళి గ్రామస్థులందరికీ బంగారం పంచిపెడతాననీ, అందరినీ కొండవద్దకు రమ్మనీ చెప్పాడు. గ్రామస్థులందరూ తనని పొగుడుతుండగా, గర్వంతో ఉప్పొంగిన ఛాతీతో అర్జునుడు కొండ వద్దకు వెళ్ళాడు. రెండు పగళ్ళు,రెండు రాత్రులు కష్టపడి కొండను త్రవ్వి గ్రామస్థులందరికీ బంగారాన్ని పంచి ఇచ్చాడు. కాని కొండలు కొంచెం కూడా తగ్గలేదు. చాలామంది గ్రామస్థులు నిమిషాల్లో తిరిగివచ్చి, మళ్ళీ బంగారం కోసం వరుసలలో నిలబడ్డారు.

27023FD5-AB45-46D1-8B01-5A4CBB94414E

కొద్దిసేపటికి బాగా అలసిపోయిన అర్జునుడు కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే తప్ప ఇంకా బంగారం పంచలేనని చెప్పాడు. కాని అతనిలోని అహంభావం ఏ మాత్రం తగ్గలేదు. కృష్ణుడు, కర్ణుని పిలిపించాడు.”కర్ణా! ఈ కొండలలోని మొత్తం బంగారాన్ని పంచిపెట్టాలి” అని అతనికి చెప్పాడు. కర్ణుడు ఇద్దరు గ్రామస్థులను పిలిచాడు. వాళ్ళతో కర్ణుడు” మీకు ఈ బంగారు కొండలు కనిపిస్తున్నాయా! ఆ రెండు కొండల బంగారం మొత్తం మీదే.అవి తీసుకుని మీరు ఏమి చెయ్యాలనుకుంటే అది చెయ్యండి” అని చెప్పాడు. అలా చెప్పి కర్ణుడు వెళ్ళిపోయాడు. అర్జునుడు నోటమాటరాకుండా కూలబడిపోయాడు. ఈ ఆలోచన తనకి ఎందుకు కలగలేదు అని ఆశ్చర్యపడ్డాడు. కృష్ణుడు చిలిపిగా నవ్వుతూ, అర్జునునితో “అర్జునా! తెలియకుండానే నీవు బంగారం పట్ల ఆకర్షితుడవైనావు. నువ్వు ఏదో చాలా దయతో దానం చేస్తున్నట్లుగా భావిస్తూ, బాధపడుతూనే గ్రామస్థులకు బంగారం దానం చేసావు. అందువల్ల నీ ఊహకి తోచినట్లుగా గ్రామస్థులకు బంగారం దానం చేసావు. కర్ణుడికి అటువంటి ఆలోచనలు ఏమీ లేవు. అంత బంగారాన్ని అలా దానం చేసేసి అతను ఎంత నిర్వికారంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడో చూడు. ప్రజలు తనను పొగడాలని, కీర్తించాలని అతను ఆశించలేదు. అతని వెనుక ప్రజలు అతని గురించి మంచి మాట్లాడినా, చెడుగా చెప్పుకున్నా అతనికి బాధ లేదు, సంతోషం లేదు. జ్ఞాన మార్గంలో ఉన్నందుకు గుర్తు అది” అని చెప్పాడు.

నీతి: ఎటువంటి పరిమితులు, షరతులు లేకుండా ప్రేమించడమే అసలైన ప్రేమ. అదే అసలైన దానం. మనిషి ఎప్పుడూ మంచిపనులే చెయ్యాలి. ఎందుకంటే అది మనిషికి నేర్పబడిన విలువ. మనిషిగా పుట్టినందుకు ఉండవలసిన లక్షణం అది. అంతేకాని పేరు కోసం, ఇతరుల పొగడ్తల కోసం ఏమీ చెయ్యకూడదు. ఏది చేసినా నిస్వార్ధంగా, గుర్తింపు ఆశించకుండా చెయ్యాలి.

https://saibalsanskaar.wordpress.com/2014/11/18/who-is-more-generous/

https://m.facebook.com/neetikathalu