Archive | January 2019

గణపతి మరియు కార్తికేయుని కథ

విలువ: ధర్మం
ఉప విలువ : గౌరవము

 

ఒక రోజు శ్రీ గణపతి మరియు వారి తమ్ముడు కార్తియులవారు ఆడుకుంటున్నారు . అప్పుడు వారికి దేవతలు ఒక ఫలమును ప్రసాదించారు. చిన్నతనం వల్ల వారు పండు పంచుకోటానికి సిద్ధంగా లేరు. అప్పుడు వారి తలిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు ,వారిలో ఎవరైతే ఈ విశ్వాన్ని మూడు సార్లు చుట్టి వస్తారో వారు ఈ ప్రత్యేక ఫలము వల్ల కలిగే లాభములను పొందుతారు అని నిర్ణయించారు. అ లాభములేమిటి అంటే ‘అమరత్వము, మరియు ‘బ్రహ్మ జ్ఞానము’. పందెము గురించి వినగానే కార్తికేయులవారు, ఫలమును గెలవటం కోసం ఈ విశ్వాన్ని పరిక్రమించటానికి వారి వాహనమైన నెమలి మీద ఉత్సాహంగా బయలుదేరారు. కాని , గణపతి , వారి శరీర పరిస్థితి వల్ల,మరియు నెమలి వలె రెక్కలు లేని ఎలుక వాహనముగా ఉండటం వల్ల చింతూస్తూ ఉండిపోయారు.

shiva-parvati
తరువాత తన బుద్ధికుశలతతో గణపతి ఒక నిర్ణయం తీసుకున్నారు. తమ తల్లిదండ్రుల అనుమతి తీసుకుని , వారిని విశ్వముగా భావిస్తూ వారి చుట్టూ మూడు సార్లు తిరిగారు. ఈ విధంగా గణపతి పందెమును తెలివిగా గెలిచి పండును దక్కించుకున్నారు.

నీతి:
బుద్ధిని సరైన సమయములో సరైనచోట ఉపయోగించి విజయాన్ని సాధించవచ్చు. తలిదండ్రులని ఎప్పుడూ గౌరవించాలి. మన జీవితంలో వారికంటే ప్రత్యేకమైనవారు ఎవ్వరూ ఉండరు.

http://www.momjunction.com/articles/lord-ganesha-stories-kids_00101242/

Advertisements

మంచి నాలుక-చెడు నాలుక

మంచి నాలుక-చెడు నాలుక

విలువ :అహింస
ఉప విలువ: మిత భాషణ

అనగనగా ఒక రాజు తన ప్రజలని సంతోషపెట్టే విషయముల గురించి తెలుసుకుందామని అనుకున్నాడు. అందుకోసమని ఒక ప్రదర్శనని ఏర్పాటు చేసి ,తమ రాజ్యంలోని తెలివైన వారిని ఆహ్వానించాడు. వారిని ఆ ప్రదర్శనకి ప్రజలని సంతోషపెట్టే వస్తువులని తీసుకురమ్మని ఆదేశించాడు. తాను స్వయంగా ప్రదర్శనని చూద్దామని వెళ్ళాడు.

అక్కడ ఎన్నో కనువిందు కలిగించే పూలు,పండ్లు ,మొక్కలు,మిఠాయిలు,బట్టలు,సంగీత వాయిద్యములు,బంగారు నగలు,చిత్ర కళలు ఇలా ఎన్నో వస్తువులను చూశాడు. కానీ ఇవేవి ప్రజలకి ఆనందం కలిగిస్తాయని రాజుగారికి అనిపించలేదు. చివరకి అక్కడ బంక మట్టి తో చేయబడ్డ ఒక రంగుల శిల్పం ఆయన కంట బడింది.అది ఎంతో ఆకలితో , నాలుకబయిటకి తెరుచుకుని ఉన్న ఒక ముసలి మనిషి శిల్పం . శిల్పం కింద “మంచి నాలుక” అని రెండు పదాలు చెక్కడబడి ఉన్నాయి.

రాజు గారు ,శిల్పిని పిలిపించి ,శిల్పాన్ని ఎందుకలా వింతగా చెక్కావని అడిగారు . దానికి జవాబుగా ఆ శిల్పి,”రాజా ,ఈ ప్రదర్శనలో ఉన్న ఇతర వస్తువుల వల్ల కలిగే సంతోషము తాత్కాలిక మైనది. కాని, దయ మరియు ప్రేమపూరితమైన మాటలు పలికే ఒక మంచి నాలుక ,మనని ఎన్నో ఏళ్ల వరకు ఆనందంగా ఉంచగలదు . మంచి నాలుక మాట్లేడే మాటలు బాధలో ఉన్న వారిలో ఆశ,మరియు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. నిర్బలులలో ధైర్యాన్ని,.ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అనాధులకి ప్రేమ ,జాలి అందిస్తాయి.కనుక ఒక మంచి నాలుక మటుకే అందరినీ అన్నివేళలా ఆనందంగా ఉంచగలదు”, అన్నాడు. శిల్పి ఆలోచనా విధానాన్ని ప్రశంసిస్తూ రాజుగారు అతనికి ఒక కుండ నిండా బంగారు నాణాలను బహూకరించారు.

మరి కొన్ని రోజులు గడిచాక రాజుగారు మనుషులని బాధపెట్టే విషయములేమిటి అని తెలుసుకుందామని మరొక సారి ఒక ప్రదర్శనని ఏర్పాటు చేయమని ఆదేశించారు. మళ్ళీ రాజ్యంలోని మేధావులని పిలిపించి ఆ ప్రదర్శనలో మనుషులకి బాధను కలిగించి, వారి జీవితాన్ని విషాదంలో ముంచెత్తే వస్తువులని ప్రదర్శించమని కోరారు.

రాజుగారి ఆదేశానుసారం మేధావులు ప్రదర్శనలో కత్తులు,ఖడ్గములు ,కొరడాలు,మధ్యపానము, విషము ,మొరిగేకుక్కలు ఇలా మనుషులకి ఇబ్బందిని , కీడుని కలిగించే వస్తువులని ఉంచారు. కాని ,ఏ వస్తువులు కూడా రాజుగారిని సమాధానపరచలేదు. చివరికి ఆయనకి ఇదివరకు లాగానే బంకమట్టితో చేయబడ్డ ఒక మనిషి విగ్రహం కనిపించింది. ఈ సారి అది కోపంతో మండుతున్న ఎర్రటి కళ్ళు మరియు నల్లటి నాలుక ఉన్న ఒక విగ్రహము. అతను , ఆకలితో బాధపడుతున్న ఒక పేదమనిషిని తిట్టిపోస్తున్నాడు. దాని కింద “చెడు నాలుక” అని రెండు పదాలు చెక్కబడి ఉన్నాయి.

శిల్పిని పిలిచి రాజుగారు ,అటువంటి శిల్పాన్ని ఈ ప్రదర్శనలో ఉంచడం వెనుక కారణమును వివరించమని అడిగారు. దానికి జవాబుగా శిల్పి,”రాజా! ఒక చెడు నాలుక, మనుషుల ఆనందాన్ని ఆశని,ఉత్సాహాన్ని,ధైర్యాన్ని నశింపచేసి వారిని విషాదంలో ముంచేస్తుంది.

చెడునాలుక మనిషుల హృదయాన్ని ఎంత గాయపరుస్తుందంటే ,కొన్నేళ్ల తరవాత కూడా ఆ గాయం మానటం చాలా కష్టము. అందుకే చెడు నాలుక మనిషికి అన్నిటికంటే బద్ధ శత్రువు.
రాజుగారు శిల్పి సమాధానాన్ని మెచ్చుకుని అతని ఆలోచనని ప్రశంసిస్తూ అతనికి కుండనిండా బంగారు నాణాలు,వజ్రములు బహూకరించారు. అంతే కాకుండా శిల్పి చెక్కిన ఈ విగ్రహములు తనకి ఎంతో విలువైన పాఠములు నేర్పాయని మెచ్చుకున్నారు.

నీతి :
చెడు తలంపులు, మాటలతో ఇతరులకి బాధ కలిగించడం వారిని హింసించడమే అవుతుంది.అటువంటి మాటల వలన కలిగే గాయములు ఒక పట్టాన మానవు.
కానీ,ప్రేమతో తీయగా మాట్లాడే మాటలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అందుకే ఇతరులని ఎల్లప్పుడూ ఒప్పించలేకపోయినా,వారిని నొప్పించే విధంగా మాట్లాడకూడదు. దయగల హృదయంతో మధురంగా మాట్లాడటం నేర్చుకోవాలి.
మూలము:
శ్రీ సత్య సాయి బాలవికాస్ -గ్రూపు 2 పాఠ్య పుస్తకము
https://saibalsanskaar.wordpress.com/2015/09/04/good-tongue-bad-tongue/

సంక్రాంతి శుభాకాంక్షలు

సంబరాల సంక్రాంతి వచ్చేసింది. రంగురంగుల ముగ్గులు, ముద్దుల గొబ్బెమ్మలు, వినసొంపైన హరిదాసు కథలు, గంగిరెద్దుల గలగలలు, చిన్నారులు మెచ్చే భోగిపళ్లు, పెద్దలు వేసే భోగి మంటలు, కమ్మని బొబ్బర్లు, పిల్లల కేరింతలతో.. సకల శుభాలతో సంక్రాంతి వచ్చేసింది. రకరకాల సంప్రదాయాలు, సంబరాలతో సంక్రాంతి సందడి పల్లె వాతావరణానికి అద్దం పడుతుంది.

పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది జనవరిలో వస్తుంది. మకర సంక్రాంతి రోజు సూర్యుడు ఉత్తరాయణంలోకి అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతాయి. హిందువులు పెద్ద పండుగగా భావించే సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చేదే భోగి.

తెలుగువాళ్లకు సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. ముందు రోజు వచ్చే భోగికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. భోగి అంటేనే అందరికీ గుర్తొచ్చేది భోగి మంటలు, భోగి పళ్లు. పిల్లలు ఎంతో సరదాగా గడిపే ముచ్చట భోగిపళ్ల పేరంటం. భోగి రోజు రేగుపళ్లు కాస్త భోగిపళ్లు మారిపోతాయి. అసలు భోగిపళ్లు ఎందుకు పోస్తారు ? రేగుపళ్లనే భోగిపళ్లు ఎందుకు పిలుస్తారు ? రేగుపళ్లనే ఎందుకు ఎంచుకున్నారు ?

రేగుపళ్లను ఇండియన్ డేట్, ఇండియన్ జుజుబీ అని పిలుస్తారు. రేగుపళ్ల ప్రస్తావన పురాణాలలో ఉంది. నారాయణులు బదరీ వృక్షంగా పిలువబడే రేగు చెట్టు దగ్గరే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారని.. అందుకే ఆ ప్రాంతానికి బదరీక్షేత్రం అని పేరు వచ్చిందని ప్రతీతి. భారతీయ వాతావరణంలో.. ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని రేగుచెట్టు పెరుగుతుందట. అలాగే సంక్రాతి సమయానికి రేగుపళ్లు అందుబాటులోకి వస్తాయి. పులుపు, తీపి రుచి కలిగిన ఇవి.. అమోఘమైన రుచినే కాదు.. ఆరోగ్యానికి మంచిదే. అందుకే పిల్లల తలపై భోగిపళ్లు పోసే సంప్రదాయానికి రేగుపళ్లనే ఎంచుకున్నారు.

ఐదేళ్లలోపు పిల్లలకి భోగి పండుగ రోజు భోగిపళ్లు పోస్తారు. వీటినే ఎందుకు పోస్తారు అంటే.. ఐదేళ్లలోపు పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే ఊపిరితిత్తులూ, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటాయి. కాబట్టి రేగుపళ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే రకరకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. కాబట్టి రేగుపళ్లు వాళ్లపై పోయడం వల్ల.. వాటికి ఎట్రాక్ట్ అయి తినడానికి ఇష్టపడతారు. అందుకే రేగుపళ్లు.. భోగినాటికి భోగిపళ్లుగా మారిపోతాయి.
రేగుపళ్లతో పాటు, డబ్బులు, బంతిపూల రెక్కలు, చెరకు ముక్కలు వాడతారు. బంతిపూల రెక్కలు వాడటం వెనకు కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. బంతిపూలకు క్రిములను నాశనం చేసే శక్తి ఉంది. అలాగే చర్మ సమస్యలతో పోరాడుతుంది. కాబట్టి వీటికి కూడా ప్రాధాన్యత ఇస్తారు.

అసూయ పతనానికి హేతువు

విలువ : ధర్మం
ఉప విలువ : నిస్స్వార్ధ సేవ

 

pumpkin

అనగనగా ఒక ఊరిలో మాధవ ,కేశవ అని ఇద్దరు రైతులుండేవారు. మాధవ తెలివైన వాడు ,కష్ట జీవి కూడా. ఎప్పుడూ తృప్తిగా ,ఆనందంగా ఉండేవాడు. కాని ,కేశవ బద్ధకిష్టుడు . ఎప్పుడూ విచారిస్తూ బాధగా ఉండే వాడు. కేశవ మాధవుడిని చూసి ఎప్పుడూ అసూయ పడుతూ ఉండేవాడు. అతనిని విసికించటమే కాకుండా , భగవంతుడిని అతను పతనం కావాలని ప్రార్ధించే వాడు.

కాని ,మాధవ ఊరిలో ఉన్నవారందరి బాగు కోరుకునే వాడు . అందువల్ల భగవంతుడి అనుగ్రహమును దండిగా పొందగలిగాడు. ఎన్నో ఏళ్ళు కష్టపడి అతను చక్కటి “గుమ్మడికాయల” పంటను పండించాడు. ఆ గుమ్మడికాయలు ఇంద్రధనస్సులోని రంగులతో చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి. మల్లెపూల వాసన వెదజల్లుతూ ,తేనె వలె ఎంతో తియ్యగా ఉన్నాయి. అంతేకాకుండా అవి నాలుగు , కాళ్ళు,తొండము మరియు తోకతో ,చూడటానికి వింతగా, ఏనుగులా ఉన్నాయి.

elephants-9a

ప్రత్యేకంగా ఉన్న ఈ గుమ్మడికాయను మాధవ,రాజుగారికి బహుమానంగా ఇద్దాముకున్నాడు. రాజధానికి వెళ్ళి రాజుగారికి ఈ గుమ్మడికాయను ఎంతో వినయంతో సమర్పించాడు . రాజుగారు మాధవ తనకు ఇచ్చిన బహుమానాన్ని మెచ్చి అతనికి నిజంగానే ఒక ఏనుగును బహూకరించారు.
ఇది విన్న కేశవ చాలా అసూయ పడ్డాడు. అతనికి ఆ రాత్రంతా అస్సలు నిద్ర పట్టలేదు. తాను కూడా రాజుగారి నుండి ఇంకా ఎంతో విలువైన బహుమతిని పొందాలనుకున్నాడు. రాజు గారికి ఉత్తి గుమ్మడికాయ ఏనుగుని ఇచ్చి మాధవ నిజమైన ఏనుగుని పొందినప్పుడు… నిజమైన ఏనుగుని రాజుగారికి బహుమానంగా ఇచ్చి ఏకంగా ఒకటో రెండో ఊళ్ళని రాజుగారి నుండి బహుమానంగా పొంది గొప్పజమీందారు అయిపోదామనుకున్నాడు,కేశవ.

ఆ మరునాడే తన పొలాన్ని,ఆవుల్ని,గొర్రెలని ,మేకలని అమ్మేశాడు. దానివల్ల వచ్చిన డబ్బుతో ఒక పెద్ద ఏనుగును కొని రాజుగారి వద్దకి తీసుకుని వెళ్ళాడు. ఒక సాధారణమైన రైతు అంత ఖరీదైన బహుమానాన్ని ఇవ్వటం ,రాజుగారిని ఆశ్చర్యపరిచింది. అతనిపై అనుమానం కలిగిన రాజుగారు తన మంత్రిని అసలు విషయమేంటో కనుక్కుని అతనికి తగిన బహుమతిని ఇచ్చి పంపమని ఆదేశించారు. కేశవతో కొంత సేపు ముచ్చటించగానే ,అతనికి మాధవ పట్ల ఉన్న అసూయే దీనంతటికి కారణమని గ్రహించాడు మంత్రి.”మహారాజా ! మీరు నిన్న ఒక గుమ్మడికాయకి బదులుగా ఆ రైతుకి ఒక ఏనుగుని బహూకరించారు కదా ,అదే విధంగా ఈ రైతుకి కూడా అతను మీకిచ్చిన ఏనుగుకి బదులుగా మంచి గుమ్మడికాయను బహూకరించండి”, అని చక్కటి సలహాను ఇచ్చాడు,తెలివైన ఆ మంత్రి.

ఈ విధంగా అసూయ కారణంగా తన ఆస్తంతా కూలిపోయిన కేశవ బాధతో కుమిలిపోయాడు

నీతి:“అసూయ “అనబడే దుర్గుణము పతనానికి దారి తీస్తుంది. కాని, నిస్స్వార్దంతో చేసే ఏ పనైనా గుర్తింపును పొందుతుంది.
మూలము: బాలవికాస్ గ్రూప్ 2-గ్రంథము