Archive | November 2016

ఒక పేద బ్రాహ్మణుడు!

ఒక పేద బ్రాహ్మణుడు!

విలువ :ధర్మం
ఉపవిలువ : దయ

img_0890
ఒకసారి కృష్ణార్జునులు కలిసి ద్వారకా నగర వీదుల్లో వెళుతున్నారు. వారికి దారి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జనుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచీ నిండుగా బంగారు నాణాలు ఇచ్చాడు.

సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు .మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు.

మళ్లీ ఓరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జనుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న పాత కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు.

తెల్లారింది…… చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరుగెట్టుకుంటూ నదీతీరం వద్దకు వెళ్లాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు.

కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.

మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని. ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్నాడు – అన్నాడు అర్జనుడు శ్రీ కృష్ణుడితో.

లేదు అర్జునా……. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణాలు పెట్టాడు శ్రీకృష్ణుడు.

ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ రెండు నాణాలేమైనా తలరాతను మారుస్తాయా నా పిచ్చికానీ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు.

దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు.
అతని హృదయం ద్రవించింది.

కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణాలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలూ ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు.

అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండీ అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది. ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుకున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు.

నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై “దొరికింది…దొరికింది నా చేతికి చిక్కింది” అని గావుకేకలు పెట్టాడు.

అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారుపడ్డాడు. “గతంలో అతన్ని దారిదోపిడి చేసి బంగారు నాణాలు సంచి దొంగలించాను, నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు”అనుకుని వణికిపోయాడు.

ఆ బ్రాహ్మడు దగ్గరకి వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణాలను నువ్వు తీసేసుకో నన్ను రక్షకభటులకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు.

ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది. తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులూ తమకు చేరాయి. పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలుచెప్పాడు.

img_0889

కృష్ణా…….., నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని
దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన రెండు నాణాలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు.

“అర్జునా………., అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు.

అదే రెండు నాణాలు ఉన్నప్పుడు మరో జీవి మంచిచెడులు, ఈతిబాధలు, కష్టసుఖాలు గురించి ఆలోచించాడు.

నిజానికి అది దేవుడి చేయాల్సిన పని. అందులో తానుకూడా పాలు పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను” అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ.

నీతి: స్వార్థ రహితంగా ఇతరుల మేలును కోరే వారి మంచి చెదులన్నింటినీ ఆ భగవంతుడే దగ్గరుండి చూసుకుంటాడు.

Advertisements

ఇద్దరు అబ్బాయిలు

 

ఇద్దరబ్బాయిలు.

విలువ:ఆత్మ విశ్వాసం

ఉప విలువ: ధైర్యం,ప్రోత్సాహం

img_0872

ఒకడు పదేళ్ల వాడు. ఇంకొకడు ఆరేళ్ల వాడు.
ఊరి బయట పొలం దగ్గర పరుగులు పెట్టి అడుకుంటున్నారు.
చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు. పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు.
ముందు పెద్ద బావి ఉంది. పెద్దోడు చూసుకోలేదు.
అందులో పడిపోయాడు. వాడికి ఈత రాదు. బావి చాలా లోతు.
చుట్టుపక్కల ఎవరూ లేదు. అరిచినా సాయానికి వచ్చేందుకు నరప్రాణి లేదు.
చిన్నోడికి ఒక తాడు కట్టిన బొక్కెన కనిపించింది. తాడును పట్టుకుని బొక్కెనను బావిలోకి విసిరాడు.
“అన్నా… దీన్ని పట్టుకో” అన్నాడు.
నీట మునిగి తేలుతూ కేకలేస్తున్న పెద్దవాడు తాడును పట్టుకున్నాడు.
చిన్నోడు తన శక్తినంతా కూడగట్టుకుని తాడును పైకి లాగడం మొదలు పెట్టాడు.
“అన్నా … భయపడకు… జాగ్రత్తగా పట్టుకో… పడిపోకుండా చూసుకో” అని అరిచాడు.
తాడు చివరను ఒక చెట్టుకి కట్టాడు. నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు. ఒక అరగంట పెనుగులాడిన తరువాత పెద్దోడు సురక్షితంగా బయటకి వచ్చాడు.
ఆ తరువాత పెద్దోడు చిన్నోడు ఊళ్లోకి పరుగెత్తారు. ఊళ్లో వాళ్లకి జరిగింది చెప్పారు. చిన్నోడు పెద్దోడిని ఎలా కాపాడాడో చెప్పారు.

 

img_0873
ఊళ్లో ఎవరూ నమ్మలేదు. ఆరేళ్ల వాడేమిటి, పదేళ్ల వాడిని లాగడమేమిటి? అందునా బావి నుంచి లాగడమేమిటి? అసాధ్యం. వాడు చేయలేడని అన్నారు.
ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు.
సంగతి ఆ నోటా ఈ నోటా పాకింది.
దేవాలయం ముసలి పూజారిగారికి విషయం తెలిసింది.
“మీరు నమ్ముతారా పూజారి గారూ”
“నమ్ముతాను”
“ఎలా?”
“చిన్నోడు లాగి పెద్దోడిని బావి నుంచి బయటకి తీసి రక్షించాడు.”
“అదెలా సాధ్యం. అంత చిన్నోడు ఎలా చేయగలడు?”
“తనకి అంత బలం లేదన్న సంగతి, వాడు పెద్దోడిని బావినుంచి లాగలేడన్న సంగతి చిన్నోడికి తెలియదు. ఒరేయ్… నీకంత బలం లేదురా… నువ్వు చేయలేవురా… అది నీవల్ల సాధ్యం కాదురా…అని చెప్పేవారెవరూ ఆ పరిసరాల్లో లేరు. కాబట్టి వాడు చేయగలిగాడు. నీవల్ల కాదని చెప్పే వాళ్లుంటే వాడు ప్రయత్నించేవాడే కాదు. ఏడుస్తూ ఊళ్లోకి పరిగెత్తుకు వచ్చేవాడు. మనం బావి దగ్గరికి వెళ్లే సరికి పెద్దోడు శవమై తేలి ఉండేవాడు. ”
ప్రశ్నవేసిన వాడు మాట్లాడలేకపోయాడు.

నీతి:
“నీవల్ల కాదు అని చెప్పేవాడు లేకుంటే మనిషి ఎంత పనైనా చేస్తాడు. అది బావైనా, బతుకైనా అంతే…” అన్నాడు పూజారిగారు.

కిలో వెన్న

img_0825
కిలో వెన్న
విలువ :సత్యము
ఉపవిలువ- నిజాయతీ
ఒక రైతు ఉండేవాడు. ఆతను ఎప్పుడూ ఒక కిలో వెన్నను ఒక బేకర్ కు అమ్ముతూ ఉండేవాడు. ఒక సారి బేకర్ కి అనుమానము వచ్చింది. “ఈ రైతు సమంగా ఒక కిలో వెన్న ఇస్తున్నాడా లేదా ?”అని అందుకని ఈసారి రైతు వెన్న తెచ్చి ఇవ్వగానే దాన్ని ఒక కిలో రాయితో త్రాసులో తూచాడు. తీరా చూస్తే వెన్న ఒక కిలో కంటే తక్కువ ఉంది. బేకర్ కి చాలా కోపం వచ్చి, రైతుని తీసుకువచ్చి కోర్టులో జడ్జి ముందు నిలబెట్టాడు. జడ్జి రైతుని అడిగాడు, “నీవు వెన్న ఎట్లా తూచి ఇస్తున్నావు అని. దానికి రైతు ఈ విధంగా బదులు చెప్పాడు, యువర్” ఆనర్, నాకు చదువు రాదు, అనాగరికుడిని కానీ, తూచడానికి నాకు ఒక పధ్ధతి తెలుసు”. జడ్జి అడిగారు,” సరే ! ఆ పధ్ధతి ఏమిటో చెప్పు”
రైతు ఇలా వివరించాడు ,”ఎప్పటినుంచో ఈ బేకర్ దగ్గర కిలో బ్రెడ్ కొంటూ ఉండే వాడిని. అప్పటికి ఇంకా నేను ఈయనకు వెన్న అమ్మేవాడిని కాను. తరవాత ఇతను నాకు అమ్మే కిలో బ్రెడ్ అమ్ముతున్నప్పటి నుంచి త్రాసులో కిలో బ్రెడ్ ఒక వైపు పెట్టి దానికి సరిబరువు గల వెన్న మరో వైపు పెట్టి తూచి, కిలో వెన్న బేకర్ కు ఇస్తున్నాను. ఇందులో ఎవరిదైనా పొరపాటు ఉంటే అది ఈ బేకరిదే. అతను కిలో బ్రెడ్ అని చెప్పి అమ్ముతున్నది కిలో కంటే తక్కువ ఉన్నది.

 

 

img_0827

నేర్చుకోవలసిన విషయము.
మనము ఇతరులకు ఏమి ఇస్తామో మనకు అదే తిరిగి వస్తుంది. కొంతమంది నిజాయతీ గా ఉంటారు. మరి కొంత మందికి నిజాయతీ అంటే తెలియదు. వారు అబద్ధాన్ని అతి తేలిక గా చెప్పేస్తారు. అటువంటి వారు ఎదుటి వారిలో నిజాయితీ ని గుర్తించలేకపోగా, అందరూ తమలాంటి వారే అని అనుకుంటారు. వారిని వారే మోసగించుకుంటారు.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

క్షమించుటే ఉత్తమ లక్షణం

విలువ-సత్ప్రవర్తన
అంతర్గత విలువ- క్షమా గుణం

images

ఇది ఒక ఇరుగు-పొరుగు ఇళ్ళ కథ.
ఒక అతను ఎంతో అందమైన పెద్ద భవంతిని కొనుక్కున్నాడు.చుట్టూ ఎంతో అందమైన పూల చెట్లు , పండ్ల చెట్లతో ఆ ఇల్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ఆ ఇంటి పక్కనే ఒక పాత ఇల్లు ఉంది. ఆ ఇంటి యజమానికి ఏ క్రొత్త ఇంటి యజమానిని చూసినా ఈర్ష్య కలిగేది .ఎలాగైనా సరే ఆ కొత్త ఇంటి యజమానిని మానసింకంగా బాధించాలని చెత్తా, చెదారం ఇంకా అనేక రకాల చెత్త పనులు చేస్తుండేవాడు.
ఒక రోజు ఆ కొత్త యజమాని ప్రొదున్నే లేచి ఎంతోసంతోషంగా బాల్కనీలోకి వచ్చేట ప్పటికీ,ఆయనకి పాతబట్టలు మరియు చెత్త ఉన్న ఒక బకెట్ బాల్కనీలో కనబడినది.వెంటనే ఆయన ఆ బకెట్ బాగా శుభ్రం చేసి, దాన్నిండా ఆపిల్స్ నింపి ఆ ఆపిల్స్ బకెట్ తో వెళ్ళి పాత ఇంటి యజమాని తలుపు తట్టాడు.
పాత ఇంటాయన తానూహించినట్టే పోరుగింటాయిన వస్తే నాకు అతనితో వచ్చింది దెబ్బలాడే అవకాశం వచ్చింది అనుకుంటూ తలుపు తీశాడు. కానీ ఆశ్చర్యం! ఆ క్రొత్తఇంటాయన ఆపిల్ పళ్ళ బకెట్ పాతాయనకు ఇస్తూ ఎవరి దగ్గర ఏది సమృద్ధిగా ఉంటుందో అదే ఇంకొకరితో పంచుకోగలరు అని అన్నాడు

నీతి:
ఎవరైనా వారికి గల సత్ప్రవర్తన గానీ , విలువలను గానీ మార్చుకోకూడదు. దాని వలన మనము ఇతరుల కంటే వేరుగా సరైన వారుగా ఉండగలము.
ఎప్పుడైతే మనలను కష్టపెడుతున్న వారిని కూడా క్షమించి ప్రేమను పంచుకోగలుగుతామో అప్పుడు మనకు రెట్టింపు ప్రేమ ఆప్యాయత లభిస్తుంది.

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu