Archive | November 2017

గురువుగారు-పులి

గురువుగారు-పులి
విలువ : శాంతి
ఉపవిలువ : సహనం, ఏకాగ్రత

 

AA85BF96-4C35-44B9-A33E-943130E3B189

ఒక గురువుగారు, శిష్యుడు ఒక గ్రామం నుండి వేరొక గ్రామానికి నడిచి వెళ్తున్నారు. ఇంతలో వాళ్ళకి ఒక పెద్ద గాండ్రింపు వినిపించింది. ఆ శబ్దం వచ్చిన వైపుగా చూస్తే ఒక పులి వాళ్ళ వైపు వస్తూ కనిపించింది.
శిష్యుడికి చాలా భయం వేసి పరిగెత్తి పారిపోదాము అనుకున్నాడు కానీ అలా గురువు గారిని వదిలి పారిపోవడం సరైన పని కాదని, ఇప్పుడు ఏమి చేద్దాము? గురువుగారు అని అడిగాడు.

గురువుగారు ప్రశాంతంగా ఇలా బదులిచ్చారు.
” మనకి చాలా మార్గాలున్నాయి. భయంతో ఇక్కడే కదలకుండా ఉండిపోవచ్చు. అప్పుడు పులి వచ్చి మనల్ని చంపేస్తుంది. మనం పరిగెత్తి పారిపోతే అది కూడా మన వెనకాల పరిగెత్తుకువస్తుంది. దానితో పోరాడవచ్చు కానీ శారీరకంగా అది మనకంటే చాలా బలమైనది”

” మనల్ని కాపాడమని భగవంతుణ్ణి ప్రార్థించవచ్చు. మన మనస్సుకి బలమైన శక్తి ఉంటే దానితో పులిని నిగ్రహించవచ్చు. మనం పులికి మన ప్రేమను పంపించవచ్చు. మన అంతరంగం పైన దృష్టి నిలిపి, ఈ విశాలవిశ్వంలో మనం కూడా ఒక భాగంగా భావించి ఆ శక్తితో పులి యొక్క ఆత్మని ప్రభావితం చెయ్యవచ్చు.”
వీటిలో ఏ మార్గం ఉపయోగించుకుందాము? అని అడిగారు. దానికి శిష్యుడు మీరు గురువుగారు కాబట్టి మీరే నిర్ణయించండి,మనకు ఎక్కువ సమయం లేదు అని చెప్పాడు.
గురువుగారు ఒక్కసారి పులి వైపు చూసి ధ్యానం లోకి వెళ్ళారు. విశ్వం అంతా శక్తితో నిండి ఉన్నట్లు దానిలో తానూ ఒక భాగంగా భావించి ధ్యానం చెయ్యసాగారు.
ఏకాగ్రతతో చేసే ధ్యానంలో జీవుల మధ్య తేడా ఉండదు. ఇంతలో పులి దగ్గరగా రావడంతో శిష్యుడు భయంతో వణికిపోసాగాడు. పులి దగ్గరగా వస్తున్నా భయం లేకుండా గురువుగారు ధ్యానంలో అంత ప్రశాంతంగా ఎలా ఉన్నారో శిష్యుడికి అర్థం కావట్లేదు. కొంతసేపటి తరువాత పులి తల దించుకుని, తోక ఆడిస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.

శిష్యుడు ఆశ్చర్యంతో , గురువుగారు మీరు ఏమి చేసారు? అని అడిగాడు.

“గురువుగారు ఇలా చెప్పేరు, ఏమి లేదు నా మనసులో ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి భగవంతుడి పైన దృష్టి నిలిపాను. ధ్యానంలో ఒక స్థాయిలో నా ఆత్మ, పులి యొక్క ఆత్మ ఒక్కటే అయ్యాయి. పులి నా మనసులో ప్రశాంతతని, ప్రేమని గుర్తించి, ఇక్కడ దానికి ఎలాంటి ప్రమాదం లేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.”

” మన మనస్సు మౌనంగా, ప్రశాంతంగా ప్రేమతో నిండి ఉంటే ఆ ప్రభావం మన చుట్టు పక్కల ఉన్నవారి మీద పడి వారు కూడా మనతో ప్రేమగా ఉంటారు”

నీతి: మన మనస్సు ప్రశాంతంగా, ఆలోచనలు లేకుండా
ప్రేమతోనిండి ఉంటే, ఏకాగ్రత సులభంగా కుదురుతుంది. అప్పుడు మనం అనుకున్న పని సులభంగా చెయ్యగలుగుతాము.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

 

Advertisements

జ్జానేశ్వర్ – నాందేవ్

4B7C641F-7A30-4DD2-BD5C-BECDBDCD580B.jpeg

విలువ: సత్యము
ఉపవిలువ:అందరూ సమానమే

నామదేవుడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ భగవంతుని నామం జపిస్తూ ఉండేవాడు. అలా నామస్మరణ చేస్తూ అతను ఇంట్లో చెయ్యవలసిన కర్తవ్యం కూడా మర్చిపోయేవాడు. అతని చెల్లెలు జానాబాయి ఇది గమనించి, ఎవరి వద్దనైనా డబ్బు అప్పు తీసుకుని బట్టల వ్యాపారం చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది.
నామదేవుడు సరేనని బట్టల వ్యాపారం ప్రారంభించి, చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి బట్టలు అమ్మసాగాడు.

ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళేసరికి ఆ గ్రామంలో అందరూ ఏడుస్తూ కనిపించారు. నామదేవుడు కారణం అడుగగా, ఆ ఊరిలో బందిపోటు దొంగలు పడి మొత్తం ధనం, బట్టలు,ఆహారం దోచుకుపోయరని చెప్పారు.
నామదేవుడు వారి పరిస్థితికి జాలిపడి తన దగ్గరున్న బట్టలన్నీ వారికి ఉచితంగా ఇచ్చాడు. వట్టి చేతులతో ఇంటికి వచ్చిన భర్తను చూసి నామదేవుని భార్య కోపంతో అతనిని వదిలి పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది.జానాబాయి బాధపడుతూ కృష్ణుణ్ణి ప్రార్ధించసాగింది.
జ్ఞానేశ్వర్ అనే జ్ఞాని నామదేవుడిని ఉత్తరభారతదేశ యాత్రలకు తీసుకువెళ్దామని వారింటికి వచ్చాడు. జానాబాయి బాధపడడం చూసి కారణం అడిగాడు. జరిగినదంతా చెప్పి భగవంతుడు ఎందుకు ఇలా తన బిడ్డలను శిక్షించి ఆనందిస్తాడు అని అడిగింది.
దానికి జ్ఞానేశ్వర్ ఇలా చేప్పేడు” ఈ సంసారమంతా ఒక మాయ. దొంగల రూపంలో ఆ వూరివారిని దోచుకున్నది కృష్ణుడే, నామదేవుని రూపంలో వారికి సహాయం చేసింది కృష్ణుడే, అందరిలో ఉన్నదీ కృష్ణుడే. అంతా ఆయన ఇష్టప్రకారమే జరుగుతుంది. ఈ సత్యం తెలుసుకున్నవారికి ఈ సంసరబాధలు అంటుకోవు.”
నీతి: భగవంతుడు విశ్వమంతా వ్యాపించి
ఉంటాడు. ఆయన లేని చోటు లేదు. జీవులందరూ ఆయన ప్రతిరూపాలే. ఉన్నదంతా ఒకటే.
గమనిక: జ్ఞానులకు మాత్రమే ఈ స్థితి అర్థం అవుతుంది. మనకి అద్వైతం గురించి పూర్తి జ్ఞానం వచ్చేవరకూ మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ భగవంతుడిని ప్రార్థించాలి.

 

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలగటం ఎలా?

విలువ: శాంతి
ఉపవిలువ: మనసు ప్రశాంతముగా ఉంచుకొనుట

60CE9A3C-B3A6-4C59-A491-D88D8E8C52B4

ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాడు. సాటివారి పట్ల దయ కలిగి ఉండేవాడు. ఎవరయినా కష్టాల్లో ఉంటే ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ముందుకి నడిపించేవాడు.అతని వద్దకు వచ్చినవారు ఎవరయినా, ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్ళేవారు మరియు అతనిని గొప్ప స్నేహితునిగా భావించేవారు.
అతని పొరుగింట్లో నివసిచే కృష్ణయ్య కు, రామయ్యను చూస్తే ఆశ్చర్యంగా ఉండేది. ఇతను ఎప్పుడూ ఇంత ఆనందంగా ఎలా ఉంటాడు? సాటి వారి పట్ల ద్వేషం లేకుండా ఎల్లప్పుడూ దయ కలిగి ఉండడం ఎలా సాధ్యమవుతుంది అని అనుకునేవాడు.
ఒకసారి రామయ్యను కలిసినప్పుడు కృష్ణయ్య ఇలా అడిగాడు ” చాలామంది మనుషులు స్వార్థంతో, సంతృప్తి లేకుండా ఉంటారు. పక్కవారిని చూసి కూడా నవ్వకుండా వెళ్లిపోతుంటారు. కానీ నువ్వు ఎప్పుడు చూసినా ఎంతో ఆనందంగా, ద్వేషం లేకుండా ఉంటావు. ఇది నీకు ఎలా సాధ్యమవుతుంది?”
దానికి రామయ్య నవ్వి ఇలా సమాధానం ఇచ్చాడు “మన మనసు ప్రశాంతంగా ఉంచుకోగలిగితే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండవచ్చు. మనమందరం భగవంతుని బిడ్డలమే, మనలో ఉన్న ఆత్మయే అందరిలోనూ ఉందని గ్రహిస్తే ఎవరిపట్లా ద్వేషం కలగదు. మన ఆలోచనలు మన నియంత్రణలో ఉంటే మనసు బలంగా ఉంటుంది. మనసు బలంగా ఉంటే శరీరం కూడా బలంగా ఉంటుంది. అప్పుడు మనం అనుకున్న పనులన్నీ చక్కగా చెయ్యగలుగుతాము. మన ఆలోచనలు, అలవాట్లను బట్టి మన ప్రవర్తన ఉంటుంది. ద్వేషము,అసూయ వంటి ఆలోచనలకు దూరంగా ఉంటే మనలో ఉన్న సంతోషం బయటికి వస్తుంది.”

“మనలో ఆనందం బయటికి రావాలంటే కష్టపడి పని చెయ్యాలి. మంచి అలవాట్లు పెంపొందించుకోవాలి. ఏకాగ్రత పెంచుకోవాలి. ఇలా చెయ్యగలగాలి అంటే చాలా  కష్టపడాలి. అడ్డంకులు అన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి.”
“దారిలో వచ్చే కష్టనష్టాల గురించి ఆలోచిస్తూ ఉంటే ముందుకి వెళ్ళలేము. ఆలోచనలతో పాటు మనం వెళ్ళిపోకుండా పని మీద మన దృష్టిని  పెట్టాలి”
ఇందంతా విన్న కృష్ణయ్య ఇంత సులభమా? అన్నాడు.
దానికి రమయ్య “నీకు వచ్చి, వెళ్ళే ఆలోచనలనలను గమనించు. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు.మొదట్లో ప్రశాంతత కొంచెం సేపే ఉంటుంది, సాధన చేసేకొద్దీ ఎక్కువసేపు ప్రశాంతంగా ఉండడం మనసుకి అలవాటు అవుతుంది. మనసుకి ఉన్న ఈ ప్రశాంతతే మనకు బలం. దీనివల్లనే మనలో దయ, ప్రేమ పెరుగుతాయి.కొంత కాలానికి ఈ విశ్వ శక్తిలో మనం కూడా ఒక భాగం అని తెలుస్తుంది. అది అర్థం అయిన తరువాత విషయాలను కొత్త కోణంలో చూసి అర్థం చేసుకోవడం అలవాటు అవుతుంది. మనలో ఉన్న అహంకారం క్రమంగా తగ్గిపోతుంది.”అని కృష్ణయ్యని ఉత్తేజపరిచే విధంగా సమాధానం ఇచ్చాడు.

అప్పుడు కృష్ణయ్య  ,” రామయ్య! మీరు చెప్పిన విషయాలన్నీ    గుర్డగుర్తుపెట్టు కోవడానికి ప్రయత్నం చేస్తాను, కానీ నాకు ఇంకో విషయం కూడా తెలుసుకోవాలని ఉంది”,అన్నాడు కృష్ణయ్య. “అది ఏమిటి? “అని అడిగాడు రామయ్య.

“రామయ్య! మీరు చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావానికి లోను అయినట్లు కనిపించరు, అందరితో ఎప్పుడూ దయతో మాట్లాడతారు.ఇదెలా సాధ్యం?”అని అడిగాడు.
దానికి రామయ్య,”మంచిగా, ప్రేమగా ఉన్నంత మాత్రాన మనం బలహీనులమని అర్థం కాదు. మంచిగా ఉంటూ కూడా శక్తివంతంగా ఉండవచ్చు. మన చుట్టూ ఉన్నవారు మనలో ఉన్న అంతర్గత శక్తిని గుర్తిస్తారు కాబట్టి మనని ప్రభావితం చేసే ప్రయత్నం చెయ్యరు. మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన శక్తిని ఉపయోగించి ఇతరులకు సహాయం చెయ్యవచ్చు. మంచితనం బలహీనులకు మాత్రమే ఉంటుంది అనుకోవడం పొరపాటు. ప్రేమ మరియు మంచితనం వల్ల మనలో ఎంతో శక్తి ఉద్భవిస్తుంది “,అని చెప్పాడు రామయ్య.
“మీ నుండి ఇన్ని మంచి విషయాలు తెలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. వాటిని ఆచరించి నేను కూడా ప్రశాంతతను పొందుతాను”,అని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు కృష్ణయ్య.
నీతి:మనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని మనలో అంతర్గత శక్తిని పెంచుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రేమ,దయ, సరైన నడవడి మొదలయిన లక్షణాలు మన వెన్నంటి వస్తాయి.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

ఆహారము – ఆలోచనలు

ఆహారము – ఆలోచనలు
విలువ-ధర్మం
అంతర్గత విలువ -మంచి ఆలోచనలు

B63C1CAF-2A97-4875-87D5-A8952FE68445
మైసూర్ రాష్ట్రంలో బాగా చదువుకున్న ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. ఆయన భార్య కూడా బాగా చదువుకున్న పండితురాలు. ఆయన ఎప్పుడూ పూజలు,జప,ధ్యానాలు చేసుకుంటూ ఉండేవాడు. ఒక రోజు నిత్యానందుడు అనే సన్యాసి ఈ పండితుడి ఇంటికి వచ్చాడు. పండితుడు చాలా సంతోషంగా నిత్యానందుడిని ఇంట్లోకి ఆహ్వానించాడు. ఆ రాత్రికి తన ఇంట్లోనే ఉండమని అడిగాడు,అందుకు నిత్యానందుడు కూడా ఒప్పుకున్నాడు.
ఇంతలో పండితుడి భార్యకి ఒంట్లో బాగుండకపోవడంతో, పక్కింటి ఆవిడ వంట చేసి తెచ్చి ఇచ్చింది.

పండితుడు, నిత్యానందుడు కలిసి భోజనం చేసారు. కాని భోజనం చేస్తూ ఉండగా నిత్యానందుడికి అక్కడే ఉన్న వెండి గ్లాసు దొంగిలించాలని దురాలోచన పుట్టింది. ఎంత ప్రయత్నించినా ఆ ఆలోచనని అదుపులో పెట్టుకోలేక ఎవరూ చూడకుండా ఆ వెండి గ్లాసు దొంగిలించాడు. తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు కానీ ఇలా దొంగతనం చెయ్యడం అతనికి చాలా సిగ్గుగా అనిపించింది. ఇలాంటి పనుల వల్ల తన సాధన అంతా వృధా అయిపోతుందని, గురువుగారికి చెడ్డపేరు వస్తుందని భావించాడు. పండితుడి దగ్గరికి వెళ్లి చేసిన తప్పు ఒప్పుకుని కాళ్ళ మీద పడ్డాడు.

ఇది చూసి పండితుడు ఆశ్చర్యపోయాడు. నిత్యానందుడికి ఇలాంటి చెడ్డ ఆలోచన ఎందుకు వచ్చిందా అని ఆలోచించి, ఇవాళ వంట ఎవరు చేసారు అని భార్యని అడిగాడు. తనకి ఆరోగ్యం బాగోలేనందున పక్కింటావిడ చేసిందని ఆమె చెప్పింది.

పండితుడు పక్కింటావిడ వ్యక్తిత్వం గురించి ఆరా తీయగా, ఆమెకు చిన్న చిన్న దొంగతనాలు చేసే అలవాటు ఉందని తెలిసింది. ఆమె వంట చెయ్యడం వల్ల , ఆమె ఆలోచనల ప్రభావం ఆహరం మీద పడింది. ఆ ఆహరం తినడం వల్ల నిత్యానందుడికి దురాలోచన వచ్చింది అని తెలుసుకున్నాడు. అందువల్లనే మన పెద్దలు సాధకులు కందమూలాలు మాత్రమే తింటూ సాధన చెయ్యాలని చెప్తారు.

నీతి: ఆహరం తయారు చేసేటప్పుడు ప్రేమతోనూ , మంచి ఆలోచనలతోనూ చేసి దైవార్పణ చేసి తింటే మనకు మరియు తినేవారికి కూడా మంచి బుద్ధి కలుగుతుంది.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu