Archive | July 2016

మన మనసే స్వర్గము

విలువ — సత్యము

అంతర్గత విలువ — అప్రమత్తంగా ఉండడం

image

ఒక సేనాధిపతి ఒక రోజు జెన్ మాస్టర్ హుకుం దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు, “స్వర్గము ఎక్కడ ఉంటుంది? నరకము ఎక్కడ ఉంటుంది ?”
ఆ సేనాధిపతికి రెండే తెలుసు,1) జీవనం 2)మరణం.
నరకము నుంచి స్వర్గానికి దారి తెలుసుకోవాలని అనుకున్నాడు. జెన్ మాస్టర్ హుకుంసేనాధిపతికి అర్ధం అయ్యేలా సమాధానం చెప్పారు.
“నువ్వు ఎవరివి?” అని హుకుం అడిగారు.
నేను సైనికుల నాయకుడిని . రాజుగారు నాకు చాలా మర్యాద ఇస్తారు.
హుకుం నవ్వుతూ అన్నారు, “నువ్వు నిజంగానే నాయకుడివా ? అలా అనిపించటం లేదు?”
సేనాధిపతి కోపంతో కత్తి తీసి హుకుం ని చంపడానికి సిద్ధమయ్యాడు.
ఇదే నరకానికి దారి అని అన్నారు హుకుం.
సేనాధిపతి అర్ధం చేసుకుని కత్తి కింద పడేసి, తల వంచుకుని నుంచున్నాడు.
ఇదే స్వర్గానికి దారి అని అన్నారు హుకుం.

నీతి.

స్వర్గము, నరకము మన లోపలే ఉంటాయి. ఇది సత్యము.
మనుషులు స్వర్గము, నరకము కోసం బయట వెతుకుతుంటారు.
పై కథలో హుకుం చెప్పినట్లు కోపంలో విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తాము అందువల్ల మనసుకు శాంతి ఉండదు. ఓర్పుగా వ్యవహరిస్తే పరిస్థితులు చక్కబడి మనసుకి శాంతి లభిస్తుంది.
మన ఆలోచనలతో ప్రతి నిమిషము మనము స్వర్గము, నరకము అనుభవిస్తూనే ఉంటాము.

http://saibalsanskaar.wordpress.com

గురు పౌర్ణమి విశిష్టత :

 

image.jpeg

భారత దేశములో ఆషాడ పూర్ణిమనుండి నాలుగు మాసాలు చాతుర్మాసం పాటిస్తారు . పూర్వకాలములో శిష్యులు , గురువులు కూడా ఈ నాలుగుమాసములు వర్షాకాలము అయినందున , వ్యాధులు ప్రబలే కాలము అయినందున … ఎలాంటి పర్యటనలు , దేశ సంచారము చేయకుండా ఒకేచోటే తాత్కాలికము గా నివాసము ఏర్పరచుకునేవారు . అప్పుడు శి్ష్యులు గురుగు దగ్గర వి్జ్ఞాన సముపార్జన చేసేవారు . ఈ జ్ఞానసముపార్జన లో మొదటిరోజు ని గురువుని ఆరాధించడానికి ప్రత్యేకించేవారు . ఈ సంప్రదాయమే కాలక్రమేన ” గురుపూర్ణిమ ” గా మారినది అని చరిత్ర చెబుతోంది .
ఆదిగురువు వేదవ్యాసులవారు . వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ , వ్యాసపూర్ణిమ , అంటారు . గురువులను , ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.

ఆదిగురువు వేదవ్యాసులవారు!!

వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, అంటారు

వసిష్ఠమహామునికి మునిమనుమడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరమునికి పుత్రుడు, శుకమర్షికి జనకుడైనట్టియు, నిర్మలుడైనట్టి, తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు.

నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు.

వ్యాసుని తల్లిదండ్రులు సత్యవతి,పరాశరుడు. వేదాలను నాలుగుభాగాలుగా విభజించి పైలుడనే శిష్యుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమిని అనే శిష్యుడికి సామవేదాన్ని, సుమంతుడనే శిష్యుడికి అధర్వణవేదాన్ని తెలిపి వ్యాప్తిచేయమని ఆదేశించాడు.

గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి.
ఈ రోజునే చాతుర్మాస్యవ్రతాన్ని ఆరంభిస్తారు. ఆచార్యులవారిని అంటే గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలనేది ఋషివచనం. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి.

ఒకప్పుడు గురుకులాలుండేవి.వాటిలో చేరిని విద్యార్థులకు తల్లీ తండ్రీ అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే:

గురువు ప్రాముఖ్యత :

“గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః”అంటారు. దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారునమ
“గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా” అంటాడు భక్తకబీర్ దాస్. అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.

గురు సందేశము :
వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- ‘ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.’ పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది

 

 

ఆత్మవిశ్వాసం

image ఆత్మవిశ్వాసం

విలువ: నమ్మకం

అంతర్గత విలువ :ఆత్మవిశ్వాసం

ఒక వ్యాపారస్తుడికి వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. బాగా అప్పుల్లో కూరుకుపోయాడు. బైటికి వచ్చే దారి కనిపించట్లేదు. అప్పులవాళ్ళు వెంట పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు పార్క్ లో బెంచి మీద కూర్చుని తన సమస్యకి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తున్నాడు.

ఇంతలో ఒక ముసలాయన వచ్చి ఎదురుగా నిల్చున్నాడు. నువ్వు దేని గురించో బాగా బాధపడుతున్నట్టున్నావు అని అడిగాడు. వ్యాపారస్తుడు తన పరిస్థితి చెప్పగానే నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. వ్యాపారస్తుడి పేరు అడిగి అతని పేరు మీద $5,౦౦,౦౦౦ చెక్కు రాసి ఇచ్చేడు. ఈ డబ్బుతో నీ అప్పులు తీర్చుకుని వచ్చే సంవత్సరం ఇదే రోజున నా డబ్బు నాకు తిరిగి ఇవ్వాలి అని చెప్పి అక్కడనుండి వెళ్లిపోయేడు.వ్యాపారస్తుడు ఆశ్చర్యంతో చెక్కు మీద సంతకం చూస్తే జాన్ డి. రాక్ ఫెల్లెర్ అని ఉంది. జాన్ డి. రాక్ ఫెల్లెర్ అంటే ప్రపంచంలోనే ధనికుల్లో ఒకరు.

Prométhée

ఆ డబ్బుతో ఒక్కసారిగా తన అప్పులు అన్నీ తీర్చుకోవచ్చు కాని అది పక్కన పెట్టి ధైర్యంగా తను కూడా ఒక ప్రయత్నం చేద్దాం అనుకుని అప్పులవాళ్ళతో మాట్లాడి కొంత గడువు తీసుకున్నాడు. కష్టపడి వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు, వచ్చిన లాభంతో అప్పులన్నీ తీర్చేసాడు.

మరుసటి సంవత్సరం అదే రోజున చెక్కు తిరిగి ఇచ్చేద్దామని పార్కుకి వెళ్ళేడు. అనుకున్నట్టుగానే ముసలాయన వచ్చి పార్క్ లో ఉన్నాడు. ఆయనకి కృతజ్ఞతలు చెప్పి చెక్కు తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటుండగా ఒక నర్సు వచ్చి ఆ ముసలాయన్ని పట్టుకుని హమ్మయ్య దొరికేడు అంది.

వ్యాపారస్తుడితో ఈయన మిమ్మల్ని ఇబ్బందిపెట్టలేదు కదా అని అడిగింది. ఈయన అస్తమానం వృద్ధాశ్రమం నుండి తప్పించుకుని తన పేరు జాన్ డి. రాక్ ఫెల్లెర్ అని చెప్పుకుని తిరుగుతుంటాడు అని చెప్పింది.

ఆయన నిజమైన జాన్ డి. రాక్ ఫెల్లెర్ కాదని తెలిసి వ్యాపారస్తుడు ఆశ్చర్యపోయేడు. ఆయన ఇచ్చిన $5,౦౦,౦౦౦ చెక్కు ఉందని నమ్మకంతోనే తను సొంతంగా ప్రయత్నించి వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. ముసలాయన తెలిసిచేసినా,తెలియక చేసినా తన మీద తనకి నమ్మకం ఏర్పడడానికి సహాయపడినందుకు మనసులోనే ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి సమస్యకి అయినా పరిష్కారం దొరుకుతుందని గ్రహించాడు.

నీతి: ప్రతి వ్యక్తికీ ఆత్మవిశ్వాసం అనేది అత్యవసరం. మన మీద మనకి నమ్మకం లేకపోతే ఎవరూ మనకి సహాయం చెయ్యలేరు.

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

హీరాకానీ

శివాజీ వీరగాధలలోని కథ

విలువ :ధర్మం

అంతర్గత విలువ :కర్తవ్య పాలన, సౌసీల్యం

image

దేవీ భక్తుడైన ఛత్రపతి శివాజీ ఒక రాజ్యాన్ని మాత్రమే స్థాపించలేదు. నిదురిస్తున్న కేసరముల వంటి భారతీయులలో గుండెలలో మఱిచిపోయిన ధర్మాన్ని మాతృదేశభక్తిని ప్రతిష్ఠించినాడు. ఆదర్శ పురుషుడైన శివాజీ రాజభోగాలను తృణప్రాయంగా ఎంచేవాడు. అప్పటి కాలంలోని ఇతర నవాబులవలె కాకుండా వ్యసనాలకు దూరముగా ఉండేవాడు శివాజీ.

భారతీయులలో గుండెలలో మరిచిపోయిన ధర్మాన్ని మాతృదేశభక్తిని ప్రతిష్ఠించినాడు. ఆదర్శ పురుషుడైన శివాజీ రాజభోగాలను తృణప్రాయంగా ఎంచేవాడు. అప్పటి కాలంలోని ఇతర నవాబులవలె కాకుండా వ్యసనాలకు దూరముగా ఉండేవాడు శివాజీ.

భారతీయతత్త్వాన్ని బాగా జీర్ణించుకున్న శివాజీ తన రాజ్యాన్ని సర్వసంగ పరిత్యాగి ఐన సన్యాసికి దానంచేసి అతని ప్రతినిధిగా ప్రజాక్షేమం కోసం రాజ్యపాలన చేశాడు. ఎప్పుడూ ప్రజలపై అధిక పన్నులు వేయలేదు. తన పట్టాభిషేకానికి కూడా తన ధనమే వినియోగించినాడు కానీ ప్రజల సొమ్ము ముట్టుకోలేదు.

శివాజీ రాయగఢ్ కోట శత్రువులకు అభేద్యంగా కట్టుదిట్టంగా ఉండేది. ప్రొద్దున ఆరింటికి తెరిచిన కోట తలుపులు రాత్రి తొమ్మిదిగంటలకు మూయబడుతాయి. ద్వారం మూసి ఉన్న సమయంలో చీమకూడా లోనినుండి బైటికి వెలుపల నుండీ లోనికి రాకూడదు. ఇది ఛత్రపతి శివాజీ ఆజ్ఞ. రాజ్య రక్షణార్థం ఇట్టి కట్టుదిట్టాలు తప్పలేదు. ఎట్టి పరిస్థితులలోనూ రాత్రి తొమ్మిది తరువాత కోట ద్వారం తెరవబడదు.

హీరాకానీ అనే గ్రామవాసి రోజూ కోటలో ఉన్న అధికారులకు సైనికులకు పాలుపోయటానికి వచ్చేది. అందరికీ తనకు చేతనైన సహాయం చేసేది. ఇలా ఉండగా ఒక రోజు సాయంకాలం పాలుపోయటానికి కోటలోకి వచ్చింది హీరాకానీ. ఒక సైనికుడి భార్య ప్రసవవేదన పడుతున్నదని తెలిసి అక్కడే ఉండి ఆమెకు సహాయం చేసింది. పురుడు అయ్యేదాకా అక్కడే ఉన్నది. ఇంటికి వెళదామని సమయంచూస్తే తొమ్మిది దాటిపోయింది. పరుగులుతీసి కోటగుమ్మం చేరింది హీరాకానీ.

కావలి వాళ్ళు హీరాకానీ చాలా మంచిది అని అభిమానం ఉన్నా రాజాజ్ఞ ధిక్కరించలేక తలుపులు తీయలేదు. “అయ్యో! ఇంట్లో ఉన్న పసిపిల్లవాడికి ఆకలివేస్తుంది. వాడికి పాలివ్వాలి” అని ప్రాధేయపడింది. హీరాకానీ మీద జాలి పడిన కావలి వాళ్ళు “తల్లీ రాజాజ్ఞ మేము మీరలేము. ఈ ఒక్క పూటకి మీ ఆయన పాలుపడతాడులే. ఈ సైనికుని ఇంట్లోనే పడుకో. ఉదయం ఆరవ్వంగానే నిన్ను మేమే స్వయంగా పంపిస్తాము” అని ఊరడించినారు.

మరునాడు ప్రొద్దురాగానే కావలివాళ్ళు హీరాకానీని వెదకసాగారు. ఎక్కడైనా ఆదమరచి నిద్రపోయిందేమో లేపి ఇంటికి పంపుదామనుకున్నారు. అలా వెదుకుతున్న వారికి కోటగోడ వద్ద హీరాకానీ పాల పెరుగు కుండ కనిపించింది. పైకి చూసేసరికి ఆమె పూసల గొలుసు కోటమీద రాయికి వ్రేలాడుతూ కనిపించింది. ఆశ్చర్యపోయిన కావలివాళ్ళు శివాజీకి ఈ విషయం విన్నవించారు. ఒక స్త్రీ అభేద్యమైన కోట అర్ధరాత్రి ఒంటరిగా దాటడమా? అది ఎలా సాధ్యం అని నివ్వెరపోతూ స్వయంగా పరిస్థితిని పరిశీలిద్దామని అక్కడికి వచ్చాడు శివాజీ.

ఇంతలో హీరాకానీ రానేవచ్చింది. వణుకుతూ శివాజీ ముందు నిలబడి “అయ్యా! రాత్రి పాలకై ఏడుస్తున్న నా బిడ్డడు గుర్తుకు వచ్చాడు. ఇక ఏ దారీ తోచలేదు. కోటగోడలెలా దాటానో నాకే తెలియదు. కొండలూ గుట్టలూ తుప్పలూ ఆ నడిరాత్రి ఎలా దాటానో కూడా తెలియలేదు. నా బిడ్డ ఒక్కడే నాకు జ్ఞప్తిలో ఉన్నాడు. నా తప్పు క్షమించండి ప్రభూ!” అని ప్రార్థించింది హీరాకానీ.

శత్రువులకు సింహస్వప్నమైన ఛత్రపతి కళ్ళు చెమ్మగిల్లాయి. హీరాకానీకి అందరూ చూస్తుండగా సాష్టాంగవందనం చేశాడు! “అమ్మా! మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు. ఇక ఈ కోటగోడలెంత? ఇక్కడ కట్టబోయే బురుజుకు నీ పేరే పెడతాను” అని ఆమెను పంపివేశాడు అమ్మ విలువ తెలిసిన శివాజీ. ఇప్పటికీ ఈ బురుజు హీరాకానీబురుజు అనే పిలవబడుతోంది.

నీతి:

ఒక స్త్రీకి మాతృమూర్తికి భారతీయులు ఇచ్చే గౌరవం ఈ కథలో మనకు స్పష్టముగా తెలుస్తున్నది. ఛత్రపతి అయివుండికూడా శివాజీ అందరిముందూ సామాన్యురాలైన హీరాకానీ పాదాలపై పడి నమస్కరించెను.
తనకు ఎన్ని పనులున్నా ప్రసవవేదన  పడుతున్న సైనికుని భార్యకు సహాయపడి తన పరోపకార బుద్ధిని మనకు నేర్పింది హీరాకానీ.
ఎంత హీరాకానీ మీద జాలి ఉన్నా రాజాజ్ఞను గౌరవించి వారి కర్తవ్యాన్ని పాలించి సేవాధర్మాన్ని కాపాడిన కావలి వాళ్ళు ధన్యులు.

https://neetikathalu.wordpress.com/category/sadguṇam/sousilyam/

 

కట్టెల మోపు

imageకట్టెల మోపు
విలువ –ప్రేమ
అంతర్గత విలువ — ఐకమత్యము

ఒక కుటుంబంలో ఉన పిల్లలు చాలా కొట్లాడుకుంటూ ఉండేవారు. తండ్రి ఎన్ని మంచి మాటలు చెప్పినా వినేవారు కాదు.ఒక రోజు పిల్లలు అందరూ ఎప్పుడు కొట్టుకునేదానికన్నా ఎక్కువగా
కొట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆ తండ్రికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఒక పిల్లవాడిని కట్టెలమోపు తీసుకునిరమ్మన్నారు. ఆ కట్టెలమోపుని ఒక్కొక్క పిల్లవాడికి ఇచ్చి విరవమన్నారు. అందరూ ఎంత ప్రయత్నించినా విరవలేక పోయారు.
అప్పుడు తండ్రి మోపుని విప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్టెను ఇచ్చారు. అప్పుడు సులువుగా విరవగలిగారు .
అప్పుడు తండ్రిఇలా అన్నారు “పిల్లలూ  , చూశారా ? మీరు అందరూ ప్రేమగా కలిసిమెలసి ఉంటే, మిమ్మల్ని మీ శత్రువు కూడా ఏమీ చెయ్యలేడు. కాని,మీరు విడిపోతే , ఆ కట్టెలమోపులో
కర్రకంటే బలహీనంగా అయిపోతారు.

నీతి:

ఐకమత్యంతో అందరం కలిసి ఉంటే ఏమైనా సాధించగలము. ఒంటరిగా ఏమీ చెయ్యలేము.

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu