Archive | December 2016

క్రిస్టమస్

క్రిస్టమస్

img_1316

 

క్రిస్టమస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండగ. ఏసు క్రీస్తు పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు. కొంతమంది క్రైస్తవులు డిసెంబర్ 25న, మరికొంత మంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. చారిత్రక మరియు సందర్భోచిత ఆధారాల ప్రకారం ఏసుక్రీస్తు డిశంబరులో పుట్టి ఉండకపోవచ్చు. ఈ రోజును ఒక రోమన్ల పండగ రోజు అయినందునో లేదా వింటర్ సోల్టీస్ అయినందునో క్రిస్టమస్ జరుపుకోవటానికి ఎంచుకున్నారు.

యేసు (Jesus) (క్రీ.పూ 7–2 నుండి క్రీ.శ 26–36 వరకు) , నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన క్రైస్తవ మత మూలపురుషుడు. అంతకాక, యేసు వివిధ ఇతర మతములలో కూడ ప్రముఖమైన వ్యక్తిగా పరిగణించబడినాడు. ఈయన సాధారణంగా యేసు క్రీస్తుగా కూడ వ్యవహరించబడతాడు. ఇందులో క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ (“ఆభిషిక్తుడు”) అనే అర్ధం వచ్చే పదం నుండి పుట్టిన ముకుటం. ఇది హీబ్రూలో “మెసయ్యా”కు సమానార్ధము కలపదము.
పూర్తీ వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి – > యేసు జనము

క్రిస్మస్‌ బహుమతి

రెండువేల సంవత్సరాల క్రితం సంగతి. ఒక అభాగ్యురాలు, సమాజ నిరాపేక్షకు గురైన ఒక స్త్రీ ఆ జనం ఎదుట దోషిగా నిలబడింది. ఆమె చుట్టూ ఉన్నవారి చేతుల్లో రాళ్ళు. పాపం చేసినవారిని రాళ్ళతో కొట్టి చంపడం ఆ దేశంలో ఉన్న దారుణమైన ఆచారం. ఇంతలో వారి మధ్యలోకి ఒక ఆజానుబాహువు వచ్చాడు. ఆయన ముఖంలో తేజస్సు. రాళ్ళతో కొట్టబోతున్నవారు ఒక్కక్షణం ఆగారు. ‘మీలో పాపం చేయనివారెవరు? పాపం చేయని వారు ఎవరైనా ఉంటే, ముందుగా వారే రాయి విసరండి’ అన్నాడాయన. అంతా ఒక్కసారి వెనుతిరిగారు. వారి చేతుల్లోని రాళ్ళు కింద పడ్డాయి. ఆమె చేతులు జోడించి ఆయన ముందు మోకరిల్లింది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు.

పాపం చేసినవారికి శిక్ష విధించడం కాదు. పాపమే మరణించాలి. అలా జరిగితే పాపంలేని మనిషి పాపరహితుడై యేసుక్రీస్తులా మారతాడని దేవుని నమ్మకం. అందుకే నశించిన దాన్ని వెదికి రక్షించే నిమిత్తం ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈలోకానికి పంపాడని విశ్వసిస్తారు. అలా సమస్త మానవాళి పాపపరిహారార్థం దేవుడు నరుడిగా జన్మించిన పవిత్రమైన రోజే క్రిస్మస్‌.

యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలసింది. ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళి బాలయేసును దర్శించిన ముగ్గురు జ్ఞానులు పరమానంద భరితులయ్యారు. ఆ సంతోషానికి గుర్తుగా వారు బాలయేసుకు మూడు కానుకలను సమర్పించారు. అవి బంగారము, బోళం, పరిమళ సాంబ్రాణి. వారు సమర్పించిన బంగారం క్రీస్తు ప్రభువు పరిశుద్ధతకు, పవిత్రతకు చిహ్నంగా కనబడుతుంది. బోళం సమర్పణకు సూచన. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమతో సమర్పించిన రీతిలో అందరూ ఒకరిపట్ల మరొకరు ప్రేమానురాగాలు కలిగి ఉండటం, ద్వేషాన్ని విడనాడటం క్రిస్మస్‌ పర్వదినం ప్రాముఖ్యం. ఇక ఆనాడు జ్ఞానులు కానుకగా సమర్పించిన పరిమళ సాంబ్రాణిని ఆరాధనకు సూచనగా లేఖనాలు పేర్కొంటాయి. అహంకారంతో అవమానం, వినయవిధేయతలతో జ్ఞానం కలుగుతాయి. నీ కన్నతండ్రి హితోపదేశం విను, నీ తల్లి వృద్ధాప్యంలో ఉంటే ఆమెను నిర్లక్ష్యం చేయకు- ఇవి క్రీస్తు పలికిన అమృతవాక్కులు. యేసు అనగా గ్రీకుభాషలో రక్షకుడని, క్రీస్తు అనగా హెబ్రూ భాషలో అభిషిక్తుడని అర్థం. సమస్త లోక ప్రజల ఆకలి తీర్చే జీవాహారం ఇచ్చే క్రీస్తు ప్రభువు జన్మించిన ఊరిపేరు బెత్లహేమ్‌. ఆ మాటకు అర్థం- రొట్టెల గృహం.

యేసుక్రీస్తు తన శిష్యులకు ఒకసారి తప్పిపోయిన గొర్రెపిల్ల కథ చెప్పారు. ‘మీలో ఎవరికైనా వంద గొర్రెలు ఉన్నాయనుకోండి, వాటిలో ఒక గొర్రె తప్పిపోతే అప్పుడు ఆ గొర్రెలకాపరి సురక్షితంగా ఉన్న తొంభైతొమ్మిదింటినీ వదిలి, తప్పిపోయిన ఆ ఒక్కదాన్నీ వెదకడానికి వెళతాడు. ఎంత అలసినా, కాలం వృథా అయినా అతను గొర్రె దొరికే వరకూ వెదుకుతూనే ఉంటాడు. అది దొరికినప్పుడు ఎంతో సంతోషిస్తాడు. దాన్ని భుజాల మీద పెట్టుకుని తీసుకువస్తాడు. తప్పిపోయి దొరికిన తన గొర్రె గురించి స్నేహితులకు ఆనందంగా చెబుతాడు…’ అంటూ ఆయన బోధించారు. అలా తప్పిపోయిన గొర్రె వంటి అమాయక ప్రజలను వెదికి రక్షించేందుకు ఈ లోకంలోకి వచ్చిన ప్రభువుగా ఆయనను కీర్తిస్తారు. ఇందుకు సాదృశ్యంగా ఆయన జన్మించినప్పుడు ఆ శుభవర్తమానం అమాయకులైన గొర్రెల కాపరులకే ముందుగా తెలియడం ఆశ్చర్యానుభూతి కలిగించే విషయం.

‘నిన్ను వలే నీ పొరుగువాణ్ని ప్రేమించు’ ఇది ఆయన చిన్నవాక్యంలో అందించిన అద్భుతమైన ఉపదేశం. ‘దుర్మార్గులను, సన్మార్గులను; పతితులను, పవిత్రులను ఒకే దృష్టితో ప్రేమించగలిగే దివ్య మానసాన్ని మీరు ప్రతిష్ఠించుకోండి’ అని ఆయన చేసిన బోధన- అన్ని కాలాల్లో అందరూ అనుసరించదగ్గ ఆత్మసాధన. దేవుడు కొలువుదీరేది ఆత్మలో అయితే… దానికి మార్గం- క్రీస్తు బోధించిన ప్రేమతత్వం, కరుణ, క్షమ. ‘సంపూర్ణ మానవత్వమే మనిషిని మహాపురుషుడిగా, దైవస్వరూపుడిగా మారుస్తుంది’- ఇదే క్రిస్మస్‌ పర్వదినం ద్వారా సమస్త మానవాళికి అందే శుభసందేశం.

http://telugupandagalu.blogspot.com/2009/10/christmas.html?m=1

 

img_1317

పాలకుండలో కప్ప

img_1281

విలువ సత్యం

అంతర్గత విలువ : ఆశావహ ధృక్పధం,పట్టుదల
ఒక కప్ప గెంతులు వేస్తూ ఆరుబయట అటూ ,ఇటూ తిరుగుతూ ఉంది. చుట్టుపక్కల ఇంకేమి ఉన్నాయో అని ఆసక్తికొద్దీ , మితిమీరిన ఉత్సాహంతో గెంతుతూ పెద్దగా ఎగిరి పక్కనే సగం దాకా పాలున్న కుండలో పడింది. ఆ పాలలో ఈది కుండపైకి రావడానికి ప్రయత్నిస్తే, కుండ చివరి వరకూ దూరం ఎక్కువ కనపడి, అంతవరకూ
గెంతలేక పోయింది. ప్రతీ సారి వెనక కాళ్ళు సాగదీసి, శరీరం సాగదీసి కుండ అడుగునుండి ప్రయత్నించాలనుకుంటే కుండ లోతు ఎక్కువగా ఉంది. పై వరకూ ఎక్కలేదు, అడుగు వరకూ పోలేదు.
అయినా ఆ కప్పకు దాని ప్రయత్నం మధ్యలో వదలాలని లేదు. ఎలాగయినా కుండనించి బయటపడాలని, తన శక్తి కొద్దీ ప్రయత్నించాలని, గట్టిగా నిర్ణయించుకుని పాలల్లో అటూ,ఇటూ , పైకీ,క్రిందకీ,బలంగా గెంతులు వేయసాగింది. కొంతసేపటికి పాలన్నీ బాగా చిలకబడి పాలలోని వెన్న ఒక చిన్న కొండలాగా తయారయ్యింది. వెన్న ఘన పదార్ధం కాబట్టి అది కుండ పై భాగం వరకూ ఉంది. కప్ప వెన్న మీదనుండి కుండ బయటికి ఒక్క గెంతులో దూకేసి హమ్మయ్య అనుకుంది.

నీతి:

ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు. లక్ష్యం చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మధ్యలో వదిలివేయకూడదు.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

గోడకి అవతలివైపు

గోడకి అవతలివైపు
విలువ : ప్రేమ
అంతర్గత విలువ: ఓర్పు

img_0994

 

ఒక యువతి తమ పూలతోటను చాలా శ్రద్ధగా చూసుకునేది. ఆమె తన నాయనమ్మ దగ్గరనుండి మొక్కలను, పువ్వులను ఎలా ప్రేమగా చూసుకోవాలో, శ్రద్ధగా ఎలా పెంచాలో నేర్చుకుంది. తన నాయనమ్మను ఎంత ప్రేమిస్తోందో, పూలతోటను కూడా అంతే ప్రేమగా చూసుకుంటుంది. ఒకరోజు ఆ యువతి ఎప్పుడూ మొక్కలు కొనే నర్సరీ కి వెళ్ళింది.అక్కడ కొత్తగా ఒక మొక్కను చూసి ముచ్చటపడి కొని తీసుకువచ్చింది. తోటలో ఒక పక్కగా నాటి శ్రద్ధగా పెంచసాగింది.ఆ మొక్క కూడా బాగా ఎదిగింది కాని పువ్వులు పూయట్లేదు.

ఆ మొక్క గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ దానితో ప్రేమగా మాట్లాడసాగింది. అయినా ఆ మొక్క పువ్వులు పూయట్లేదు. ఒకరోజు దాని గురించి ఆలోచిస్తూ తోటలో నుండి ఆ మొక్కను తీసేసి కొత్త మొక్క నాటాలి అనుకుంది. ఇంతలో పక్కింటావిడ పిలవడంతో అటువైపు చూసింది.
ఆమె చాలా సంతోషంగా ఇలా అన్నది ” మీ కొత్త మొక్క పువ్వులు మాకు ఎంతో ఆనందం కలిగిస్తున్నాయి”. ఆ మాటకు ఆశ్చర్యపోయిన ఆ యువతి పక్కింటికి వెళ్లి చూసింది. ఆ మొక్క తీగలు గోడ మీదుగా వాలి ఉన్నాయి. ఆ తీగలకి ఎంతో అందమైన పువ్వులు ఉన్నాయి. అంత అందమైన పువ్వులను ఆ యువతి ఎప్పుడూ చూడలేదు. అవి చూసి చాలా సంతోషపడింది.

ఆ మొక్క పువ్వులు పూయట్లేదనే అనుకుంటోంది కాని దాని తీగలు గోడ మీదుగా పక్కింట్లోకి పాకి పువ్వులు పూస్తున్నాయని గమనించలేదు. ఒక్కోసారి మన శ్రమకి తగిన ఫలితం వెంటనే లభించకపోవచ్చు, కాని దాని అర్థం ఫలితం రాదని కాదు. ఓర్పుగా ఎదురుచూస్తే మంచి ఫలితం వస్తుంది.

నీతి :-

పడిన కష్టం ఎప్పుడూ వృధాగా పోదు. మంచిపనుల ప్రభావం ఒక్కోసారి వెంటనే కనిపించక పోవచ్చు, కానీ దాని ప్రభావం ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా ఉంటుంది. మనం నమ్మకంతో, ఓర్పుగా మన పనిని కొనసాగిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది.

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

నామస్మరణ మరియు నిస్వార్థ సేవ ప్రాముఖ్యత

విలువ:సత్యం
ఉపవిలువ:భక్తి మరియు దయ

img_0931

ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూర్చుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు.
చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు.
రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు.
ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణాన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే.

ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది.

బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు.
చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది.

తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు.
తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు.
భక్తుడు సరేనన్నాడు.
ఆ ఘడియ రానే వచ్చింది.
బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు.

భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు.
ఆశ్చర్యం ……!
దాని నుండి నిధి బయటపడింది.
వెండి, బంగారు నాణాలు దానిలో ఉన్నాయి.
అవన్నీ అతడి సొంతమయ్యాయి.

మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు.
అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది.
జరిగిన దానికి సంతోషపడ్డాడు.
కానీ, ఒక సందేహం అతడిని పీడించింది.

నిధి మీదే కూర్చున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడి గానే ఉండిపోయాను.
దారిన పోయే దానయ్య కోటీశ్వరుడు అయ్యాడు.
ఏమిటయ్యా ఇది!
అని ఇంద్రుణ్ణి ప్రశ్నించాడు.

అతడికి ఇంద్రుడు సమాధానం చెబుతూ,
నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూర్చుని, భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు.
అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది.
అతడు రోజూ భగవత్సేవ చేస్తూ, నీకు యదా శక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు.
నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.
అందుకే అతనికి సిరిసంపదలు లభించాయి
అన్నాడు ఇంద్రుడు.

నీతి:
వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి,గుడ్డి వాడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి.తప్పక అంతర్ముఖుడు కావాలి!