Archive | February 2016

ప్రేమ తో సాధించలేనిది ఏమీ లేదు !

image.jpeg

విలువ : ప్రేమ

అంతర్గత విలువ :క్షమ

కార్ల్ ప్రశాoతం గా ఉండే వ్యక్తి . మిత భాషి ,ఎప్పుడూ ఎదుటివారిని నవ్వుతూ పలకరించేవాడు .

రెండవ ప్రపంచ యుద్ధం రోజులలో అతనికి తగిలిన బుల్లెట్ గాయం తగిలింది  అప్పటి లో అతడు బ్రతక డేమో అని కూడా అనుకున్నారు.అదృష్టవశాత్తు అతడు   బ్రతికాడు.అయినా కూడా రిటైర్ అయ్యే దాకా అతడు పనిచేసే చోటికి బస్సు లో వెళ్ళేవాడు .అప్పడు అతని వయస్సు సుమారు 87ఏళ్ళు ఉండవచ్చు. కార్ల్ నివసించే పట్టణం లో అల్లరి మూకలు ఎక్కువై పోయాయి తరచూ ఏవో గొడవలు జరుగుతూ ఉండేవి.కార్ల్ వంటి ప్రశాంతం గా వుండే వ్యక్తి ఉండదగిన ప్రదేశం కాదది.

అక్కడున్న చర్చ్ కి సంబంధించిన తోటలలో పని చేయడానికి స్వయం సేవకులు కావాలని ఒక ప్రకటన చేశారు.కార్ల్ దానికి తోటమాలి గా ఉండడానికి ఒప్పుకున్నాడు. అక్కడ పని చేయడం మొదలు పెట్టాడు.

ఒక రోజున అతడు తోటలో మొక్కలకు నీళ్ళు పట్టడం ముగించే సమయానికి ముగ్గురు అల్లరి యువకులు అతని దగ్గరికి వచ్చి అతన్ని భయపెట్టడానికి ప్రయత్నం చేశారు.అదేమీ పట్టించు కోకుండా ,కార్ల్ వాళ్ళను మమూలుగా పలకరించారు.వాళ్ళు కార్ల్ కు కొంచం భయం కలిగించే విధంగా స్పందించి అతని వాచీని పర్స్ ని దొంగిలించి అతనిని త్రోసి ,పారిపోయారు. తనకాలు నొప్పిగా ఉండడం చేత కార్ల్ వాళ్ళను ప్రతిఘటించ లేక పోయాడు. తనకు సహాయ పడడానికి చర్చి అధికారి వస్తాడేమో అని ఆశగా ఎదురు చూశాడు,కాని చర్చి అధికారి కిటికీ లోంచి ,ఇదంతా గమనిస్తూ ఉండిపోయాడే కాని తొందరగా వచ్చి ఆ అల్లరి యువకులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

తరువాత తీరికగా వచ్చి ,”కార్ల్ !నీకేమైనా దెబ్బ తగిలిందా , ఏమైనా సహాయం కావాలా అని అడిగాడు . కార్ల్ , ఏమీ జరగనట్లు మామూలుగా , ” ఏమీ లేదండి , అల్లరి పిల్లలు, మూర్ఖంగా ప్రవర్తించారు , అంతే !

ఏదో ఒక రోజు వాళ్ళే తెలుసు కుంటారు లే “,అని అనేసి ఊరుకున్నాడు.కార్ల్ నీళ్ళు పెట్టే గొట్టాన్ని సరిచేసి మళ్ళీ మొక్కలకు నీళ్ళు పెట్టే పనిలో మునిగి పోయాడు. చర్చి అధికారి కార్ల్!ఏం చేస్తున్నావు అని అడిగాడు. మొక్కలలు నీళ్ళు పెట్టడం పూర్తి చేయాలి ఇవి ఎండి పోయి ఉన్నాయి అని ప్రశాంతం గా సమాధానం చెప్పి కార్ల్ తన పని లో ములిగి పోయాడు కార్ల్ బాగానే ఉన్నాడు అనుకుని చర్చి అధికారి కార్ల్ అందరి లాటి వ్యక్తీ కాదు ఇతను ఒక ప్రత్యే క తరహా కు చెందిన వ్యక్తి అనుకుంటూ వెళ్లి పోయాడు కొన్ని రోజుల తరువాత్ ఆ అల్లరి యువకులు మళ్ళీ వచ్చారు. కార్ల్ వాళ్ళ నేమీ చేయలేడని వాళ్ళ ధీమా కార్ల్ వాళ్ళను చూసి ఇదివరకు లాగీ ప్ర శాo తం గా డ్రింక్ కావాలా అని అడిగాడు ఈ సారి వాళ్ళు కార్ల్ దగ్గర ఏమీ దోచు కో లేదు కార్ల్ చేతిలో నీళ్ళు పెట్టే పైప్ లాక్కొని తల నుండి పాదాల వరకు అతణ్ణి చల్లటి నీళ్ళతో తడిపివేసి వెక్కిరిస్తూ తిడుతూ హుందా గా నడుచు కుంటూ ప్రక్కవీది లోంచి వెళ్లి పోయారు తాము చేసిన పని తో వాళ్ళు పెద్ద విజయం సాధించినట్లు భావించారు కార్ల్ ఒక్క నిముషం వాళ్ళ వైపు చూసి మళ్ళీ తన పనిలో మునిగి పోయాడు.

వేసవి కాలం గడిచింది .కార్ల్ తోటలో నాగలి దున్నుతుండగా , తనను ఇబ్బంది పెట్టడానికి ఎవరో వెనుక వైపు వచ్చి నిలబడడం కార్ల్ గమనించాడు . వాళ్ళ నుంచి తప్పించు కోవాలనే ప్రయత్నం లో ప్రక్కనే ఉన్న చెట్టు కొమ్మల లో పడి పోయాడు. నెమ్మది గా లేచి వెనుకకు తిరిగి చూసే సరికి తనను ఇంతకు ముందు ఇబ్బంది పెట్టిన అల్లరి యువకుల నాయకుడు కనుపించాడు .కార్ల్ తో అతను , “సార్ !భయ పడకండి!నేను ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టడానికి రాలేదు “,అని మృదువుగా చెప్పాడు .అంతే కాకుండా కింద పడిపోయిన ,కార్ల్ ను ఆ యువకుడు నెమ్మదిగా లేవదీసి అతని చేతిలోఒక సంచీని పెట్టాడు . ఇదేమిటి అని కార్ల్ అడుగగా , ఆ యువకడు ,” ఇది మీ సొమ్మే అండి !” అని జవాబు చెప్పాడు.

ఇంత కాలానికి ఇప్పుడు ఎందుకు నీవు ఈ సొమ్ముని నాకు తిరిగిస్తున్నావు అని అడుగగా , ఆ యువకుడు ఒక అడుగు ముందుకు వేసి ,”నేను మీ నుండి కొన్నివిషయాలు నేర్చుకున్నాను.

ఇంతకు ముందు నా తోటి వారి తో కలసి మీలాంటి వాళ్ళను బాధ పెట్టి వాళ్ళ సొమ్మును దోచుకొనే వాడిని. మేము ముఖ్యంగా ముసలి వాళ్ళనే ఎంచు కొని ఇలా చేసే వాళ్ళం. ప్రతి సారి మేము వచ్చి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మీరు మా మీద కోపగించు కోలేదు సరి కదా, మమ్మల్ని తోటి వారిలా ఆప్యాయంగా పలకరించేవారు . మాతో పోట్లాడ లేదు మమ్మల్ని అసహ్యిం చు కోలేదు. మమ్మల్నిద్వేషిం చ డా నికి బదులు గా మా మీద ప్రేమ చూపించారు .మమ్మల్ని పోలీసులకి పట్టించలేదు మీ సొమ్ము దొంగిలించాక నాకు నిద్ర పట్ట లేదు .అందుచే మీ సొమ్మును మీకు తిరిగి ఇచ్చేదామని వచ్చాను . అని చెప్పి ఆ యువకుడు వెళ్లి పోయాడు.

కార్ల్ ఆ బాగ్ తెరచి చూస్తే తన వాచీ మరియు డబ్బులు భద్రం గా ఉన్నాయి. తన భార్య చిరునవ్వు నవ్వుతూ తన వైపు చూస్తున్న ఒకప్పటి ఫోటో కూడా భద్రంగా ఉంది. ఆ చిత్రం ఒక క్షణం పాటు కార్ల్ కు పాత జ్ఞా పకాలను గుర్తు చేసింది.

తరువాత వచ్చిన క్రిస్మస్ రోజులలో కార్ల్ చని పోయాడు. అంత్య క్రియలకు చాలా మంది వచ్చారు. అంత్య క్రియలకు వచ్చిన వారిలో ఒక పొడుగాటి యువకుడు ఒక మూల ఒంటరి గా కూర్చుని ఉండడం చర్చి అధికారి గమనించాడు . చర్చి అధికారి కార్ల్ కు నివాళులులను అర్పిస్తూ తన మాటలలో ,”మీలో ఎవర్రైనా మీ ఇంటిలో ఉద్యానవనాన్ని ఇంత కార్ల్ అంత అందం గా తీర్చి దిద్ద గలరా అని ప్రశ్నించాడు .మనం కార్ల్ ని ,అతడు పెంచిన ఉద్యానవనాన్ని ఎప్పటికీ మరచి పోలేము కదూ అని అంటూ అక్కడి నించి బాధతో వెళ్ళిపోయాడు.

తరువాత కొన్ని రోజులకు చర్చి అధికారి ఆఫీసు రూమ్ తలుపు ఎవరో వచ్చి తట్టారు. తలుపు తెరిచి చూసే సరికి కార్ల్ చనిపోయినపుడు అతని అంత్య క్రియలపుడు కనిపించిన యువకుడు చేతిలో కార్ల్ విరిగి పోయిన బూటు ని తీసుకుని వచ్చాడు .

ఆ యువకుణ్ణి కార్ల్ పర్సు దొంగతనం చేసిన వ్యక్తి గా అ చుర్చ్ అధికారి గుర్తించాడు .కార్ల్ దయాగుణం ఆ యువకుని లో మార్పు తెచ్చిందని చర్చి అధికారి తెలుసుకో గలిగాడు. కార్ల్ చేసిన ఆ ఉద్యానవనం లో పని చేయడానికి ఆ యువకుడు వచ్చాడని విని చర్చి అధికారి చాలా సంతోషించాడు .

ఉద్యాన వనం తాళాలు ఇచ్చి నీవు వెళ్లి ఉద్యానవనం బాధ్యతను తీసుకుని కార్ల్ ఆత్మ సంతోషించేలా నిర్వహించు అని చెప్పాడు .

ఆ ఉద్యానవనం లో తరువాత చాల రోజులు పని చేశాడు .

కార్ల్ చేసినంత శ్రద్ధ గా పని చేసి ఉద్యాన వనం లో చక్కటి పూల మొక్కలను కూరగాయల మొక్కలను పెంచాడు .

పగటి సమయం లో కాలేజీ కి వెళ్లి కష్టపడి చదువుకున్నాడు పెద్ద వాడై పెళ్లి చేసుకుని సమాజం లో గౌరవ ప్రద మైన స్థానానికి ఎదిగాడు కాని అతడు కార్ల్ కి ఇచ్చిన మాట తప్పకుండా కార్ల్ తీసు కు న్నం త శ్రద్ధ తీసుకుని ఉద్యానవనాన్ని అందంగా తీర్చి దిద్దాడు.అంతే కాకుండా తనకు పుట్టిన బిడ్డకు కార్ల్ పేరు పెట్టుకున్నాడు

ఈ విధంగా కార్ల్ ను ఆదర్శంగా తీసుకుని ఇద్దరు యువకులు చక్కని బాటలో నడిచి మంచి పేరు తెచ్చుకున్నారు .

నీతి : చీకటి ,చీకటిని పార ద్రోల లేదు ..ఒక దీపం మాత్రమే ఆ పని చేయ గలుగుతుంది.

ద్వేషం ద్వేషాన్ని పోగొట్ట లేదు ప్రేమ మాత్రమే ఆ పని చేయ గలుగు తుంది ఎదుటి వ్యక్తీ లో పరివర్తనతేవడం ప్రేమ ద్వారా మాత్ర్రమే సాధ్యమవుతుంది ప్రేమ యొక్క శక్తిని తక్కువగా అంచనా వేయవద్దు.

ప్రేమ ఒక్కటే ప్రపంచాన్ని ప్రేమ పూరితంగా ప్రశాంతo గా ఉండేలా చేయ గలదు

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

 

అవ్యాజమైన ప్రేమ

image
విలువ: ప్రేమ

అంతర్గత విలువలు:- మంచి చెడ్డలను సమానం గా స్వీకరించడం, అవ్యాజమైన ప్ర్రేమ
ఆరోజు శుక్రవారం. అండ్రూ ఉదయమే ఆఫీసు కు వెడుతూ తన భార్యతో ఈ రోజు ఎలాగైనా తన యజమానిని కలసి జీతం పెంచమని అడుగుదామని నిర్ణ యించు కున్నాను అని చెప్పాడు.

ఆ రోజంతా అండ్రూ అసహనం గా ,చాలా ఒత్తిడి లో గడిపాడు . జీతం పెంచమని అడిగితే పిసినారి అయిన యజమాని ఒప్పు కుంటాడా అని   అండ్రూ  సందేహం. అండ్రూ  గడచిన పదు నెనిమిది నెలల నుండి చాలా కష్ట పడి పని చేస్తూన్నాడు. కొన్ని అకౌంట్స్ ముఖ్యంగా బార్బెర్ & హాప్కిన్స్ సంస్థ కు చెందిన ఖాతా లను ఒక కొలిక్కి తేవడం లో విజయం సాధించాడు అతని జీతం పెంచడం అన్నివిధాలా సమంజసం. దానికి అన్నివిధాలా  అండ్రూ అర్హుడు కానీ , మధ్యాహ్నం తన యజమాని ఛాంబర్ లోకి వెళ్ళా లనే  సరికి అండ్రూ కి కాళ్ళు వణక సాగాయి. మొత్తానికి ధైర్యం కూడగట్టుకుని తన యజమానిని తనకు జీతం పెంచమని అడగ గలిగాడు.

ఆశ్చర్య కరం గా యజమాని వెంటనే ఒప్పుకున్నాడు .

ఆండ్రూ చాలా సంతోషం గా ఇంటికి చేరుకున్నాడు .ఇంటికి వచ్చే సరికి అతని భార్య టీనా అండ్రూ కి ఇష్టమైన వంటకాలతో భోజనం సిద్ధం చేసింది అండ్రూ భోజనానికి కూర్చునే సరికి అందమైన అక్షరాలతో టీనా వ్రాసిన ఒక కాగితం ప్రక్కనే కనపడింది. ఆ కాగితం మీద,” ప్రియా అభినందనలు నీ జీతం పెరుగుతుందని నాకు ముందే తెలుసు !నీకు జీతం పెరగడం నాకు ఎంతో సంతో షం గా ఉంది . నేనునిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియాలనే ఈ రోజు ఈ భోజనం సిద్ధం చేశాను ,”అని వ్రాసి ఉంది .

తన భార్య తనను ఎంతగా ప్ర్రేమిస్తోందో అని తలచుకుని అండ్రూ ఎంత గానో సంతోష పడ్డాడు . భోజనంచేసి అండ్రూ చేతులు కడుగు కోవడానికి వంటింట్లోకి వెడుతూ వుంటే మరొక కాగితం కనపడింది. అది టీనా పర్సు లోంచి జారి పడింది .టీనా ఈ విషయం గమనించ లేదు . దాంట్లో ఇలా వ్రాసి ఉంది ….

“జీతం పెరగ లేదని బాధ పడకు. నీకు జీతం ఖ చ్చితo గా పెరగాలి ,ఆ అర్హత ఖచ్చితంగా నీకుంది !నీవు గొప్ప పని మంతుడివి నీ బాధ్యతలను చక్కగా నిర్వర్తి స్తావు నీ జీతం పెరగక పోయినా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియాలనే ఈ భోజనం సిద్ధం చేశాను”ఇది చదివే సరికి అండ్రూ కళ్ళ నుండి జారిపడిన ఆనంద బాష్పాలకు హద్దులు లేవు అతడు ఉబ్బి తబ్బిబ్బ య్యాడు .

తన జీతం పెరిగినా పెరగక పోయినా తను విజయం సాధించినా సాధించక పోయినా తన పై అవ్యాజమైన ప్రేమ చూబించే టీనా వంటి భార్య ను చూసి అండ్రూ కి ఆనందం తో పాటు ఎంతో గర్వం కూడా కలిగింది.

నీతి :మనలను మన్స్ఫూర్తి గా ప్రతి ఫలాపేక్ష రహితం గా ప్రేమించే వాళ్ళుంటే ఓటమి వల్ల మనలో కలిగే నిరా శ కొంతవరకైనా తగ్గి ఊరట కలుగుతుంది .ప్రతి ఫలాపేక్ష లేకుండా అవ్యాజమైన ప్రేమ చూబించ గలిగితే అది మనకు, ఎదుటి వారికి కూడా ఆనందాన్ని ,తృప్తి ని ఇస్తుంది.

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

వ్యక్తిత్వం

image
విలువ: ధర్మ
అంతర్గత విలువ: నిజాయితి,సత్ప్రవర్తన

నేను, నా స్నేహితుడు చాలా కాలం తరువాత కలుసుకున్నాము. కబుర్లలో పడి సమయం ఎంత అయిందో గమనించలేదు. చీకటి పడిపోయింది. వాతావరణం చల్లగా ఉండడంతో గాలి చాలా చల్లగా వీస్తోంది. ఆటో తీసుకుని తొందరగా ఇంటికి వెళ్తే మంచిదనిపించింది.
​ ఇంతలో వర్షం కూడా మొదలవటంతో ఆటో కోసం పరిగెత్తాము. ఎవరూ ఆటోలు ఆపట్లేదు. చివరకు ఒక డ్రైవరు ఆపాడు.దేవుడా ! అమ్మయ్యా! అనుకుంటూ ఆటో ఎక్కాము. ఎక్కడికి వెళ్ళాలో డ్రైవరుకు చెప్పాము. దారిలో ఎక్కడైనా టీ కొట్టు దగ్గర ఆపమని చెప్పాము.
​ కొంతదూరం వెళ్ళాక టీ కొట్టు దగ్గర ఆటో ఆగింది.

మేము దిగి డ్రైవరును కూడా మాతో టీ త్రాగటానికి పిలిచాము. అతను వద్దు అన్నాడు. నేను రమ్మని బలవంతం చేసినా కూడా అతను వినయంగా వద్దని చెప్పాడు.
​ నా స్నేహుతుడు ఈ షాపులో టీ త్రాగటం నీకు ఇష్టం లేదా? అని అడిగాడు డ్రైవరిని. దానికి అతడు అదేమీలేదు సార్,” నాకు ఇప్పుడు టీ తాగాలని లేదు అన్నాడు. ఒక కప్పు టీ తాగితే నష్టం లేదు రావయ్యా!”అని అన్నాను నేను.
​ అతను మళ్ళీ “వద్దు సార్ !అన్నాడు వినయంగా. నా స్నేహితునికి కోపం వచ్చి ఎప్పుడూ బయట టీ తాగనట్లే మాట్లాడుతున్నావేంటి? అని మండి పడ్డాడు.

ఆటోడ్రైవర్ మళ్ళీ వినయంగా అవునండీ !”నేను బయట ఏమీ తినను,త్రాగను అన్న్నాడు. నా స్నేహితుడు చాలా కోపంగా మాతో టీ తాగడం నీకు పరువు తక్కువ అని భావిస్తున్నావా? మేము నీ తాహతుకు సరిపోమా అని అడిగాడు. అతను ఏమీ జవాబు చెప్పలేదు .వాదన మంచిది కాదని నేను నా స్నేహితుడిని వారించాను.

​టీ త్రాగటం అయ్యాక ఆటో ఎక్కి ఇంటికి చేరాము. డబ్బులు ఇచ్చిన తరువాత కుతూహలం కొద్దీ డ్రైవరును అడిగాను. నువ్వు టీ ఎందుకు తాగలేదో తెలుసుకోవచ్చా అని. దానికి అతను సార్!
మా తండ్రి గారికి ఒంట్లో బాలేదు ,వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. దాని కోసం డబ్బును ఆదా చేస్తున్నాను.ఆయనకి పూర్తిగా నయమయ్యి ఇంటికి వచ్చి ఎప్పటిలా హుషారుగా తిరిగేదాక , నేను డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టదల్చుకున్నాను. సమయం వృధా చెయ్యకుండా రోజుకి ఖచ్చితంగా కొంత  వరుకు డబ్బు సంపాదించాలి అని నిశ్చయించుకున్నాను. అందుకని నేను మీతో రాలేక పోయాను అని చెప్పాను.
కష్టం లో ఉండి కూడా వృత్తి ధర్మాన్ని క్రమం తప్పకుండా నిజాయితీగా పాటించడమే కాకుండా అతను బాధ్యత గల కొడుకుననిపించుకున్నాడు

నీతి: నిజాయితీ అనేది మనుషులకు ఉండవలసిన లక్షణాలలో ఒకటి. కష్టాలలో ఉన్నప్పుడే మనిషి వ్యక్తిత్వం ఏమిటో తెలుస్తుంది. మన ప్రవర్తనలో నిజాయితీ ఉండడం వల్ల మనకు మనశ్శాంతి, సంతోషం మరియు సంఘంలో గౌరవం కూడా లభిస్తాయి.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

ప్రయత్నలోపం

image

విలువ: ధర్మం
అంతర్గత విలువ: ప్రయత్నం

అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. దయ కలవాడు. పక్షులన్నా, జంతువులన్నా చాలా ఇష్టపడేవాడు. వాటి కోసం ఒక వనం ఏర్పాటు చేసి వాటి సంరక్షణ కోసం పనివారిని నియమించాడు. ఒకరోజు అతని స్నేహితుడు వేరే దేశానికి చెందిన రెండు గ్రద్దలను బహుమతిగా ఇచ్చాడు. రాజు వాటి రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించి గ్రద్ధలను వనంలో ఉంచాడు.

ఆ గ్రద్ధలు ఈ దేశ వాతావరణానికి అలవాటు పడే విధంగా వాటికి తగిన ఏర్పాట్లు చేస్తూ జాగ్రత్తగా చూస్తున్నాడు ఆ వ్యక్తి. ఒకరోజు రాజు గ్రద్దలను చూడటానికి వచ్చాడు. అందులో ఒక గ్రద్ద చాలా ఎత్తు వరకు ఎగరడం చూసి సంతోషించి వాటి రక్షణ బాధ్యత బాగా చూస్తున్నందుకు అతనికి 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు.
రెండవ గ్రద్ద సంగతి ఏమిటి? అని అడిగాడు రాజు. అది ఎగరడానికి ఇష్టపడట్లేదని ఎంత బాగా చూసినా చురుకుగా ఉండట్లేదని కారణం అంతు పట్టట్లేదని చెప్పడు ఆ వ్యకి, అది విన్న రాజు ఒక వృద్ధుడిని పిలిచి గ్రద్ద ఎగరక పోవటానికి కారణం తెలుసుకోమన్నారు.
మర్నాడు రాజు గ్రద్దలను చూడటానికి వెళ్ళేసరికి రెందవ గ్రద్ధ కూడా ఎంతో ఎత్తుగా ఎగరడం చూసి ఆశ్చర్యపోయారు. ఒక్కరోజులో మార్పుకు కారణం ఏమిటని వృద్ధుడు అడిగారు. దానికి వృద్ధుడు నవ్వుతూ ఏమీలేదు రాజా! ఆ గ్రద్ధ కూర్చున్న చెట్టు కొమ్మ నరికేసాను. అప్పటి నుండి ఎగురుతోంది అని చెప్పాడు.

నీతి: మనలో చాలామంది ప్రవర్తన ఇలాగే ఉంటుంది. “సాధనమున పనులు సమకూరు ధరలోన” అన్నట్ట్లు కస్టపడితేనే పనులు అవుతాయి,ప్రయత్నలోపం లేకుడా మన పని మనం చేస్తే జీవితంలో కూడా ఎంతో ఎత్తుకు ఎదగవచ్చు.

 

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

దూరపు కొండలు నునుపు గా కనిప్స్తాయి!

దూరపు కొండలు నునుపు గా కనిపిస్తాయి !!!
విలువ –సత్ప్తవర్తన
అంతర్గత విలువ –నమ్మకం

 

image

ఒక చిన్న గ్రామం లో, రాళ్లు కొట్టే వాడు, ఒకడు ఉండేవాడు. రొజంతా కష్టపడి రాళ్ళని సమమైన ఆకారం వచ్చేటట్లు కొట్టి , ఖాతాదారులకి తగినట్టుగా తయారు చేస్తూ ఉండేవాడు. ఈ పని వల్ల తన రెండు చేతులూ గట్టిగానూ మరియు బట్టలు చాలా మురికిగా తయారయ్యేవి.

ఒక రోజు ఒక పెద్ద శిలని కొట్టే పని పెట్టుకున్నాడు .కొన్ని గంటలు కష్టపడి పని చేశాడు .చాలా ఎండగా ఉండటం వల్ల అలిసిపొయి, నీడపట్టున కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్ది సేపటికి మనుషుల మాటలు ఏవో వినిపించాయి. “ఎవరా అదీ !”అని తిరిగి చూశాడు

అతనికి అప్పుడు ,పల్లకి లో రాజుగారు, వెంట సైనికులు, బంటులు, పెద్ద ఉరేగింపు కనిపించింది .
అప్పుడు ఒక్కసారి ఇలా అనుకున్నాడు, “రాళ్లు కొట్టే వాడి కన్నా, రాజుగారి లా జీవిస్తే ఎంత బాగుండేదో ?”. అలా అనుకో గానే ఒక వింత జరిగింది.

రాళ్లు కొట్టే వాడు అకశ్మాత్తుగా మంచి ఖరీదు గల, దుస్తులు, ఆభరణాలు వేసుకుని ఉన్నాడు. తన చెతులు ఎంతో మృదువుగా అయిపొయాయి. చక్కగా పల్లకిలో కుర్చుని ఉన్నాడు. పల్లకి లో నించి బయటికి చూస్తూ , “ఎంత బాగుందో ఇలా రాజు గా ఉంటే , ఎంత మంది పనివాళ్ళు ఉంటారో !” అని అనుకున్నాడు .

ఇలా ముందుకి పల్లకిలో సాగుతూ , కొద్దిసేపటికి రాజుగా మారిన రాళ్ళు కొట్టే వాడు ఎండ తట్టుకోలేక , మంత్రిని కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆగమన్నాడు. అలా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అతనితో మంత్రి ఇలా అన్నాడు’ ,”మహారాజా మీరు ఈ రోజు, సూర్యాస్తమయం అయ్యే లోపల అంత:పురానికి చేరుకోక పోతే నన్ను ఉరి తీస్తా అన్నారు కదా ?”అని మనవి చెశాడు .

అప్పుడు ఆ రాళ్లు కొట్టే వాడికి మంత్రి పైన జాలి వేసింది. అలాగని తను వేడిని కూడా తట్టుకోలేక పొయాడు.

అప్పుడు మళ్ళీ తన మనుసులో ఇలా అనుకున్నాడు, ” రాజుగా నేను యేమైనా చేయగలను కాని ,నాకంటే సూర్యుడు ఇంకా శక్తిగల వాడు. రాజుగా కంటే సూర్యుడిగా ఉంటే బాగుండు కదా “అని ఇలా అతడు అనుకోగానే రాళ్లు కొట్టేవాడు , సూర్యుడి గా మారిపొయాడు.

ఇలా ఈ యొక్క కొత్త శక్తి ని అతను అదుపు లో పెట్టలేక పోయాడు.

విపరీత మైన ఎండ కాయడం వల్ల పొలాలు ఎండి పొయేవి. సూర్య కిరణాలు, ఆవిరిగా మారి, భూమిని, పెద్ద మబ్బు గా కప్పి వేసింది ఆ ఆవిరి.

అప్పుడు అతను ” ఔనూ !సూర్యుడి కంటే మబ్బు శక్తివంత మైనది కదా “అనుకున్నాడు.

రాళ్లు కొట్టే వాడువెంటనే మబ్బుగా మారపోయాడు. తన శక్తిని చూపించుకో వాలనే అహంకార భావం వలన ,విపరీతమైన వాన, తుఫాను కురిపించాడు. పొలాలు, ఇళ్ళు అన్నీ కొట్టుకు పోయాయి. కాని, తను ఇదివరుకు పని చెస్తున్న శిల మాత్రం కదల లెదు. ఎంత వర్షం కురిసినా కదల కుండా అలా ఉండిపొయింది.

అప్పుడు శిల ఎంత శక్తి వంతమైనది కదా మబ్బు కంటే అనుకున్నాడు.మరి రాళ్లు కొట్టే వాడికే కదా , అటువంటి శక్తివంత మైన శిలని మంచిగా తయారు చేయగలిగే శక్తి ఉంటుంది “!అని అనుకున్నాడు. వెంటనే మళ్ళీ అతను రాళ్లు కొట్టే వాడిగా మారి పొయాడు.
ఎప్పటి లాగానే తన రెండు చెతులూ కఠినంగా అయిపొయాయి, బట్టలు మాసి పోయి రాళ్లు కొడుతూ సంతోషంగా ఉన్నాడు. తన తప్పుని తెలుసుకుని తృప్తిగా తన వృత్తి ధర్మాన్ని ఆనందంగా నిర్వర్తించ సాగాడు ,

నీతి :
దూరపు కొండలు ఎప్పుడూ నునుపుగా కనిపిస్తాయి. మన వృత్తిని మనము ఆరాధనా భావం తో ఆనందంగా చేసుకో వాలి .ఎవరి  గొప్ప వారిదే అన్ని పనులూ గొప్పవే .ఏది జరిగినా అది మన మంచికే అని అనుకోవాలి .

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

ఎవరు ఏ పని చెయాలో వారే చెయ్యాలి

image
విలువ :సత్యం
అంతర్గత విలువ : కర్తవ్యం
వీధులు ఊడ్చే ఒక స్వీపర్ కి పని చేసి చేసి విసుగొచ్చింది.
దేవుడితో ఈ విధంగా మొరపెట్టుకున్నాడు.

“రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు.నా బతుకు చూడు.ఎంత దుర్భరమో
ఒక్క రోజు… ఒక్కటంటే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి. నీ పనిని నేను చేస్తా,” అప్పుడు నా బాధ ఎంటో నీకు అర్థం ఔతుంది అని సవాలు విసిరాడు.
భక్తుడి కొరికను మన్నించి సరేనన్నాడు ఆ భగవంతుడు.
“అయితే ఒక్క షరతు. నువ్వు ఎవరేమన్నా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు.నోరు మెదపకూడదు.”అన్నాడు దేవుడు.”సరే” అన్నాడు మన వాడు.

తెల్ల వారగానే మన వాడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు.( సూక్ష్మ రూపం లో అనమాట)
కాసేపటికి ఓక ధనిక భక్తుడు వచ్చాడు.
“దేవా … నేను కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నాను. దయచేసి మా పైన లాభాల వర్షం కురిపించు”అంటూ భగవంతుడిని ప్రార్థించ సాగాడు.

ఐతే పాపం అతని జేబులో నించి పర్సు కింద పడిపోయింది. అతడు అది గమంకంచకుండా వెళ్లిపోయాడు.
ఇదంతా చూస్తున్న మన స్వీపెర్ ,
“నాయనా కింద .. పర్సు వదిలేశావు చూసుకో”అందామనుకున్నాడు.
కానీ దేవుడి తో తాను చేసిన ఒప్పందం గుర్తుకు వచ్చి మౌనంగా ఉండి పోయాడు.ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు.”దేవా… నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అది నీకు సమర్పించుకుంటున్నాను. కాస్త నా యందు దయ చూపీ తండ్రి అని వేడుకున్నాడు .కళ్లు తెరిచి చూసే సరికి అతనికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది.”ఇలా నా పీ దయ చూపించావా తండ్రీ”అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు.

“దొంగా…. “అని అరుద్దామనుకున్నాడు మన స్వీపెర్.కానీ ఎలాగోలా నోరు మెదపకుండా ఊరుకున్నాడు.ఆ తరువాత ఒక నౌకా నడిపేవాడు వచ్చాడు.”దేవా రేపు సముద్ర ప్రయాణం ఉంది.ప్రయాణం లో యే ఇబ్బందులు ఎదురవ్వకుండా నన్ను చల్లగా కాపాడు తండ్రీ.అన్నాడు.అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు.

“నా తరువాత వచ్చింది ఇతడే. కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు,పట్టుకొండి” అని ఈ నౌకావాడిని నిందించాడు .పోలీసులు అతడిని అరెస్టు చేశారు.ఈ అన్యాయాన్ని కళ్ళారా చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు.”ఆగండ్రా… ఇతను నిర్దోషి. అసలు దొంగ ఇంకొకడు. ఇందాకే వచ్చి వెళ్ళిన బిచ్చగాడు పర్సును తీసుకెళ్లాడు.”నేనే సాక్షి అని మన స్వీపర్ అరిచేశాడు.
విగ్రహం నుండీ మాటలు వినపడే సరికిదేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి, ఆ పేదవాడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు.

చేసుకున్న ఒప్పందం ప్రకారం సాయంత్రానికి వీధులు ఉడ్చేవాడు దేవుడి స్థానం నుండి తన డ్యూటీ లోకి దిగాడు.దేవుడు కూడా తన స్థానం లోకి వచ్చేసాడు.అప్పుడు తనతో ఆ స్వీపర్ ,
“దేవా… ఇవాళ్ల ఎంత మంచి పని చేశానో తెలుసా…ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను. అంతేకాకుండా ఒక దోషిని అరెస్టు చేయించాను.”అన్నాడు మనోడు.దేవుడు “ఎంతపని చేశావోయ్. అసలు …ఎందుకలా చేశావు.”నీకు నేను చెప్పిందేమిటి,ఎమైనా సరే నోరు మెదపొద్దు అని చెప్పానా లేదా ,అప్పుడు సరే అన్నావు కదా ? అని మందలించాడు.స్వీపర్ భయపడి పోయి ,” ఇంత మంచి పని చేసినందుకు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను.” మీకు అంత కోపం తెప్పించేంత యేమి తప్పు జరిగింది నా వల్ల.దయచేసి నాకు అర్ధమయ్యేలా చెప్పండీ అని దీనంగా వేడుకున్నాడు ఆ భగవంతుడిని.

అప్పుడు జవాబుగా పరమాత్ముడు ,”ఆ ధనవంతుడు మహాపాపాత్ముడు.వాడు అందరినీ దోచుకుంటున్నాడు.”వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను.మరోపక్క పేదోడికి కష్టాలు తీరేవి కదా వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవాడు కదా .

ఇక నావికుడు తెల్లారితే సముద్ర ప్రయాణం చేయబోతున్నాడు.దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు.అదే అతను అరెస్టై అయ్యి జైల్లో ఉంటే బతికిపోయేవాడు.
ఇప్పుడు చూడు… పేదోడు జైల్లో ఉన్నాడు. ధనికుడు పాపాలు చేస్తూనే ఉంటాదు . నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావు నువ్వు…అన్నాడు దేవుడు.
ఇదంతా విని స్వీపర్ ఎంత పని చేశాను ,చక్కగా దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం గమ్మున ఉంటే ఇంత అనర్ధం తప్పేది కదా అని మొత్తుకున్న్నాడు .

నీతి :
ఆ దేవుడి లీల ఏమిటో మనకి తెలియదు .
కష్టంలా కనిపించేది వాస్తవానికి మనకి మేలు చేయొచ్చు.
తప్పులా తోచేది నిజానికి మనకి ఒప్పై ఉండచ్చు.ఆయన ఆలోచనల లోతు ని అర్థం చేసుకోటం ఎవరికీ సాధ్యం కాదు .ఏది జరిగినా మన మంచికే భగవంతుడు మనకి ఏది అవసరమో ఏది మంచో అదే ఇస్తాడు

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu