Archive | August 2019

ధనవంతుడు మరియు ముగ్గురు బిచ్చగాళ్ళు

విలువ: ప్రేమ
అంతర్గత విలువ: భగవంతుని శరణు వేడుట

3559F3E9-3015-42E8-9290-3CD20154771A.png

ఒక ఊరిలో మంచి వ్యక్తిత్వం కలిగిన ధనవంతుడు ఉండేవాడు.  ముగ్గురు బిచ్చగాళ్ళు ఆ ధనవంతుడిని సహాయం అడగాలని అనుకున్నారు. మొదటి బిచ్చగాడు ధనవంతుడి దగ్గరకు వెళ్ళి నాకు 5 రూపాయలు ఇవ్వండి అని అడిగాడు. ధనవంతుడికి కోపం వచ్చి నేనేదో నీకు అప్పు ఉన్నట్టు అడుగుతున్నావే, ఈ 2 రూపాయలు తీసుకుని వెళ్ళు అని పంపించేసాడు.
రెండవ బిచ్చగాడు ధనవంతుడి దగ్గరికి వెళ్ళి అయ్యా; నేను 10 రోజులుగా సరైన తిండి లేకుండా ఉన్నాను, నాకు సహాయం చెయ్యండి అని వినయంగా అడిగాడు.  నీకు ఎంత డబ్బు కావాలి అని ధనవంతుడు అడిగాడు. మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి అన్నాడు బిచ్చగాడు. ధనవంతుడు 10 రూపాయలు ఇచ్చి ఈ డబ్బుతో 3 రోజులు కడుపునిండుగా భోజనం చెయ్యవచ్చు అని చెప్పి పంపించాడు.

మూడవ బిచ్చగాడు ధనవంతుడి దగ్గరకు వెళ్ళి అయ్యా; మీ గురించి చాలా మంచిగా విన్నాను. మిమ్మల్నిఒక్కసారి చూసి పోదామని వచ్చాను. మీలాంటి మంచి గుణాలు ఉన్న వ్యక్తులు భగవంతుడితో సమానం అన్నాడు. అది విన్న ధనవంతుడు బిచ్చగాడిని కూర్చోమని  కుర్చీ చూపించాడు. చాలా అలసటగా కనిపిస్తున్నారు అని చెప్పి తినడానికి ఆహారం అందించాడు. మీకోసం నేను ఏమి చెయ్యగలను అని అడిగాడు. దానికి సమాధానంగా బిచ్చగాడు అయ్యా కడుపునిండా తిండి పెట్టేరు, ఆప్యాయంగా మాట్లాడేరు అది చాలు.నేను మీ నుండి ఏమీ ఆశించట్లేదు అన్నాడు.  ధనవంతుడు బిచ్చగాడి ప్రవర్తనకు సంతోషించి జీవితాంతం తన దగ్గరే ఉంచుకుని ప్రేమగా చూసుకున్నాడు.

నీతి:
——-
భగవంతుడు కూడా పై కథలో ధనవంతుడిలాంటివాడు.  ముగ్గురు బిచ్చగాళ్ళ వలే మూడు రకాల వ్యక్తులు ప్రపంచంలో ఉంటారు. మొదటిరకం వాళ్ళు భగవంతుడి మీద పెత్తనం చేసి తమ పనులు నెరవేర్చుకోవాలని చూస్తారు. రెండవరకం వాళ్లు ప్రాపంచిక సుఖాలకోసం భగవంతుడిని ఆశ్రయిస్తారు. మూడవరకం వాళ్ళు ఉన్నంతలో తృప్తిగా ఉంటూ భగవంతుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారు  మూడవరకం వాళ్ళు ఉత్తములు. వారికి భగవంతుడు బాధని తగ్గించి జాగ్రత్తగా కాపాడుకుంటాడు.

https://saibalsanskaar.wordpress.com/2015/12/08/a-millionaire-and-three-beggars/

మూడు రకాల మనుషులు

 

EE8F1EE1-DC1F-426B-A4BA-DAE5DF00F5CD.jpeg

విలువ: సత్యము

అంతర్గత విలువ: నమ్మకము, వినయము 

ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యార్థికి 3 బొమ్మలు ఇచ్చి వాటిలో గల తేడాలు కనిపెట్టమన్నారు. ఆ 3 బొమ్మలు ఆకారం,పరిమాణంలో చూడడానికి ఒకేలా ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించిన తరువాత ఆ బొమ్మలలో  రంధ్రాలు ఉన్నాయని గమనించాడు ఆ విద్యార్థి. మొదటి బొమ్మకు రెండు చెవులలో రంధ్రాలు ఉన్నాయి. రెండవ బొమ్మకు ఒక చెవిలో మరియు నోటిలో రంధ్రాలు ఉన్నాయి. మూడవ బొమ్మకు ఒక చెవిలో మాత్రమే రంధ్రం ఉంది.
                                       ఆ విద్యార్ధి ఒక సన్నని పుల్ల తీసుకుని మొదటి బొమ్మ  చెవిలో దూర్చాడు. ఆ పుల్ల ఆ బొమ్మ రెండవ చెవిలో నుండి బయటకు వచ్చింది. రెండవ బొమ్మ చెవిలో పుల్ల దూర్చి చూసాడు. అది బొమ్మ నోటిలో నుండి బయటకు వచ్చింది.మూడవ బొమ్మ చెవిలో పుల్ల దూర్చి చూసాడు. అది బయటకు రాలేదు.
అదంతా గమనించిన ఉపాధ్యాయుడు విద్యార్థికి ఈ విధంగా వివరించారు. ఈ మూడు బొమ్మలు మనచుట్టూ ఉండే మనుషుల వ్యక్తిత్వాలను తెలియజేస్తున్నాయి. మొదటి బొమ్మ చెవిలో పుల్ల దూరిస్తే రెండవ చెవిలో నుండి బయటకు వచ్చింది, అంటే కొంతమంది మనం చెప్పేది వింటున్నట్టే ఉంటారు, కానీ అదేమీ పట్టించుకోకుండా ఒక చెవితో విని, రెండవ చెవితో వదిలేస్తుంటారు. ఇలాంటి వాళ్ళతో అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి.
          రెండవ బొమ్మ చెవిలో పుల్ల దూరిస్తే నోటిలో నుండి బయటకు వచ్చింది. వీళ్ళు మనం చెప్పేది అంతా  విని ఇతరులకు మన విషయాలు చెప్పేస్తూ ఉంటారు. వీళ్ళని నమ్మి సొంత విషయాలు చెప్పడం ప్రమాదకరం.
                        మూడవ బొమ్మ చెవిలో పుల్ల దూరిస్తే అది బయటకు రాలేదు. ఈ రకం మనుషులు నమ్మకస్తులు. వీరు విన్నదానిలో ఏది అవసరమో అదే మాట్లాడతారు, మనకు హాని కలిగిచే విధంగా ఎక్కడా మాట్లాడరు.
నీతి:  
ఎల్లప్పుడూ మంచివారితో ఉండే ప్రయత్నం చెయ్యాలి. నమ్మకంగా మరియు నిజాయితీగా ఉండేవాళ్ళ  మద్య ఉంటే మన ప్రవర్తన మెరుగుపరచుకోవచ్చు మరియు అవసమైన సమయాల్లో ఇలాంటివాళ్ళు మనకు సరైన సలహాలిచ్చి దారి చూపించగలుగుతారు.