Archives

మూడు రకాల మనుషులు

 

EE8F1EE1-DC1F-426B-A4BA-DAE5DF00F5CD.jpeg

విలువ: సత్యము

అంతర్గత విలువ: నమ్మకము, వినయము 

ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యార్థికి 3 బొమ్మలు ఇచ్చి వాటిలో గల తేడాలు కనిపెట్టమన్నారు. ఆ 3 బొమ్మలు ఆకారం,పరిమాణంలో చూడడానికి ఒకేలా ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించిన తరువాత ఆ బొమ్మలలో  రంధ్రాలు ఉన్నాయని గమనించాడు ఆ విద్యార్థి. మొదటి బొమ్మకు రెండు చెవులలో రంధ్రాలు ఉన్నాయి. రెండవ బొమ్మకు ఒక చెవిలో మరియు నోటిలో రంధ్రాలు ఉన్నాయి. మూడవ బొమ్మకు ఒక చెవిలో మాత్రమే రంధ్రం ఉంది.
                                       ఆ విద్యార్ధి ఒక సన్నని పుల్ల తీసుకుని మొదటి బొమ్మ  చెవిలో దూర్చాడు. ఆ పుల్ల ఆ బొమ్మ రెండవ చెవిలో నుండి బయటకు వచ్చింది. రెండవ బొమ్మ చెవిలో పుల్ల దూర్చి చూసాడు. అది బొమ్మ నోటిలో నుండి బయటకు వచ్చింది.మూడవ బొమ్మ చెవిలో పుల్ల దూర్చి చూసాడు. అది బయటకు రాలేదు.
అదంతా గమనించిన ఉపాధ్యాయుడు విద్యార్థికి ఈ విధంగా వివరించారు. ఈ మూడు బొమ్మలు మనచుట్టూ ఉండే మనుషుల వ్యక్తిత్వాలను తెలియజేస్తున్నాయి. మొదటి బొమ్మ చెవిలో పుల్ల దూరిస్తే రెండవ చెవిలో నుండి బయటకు వచ్చింది, అంటే కొంతమంది మనం చెప్పేది వింటున్నట్టే ఉంటారు, కానీ అదేమీ పట్టించుకోకుండా ఒక చెవితో విని, రెండవ చెవితో వదిలేస్తుంటారు. ఇలాంటి వాళ్ళతో అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి.
          రెండవ బొమ్మ చెవిలో పుల్ల దూరిస్తే నోటిలో నుండి బయటకు వచ్చింది. వీళ్ళు మనం చెప్పేది అంతా  విని ఇతరులకు మన విషయాలు చెప్పేస్తూ ఉంటారు. వీళ్ళని నమ్మి సొంత విషయాలు చెప్పడం ప్రమాదకరం.
                        మూడవ బొమ్మ చెవిలో పుల్ల దూరిస్తే అది బయటకు రాలేదు. ఈ రకం మనుషులు నమ్మకస్తులు. వీరు విన్నదానిలో ఏది అవసరమో అదే మాట్లాడతారు, మనకు హాని కలిగిచే విధంగా ఎక్కడా మాట్లాడరు.
నీతి:  
ఎల్లప్పుడూ మంచివారితో ఉండే ప్రయత్నం చెయ్యాలి. నమ్మకంగా మరియు నిజాయితీగా ఉండేవాళ్ళ  మద్య ఉంటే మన ప్రవర్తన మెరుగుపరచుకోవచ్చు మరియు అవసమైన సమయాల్లో ఇలాంటివాళ్ళు మనకు సరైన సలహాలిచ్చి దారి చూపించగలుగుతారు.
Advertisements

నల్ల చుక్క   

 

విలువ:సత్యం

ఉపవిలువ:కృతజ్ఞత ,ఆశాభావము

black-dot

ఒక రోజు ఒక ఉపాధ్యా యుడు   కళాశాలలోని పిల్లలకి ముందుగా తెలుపకుండా,  అకస్మాత్తుగా ఒక పరీక్ష పెట్టారు . పిల్లలందరూ పరీక్షలో ఏమడుగుతారో , పరీక్ష ఎంత కష్టంగా  ఉంటుందో అని ఆందోళన పడ్డారు. అధ్యాపకుడు పరీక్షా పత్రాలను పిల్లలలో పంచారు. అయితే పత్రాలు తలకిందగా ఉండడంతో అందులో ఏమి రాసుందో పిల్లలకి కనబడలేదు. అందరికీ పత్రాలు అందాక ఉపాద్యాడు పిల్లలను ప్రశ్నల పత్రాలను తిప్పి చూడమని ఆదేశించారు. తీరా చూస్తే అందులో ఒక్క  ప్రశ్న కూడా లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. మాస్టారు ,వాళ్ళని ఆ పత్రాలలో వాళ్లకి ఏమి కనిపించిందో వివరంగా రాయమన్నారు. ప్రొఫెసర్ ఆదేశానుసారం విద్యార్థులు వారికి అందులో కనిపించిన “నల్ల చుక్క” గురించి రాశారు.

                              తరగతి పూర్తి అయ్యాక మాస్టారు పిల్లలు రాసిన జవాబులన్నింటినీ గట్టిగాచదివారు. అందరూ వారికి కనిపించిన నల్ల చుక్క గురించి, కాగితంలో దాని స్థానం  గురించి వారివారి మాటలలో వివరించారు.అందరి జవాబులను చదివాక మాస్టారు విద్యార్థులకు ఈ విధానంగా బోధించారు “విద్యార్థులారా! భయపడకండి, నేను ఈ పరీక్షకి మార్కులు ఇవ్వబోటంలేదు. ఈ అభ్యాసం  ద్వారా మీకు ఒక చక్కటి జీవిత సత్యాన్ని బోధించి, జీవితం పట్ల మీ అవగాహనని మార్చాలనుకున్నాను. మీరంతా ఆ పత్రాలలో ఉన్న ఒక చిన్న నల్ల చుక్కపై మీ దృష్టిని కేంద్రీకరించారే గాని దాని చుట్టూరా ఉన్న తెల్ల కాగితాన్ని గురించి ఎవ్వరూ రాయలేదు.

                         మనమంతా కూడా నిత్య జీవితంలో సరిగ్గా అదే చేస్తున్నాము. కేవలం  సమస్యల మీదే మన దృష్టిని పెడుతున్నాము. ఒకరికి ఆరోగ్య సమస్య ,ఒకరికి  ఆర్థిక సమస్య,మరొకరికి కుటుంబలోని వారితో చికాకులు,మరికొందరికి స్నేహితుల వలన బాధ కలిగి ఉండవచ్చు . ఇందాక మీరు చూసిన  నల్ల చుక్క ప్రమాణం దాని చుట్టూ ఉన్న తెల్ల రంగు కంటే చాలా చిన్నది. అలాగే మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు మిగతా మంచి విషయాలతో పోలిస్తే చాలా చిన్నవి. నిజానికి  అవి ఎంత చిన్న సమస్యలే ,అయినా మన మనసుని ఎంతో కలుషితం చేస్తాయి. అందుకని వాటినుండి మన దృష్టిని వంటనే మనకు లభించిన వాటిపై మరల్చాలి. వాటిని ఆ భగవంతుడి అనుగ్రహంగా గుర్తించి జీవితాన్ని ఆనందంగా , తృప్తిగా గడపాలి.

నీతి :
చెడుని పక్కన పెట్టి మంచి మీద దృష్టిని పెట్టండి . విశాల భావంతో  ఆలోచించండి, చిన్నచిన్న సమస్యలలో కూరుకుపోయి జీవితంలోని మధుర క్షణాలని కోల్పోకండి. ఆనందంగా ప్రేమతో జీవించండి.

మూలం: రాజర్ డార్లింగ్టన్ కథలు

https://saibalsanskaar.wordpress.com/2016/07/18/the-black-spot/

కష్టములను ఎదురుకొనుట

 

విలువ: సత్యము
ఉపవిలువ:ఆశాభావం

 

spider
అనగనగా ఒక ప్రదర్శనశాలలో సాలెపురుగు ఒకటి ఉండేది.ప్రదర్శనశాలలోని అడుగు అంతస్తులో ఎన్నో పురాతనమైన చిత్రపటాలు ఉండేవి.చిత్రపాటాలు సాలెపురుగులు నివసించేందుకు గూడుకట్టుకోటానికి ఎంతో వీలుగా ఉండేవి. తోటి సాలెపురుగులకంటే మన కథలోని సాలెపురుగు ఎంతో అందమైన,అద్భుతమైన గూడుకట్టుకుంది. తాను కట్టుకున్నగూడుని ఆ పురుగు ఎంతో భద్రంగా చూసుకునేది.

క్రమక్రమంగా ప్రదర్శనశాల అధికారులు అడుగు అంతస్తులోని చిత్రపటాలను పై అంతస్తుకి మార్చి వాటిని ప్రదరించడం మొదలుపెట్టారు . ఇది గ్రహించిన సాలెపురుగులన్నీ జాగ్రత్తలు తీసుకోవటం మొదలు పెట్టాయి. కాని, ఈ పురుగు మటుకు “ఏమీ కాదులే ,అన్ని పటాలని పైకి తరలించరులే “ అని ధీమాగా ఏమీ చేయకుండా కూర్చుంది. తనకి విశాలమైన గూడు కట్టుకోటానికి ఇంతకంటే మంచి చోటు ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంది.

కాని, ఒక రోజు పొద్దున్నే అధికారులు తాను నివసించే చిత్రపటంతో పాటు తనని, తన గూడుని కూడా ప్రదర్శనా ప్రదేశంలో తెచ్చి పెట్టారు.

అప్పుడు తనని కాపాడుకోవటం కోసం తెలివైన సాలెపురుగు తన గూడుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది . ఈ విధంగా జీవితకాలం కష్టపడి కట్టుకున్న గూడుని ఒదులుకుని సాలెపురుగు పురుగులమందు నుంచి తన ప్రాణాలని కాపాడుకుంది.

అక్కడనించి పారిపోయి ఒక అందమైన పూదోటకు చేరుకుంది. ఒక ప్రశాంతమైమ చోటుని వెతుక్కుని అంతకుముందు కట్టుకున్న గూడుకంటే ఎంతో అందమైన గూడుని కట్టుకుంది. అక్కడే ఆనందమైన జీవవితాన్ని గడపసాగింది.

నీతి:
మన కష్టమును నమ్ముకుంటూ , నిరంతరం శ్రమించటానికి సిద్ధంగా ఉండే మనస్తత్వం ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుంది .
https://saibalsanskaar.wordpress.com/2015/09/29/overcoming-difficulties/

జీవితం యొక్క విలువ ఏమిటి!

8BFE4A4A-F55E-4AB8-AABD-F4BCC81E22CE

విలువ – సత్యం

ఉప విలువ – ఆత్మ విశ్వాసం

ఒకతను  గురు నానక్ సాహెబ్ వద్దకు వెళ్ళి ,”జీవితం యొక్క విలువేంటి స్వామి ?” అని అడిగాడు అప్పుడు గురునానక్ అతని చేతిలో ఒక రాయిని పెట్టి ,”ముందు నువ్వు ఈ రాయి విలువని తెలుసుకునిరా. కాని,ఒక విషయం గుర్తు పెట్టుకో ,ఈ రాయిని నీవు ఎట్టి పరిస్థితిలో కూడా  అమ్మకూడదు అని చెప్పారు.

అతను గురునానక్ ఆజ్ఞానుసారం ఆ రాయిని ముందుగా సంత్రాలు అమ్మే వాడి దగ్గెరకి తీసుకెళ్ళి దాని విలువ ఎంత ఉండచ్చు తెలుపమని అడిగాడు.

అతను ,ఆ రాయిని చూసి ,”ఈ రాయికి బదులుగా నీకు ఒక డజను (12) సంత్రాలను ఇస్తాను అని చెప్పాడు. దానికి ఈ మనిషి ,”గురువుగారు! నన్ను ఈ రాయిని అమ్మవద్దని చెప్పారు,కనుక నేను నీకు అమ్మలేను” అని ఖచ్చితంగా చెప్పేశాడు.

తరువాత ఆ రాయిని ఆతను ఒక కూరగాయలు అమ్మే వాడి దగ్గెరికి తీసుకెళ్ళి మళ్ళీ అదే ప్రశ్న వేశాడు . కూరగాయలతను ,ఆ రాయికి బదులుగా నీకు ఒక బంగాళదుంప సంచీని అమ్ముతాను అని చెప్పాడు .కాని,గురువుగారి మీద గౌరవంతో రాయిని అమ్మనని కూరగాయల వాడిని క్షమాపణ కోరి ఆటను అక్కడినుండి వెళ్ళిపోయాడు.     

ఈ సారి  రాయిని ఓక బంగారు కొట్టు వాడి దగ్గెరకి తీసుకుని వెళ్ళాడు . రాయిని చూడగానే షావుకారు ,రాయికి బదులుగా యాభై లక్షలు ఇస్తానని చెప్పాడు. దానికి ఈ మనిషి అడ్డంగా తలూపే సరికి ,”అయితే రెండు కోట్లు తీసుకో కాని ,రాయిని మటుకు నాకివ్వు అని బతిమాలాడు. “నేను రాయిని ఎట్టి పరిస్థితిలో నీకు అమ్మలేను” అని చెప్పి అక్కడి నించి కూడా అతను మౌనంగా వెళ్ళిపోయాడు.

చివరగా అతను విలువైన నాణెములను అమ్మే చోటికి ఆ రాయిని తీసుకుని వెళ్ళాడు.

ఆ కొట్టు యొక్క యజమానిని  ఆ రాయి విలువని తెలుపమని కోరాడు.రాయిని చూసిన ఆ యజమాన,  అది ఎంతో విలువైన రూబీ(కెంపు)అని గుర్తించాడు. ఒక ఎర్రని గుడ్డ మీద  రాయిని ఉంచి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి ,ఎంతో వినయంతో ఆ నాణెము ముందు  తలొంచుకుని నిలబడ్డాడు. యజమాని అతనిని “ఏమండీ! ఇంతటి విలువైన నాణెము మీకు ఎక్కడ దొరికిందండి.” నా కొట్టుని ,నా జీవితాన్ని మీకు తాకట్టు పెట్టినా నేను మీరు వెలకట్టమని అడిగిన  ఆ విలువైన నాణెమును కొనలేను” అని చెప్పి చేతులెత్తేశాడు. ఎందుకంటే అది ఎంతో విలువైనది వెల కట్టలేనిది అని చెప్పాడు,

ఈ విధంగా గురువుగారు ఇచ్చిన రాయి విలువను తెలుసుకున్న శిష్యుడు,గురునానక్ సాహెబ్ గారి వద్దకు వెళ్ళి ,”గురూజీ ఇప్పటికైనా జీవితమూ యొక్క విలువ గురించి చెప్పండి?” అని వినయంగా అడిగాడు . అప్పుడు గురునానక్ “నాయనా ! సంత్రాలు, కూరలు ,బంగారం ,విలువైన నాణెములను అమ్మే వాళ్ళందరూ నీకు ఇచ్చిన సమాధానములు మన జీవితము యొక్క విలువను తెలియచేస్తున్నాయి.

మన జీవితము  ఎంతో విలువైనది వెల కట్టలేనిది, కాని,మన జీవితాన్ని వెల కట్టాలని చూసే వాళ్ళు వారి వారి ఆర్ధిక స్తోమతను బట్టి, మన  గురించి వారికి గల అవగాహన బట్టి,మన వల్ల వారికి కలిగిన లేక కలగబోయే లాభ నష్టములను బట్టి , వారిలో నిజమును చెప్పటానికి ఉన్న ధైర్యమును బట్టి  వెల కడతారు . కనుక ఇతరుల మాటలను పట్టించుకోవద్దు.నీవు తీసుకెళ్ళిన రాయి విలువను గుర్తించిన షావుకారి లాగా, నీ విలువని గుర్తించగలిగేవారు,నిన్ను పూర్తిగా  అర్ధం చేసుకోగలిగినవారు, తప్పక ఎదురవుతారు.కనుక నిరాశ చెందకు”,అని గురువుగారు ప్రేమగా జీవితం యొక్క విలువను అనుభవపూర్వకంగా తెలుసుకొనగలిగేలా ఏర్పాటు చేశారు.  

నీతి:   ఆత్మాభిమానము చాలా ముఖ్యమైన లక్షణము. మనందరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ముందుగా మనని మనము  కించపరుచుకోకుండా గౌరవించుకోగలగటం నేర్చుకోవాలి.

https://saibalsanskaar.wordpress.com/2015/09/30/what-is-the-value-of-life/

 

సిద్ధార్థ్ మరియు పూజ – ఒక చిన్న కథ

children-marble

విలువ: సత్యం
ఉప విలువ :నిజాయతి ,నమ్మకం

సిద్దార్థ్ ,పూజ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి చక్కగా ఆడుకునే వారు. సిద్దార్థ్ దగ్గర బోలెడు గోళీలు ,పూజ వద్ద మంచి మిఠాయిలు ఉన్నాయి. ఒక రోజు సిద్ధార్థ్ పూజతో ,”నీవు నీ మిఠాయిలను నాకు ఇస్తే,వాటి బదులుగా నా గోళీలన్నీ నీకు ఇచ్చేస్తాను” అని చెప్పాడు. పూజ దానికి అంగీకరించింది.

మరునాడు సిద్ధార్థ్ అన్నిటికంటే పెద్దగా ,అందంగా ఉన్న గోళీలను తన వద్దే ఉంచుకుని మిగిలిన గోళీలను పూజకి ఇచ్చాడు.కాని ,పూజా మటుకు అనుకున్న ప్రకారంగా తన దగ్గర ఉన్న స్వీట్స్ అన్నీ సిద్దార్థ్ కి ఇచ్చేసింది.

ఆ రోజు పూజా ప్రశాంతంగా పడుకోగలిగింది. సిద్దార్థ్ మటుకు ఒక వేళ పూజ కూడా తన లాగే మంచి రుచికరమైన మిఠాయిలను తన వద్దే దాచి పెట్టుకుందేమో అని ఆలోచిస్తూ సరిగ్గా నిద్రపోలేకపోయాడు.

నీతి:
ఏ సంబంధానికైనా నిజాయతి మరియు నమ్మకము పునాదులు.వ్యక్తిగత సంబంధాలలోగాని, లేదా ఉద్యోగరీత్యా ఏర్పడే సంబంధాలలోగాని- ఇతరులకి మన వంతు సంపూర్ణమైన ప్రేమను,విధేయతను మనము ఇవ్వనప్పుడు , వాటిని మనకి వారు వందకు వంద శాతం తిరిగి ఇస్తున్నారా లేదా అని అనుమాన పడుతూనే ఉంటాము.కనుక సంబంధాలు గట్టిపడి మనము అనంద దాయకమైన జీవితము గడపాలి అంటే మన వంతు కృషిని మనము నిజాయితీగా, పూర్తి నమ్మకంతో తప్పకుండా చేయాలి.

http://www.funzug.com/index.php/stories/love-is-complete-trust-and-faithfulness-story

 

 

ఎండా-వాన  కథ

విలువ — సత్యం,ఆశావాదం
అంతర్గత విలువ –అవగాహన
ఒక పెద్దావిడకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారిద్దరికీ పెళ్ళిళ్ళు అయి కాపురాలు చేసుకుంటున్నారు.పెద్దమ్మాయి భర్తకి గొడుగుల వ్యాపారము, చిన్నమ్మాయి భర్తకి నూడిల్స్ వ్యాపారము ఉన్నాయి.ఆ పెద్దావిడ వాతావరణం మారినప్పుడల్లా తరచుగా బాధపడుతూ ఉండేది. బాగా ఎండగా ఉన్నప్పుడు, “అయ్యో పెద్దల్లుడుకి వ్యాపారము ఉండదు, ఎవరూ గొడుగులు కొనుక్కోరు ” అని బాధ పడేది. బాగా వర్షం వచ్చినప్పుడు “అయ్యో చిన్నల్లుడికి  వ్యాపారము ఉండదు, ఎండ ఉంటేనే నూడిల్స్ తయారు చెయ్యడానికి అవుతుంది ” అని బాధ పడేది.
ఒక రోజు ఆ పెద్దావిడ ఒక సాధువుని కలిశారు. సాధువు పెద్దావిడ బాధపడడానికి కారణము తెలుసుకుని ఇలా సలహా ఇచ్చారు.
“ఇది చాలా సులభం. బాగా ఎండగా ఉన్నప్పుడు పెద్దమ్మాయి గురించి అసలు ఆలోచించద్దు. చిన్నమ్మాయి గురించి ఆలోచించండి. ఎండగా ఉండడం వల్ల నూడుల్స్ వ్యాపారం బాగుంటుంది అని సంతోషించండి. అలాగే బాగా వర్షం పడినప్పుడు చిన్నమ్మాయి గురించి అసలు ఆలోచించద్దు. పెద్దమ్మాయి గురించి ఆలోచించండి, గొడుగుల వ్యాపారం  బాగుంటుంది అని సంతోషించండి. “
పెద్దావిడ సాధువు చెప్పినట్టు అనుసరించి ఆలోచనలో మార్పు తెచ్చుకున్నారు. తరువాత ఇంక బాధ పడలేదు. రోజూ సంతోషంగా నవ్వుతూ ఉండేవారు.
నీతి 
ఎలాంటి పరిస్థితి ఎదురైనా దానిలో మంచి చూడడం అలవాటు చేసుకుంటే మనం సంతోషంగా జీవించగలము.

 

చదువుకున్న పండితుడు

విలువ — సత్యము,
అంతర్గత విలువ — ఆచరణ / అభ్యాసమ
 ఒక నది దాటటానికి కొంత మంది మనుషులు పడవలో కూర్చున్నారు. అందులో ఒక చదువుకున్న పండితుడు ఉన్నాడు.  ఆ పండితుడు తను చదువుకున్న పుస్తకాల గురించి , తనకి ఉన్న జ్ఞానాన్ని గురించి అందరికీ  చెప్పాలి అనుకున్నాడు.
పండితుడు , అందరినీ  ప్రశ్నించడం మొదలు  పెట్టాడు.
మీరు ఉపనిషత్ లు  చదివారా ?? శాస్త్రాలు చదివారా ?? 6 వర్గాల హిందూ తర్కశాస్త్రము గురించి తెలుసా ??
దానికి  పడవలో ప్రయాణము చేసే వాళ్ళు,” ఈ వాక్యములు వినలేదు మాకు తెలియదు” అని సమాధానము చెప్పారు.
దానికి పండితుడు, “మీ జీవితం వ్యర్థము, వీటిగురించి తెలియదా ??” అని అన్నాడు. పండితుడు అలా అన్న కొంతసేపటికి నదిలో పెద్ద పెద్ద అలలు  రావడం మొదలు పెట్టాయి. పండితుడికి కంగారు వేసింది. పడవలో  ఉన్న ఒక వ్యక్తి పండితుడిని మీకు ఈత వచ్చా? అని అడిగాడు.
పండితుడు ‘రాదు ‘ అని సమాధానము చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి “ఇంక మీ  జీవితము అయిపోయింది ” అని పడవ లోంచి నదిలోకి దూకి ఈదుకుంటూ  వెళ్ళిపోయాడు.
నీతి
 ఎన్నో పుస్తకాలు చదివిన జ్ఞానం ఒక్కటీ ఉంటే సరిపోదు.అవసరానికి మనము నేర్చుకున్నది ఆచరణలో పెట్టలేకపోతే ,ఆ జ్ఞానము వ్యర్థము. ఇది యధార్థము.