Archives

తృప్తి

విలువ — శాంతము
అంతర్గత విలువ — సంతోషము

ఇది ఒక రాజుగారి కథ !
భోగ – భాగ్యములు అనుభవిస్తున్న రాజుగారికి, మనస్సు ఆనందంగా, శాంతంగా ఉండేది కాదు. దీనికి కారణం తెలిసేది కాదు రాజుగారికి.
ఒక రోజు రాజుగారికి, ఒక పనివాడు, సంతోషంగా, ఉల్లాసంగా, పాటలు పాడుకుంటూ కనిపించాడు . “ఈ రాజ్యానికి రాజునైన నాకు లేని నిమ్మది, శాంతి, ఈ పనివాడికి ఎలా కలుగుతోంది’ అని అనుకున్నారు రాజుగారు.

‘నీ సంతోషానికి కారణం ఏమిటి ?”, అని ఆ పనివాడిని ,రాజుగారు అడిగారు
దానికి పనివాడు ‘అయ్యా ! నాకు, నా కుటుంబానికి కావలిసినది-ఉండడానికి చోటు, కడుపు నిండా తినడానికి భోజనము , ఈ రెండూ ఉన్నందువల్ల ,మేము సంతోషంగా జీవించగలుగుతున్నాము”,అని సమాధానం చెప్పాడు.

రాజుగారు జరిగింది తన మంత్రికి చెప్పారు. పనివాడి కథ విన్న తరువాత, మంత్రి “మహారాజా, పనివాడు మన ‘99వ క్లబ్బులో(సంఘము)’ , లేడు కదా, అందుకనే సంతోషంగా ఉన్నాడు ‘ అని అన్నారు.

‘99వ క్లబ్బు’ అంటే ఏమిటి అని ఎంతో ఉత్సుకతతో అడిగారు రాజుగారు.
“ఇది తెలియాలి అంటే, 99 బంగారు నాణాలున్న సంచీని పనివాడి ఇంటి ముందర ఉంచండి” తరువాత మీకే అర్ధమవుతుంది అన్నారు మంత్రి.

మరునాడు ఇంటి ముందర , బంగారు నాణాలు ఉన్న సంచి చూసి, సంతోష పడిన ఆ పనివాడు, నాణములను ఎన్నో మార్లు లెక్క పెట్టి, ఇందులో 99 ఉన్నాయి, ఎలాగైనా సరే కష్ట పడి, వీటిని 100 చెయ్యాలి “ అని అనుకున్నాడు.

ఆ రోజు నుంచి పనివాడిలో ఎంతో మార్పు కనిపించింది. సంతోషంగా ఉండడం, ఉల్లాసంగా పాటలుపాడుకోవటం పూర్తిగా మర్చిపోయాడు. ఎంతసేపటికీ ఒకటే ఆలోచన!
99బంగారు నాణాలని, ఎలా 100బంగారు నాణాలు చెయ్యాలి? అని ఆలోచిస్తూ ,అతనికి సహాయపడటంలేదని కుటుంబ సభ్యుల మీద చాలా చికాకు పడే వాడు.

ఇదంతా గమనిస్తున్న రాజుగారు, ఎంతో ఆశ్చర్య పోయారు.
అప్పుడు మంత్రి రాజుగారితో ,”మహారాజా! పనివాడు 99వ క్లబ్బు మాయలో మునిగిపోయాడు “,చూశారా అని అన్నారు.

99 ఉన్నాయి అని తృప్తి లేకుండా, 100కి ఇంకా ఒక్కటి తక్కువ ఉంది అని అసంతృప్తి పడే వారినే ‘99 క్లబ్బు లేదా సంఘము అంటారు” . వీళ్ళు ఉన్నదానితో తృప్తి పడకుండా లేని ఆ ఒక్క విషయం లేదా వస్తువు కోసం పాకులాడుతూ ఉంటారు.

నీతి

మనకి ఉన్న దాంతో ఏంటో తృప్తిగా జీవించవచ్చు. కానీ ఉన్న దానికంటే కొంచం ఎక్కువ దొరికినప్పుడల్లా ఇంకా ఇంకా కావాలి అని ఆరాట పడుతూ ఉంటాము.

భగవంతుడు మనకి చక్కటి అనుభవం, పదవి లేదా హోదాని అనుగ్రహించినప్పుడు , దాన్ని ఒక ప్రసాదంగా స్వీకరించకుండా,సంతోష పడకుండా, ఇంకా ఎక్కువ కావాలి అని, అతి ఆశతో నిద్రాహారాలు కూడా లెక్క చేయకుండా జీవిస్తున్నాము.
దురాశ పతనానికి హేతువు !

https://saibalsanskaar.wordpress.com/2016/04/02/contentment-the-99-club/

మనమందరం సంతోషంగా ఉందాము!!!

విలువ : శాంతి
పవిలువ : నిర్లిప్తత .

అనగనగా రాజభవముకు కొంత దూరంలో ఒక బిచ్చగాడు నివసించేవాడు . అతడు ఒక రోజు ఆ భవనపు గోడపై ఒక నోటీసు బోర్డును చూశాడు.అందులో ,”రాజుగారు ఒక విందును ఇవ్వబోతున్నారు, ఆ విందుకు రాజు వేషధారణలో వచ్చేవారందరు ఆహ్వానితులే.”,అని ఉంది. ఆ ప్రకటన చదివిన బిచ్చగాడికి ఒక వింత కోరిక కలిగింది. తాను ఆ విందుకు వెళ్లి ఆ భోగాలన్నీ చూడాలనుకున్నాడు. కానీ రాజు ధరించే దుస్తులు తనవద్ద లేవు. వెంటనే అతను ఒక ఆలోచన చేశాడు. తన దుస్తులు చిరిగిపోయాయి. విందులో పాల్గొనాలి అంటేరాజరికపు దుస్తులు కావాలి అందుకని రాజు కాపలా దారు వద్దకు వెళ్ళి తనను రాజుగారి వద్దకు వెళ్ళటానికి అనుమతి ఇవ్వమని కోరాడు.
కాపలాదారు లోనికి వెళ్ళి రాజుగారు కొలువులో ఉండటం చూసి,ఆయన ప్రజల కష్టమములను,సమస్యలను వింటున్న సందర్భం చూసి ,ఈ బిచ్చగాడిని లోనికి పోవుటకు అనుమతి ఇచ్చాడు. బిచ్చగాడు రాజసభలోనికి వెళ్ళి రాజు ముందర చేతులు జోడించి నిలబడ్డాడు. రాజు బిచ్చగాడిని, “నీకు ఏమి కావాలి?”, అని అడిగాడు . బిచ్చగాడు, “రాజా! మీరూ ఇవ్వబోతున్న విందుకు, నాకు రావాలని ఉంది . దయచేసి మీ పాత దుస్తులు నాకు ఇప్పిస్తారా”? అని కోరాడు. రాజుగారు తన దుస్తులను అతనికి ఇప్పించారు . బిచ్చగాడు ఆ దుస్తులు తన సైజుకే ఉన్నాయని చాలా సంతోషించాడు. రాజుగారన్నారు ,ఆ బీదవానితో ,”ఈ దుస్తులు ఎప్పటికీ ఇలానే కొత్తవిగా ,శుభ్రంగా తాజాగా ఉంటాయి. వీటిని ఉతకవలసిన పని లేదు. ఎన్నాళ్లు వాడినా చినిగిపోవు”, అని చెప్పారు. ఈ దుస్తులను ధరించి ఆతను విందుకు రావచ్చు అని కూడా చెప్పాడు. ఇది విన్న బిచ్చగాడి ఆనందానికి అంతు లేదు. అతని కళ్ళవెంట నీరు కారింది. వంగి నమస్కారములు చేసి ధన్యవాదములు చెప్పాడు. కానీ, అతనికి రాజు గారి మాటపై నమ్మకము లేదు! ఒకవేళ రాజుగారు ప్రసాదించిన బట్టలు చినిగి పొతే తన పాత బట్టల అవసరం ఉంటుంది ,అని తన పాత బట్టల మూట ఒకటి తయారు చేసికున్నాడు.
అతనికి ఉండటానికి ఒక చోటు అంటూ లేదు. అందువల్ల ఆ మూట చంకలో పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. తాను వేసుకున్న రాజుగారి బట్టలు చక్కగా మురికి పట్టకుండా శుభ్రంగా ఉండేవి. అయినా తన పాత బట్టలు మూట వదిలేవాడు కాదు. అదే మూట ప్రక్కన పెట్టుకుని రాజు గారిచ్చిన విందుకు వెళ్ళాడు. కానీ లోపల బాధ పడుతూనే ఉన్నాడు. రాజ భవనం లో భోం చేస్తున్నందుకు ఆనందించ లేక పోయాడు. ఎందుకంటే తన పాత బట్టల మూటను ఎవరన్నా కాజేస్తారేమో అని భయము వల్ల. రాజుగారు చెప్పినట్లు రాజు దుస్తులు ఎప్పుడు కొత్తవిగానే ఉన్నాయి. కానీ ఆ బీదవాడు తన పాత బట్టలపై మమకారం వదులుకోలేక ఆ మూటను పట్టుకునే, తిరుగుతుండేవాడు.ఆ బట్టల అవసరం ఏమాత్రం లేకపోయినా సరే. వాటిమీద ప్రేమ వల్ల , ఆ మూట తనతో పాటు ఉండాల్సిందే. అందరు అతనిని “పాతగుడ్డల మనిషి”అంటుండేవారు.
కొన్నాళ్లకు బిచ్చగాడు మంచం పట్టాడు. కానీ పాత గుడ్డల మూట తన దిండు ప్రక్కనే పెట్టుకున్నాడు. రాజు గారు ఒకసారి ఈ బిచ్చగాడి గురించి తెలిసి అతనిని పలకరించటానికి వచ్చాడు. రాజుగారు ఆ బిచ్చగాడిని చూసి చాలా జాలిపడ్డాడు . ఎందుకంటే మూట అవసరం లేక పోయినా ,ఎక్కడ ఎవరన్నా ఆ మూట తీసి కెళ్తారేమో అని అనుక్షణం బాధ, భయంతో సంతోషం లేకుండా గడిపాడు. జీవితాంతం ఈ పాత గుడ్డల మూట అతని సంతోషాన్ని హరించింది అనుకున్నాడు రాజుగారు.

నీతి:
ఈ కథ బిచ్చగాడిదే కాదు. మనందరముకూడా మూటలు మోస్తున్న వారమే. మనస్సు అనే మూటలో శత్రుత్వము, అసూయ ,ద్వేషము,కోపము,బాధలు మొదలగున్నవి నిరంతరం మోస్తున్నాము. ఈ బరువు మనలోనే పెట్టుకుని పెరిగి పెద్దవారమవుతాము. అందువలన సంతోషించాల్సిన సమయంలో కూడా వీటివల్ల పూర్తి ఆనందం పొందలేక పోతున్నాము. ఎప్పటికపుడు ఈ చెడుగుణములను లోపల స్టోర్ చేయకుండా విడిచి పెట్టలేక పోతున్నాము. అందువలననే ఈ దుఃఖము.
పెద్ద పెద్ద భావనాలయందు, రాజభవనములయందు ఉండేవారు ఒక్కొక్కసారి కథలో బిచ్చగాడి లాగే జీవిస్తుంటారు. కొంతమంది అనాధ ఆశ్రమంలో ఉం టూ ఏమి లేకపోయినా సంతోషంగా తృప్తిగా వుంటారు దర్జాగా రాజుల్లాగా వుంటారు ధైర్యంగా. ఇదంతా బాహ్యంలో కన్పించేది కాదు. అంతరంగంలో మనం ప్రపంచాన్ని చూసే దృక్పధం ఫై ఆధారపడి వుంటుంది. మనం యిళ్ళలో అవరసం లేనివి ,పాతవి జమ చేస్తాము. చెత్తపేరుకు పోతుంది. అవసరమైన వాటిపై ప్రేమతో వాటిని వదిలించుకోవటానికి ఇష్టపడము. క్రమంగా యిల్లు గోడౌన్ అయిపోతుంది.

మనకు ఏది ముఖ్యమో ,ఏది కాదో తెలుసుకోలేము. జీవితం అంతా చిన్న చిన్న విషయాలలోనే చిక్కుకుంటున్నది. వృధా అవుతోంది. ఇది యింటికి మాత్రమే పరిమితం కాదు. మన మనసు అనేక ఆలోచనలతో నిండిన పెద్ద గోడౌన్. ఎన్నో పనికిరాని అవసరమైన ఆలోచనలతో నింపేసాము. మళ్ళీ మళ్ళీ ఇంకా నింపుతున్నాము.

సంతోషంగా ఉండటానికి ఏ కారణం అవసరం లేదు. ఎందుకంటే అది మన స్వరూపమే.  

              మన అహంకారంతో జీవితంలో  వచ్చే ఎన్నో సువర్ణావకాశములను కోల్పోతున్నాము. చేతులారా అవకాశములను వదిలేసుకుంటున్నాము. ఎందుకంటే మనం ఎపుడూ మన అహంకారం పోషించు కోవటంలో తీరిక లేకుండా ఉంటున్నాము. ప్రతి క్షణం బరువుగా గడుపుతాము. ప్రతి సంఘటనకు తీవ్ర ఆదుర్దా . ప్రతి చర్యలో కంగారు ,హడావిడి. అహంకారంతో చేసే చర్యలన్నీ నిప్పుల మ్మీద నడకలే. కఠినత్వానికి ,సరళత్వానికి ఏనాటికి పొంతన కుదరదు. మంచి ,చెడు రెండూ ఒకే సమయంలోఉండలేవు.   

             మాంసపు ముక్కను నోట కరుచుకున్న ఒక కాకి ఎగురుతూ ఉన్నది. దానిని చూసి మిగతా పక్షులన్నీ ఆ మాంసపు  ముక్కకై కాకిని తరమసాగాయి . ఇది గమనించి కాకి మాంసపు ముక్కను వదిలేసి పైకెగిరింది. ఇక పక్షులన్నీ కాకి ని వదిలేసి ముక్కవైపు వెళ్లాయి. సుదీర్ఘ ఆకాశంలో ఒంటరిగా సంతోషంగా విహరిస్తున్న  కాకి ఇలా అనుకుంది. “ఒక్క మాంసపు ముక్కను వదిలేస్తే ఆకాశం అంతా నాదే . ఎంత స్వేచ్ఛగా విహరిస్తున్నాను!” 

 పరిస్థితులను స్వీకరించు ,దేవుని శరణాగతి చేయి . మిగతావి వదిలేయి … .!

మూలము:

మే 2014: మ్యాగజైన్ మహాత్రియ – అనంత ఆలోచనలు : 

https://saibalsanskaar.wordpress.com/2016/01/28/let-us-be-happy/

శాంతిసందేశం( మహాభారతం)

విలువ:శాంతి

అంతర్గత విలువ :న్యాయం

మహాభారతంలో సంజయుడి రాయబారం విఫలమయిన తరువాత, శ్రీ కృష్ణుడే స్వయంగా దుర్యోధనునితో మాట్లాడడానికి హస్తినాపురానికి బయలుదేరి వెళ్ళాడు. దుర్యోధనుడు కృష్ణుడిని మర్యాదగా ఆహ్వానించాడు. కృష్ణుడు, దుర్యోధనునితో ” నేను పాండవుల తరపున శాంతి సందేశం తీసుకు వచ్చాను. పాండవులకు అర్థరాజ్యం ఇచ్చేబదులు ఐదుగురికీ తలా ఒక గ్రామం ఇస్తే చాలు అని చెప్పమన్నారు. దీనివల్ల నీకు ఇబ్బంది ఉండదు, వారు కూడా ఉన్నంతలో తృప్తిగా జీవిస్తారు, రాజ్యంలో ప్రజల శాంతికి భంగం కలగదు” అని చెప్పాడు.

 

అది విన్న దుర్యోధనుడు కోపంగా ఈ రాజ్యమంతా నాకే సొంతం. సూదిమొన మోపినంత స్థలాన్ని కూడా పాండవులకు ఇవ్వను. నువ్వు పాండవపక్షపాతివి. నిన్ను బంధించి చెరసాలలో పెడతాను అన్నాడు. భటులు కృష్ణుడిని బంధించే ప్రయత్నం చెయ్యగా కృష్ణుడు విశ్వరూపం చూపించాడు. ఆ శక్తికి తట్టుకోలేక భయపడి సభలో చాలామంది కళ్ళు మూసుకున్నారు. నెమ్మదిగా చెప్తే దుర్యోధనుడు వినలేదు కాబట్టి ధర్మాన్ని కాపాడడం కోసం కురుక్షేత్రయుద్ధం జరగాల్సివచ్చింది.

నీతి: మనస్సు అంతా అహంకారం, అసూయ, ద్వేషంతో నిండిపోయి ఉన్నప్పుడు మనుషులు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతారు. దీనివల్ల ఆ మనిషికి లేదా అతని కుటుంబానికి లేదా భారతంలో లాగా మొత్తం రాజ్యానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా భగవంతుడు అవతరించి ధర్మాన్ని నిలబెడుతూ ఉంటాడు.

 

http://www.kidsgen.com/fables_and_fairytales/indian_mythology_stories/krishnas_peace_mission.htm

శాంతిని ప్రతిబింబించే చిత్రము

విలువ: శాంతి 
అంతర్గత విలువ: నిశ్శబ్దం, మనసు శాంతంగా ఉంచుకోవడం 

98498670-CC98-4921-A130-11B61B18717B
ఒక రాజు శాంతిని చూపించగలిగే చిత్రాన్ని వేయమని కోరాడు. చాలామంది చిత్రాలు గీసి తెచ్చారు. రాజు వరుసగా వాటిని పరిశీలించసాగాడు.

అన్ని చిత్రాల్లో రెండు చిత్రాలు చాలా బాగున్నాయి. ఆ రెండింటిలో ఒక దానిని ఎంపిక చేసి బహుమతి ప్రకటించాలి.
మొదటి చిత్రంలో ప్రశాంతంగా ఉన్న నది ఉంది. దాని చుట్టూ ఎత్తైన కొండలు ఉన్నాయి. పైన ఆకాశం, మేఘాలు గీయబడి ఉన్నాయి. అందరు ఆ చిత్రమే ఎంపిక చేస్తారు అని అనుకున్నారు. రెండవ చిత్రంలో కూడా కొండలు ఉన్నాయి కానీ అవి అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఆకాశంలో మేఘాలు చాలా గంభీరంగా ఉరుములు,మెరుపులతో ఉన్నాయి. కొండలమీద నుండి ఒక జలపాతం ప్రవహిస్తోంది. ఆ చిత్రంలో ఎక్కడా ప్రశాంతత కనిపించట్లేదు.
D6101859-6F32-493E-934E-062E789537AA
రాజు జాగ్రత్తగా పరిశీలించి చూసాడు. జలపాతం పక్కన కొండ పగుళ్లలో నుండి ఒక చిన్న పొద  ఉంది. ఆ పొదలో ఒక పక్షి తన పిల్లలతో ప్రశాంతంగా కూర్చుని ఉంది.   రాజు రెండవ చిత్రానికి బహుమతి ప్రకటించాడు.
నీతి
పరిస్థితులు, వాతావరణం  అనుకూలంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం సులభమే కానీ ప్రతికూల పరిస్థితులలో కూడా ప్రశాంతంగా ఉండడం సాధన చెయ్యాలి. మన మనసులోనే శాంతిని వెతుక్కోవాలి. ఎల్లప్పుడూ ఆనందంగా, ప్రశాంతంగా ఉండడం సాధన చేస్తూ ఉంటే చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ప్రభావితం చెయ్యలేవు.

ఎవరిని లేక దేన్ని ఎక్కువ ప్రేమిస్తాము ?

 

CF08C74E-001F-434D-998C-562DCFAE5BDD

విలువ: శాంతి,సహనము

అంతర్గత విలువ: నిగ్రహం
ఒక వ్యక్తి తన కారును శుభ్రం చేసుకుంటున్నాడు. అక్కడే ఆడుకుంటున్న అతని  4 సంవత్సరాల చిన్న పాప, ఒక రాయి తీసుకుని కారు మీద ఏదో రాసింది. కారు మీద గీతలు చూసి తండ్రికి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలోనే  చేతిలో ఉన్న రెంచ్ తో పాప అరచేతిలో కొట్టడం మొదలుపెట్టేడు. కొంచెంసేపటికి కోపం తగ్గేక, పాప చెయ్యి చూసి కంగారు పడి పాపను హాస్పిటల్ కు తీసుకువెళ్ళాడు. కానీ అప్పటికే పాప చేతి వేళ్ళు విరిగిపోయేయి.
70D2B2C0-6FD8-463E-B801-2EA5C2562439
                హాస్పిటల్లో ఉన్న పాప తండ్రిని ” నాన్నా; నా వేళ్ళు ఎప్పుడు తిరిగి వస్తాయి” అని అడిగింది. దానికి తండ్రి ఏమీ సమధానం చెప్పలేక బాధతో మౌనంగా ఉండిపోయాడు.  కారు దగ్గరికి వెళ్ళి  తన చేసిన తొందరపాటు పనికి బాధపడుతూ, కారును కాలితో తన్నసాగాడు. కొంసేపటికి అసలు కారు మీద తన కూతురు ఏమి రాసిందో చూడాలి అనిపించి దగ్గరగా వెళ్లి చూసాడు.
“నేను నాన్నను ప్రేమిస్తున్నాను” అని రాసి ఉంది.
నీతి:  కోపానికి మరియు ప్రేమకు హద్దులు ఉండవు. మనం ఎప్పుడూ మనుషుల్ని ప్రేమించాలి, వస్తువులను వాడుకోవాలి. కానీ ఈ రోజుల్లో వస్తువుల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అందరినీ  ప్రేమిస్తూ పరిస్థితుల్ని అవగాహన చేసుకుని సహనంతో వ్యవహరించగలిగితే తరవాత బాధపడక్కర్లేదు.

 

నీ మాటల్లో నువ్వేమిటో నాకు కనిపిస్తూఉంటుంది

 

AF1501CC-79BC-4F51-B0D3-08FCAFCE6E6E

విలువ : శాంతి

ఉపవిలువ: సరైన నిర్ణయం
నేను అప్పుడు నెవెడా యూనివర్సిటీ లో సోమవారం ఉదయం 8 గంటలకు క్లాస్ తీసుకుంటున్నాను. నెవెడా యూనివర్సిటీ లాస్ వేగాస్ లో ఉంది. పిల్లలందర్నీ శని,ఆదివారాలు ఎలా గడిచాయి అని అడిగేను. ఒక విద్యార్ధి లేచి నిలబడి, గడచిన రెండు రోజులు తనకు మంచిగా లేవని, తన జ్ఞానదంతం ఒకటి తీసివేసారని చెప్పాడు. మీకు ఎల్లప్పుడూ ఉత్సాహంగా, ఆనందంగా ఉండడం ఎలా సాధ్యమౌతోంది? అని నన్ను అడిగాడు. అతని ప్రశ్నకు సమాధానంగా నేను ఒకసారి చదివిన విషయం ఒకటి గుర్తుకువచ్చింది.
మనం ప్రతిరోజూ ఉదయం లేవగానే, ఆ రోజు ఎలా గడపాలి అని నిర్ణయించుకునే అవకాశం మనకి ఉంటుంది. నేను ఎప్పుడూ ఉత్సాహంగా, ఆనందంగా ఉండాలి అనుకుంటాను అని చెప్పేను. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను అని ఇలా చెప్పడం మొదలుపెట్టేను. నేను ఇవాళ మన యూనివర్సిటీ దాకా వచ్చేసరికి నా కారు ఆగిపోయింది. గ్యారేజ్ కి ఫోన్ చేసి నా కారు రిపేరు వచ్చిందని, దానిని తీసుకువెళ్ళడానికి వేరే ట్రక్ పంపించమని అడిగేను. అదేంటి, మీ కారు దారిలో ఆగిపోతే మీరు అంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు అని అడిగేరు. నేను ఇక్కడికి 17 మైళ్ళు దూరంలో ఉంటున్నాను. కారు మధ్యలో ఎక్కడైనా ఆగిపోవచ్చు, కాని సరిగ్గా యూనివర్సిటీ ముందే ఆగింది. నాకు 8 గంటలకు క్లాస్ ఉంది. ఇప్పుడు నేను ఆ క్లాసు కు వెళ్ళి
నా విధులు నిర్వర్తించగలను. అదే దారి మధ్యలో ఎక్కడైనా కారు చెడిపోయి ఉంటే నాకు చాలా ఇబ్బంది కలిగేది, అని చెప్పి క్లాసు కి వచ్చేను.   జరిగింది చెప్పడం ముగించి విద్యార్థులందరి ముఖాలు పరీక్షగా చూసేను. అందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు. వాళ్ళందరికీ నేను ఆనందంగా ఉండడానికి కారణం అర్థమైంది అనిపించింది.
నీతి: 
ప్రతీ విషయంలోనూ మంచినే చూసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఎల్లప్పుడూ ఆనందంగా, ఉత్సాహంగా ఉండవచ్చు.

మనస్సు యొక్క ప్రతిబింబము

buddha-picture.jpg

 

విలువ — ప్రశాంతత

అంతర్గత విలువ — ఓర్పు, ప్రేమ.

ఉన్నత అధికారి అయిన ఒకపెద్దమనిషి  గౌరవనీయులయిన ఒక సాధువుని కలిశాడు.అధికారి, ఆ సాధువుకి తాను చాలా గొప్ప వాడిని,  నిరూపించాలని అనుకున్నాడు.

సాధువుని ,”ఇప్పటి  దాకా, మీరు నాకు చెప్పిన మాటలు, నాకు ఎలా అనిపించాయో మీకు చెప్పమంటారా? “అని అడిగాడు. సాధువు ‘ నా గురించి నీకు ఎటువంటి అభిప్రాయమున్నా అది నాకనవసరము.  నేను దాన్ని పట్టించుకోను,ఎందుకంటే అది నీకు సంబంధించిన విషయము’. అని జవాబు ఇచ్చాడు.

అధికారి “ మీకు వినాలని లేక పోయినా సరే ,నేను చెప్పదలచుకున్నాను , వినండి.”‘మీరు , నాకు  ఎందుకూ పనికిరాని వారిలా కనిపిస్తున్నారు’. అని సాధువుని కించపరుస్తూ మాట్లాడాడు. కాని, ఈ మాటలు విన్న సాధువు చలించకుండా మౌనంగా ప్రశాంతంగా ఉండిపోయారు .

దాంతో , తన మాటలతో  చెవిటి వాని చెవిలో శంఖం ఊదినట్లైందని తెలుసుకున్న అధికారి,  “ నా గురించి, మీరేమనుకుంటున్నారు,నాకు తెలుసుకోవాలని ఉంది  అని తిరిగి ప్రశ్నించాడు. నువ్వు నా కళ్ళకి, బుద్ధునిలా కనిపిస్తున్నావు ‘ అన్నాడు సాధువు.

ఇది విన్న అధికారి, సంతోషంగా ఇంటికి వెళ్ళి ,తన భార్యకి సాధువు తన గొప్పతనాన్ని  గుర్తించిన విషయం చెప్పాడు.

జరిగిందంతా విన్న భార్య, “ మీరెంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారండి. మన  అలోచనలు, బుద్ధి, పనికి రానివి అయినప్పుడు , మనకి ఎదుటివారిలో కూడా అవే  కనిపిస్తాయి. గౌరవనీయులయిన సాధువుకి బుద్ధుని లాంటి హృదయముండటం వల్ల ,ఆయనకి మీతో పాటు అందరిలో కూడా బుద్ధుడే కనిపిస్తున్నారు. “ అని తన భర్తకి అర్ధమేయ్యేలా సున్నితంగా చెప్పింది.  

నీతి:

“యద్భావం తద్భవతి అంటారు”  మన మనసు ప్రశాంతంగా ఉండి ఆలోచనలు నిర్మలంగా, ఉన్నప్పుడు, అవి మనము చేసే పనులలో కూడా  ప్రతిబింబిస్తాయి.

http://amritham99.blogspot.sg/search/label/inspiring%20stories

https://saibalsanskaar.wordpress.com/2015/08/11/reflection-of-mind/

https://www.facebook.com/neetikathalu

ఐక్యతలో ఉన్న శక్తి — పక్షులు నేర్పిన పాఠము

విలువ — సరైన నడత, ప్రేమ
అంతర్గత విలువ — సహనము / ఓర్పు , ఐక్యత.

 

EFD07F04-F7C4-484A-9BD5-5EE57AFF70F8

ఒక పురాతన గుడి కప్పు పైన చాలా పావురాళ్ళు నివసించేవి. గుడి పునరుద్ధరణ సమయంలో అక్కడ దగ్గరగా ఉన్న చర్చి కప్పు పైకి పావురాళ్ళు నీవిచించడానికి చేరాయి.

చర్చి కప్పు పైన ఉన్న పావురాళ్ళు , కొత్తగా వచ్చిన పౌరాళ్ళని , ఎంతో ప్రేమగా ఆహ్వానించాయి.

క్రిస్మస్ కి చర్చి అంతా బాగుచేయాల్సి వచ్చింది .అప్పుడు పావురాళ్ళు అన్నీ దగ్గరలో
ఉన్న మసీదుకి మారాయి . మసీదు కప్పు పైన ఉన్న పావురాళ్ళు , కొత్తగా వచ్చిన పౌరాళ్ళని , ఎంతో ప్రేమగా ఆహ్వానించాయి.

రంజాన్ పండగ వల్ల మసీదు అంతా బాగుచేయాల్సి వచ్చింది .అప్పుడు అన్నీ పావురాళ్ళు పురాతన గుడికి వెళ్లిపోయాయి.

ఒక రోజు బజారులో మత కలహాలు జరిగాయి. ఒక చిన్న పావురము చూసి “వీళ్లు ఎవరు అని అడిగింది ”
దానికి తల్లి పావురము “వీళ్ళు మనుషులు ” అని సమాధానము చెప్పింది.
“ఎందుకు అలా గొడవ పడుతున్నారు ” అని అడిగింది చిన్న పావురము.

తల్లి పావురము ఇలా చెప్పింది ” గుడికి వెళ్లే వాళ్ళని “హిందువులు” అంట్టారు. చర్చికి వెళ్లే వాళ్ళని
“క్రిస్టియన్ “అంటారు. మసీదుకి వెళ్లే వాళ్ళని “ముస్లిం”అంటారు ”

చిన్న పావురము అంది “మనము గుడికి వెళ్లినా , చర్చికి వెళ్లినా , మసీదుకి వెళ్ళినా
, ‘పావురాళ్ళు’అనే కదా పిలుస్తారు ? అలాగే వాళ్ళని కూడా ‘మనుషులు’అని పిలవాలి కదా?”

అప్పుడు తల్లి పావురము ఇలా అంది “మనము భగవంతుడిని అనుభవించాము, అందుకనే ఉన్నత స్థితిలో ఉన్నాము , ఆకాశంలో ఎగఎగురుతున్నాము
, నశ్చింతంగా ఉంటాము. వాళ్ళు భగవంతుడిని అనుభవపూర్వకంగా తెలుసుకోలేదు, అందుకే కింద ఉండి కొట్టుకుంటున్నారు “.

నీతి:
ముందు మనమంతా జాతి, మత , భేదాలని పక్కన పెట్టి మనుషులమని గుర్తించాలి.కలిసి మెలిసి ఐకమత్యంగా ఉంటేనే, ప్రపంచమంతా ఆనందం మరియు సుఖ శాంతులతో కలకళ్ళాడుతుంది .

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

గురువుగారు-పులి

గురువుగారు-పులి
విలువ : శాంతి
ఉపవిలువ : సహనం, ఏకాగ్రత

 

AA85BF96-4C35-44B9-A33E-943130E3B189

ఒక గురువుగారు, శిష్యుడు ఒక గ్రామం నుండి వేరొక గ్రామానికి నడిచి వెళ్తున్నారు. ఇంతలో వాళ్ళకి ఒక పెద్ద గాండ్రింపు వినిపించింది. ఆ శబ్దం వచ్చిన వైపుగా చూస్తే ఒక పులి వాళ్ళ వైపు వస్తూ కనిపించింది.
శిష్యుడికి చాలా భయం వేసి పరిగెత్తి పారిపోదాము అనుకున్నాడు కానీ అలా గురువు గారిని వదిలి పారిపోవడం సరైన పని కాదని, ఇప్పుడు ఏమి చేద్దాము? గురువుగారు అని అడిగాడు.

గురువుగారు ప్రశాంతంగా ఇలా బదులిచ్చారు.
” మనకి చాలా మార్గాలున్నాయి. భయంతో ఇక్కడే కదలకుండా ఉండిపోవచ్చు. అప్పుడు పులి వచ్చి మనల్ని చంపేస్తుంది. మనం పరిగెత్తి పారిపోతే అది కూడా మన వెనకాల పరిగెత్తుకువస్తుంది. దానితో పోరాడవచ్చు కానీ శారీరకంగా అది మనకంటే చాలా బలమైనది”

” మనల్ని కాపాడమని భగవంతుణ్ణి ప్రార్థించవచ్చు. మన మనస్సుకి బలమైన శక్తి ఉంటే దానితో పులిని నిగ్రహించవచ్చు. మనం పులికి మన ప్రేమను పంపించవచ్చు. మన అంతరంగం పైన దృష్టి నిలిపి, ఈ విశాలవిశ్వంలో మనం కూడా ఒక భాగంగా భావించి ఆ శక్తితో పులి యొక్క ఆత్మని ప్రభావితం చెయ్యవచ్చు.”
వీటిలో ఏ మార్గం ఉపయోగించుకుందాము? అని అడిగారు. దానికి శిష్యుడు మీరు గురువుగారు కాబట్టి మీరే నిర్ణయించండి,మనకు ఎక్కువ సమయం లేదు అని చెప్పాడు.
గురువుగారు ఒక్కసారి పులి వైపు చూసి ధ్యానం లోకి వెళ్ళారు. విశ్వం అంతా శక్తితో నిండి ఉన్నట్లు దానిలో తానూ ఒక భాగంగా భావించి ధ్యానం చెయ్యసాగారు.
ఏకాగ్రతతో చేసే ధ్యానంలో జీవుల మధ్య తేడా ఉండదు. ఇంతలో పులి దగ్గరగా రావడంతో శిష్యుడు భయంతో వణికిపోసాగాడు. పులి దగ్గరగా వస్తున్నా భయం లేకుండా గురువుగారు ధ్యానంలో అంత ప్రశాంతంగా ఎలా ఉన్నారో శిష్యుడికి అర్థం కావట్లేదు. కొంతసేపటి తరువాత పులి తల దించుకుని, తోక ఆడిస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.

శిష్యుడు ఆశ్చర్యంతో , గురువుగారు మీరు ఏమి చేసారు? అని అడిగాడు.

“గురువుగారు ఇలా చెప్పేరు, ఏమి లేదు నా మనసులో ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి భగవంతుడి పైన దృష్టి నిలిపాను. ధ్యానంలో ఒక స్థాయిలో నా ఆత్మ, పులి యొక్క ఆత్మ ఒక్కటే అయ్యాయి. పులి నా మనసులో ప్రశాంతతని, ప్రేమని గుర్తించి, ఇక్కడ దానికి ఎలాంటి ప్రమాదం లేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.”

” మన మనస్సు మౌనంగా, ప్రశాంతంగా ప్రేమతో నిండి ఉంటే ఆ ప్రభావం మన చుట్టు పక్కల ఉన్నవారి మీద పడి వారు కూడా మనతో ప్రేమగా ఉంటారు”

నీతి: మన మనస్సు ప్రశాంతంగా, ఆలోచనలు లేకుండా
ప్రేమతోనిండి ఉంటే, ఏకాగ్రత సులభంగా కుదురుతుంది. అప్పుడు మనం అనుకున్న పని సులభంగా చెయ్యగలుగుతాము.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

 

ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలగటం ఎలా?

విలువ: శాంతి
ఉపవిలువ: మనసు ప్రశాంతముగా ఉంచుకొనుట

60CE9A3C-B3A6-4C59-A491-D88D8E8C52B4

ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాడు. సాటివారి పట్ల దయ కలిగి ఉండేవాడు. ఎవరయినా కష్టాల్లో ఉంటే ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ముందుకి నడిపించేవాడు.అతని వద్దకు వచ్చినవారు ఎవరయినా, ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్ళేవారు మరియు అతనిని గొప్ప స్నేహితునిగా భావించేవారు.
అతని పొరుగింట్లో నివసిచే కృష్ణయ్య కు, రామయ్యను చూస్తే ఆశ్చర్యంగా ఉండేది. ఇతను ఎప్పుడూ ఇంత ఆనందంగా ఎలా ఉంటాడు? సాటి వారి పట్ల ద్వేషం లేకుండా ఎల్లప్పుడూ దయ కలిగి ఉండడం ఎలా సాధ్యమవుతుంది అని అనుకునేవాడు.
ఒకసారి రామయ్యను కలిసినప్పుడు కృష్ణయ్య ఇలా అడిగాడు ” చాలామంది మనుషులు స్వార్థంతో, సంతృప్తి లేకుండా ఉంటారు. పక్కవారిని చూసి కూడా నవ్వకుండా వెళ్లిపోతుంటారు. కానీ నువ్వు ఎప్పుడు చూసినా ఎంతో ఆనందంగా, ద్వేషం లేకుండా ఉంటావు. ఇది నీకు ఎలా సాధ్యమవుతుంది?”
దానికి రామయ్య నవ్వి ఇలా సమాధానం ఇచ్చాడు “మన మనసు ప్రశాంతంగా ఉంచుకోగలిగితే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండవచ్చు. మనమందరం భగవంతుని బిడ్డలమే, మనలో ఉన్న ఆత్మయే అందరిలోనూ ఉందని గ్రహిస్తే ఎవరిపట్లా ద్వేషం కలగదు. మన ఆలోచనలు మన నియంత్రణలో ఉంటే మనసు బలంగా ఉంటుంది. మనసు బలంగా ఉంటే శరీరం కూడా బలంగా ఉంటుంది. అప్పుడు మనం అనుకున్న పనులన్నీ చక్కగా చెయ్యగలుగుతాము. మన ఆలోచనలు, అలవాట్లను బట్టి మన ప్రవర్తన ఉంటుంది. ద్వేషము,అసూయ వంటి ఆలోచనలకు దూరంగా ఉంటే మనలో ఉన్న సంతోషం బయటికి వస్తుంది.”

“మనలో ఆనందం బయటికి రావాలంటే కష్టపడి పని చెయ్యాలి. మంచి అలవాట్లు పెంపొందించుకోవాలి. ఏకాగ్రత పెంచుకోవాలి. ఇలా చెయ్యగలగాలి అంటే చాలా  కష్టపడాలి. అడ్డంకులు అన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి.”
“దారిలో వచ్చే కష్టనష్టాల గురించి ఆలోచిస్తూ ఉంటే ముందుకి వెళ్ళలేము. ఆలోచనలతో పాటు మనం వెళ్ళిపోకుండా పని మీద మన దృష్టిని  పెట్టాలి”
ఇందంతా విన్న కృష్ణయ్య ఇంత సులభమా? అన్నాడు.
దానికి రమయ్య “నీకు వచ్చి, వెళ్ళే ఆలోచనలనలను గమనించు. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు.మొదట్లో ప్రశాంతత కొంచెం సేపే ఉంటుంది, సాధన చేసేకొద్దీ ఎక్కువసేపు ప్రశాంతంగా ఉండడం మనసుకి అలవాటు అవుతుంది. మనసుకి ఉన్న ఈ ప్రశాంతతే మనకు బలం. దీనివల్లనే మనలో దయ, ప్రేమ పెరుగుతాయి.కొంత కాలానికి ఈ విశ్వ శక్తిలో మనం కూడా ఒక భాగం అని తెలుస్తుంది. అది అర్థం అయిన తరువాత విషయాలను కొత్త కోణంలో చూసి అర్థం చేసుకోవడం అలవాటు అవుతుంది. మనలో ఉన్న అహంకారం క్రమంగా తగ్గిపోతుంది.”అని కృష్ణయ్యని ఉత్తేజపరిచే విధంగా సమాధానం ఇచ్చాడు.

అప్పుడు కృష్ణయ్య  ,” రామయ్య! మీరు చెప్పిన విషయాలన్నీ    గుర్డగుర్తుపెట్టు కోవడానికి ప్రయత్నం చేస్తాను, కానీ నాకు ఇంకో విషయం కూడా తెలుసుకోవాలని ఉంది”,అన్నాడు కృష్ణయ్య. “అది ఏమిటి? “అని అడిగాడు రామయ్య.

“రామయ్య! మీరు చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావానికి లోను అయినట్లు కనిపించరు, అందరితో ఎప్పుడూ దయతో మాట్లాడతారు.ఇదెలా సాధ్యం?”అని అడిగాడు.
దానికి రామయ్య,”మంచిగా, ప్రేమగా ఉన్నంత మాత్రాన మనం బలహీనులమని అర్థం కాదు. మంచిగా ఉంటూ కూడా శక్తివంతంగా ఉండవచ్చు. మన చుట్టూ ఉన్నవారు మనలో ఉన్న అంతర్గత శక్తిని గుర్తిస్తారు కాబట్టి మనని ప్రభావితం చేసే ప్రయత్నం చెయ్యరు. మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన శక్తిని ఉపయోగించి ఇతరులకు సహాయం చెయ్యవచ్చు. మంచితనం బలహీనులకు మాత్రమే ఉంటుంది అనుకోవడం పొరపాటు. ప్రేమ మరియు మంచితనం వల్ల మనలో ఎంతో శక్తి ఉద్భవిస్తుంది “,అని చెప్పాడు రామయ్య.
“మీ నుండి ఇన్ని మంచి విషయాలు తెలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. వాటిని ఆచరించి నేను కూడా ప్రశాంతతను పొందుతాను”,అని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు కృష్ణయ్య.
నీతి:మనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని మనలో అంతర్గత శక్తిని పెంచుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రేమ,దయ, సరైన నడవడి మొదలయిన లక్షణాలు మన వెన్నంటి వస్తాయి.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu