Archives

సంక్రాంతి శుభాకాంక్షలు

సంబరాల సంక్రాంతి వచ్చేసింది. రంగురంగుల ముగ్గులు, ముద్దుల గొబ్బెమ్మలు, వినసొంపైన హరిదాసు కథలు, గంగిరెద్దుల గలగలలు, చిన్నారులు మెచ్చే భోగిపళ్లు, పెద్దలు వేసే భోగి మంటలు, కమ్మని బొబ్బర్లు, పిల్లల కేరింతలతో.. సకల శుభాలతో సంక్రాంతి వచ్చేసింది. రకరకాల సంప్రదాయాలు, సంబరాలతో సంక్రాంతి సందడి పల్లె వాతావరణానికి అద్దం పడుతుంది.

పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది జనవరిలో వస్తుంది. మకర సంక్రాంతి రోజు సూర్యుడు ఉత్తరాయణంలోకి అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతాయి. హిందువులు పెద్ద పండుగగా భావించే సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చేదే భోగి.

తెలుగువాళ్లకు సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. ముందు రోజు వచ్చే భోగికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. భోగి అంటేనే అందరికీ గుర్తొచ్చేది భోగి మంటలు, భోగి పళ్లు. పిల్లలు ఎంతో సరదాగా గడిపే ముచ్చట భోగిపళ్ల పేరంటం. భోగి రోజు రేగుపళ్లు కాస్త భోగిపళ్లు మారిపోతాయి. అసలు భోగిపళ్లు ఎందుకు పోస్తారు ? రేగుపళ్లనే భోగిపళ్లు ఎందుకు పిలుస్తారు ? రేగుపళ్లనే ఎందుకు ఎంచుకున్నారు ?

రేగుపళ్లను ఇండియన్ డేట్, ఇండియన్ జుజుబీ అని పిలుస్తారు. రేగుపళ్ల ప్రస్తావన పురాణాలలో ఉంది. నారాయణులు బదరీ వృక్షంగా పిలువబడే రేగు చెట్టు దగ్గరే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారని.. అందుకే ఆ ప్రాంతానికి బదరీక్షేత్రం అని పేరు వచ్చిందని ప్రతీతి. భారతీయ వాతావరణంలో.. ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని రేగుచెట్టు పెరుగుతుందట. అలాగే సంక్రాతి సమయానికి రేగుపళ్లు అందుబాటులోకి వస్తాయి. పులుపు, తీపి రుచి కలిగిన ఇవి.. అమోఘమైన రుచినే కాదు.. ఆరోగ్యానికి మంచిదే. అందుకే పిల్లల తలపై భోగిపళ్లు పోసే సంప్రదాయానికి రేగుపళ్లనే ఎంచుకున్నారు.

ఐదేళ్లలోపు పిల్లలకి భోగి పండుగ రోజు భోగిపళ్లు పోస్తారు. వీటినే ఎందుకు పోస్తారు అంటే.. ఐదేళ్లలోపు పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే ఊపిరితిత్తులూ, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటాయి. కాబట్టి రేగుపళ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే రకరకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. కాబట్టి రేగుపళ్లు వాళ్లపై పోయడం వల్ల.. వాటికి ఎట్రాక్ట్ అయి తినడానికి ఇష్టపడతారు. అందుకే రేగుపళ్లు.. భోగినాటికి భోగిపళ్లుగా మారిపోతాయి.
రేగుపళ్లతో పాటు, డబ్బులు, బంతిపూల రెక్కలు, చెరకు ముక్కలు వాడతారు. బంతిపూల రెక్కలు వాడటం వెనకు కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. బంతిపూలకు క్రిములను నాశనం చేసే శక్తి ఉంది. అలాగే చర్మ సమస్యలతో పోరాడుతుంది. కాబట్టి వీటికి కూడా ప్రాధాన్యత ఇస్తారు.

బాలగోవిందం -తొమ్మిదవ శ్లోకము

తొమ్మిదవ శ్లోకము                                                                                                                                     సజ్జన సాంగత్యంలో ఉండు

bg9a

సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |                                                                                                             నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః                                                                                                                     భజగోవిందం భజగోవిందం. || 9||

అనువాదం

సత్సంగత్వమె  నిస్సంగత్వం

నిస్సంగత్వమె నిర్మోహత్వం

నిర్మోహత్వమె నిశ్చలతత్వం

నిశ్చలతత్వమె జీవన్ముక్తి

భజగోవిందం భజగోవిందం. || 9||

తాత్పర్యము :    సత్సాంగత్యం వల్ల ,  అసంగత్వం ఏర్పడుతుంది. అసంగత్వం ,మోహాన్ని నశింపచేస్తుంది. మోహం  నశిస్తే నిశ్చలమైన తత్వము, ఏర్పడుతుంది. అది జీవన్ముక్తికి దారి తీస్తుంది.గోవిందుని భజించు ,గోవిందుని  కీర్తించు. ఓ మందమతి !గోవిందుని సేవించు.

విద్యార్థుల కొరకు కథ :  

మంచి,చెడు గుర్తించగలిగే  సామర్ధ్యము.

విలువ: మంచి నడవడి,

ఉప విలువ:సత్సాంగత్యము, మంచి వారితో స్నేహం.

9b

 

 

 

 

 

 

ఒక కాకి, హంస, యిద్దరూ స్నేహితులు. ఒకరోజు కాకి, హంసను తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది.​హంసను ,కాకి తన ఇంటికి తీసుకెళ్ళి ఒక ఎండిన, వంకర పోయిన చెట్టు కొమ్మపై కూర్చోమంది.  ఆ చోటు అంతా పేడ, మాంసము ,ఎముకలు  ,దుర్గంధముతో వ్యాపించి ఉన్నది. అది చూసి హంస అన్నది”సోదరా నేను ఇటువంటి  ప్రదేశములో ఒక్క క్షణమైనా ఉండలేను. ఎక్కడన్నా పవిత్ర స్థలం ఉంటే అక్కడకి తీసుకెళ్ళు “ అన్నది .

9c

 

 

 

 

 

 

అందుకు కాకి, హంసను రాజు గారి తోటలోని ,ఒక పెద్ద చెట్టు పైన ఉన్న కొమ్మల మధ్యన ఉన్న తొర్రలో  కూర్చోబెట్టింది. అదీ  ప్రక్కనే కూచుంది. కూచోగానే హంస క్రిందకు చూసింది చెట్టు క్రింద రాజుగారు తల పైకెత్తి కూర్చుని వున్నారు. అయన ముఖంపై  సూర్యకాంతి పడుతూ ఉంది. దయాగుణం కల హంస రాజుగారికి  ఎండ తగలకుండా, నీడకోసం తన రెక్కలు విచ్చుకొని ఎండకు అడ్డం పెట్టింది. రాజు గారికి ఊరట కలిగింది. కానీ దుష్టబుద్ధి గల కాకి రాజు గారి తలపై రెట్ట వేసింది. పై నుంచి రెట్టపడగానే రాజుగారు విల్లు ఎక్కుపెట్టి బాణం వేశారు. బాణాన్ని చూస్తూనే కాకి ఎగిరి పోయినది. కానీ ఆ బాణం హంసకు  తగిలింది. హంస కిందపడి చనిపోతూ యిట్లా అంది. “ఓ రాజా! నీ మీద రెట్ట వేసింది నేను కాదు కాకి. నేను స్వచ్ఛమైన జలాల్లో వుండే హంసను. నీకు ఎండ వేడి తగలకుండా సహాయం చేశాను. కానీ దుష్ట స్వభావి అయినా కాకితో స్నేహం వలన నా  జీవితం నాశనం అయింది . అందుకే దుష్టులను దూరంగా  పెట్టాలి”. అంటారు

నేర్చుకోవలసిన విషయము :మనుషుల మంచితనం ప్రభావం వారితో ఉండేవారిపై ఏ విధంగా ప్రభావం, ప్రేరణ స్తుందో , చెడ్డ వారి సాంగత్యము వారితో ఉండేవారిని ప్రభావితం చేస్తుంది. అందుకే స్నేహితులని ఎన్నుకొనే ముందర సరి అయిన  నడవడి గల మంచి వారితోనే స్నేహం చెయ్యాలి. మంచివారి సాంగత్యం  వల్ల మనిషి  సన్మార్గములో  వుంటాడు.  ఒక మంచివాడు దుష్టుల సహవాసంలో అతని మంచితనం గుర్తింపబడక పోగా ,దుష్టసావాసం వల్ల తన జీవితం నాశనం చేసుకుంటాడు. ఒక సామెత వుంది. “నీ స్నేహితులెవరో చెప్పు, నీవు ఎట్లాంటివాడివో చెపుతాను” అని. చిన్నతనం నుంచే మంచి వారితో స్నేహం అలవరచుకోవాలి. ఇది చాల ముఖ్యము. ఒక క్రుళ్ళిన పండు బుట్టలో మిగతా పండ్లతో ఉంటే  క్రమంగా బుట్టలోని మిగతా  పండ్లు  అన్ని క్రుళ్ళి పోతాయి. స్నేహితులని ఎంచుకొనే విషయం లో కూడా చాల జాగ్రత్తగా ఉండాలి . చిన్న వయసులో అలవర్చుకొనే విలువలు జీవితాంతం మనతో ఉంటాయి. మానవతా విలువలు తెలియచెప్పే విద్య, మంచివారితో సావాసము జీవితం లో అత్యంత ముఖ్యము ,ప్రధానము.

https://saibalsanskaar.wordpress.com

 htps://facebook.neetikathalu.com 

 

బాలగోవిందం -ఎనిమిదవ శ్లోకము

ఎనిమిదవ శ్లోకము
bg8a

కా తే కాంతా కస్తే పుత్రః

సంసారో‌உయమతీవ విచిత్రః |

కస్య త్వం వా కుత ఆయాతః

తత్వం చింతయ తదిహ భ్రాతః

|| భజగోవిందం భజగోవిందం ||8||

 

అనువాదం

ఎవరు నీ సతి?ఎవరు నీ సుతుడు?

చిత్రం,సోదర! ఈ సంసారం!

ఎవరివాడ?వెవ్వడ?వెటు వచ్చితి?

చేయుము ఇక్కడె తత్వ విచారం

|| భజగోవిందం భజగోవిందం ||8||

 

తాత్పర్యం :

ఎవరు నీ  భార్య ? నీ కుమారుడు ఎవరు ? అంతా విచిత్రమైన సంసారము .ఎవరివాడివి నీవు ? ఎక్కడ నుంచి వచ్చావు ? తమ్ముడూ !ఆ సత్యాన్ని ఇక్కడే విచారించు . ఇప్పుడే ఆలోచించు.గోవిందుని భజించు .గోవిందుని కీర్తించు .ఓ మందమతి గోవిందుని సేవించు.

విద్యార్థుల కొరకు కథ:-   ఏనుగు  త్రాడు

విలువ : ఆశావాదము.

ఉపవిలువ :తన శక్తీ సామర్ధ్యములను తన ఆంతరంగిక  శక్తిని ,స్వేచ్ఛను  తెలిసికొనుట.

ఒక అతను మార్గము మీద నడుస్తూ  వెళుతున్నాడు. దారిలో అతనికి ఒక ఏనుగుల గుంపు కనపడింది. విచిత్రం ఆ ఏనుగులన్నీ కదలక అట్లాగే నిలబడివున్నాయి. ఇతనికి ఆశ్చర్యం వేసింది యివన్నీ ఎందుకిట్లా వున్నాయి అని. తీరా పరిశీలిస్తే ప్రతి ఏనుగు కుడికాలుకు ఒక త్రాడు కట్టబడి ఉంది. అవేమి వేరే త్రాళ్లతో కట్టి లేవు. ఎదురుగా  “వల ” అట్లాంటివి ఏమి లేవు. ఏనుగు కావాలనుకుంటే ఆ ఒక్క కాలికి కట్టిన త్రాటిని నిమిషంలో తెంపుకొని వెళ్లగలవు. కారణం  తెలియదు  కానీ అన్ని ఏనుగులు నిలబడి ఉన్నాయి. ఇంతలో ఎదురుగా ఏనుగుల ట్రైనర్ కనిపించాడు. ఈ బాటసారి ఆ ట్రైనర్ దగ్గరకి  వెళ్ళి ఏనుగులు కదలక పోవటానికి కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు అతను ఇట్లా చెప్పాడు.” ఏనుగు పిల్లలు  అటు ఇటు  పోకుండా ముందు కాళ్ళకి  త్రాడు కట్టి వుంచేవాళ్ళము. ఆ త్రాడు ఒక పెద్ద స్తంభానికి ముడి వేసేవాళ్ళము. అవి ఎక్కడకి కదలలేకపోయేవి.

చిన్నప్పటి  అలవాటు వల్ల కాలికి త్రాడు కడితే చాలు ఇక కదలలేము అనే భావన వారికి పెద్దైనా  సరే , ఆ కట్టుబాట్లు ,నియతి ఉన్నవని భావించి అలాగే ఉంటాయి. అవి తెంచుకొని పోవచ్చు అనే ఆలోచన వాటికి రాదు” అన్నాడు . అంత శక్తివంతమైన ఏనుగు కు ఆ  త్రాడు తెంపుకొని పోవటం ఎంత పని. ఆ బంధం  నుంచి తేలికగా తెంపేసుకొని ,స్వేచ్ఛగా ఉండవచ్చు. కానీ అవి  ఏ మాత్రం ఆలోచన లేకుండా అక్కడే బంధాలున్నాయి అనుకోని బంధింపబడ్డట్టు భావిస్తున్నాయి. ఎందుకంటే చిన్నతనంలో బంధాలకు అలవాటు పడిపోయాయి.  బంధ విముక్తి కావచ్చనే ,ఆలోచన వాటికీ కలుగదు. మానవులకు , చిన్నతనం నుంచీ బంధాలైన రాగ ద్వేషాలలో చిక్కుకొని ,వాటి నుంచి బైటపడాలనే తలపే రాదు.

నేర్చుకోవలసిన విషయము:

ఈ ఏనుగుల లాగానే మనం కూడా ఏమి చేయలేము అనే ఒక నమ్మకం ఫై ఆధారపడి ఉంటాము. ఎందుకంటే ఎపుడో ఒక సారి సన్నివేశములో అపజయం అనుభవించాము. ఎన్ని సంవత్సరములు గడిచిన , ఆ అపజయం భావమువల్ల మనం ఈ పనులు చేయట యందు సమర్ధత లేదు అనే ఒక నిర్ణయమును గట్టిగ పట్టుకొని అదే సత్యం అనుకుంటాము. అంతే కాదు మన ఆలోచనలను ,శక్తినీ  పరిమితం చేసుకుంటు ఉంటాము. కొన్ని పనులకు మనం సరిపోము. అనే నిర్ధారణ చేసుకుంటాము.

ఈ అపజయాలన్నిటినీ మనం మెట్టుగా భావించి వాటి నుంచి ఏం నేర్చుకున్నామో ఆలోచించి ఉన్నతమైన స్థానం  వైపు  క్రమక్రమంగా సోపానాలను అధిగమిస్తూ సాగిపోవాలి. అపజయం వల్ల మనం ఏది వదిలేయాలా? ఏవి సమకూర్చుకోవాలి ? చేసిన పనిలో లోటుపాట్లు గుర్తించి ,ఆ సంఘటనను , ఒక ప్రేరణగా భావించి ,మన  గమ్యమును   చేరుకోటానికి సాధనగా ఉపయోగించుకోవాలి. ఏ రకంగా విజయం సాధించాలి అని ఆలోచించాలి.  మనం మన ప్రపంచాన్ని చిన్న సందర్భమునకు పరిమితం చేయవద్దు. మన మానసిక హద్దులను ఛేదించి ఈ విశాల ప్రపంచం అంతా  వ్యాపింప చేసుకుందాము. ఒక చిన్న సంఘటనతో జీవితం అంతా మూసుకుపోకూడదు. మనం మన నమ్మకమును, హృదయమును,మనమీద, మన శక్తి పై పెట్టినప్పుడు  విజయం మనదే.  ఇంకొక  విషయం ఏమిటంటే, మన మనస్సును, విశాల దృక్పదంతో ఆలోచించకుండా ఏది  బంధిస్తుందో, దాని నుంచి బైట పడాలి.ఏ ఆలోచనలు  మన స్వేచ్ఛను ,శక్తీ ని అడ్డుకుంటున్నాయో గమనించి వాటిని వదిలేయాలి “అన్ని నేనే  , అంతా నాదే అనే దృక్పధం కలిగి ఉండాలి. మన భావాల్ని  నిర్బందించే ఆలోచనలని తొలగించుకోవటానికి  కృషి చెయ్యాలి. ఎప్పుడైతే  అలాంటి బంధించే  ఆలోచనల నుంచి స్వేచ్ఛ వచ్చిందో , మనము  ఎంతో సంతోషంగా  ప్రశాంతంగా ఉండగలుగుతాము.

విద్య విద్యార్థుల జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనది. దానివల్ల జ్ఞాన సముపార్జన మాత్రమే  కాక అనేక ఇతర కళల యందు ప్రావీణ్యమును యిస్తుంది. దీనితో  పాటు మానవతా విలువలు పెంచే విద్య చాల అవసరము. దీనివల్ల మనిషి సంపూర్ణ అభివృద్ధి చెంది జీవితము సంతోషంతో ప్రశాంతంగా గడపగలుగుతాడు.  పిల్లల్లో పోటీ మంచిదే. దానివల్ల వారు లక్ష్యసాధనకు  మార్గము , ఎంచుకొని కృషితో లక్ష్య సాధన పొందుతారు.  మన స్వాధీనంలో వున్నది అంకిత భావం తో ఆ పని నిర్వర్తించటమే . ఆ పని ఫలితాలపై మనకు ఎంటువంటి నియంత్రణ లేదు. ఒక లక్ష్య సాధనకు పూనుకున్నప్పుడు మధ్యలో ఎన్ని  ఆటంకాలు వచ్చిన , భయాలు, కలిగిన బద్ధకం వచ్చిన ,ఆ పనిని మధ్యలో చేయకుండా వాయిదా వేసిన మొదలగున్నవన్నీ , మన లక్ష్యం వైపు చేరనీయవు.  ఉదాహరణకు సోషల్ మీడియా వల్ల  దారి మళ్ళి విలాసాలపై మనసు మళ్లే అవకాశం వుంది. బద్ధకం వల్ల పనిని రేపు, రేపు చేయచ్చు అని ఆ పని ప్రాముఖ్యత గుర్తించకుండా ,వాయిదా వేసే పద్ధతి వస్తుంది .  ఏవి మొదట్లో చాల సౌకర్యంగా, సంతోషంగా అనిపిస్తాయి. మన పనులు చేసే విషయంలో శ్రద్ధ లేక మన పనుల కొరకు , వేరే వారిమీద ఆధారపడినప్పుడు ,వేరే విషయాలమీద  ఆధారపడినప్పుడు మనల్ని మన అత్త్యున్నతమైన  లక్ష్యం నుంచి దూరం అవుతాము. చిన్నతనంలోనే యివి గుర్తించి బైటపడటం తేలిక. కానీ పెద్ద అయినతరువాత మెల్ల మెల్లగా ప్రయత్నం మీద వీటినుంచి బైట పడే మార్గము తెలిసికొని ,చేస్తున్న తప్పును గ్రహించి సరిదిద్దుకొనే అవకాశాలని సృష్టించుకుని  మన లక్ష్య సాధనకై దిశా నిర్ధేశం చేసుకుంటే తప్పకుండ అనుకున్నది సాదిస్తారు.

 

వినయము గల నాందేవ్.

 namdev

 

చిన్న వయసులోనే నాందేవ్ కి  పండర్ఫుర్ భగవాన్ విఠలుడి సాక్షాత్కారం కలిగింది.ఎంత అదృష్టమో కదా ! ‘నేను ఎంతో అదృష్టమంతుడిని ‘ అని అనుకునేవాడు నాందేవ్.నాందేవ్ కి ఒక గురువు యొక్క అవసరం ఉందనుకు న్నాడు భగవంతుడు.

గ్రామంలో సాధు-గోరా అనే ఒక కుమ్మరి ఉండేవాడు.ఒక సారి ఆ గ్రామంలో ఉన్న వారందరిని పిలిచి ఒక విందు ఏర్పాటుచేశారు.  వారందరినీ గోరా పరీక్షించడం జరిగింది.అదెలా అంటే జ్ఞానేశ్వర్ గ్రామంలో ఉన్న సాధులు అందరి దెగ్గిర ఉన్న ‘కుండ’, బ్రహ్మ జ్ఞానం తో నిండి ఉందా లేదా అని గోరాని చూడమన్నాడు. సాధువులు అందరూ కూర్చున్నారు, గోరా తల మీద కుండను కర్రతో కొట్టి, పరీక్షించ సాగాడు. కానీ నాందేవ్ ఈ పరీక్షకి ఒప్పుకోలేదు. సాధువులు అందరూ నాందేవ్ ని  ‘సగం ఉడికిన కుండ ‘ అని ఎక్కిరించారు. అప్పుడు విఠలుడి దెగ్గిరకి వెళ్ళాడు నాందేవ్. విఠలుడు నాందేవ్ ని  ఓదార్చి, మహాత్ములు, సాధువుల చర్యలు అర్ధం అవ్వాలి అంటే పరిపూర్ణమైన  జ్ఞానము కలగి ఉండాలి అని అన్నారు. ఆ జ్ఞానము కలగడం కోసం,శివుడి గుడిలో ఉన్న విశోభా కేచరా అనే గురువు దెగ్గిరకి నాందేవ్ ను వెళ్ళమని పంపించాడు విఠల దేవుడు.

                తీరా నాందేవ్ గుడిలోపలికి వెళ్ళగానే, అక్కడ ఆ పెద్దాయన, తన రెండు కాళ్ళను శివలింగము పైన పెట్టుకుని పడుకుని ఉన్నాడు .అది చుసిన నాందేవ్, ఆ పెద్దాయనని తట్టి లేపాడు. నిద్దర లేచి నాందేవ్ ని  చూడగానే ‘నిన్ను విఠలుడు ఇక్కడికి పంపించారు కదా ‘ అని అడిగారు. నాందేవ్ ఆశ్చర్య పోయి, ఈ పెద్దాయన మాములు మనిషి కాదు అని అనుకున్నాడు.

                    ‘మీరు చాలా పెద్ద మనిషి లాగా కనిపిస్తున్నారు కాన, ఎందుకు రెండు కాళ్ళు  శివలింగము పైన పెట్టుకుని పడుకున్నారు “, అని అతనిని నాందేవ్ ప్రశ్నించాడు. దానికి  ఆ పెద్దాయన ‘ఓ అలాగా ! నేను చాలా అలిసిపోయి ఉన్నాను, కొంచం నా కళ్ళు శివలింగము పైనుంచి తీసి కింద పెట్టమని అడిగారు. అప్పుడు నాందేవ్ ఆ పెద్దాయన కాళ్ళు పట్టుకుని, ఎటువైపు పెట్టినా, అక్కడ శివలింగము ఆవిర్భవించింది (ప్రత్యక్షమయింది). ఆఖరికి నాందేవ్,గురు విశోభా కేచరా కాళ్ళను  తన ఒడిలో పెట్టుకున్నాడు. అలా చేసి నాందేవ్ శివతత్వ అనుభూతిని  పొందాడు.

                 ఈ కథలో మనం గమనించ వలసినది  ఏమిటి అంటే, నాందేవ్ గురువుకి శరణాగతుడు అయ్యి, గురు పాదాలని పట్టుకోవడం వల్ల శివతత్వాన్ని, జ్ఞానాన్ని పొందగలిగాడు. గురు విశోభా కేచరా, నాందేవ్ ని  ఆశీర్వదించి పంపించారు. నాందేవ్ తన గ్రామానికి తిరిగి వచ్చి, ఇంట్లోనే సమయం గడిపాడు. ఇది గమనించిన భగవాన్ విఠలుడు, నాందేవ్ ని చూడడానికి తన ఇంటికె వచ్చి,”నాందేవ్  నీవు గుడికి వచ్చి చాలా కాలం అయింది” రాకపోటానికి కారణం ఎమిటి అని ప్రశించాడు. ఆ ప్రశ్నకి నామదేవ్ వినయంగా “స్వామి! మీరు అంతటా వ్యాపించి ఉన్నారు’. మీరు లేని చోటంటూ ఏదైనా ఉందా? “ మీరు  వేరు నేను వేరు కాదు ,మీరు లేక ,మీకు దూరంగా నేను జీవించగలనా ? “అని బదులు చెప్పాడు.

ఇది తెలియడానికే, భగవాన్ విఠలుడు నాందేవ్న  గురు విశోభా కేచరా వద్దకి పంపించారు.

htps://facebook.neetikathalu.com

https://saibalsanskaar.wordpress.com/2015/07/31/namdev-humbled/

 పద్మపాద — గురుభక్తి

padmapada

విలువ — విశ్వాసము

అంతర్గత విలువ — భక్తి

జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య గారి నలుగురు శిష్యులలో ఒకరైన పద్మపాదుల వారి అసలు పేరు సనందన . మిగతా ముగ్గురు శిష్యుల పేర్లు హస్తమలక,తోటకాచార్య,సురేశ్వర. ఈ కథ సనందులవారి గురుభక్తిని చాటి చెప్తుంది.  

ఒక రోజు శంకరాచార్యుల వారు కాశిలో ఉన్నప్పుడు, గంగా నది ఒడ్డున సనందనుడు గురువుగారి తడి బట్టలను ఆరేస్తున్నారు. మరొక వైపు శంకరాచార్యుల వారు నదిలో

స్నానం చేసి తడి బట్టలతో బయటికి వచ్చి నిలబడ్డారు. పొడి బట్టలను తెమ్మని శిష్యుడిని పిలిచారు

సనందుడు గురువుగారిని తడి వస్త్రములతో చూడలేకపోయాడు.ఆయన పట్ల ఉన్న అమితమైన భక్తి ,ప్రేమల కారణంగా సనందుడు, ఎక్కడ ఉన్నాడో ఆలోచించకుండా,వెంటనే వెళ్ళి ఆయనకి పొడి బట్టలని అందించాలని అనుకున్నాడు.

గంగా నది దాటాలి  అంటే పడవలో వెళ్ళాలి, అనికూడా ఆలోచించించ లేదు.

సనందుడికి ఒక్కటే ఆలోచన ఏమిటి అంటే గురువువుగారికి పొడి వస్త్రములు అందించడం. అంతే !

అలలని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా హుటాహుటిన బయలుదేరాడు.  

నేలమీద నడిచినట్టు , గంగా నదిలో నడుచుకుంటూ , గురువుగారి దగ్గరకి వెళ్ళిపోయాడు.

ఒక వేళ తాను నదిలో మునిగిపోతే ఉన్న పొడి బట్టలు కూడా తడిసిపోతాయని కూడా అతనికి తట్టలేదు. మరి అటువంటి భక్తులకి భగవంతుడు అండగా నిలవడా ?

సరిగ్గా అదే జరిగింది.

సనందుడు నడుస్తుండగా  గంగా దేవి నది పొడుగునా తామర పువ్వులతో దారి పరిచింది.

తాను వేసే ప్రతి అడుగుకి ఒక తామర పువ్వు వికసించడం చూసి అందరూ ఆశ్చర్య పోయారు.

ఈ విధంగా సనందన సునాయాసంగా నదిని దాటి, గురువుగారి దగ్గరకి స్వయంగా వచ్చి  పొడి వస్త్రములను అందించాడు.

అప్పుడు శంకరాచార్యులు “నదికి ‘అవతల ఉన్న నువ్వు ఇంత తొందరగా నదిని  ఎలా దాటగలిగావు’?అని ప్రశ్నించారు. సనందనడు ‘గురువుగారు !మిమ్మల్ని తలుచుకుంటేనే , ఈ సంసారం అనే సముద్రంలో నీరు, మోకాళ్ళ లోతుకి వెళ్ళిపోతుంది.’ అటువంటి మీరు ఆజ్ఞాపించినప్పుడు నేను నదిని దాటడంతో ఆశ్చర్యమేముంది “ అని వినయంగా సమాధానము ఇచ్చాడు.  

శంకరాచార్యులు వారు, సనందుడికి  తామరపువ్వులు పరిచిఉన్న త్రోవని చూపిస్తూ

సనందుడి అడుగులకి తామరపువ్వులు వికసించాయి.  కాబట్టి అతనికి ‘పద్మపాదా ‘ అని పిలిచారు.

నీతి:

ఎవరైతే అచంచల  భక్తి, విశ్వాసములతో గురుపాదములను శరణు వేడుతారో వారి మంచి చెడ్డలన్నీ గురువు చూసుకుంటారు.

https://saibalsanskaar.wordpress.com/2015/07/31/padmapada-guru-bhakti/

htps://facebook.neetikathalu.com

బాలగోవిందం -ఆరవ శ్లోకము

ఏడవ శ్లోకము

bg7

మానవ జీవితంలోని నాలుగు ముఖ్యమైన దశలు. వాటిని తెలివిగా సద్వినియోగం చేసుకోవాలి

బాల స్తావత్ క్రీడాసక్తః

తరుణ స్తావత్ తరుణీసక్తః |

వృద్ధ స్తావత్-చింతామగ్నః

పరమే బ్రహ్మణి కో‌உపి న లగ్నః

భజగోవిందం భజగోవిందం || 7||

అనువాదం

ఆటలు పాటల బాల్యం గడిచెను

ప్రేమని పెండ్లని ప్రాయం నడిచెను

చింతలు వంతలు చీకున ముసిరెను

పరబ్రహ్మ కాబట్టక పోయెను

భజగోవిందం భజగోవిందం || 7||

తాత్పర్యం: బాల్యం లో ఆటల యందు ఆసక్తి ,యవ్వనంలో యువతులపై ఆసక్తి , ముసలి తనంలో మనసునిండా  చింతలే. పరమేశ్వరుని  యందు ఆసక్తి ఎవరికీ ఉండదు.

గోవిందుని భజించు ,గోవునందుని కీర్తించు . ఓ మందమతి ! గోవిందుని సేవించు .

విద్యార్థులకొరకు  కథ:

కుళ్ళిన  అరటిపండ్లు .

bg7b

విలువ :   సత్ప్రవర్తన :

ఉపవిలువ :  ఎపుడు చేయవలసిన పనిని అప్పుడు చెయ్యకుండా వాయిదా వేస్తుండటం.

నారిమన్  చాలా  మంచివాడు . ఎప్పుడూ దేవుని నామము స్మరించుకుంటూ ఎంతో సేపు ధ్యానం చేస్తూ  దేవునితో అనుసంధానం చెంది ఎంతో శక్తిని , ప్రేరణని  పొందుతుండేవాడు.  అతని జీతంలో కొంత భాగమును ,తన సమయంలో కొంత భాగమును బీదప్రజలకి  సహాయపడటానికి కేటాయంచేవాడు.  ఉచితంగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నపుడు అక్కడకి వెళ్లి సహాయం చేసేవాడు. తాను పండ్లను కొనుక్కొని, ఆసుపత్రులలో బీద రోగులకు పంచుతుండేవాడు.  బీద ప్రజలు నివసించే కాలనీలకు వెళ్లి అక్కడి పిల్లలకి ఐస్ క్రీంలని కొనివ్వటం , లేక ఏదన్నా సినిమా చూపించటం చేసేవాడు . అతను   చేసే ప్రతి సేవ  భగవంతుడి సేవగా భావించేవాడు. ఒక రోజు యువకుడైన తన కొడుకు మణిత్ ని ” మణిత్,  నేను గుడికి వెళ్తున్నాను. అరటిపండ్లను  అక్కడ గుడి బైట కూర్చుని  ఉండే   బిచ్చగాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు వచ్చి ఆ పనిలో నాకు సహాయం చేస్తావా”?  అని అడిగాడు. మణిత్ ” ఓహ్ !ఏంటి నాన్నా “?   నాకు ఇట్లాంటి పనులు చెప్తావు?. నేను ఏమన్నా ముసలి వాడినా?  గుడికి వెళ్ళటం, పండ్లు పంచటం ఇట్లాంటి పనులు  చేయటానికి. ఇవి నేను చెయ్యవలసిన పనులు  కాదు. నీవు  పెద్దవాడివి. ఇట్లాంటి  పనులన్నీ పెద్దవాళ్ళు చేయవలసినవి, నాలాంటి యువకులు  కాదు.  నాకీ  పనులు చెయ్యాలని లేదు. నీ  అంత  అయినపుడు చేస్తాలే . కానీ ఎప్పుడు కాదు అని చెప్తూ , వాక్ మాన్ ,హెడ్ఫోన్స్  చెవిలో పెట్టుకొని రాక్ మ్యూజిక్ వింటూ డాన్స్ చేస్తూ ఉండి పోయాడు.

నారిమన్  కొడుకు ధోరణి చూసి , ఏమీ  మాట్లాడకుండా తాను అనుకున్న ప్రకారం గుడికి అక్కడున్న బిచ్చగాళ్ళలో  పండ్లను  పంచేశాడు.  కొన్నాళ్ల తరువాత ఒక పెద్ద బుట్టనిండా అరటిపండ్లు తెచ్చి వరండాలో పెట్టి  స్నానం చేసిరావటానికి లోపలకి వెళ్ళాడు , ఇంతలో అటుగా వచ్చిన మణిత్ ఆ  పండ్లను చూశాడు. అవి బాగా క్రుళ్ళి పోయి ఉన్నాయి . వాటిమీద చిన్న దోమలు ముసిరి ఉ న్నాయి. పండ్లు ఏమాత్రం బాగాలేవు. ఇంతలో నారిమన్ తెల్లని దుస్తులు ధరించి ,చక్కగా తయారయ్యి  ఆ అరటిపండ్ల బుట్టని కారు డిక్కీ లో పెడుతుంటే, మణిత్, ” నాన్నా! ఈ పండ్లని ఎక్కడకి తీసుకెళ్తున్నావు” అని అడిగాడు. నారిమన్,  గుడికి  తీసుకెళ్తున్నాను  అని చెప్పాడు.   అప్పుడు మణిత్ ” అదేంటి నాన్నా తాజా  పండ్లు కొని  గుడికి తీసుకెళ్ళు. ఈ క్రుళ్ళిన పండ్లు ఎందుకు కొన్నావు? దేవుడికి  ఇలాంటివి ఇవ్వటం సిగ్గు చేటు”. అన్నాడు.అప్పుడు తండ్రి , నీవు కూడా , బాగా పెద్దవాడైన తర్వాత దేవుని పూజిస్తానంటే నీ వల్ల  దేవునికి ఏమి ఉపయోగం? ముసలి వాడివి అయ్యాక ,ఏమి చేయగలవు? అట్లాగే అతిగా పండిన ,మగ్గిన  పండ్లని ఉపయోగించవచ్చులే”అని బదులు చెప్పాడు. అది విని  కొడుకు సిగ్గుతో తలవంచుకున్నాడు.  సిగ్గుతో తండ్రి  వైపు  చూడలేక పోయాడు. తండ్రి సరైన సమయంలో సరైన కారణం చెప్పగలిగిగాడు.

తండ్రి ,”నీవు యువకుడిగా ఉన్నప్పుడు ,భగవంతునికి  ఎంతయినా సేవ చేయగలవు, ఆపదలో ఉన్న  వారికి సేవలందించగలవు . నీ  సమయాన్ని , డబ్బును కూడా బీదవారి కోసం ఖర్చుపెట్టవచ్చు.  ఆపదలో ఉన్నవారిని  ఆదుకోవచ్చు . కానీ, నువ్వు ముసలివాడవైతే  నీ  శరీరం లో అనేక రుగ్మతలు వస్తాయి. అప్పుడు, నీకే ఎవరన్నా సేవ చెయ్యాలి.  ధన సంపాదన లేకపోతే ఆర్థిక బాధలుంటాయి ,ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఎవరికి తెలుసు? వయసుతో వచ్చే కాళ్ళ నొప్పులు , మోకాళ్ళ నొప్పులతో కొద్ది గంటలైనా కూర్చొని దైవ   ప్రార్ధన  చేయగలవా? నీవు దేవునికి ఏమి సమర్పించగలవు? ఆ సమయంలో నీకు  ఇప్పటికంటే కూడా , దైవానుగ్రహం చాలా  అవసరం”, అన్నాడు.  ఈ మాటలన్నీ చెప్పి తండ్రి బుట్టని  కారు  డిక్కీ లో పెట్టుకొని వెళ్ళిపోయాడు. కొడుకుకు చెప్పాల్సినవి  చెప్పాడు. కానీ  గుడికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ పళ్ళు  దేవుడికి సమర్పించటానికి పనికిరావని ఆయనకీ తెలుసు . ఆ బుట్టలో ఉన్న పండ్లని గుడికి తుసుకెళ్ళకుండా , గోశాలకు తీసుకెళ్లి ఆవులకు తినిపించాడు. క్రుళ్ళిన  అరటిపండ్లు ఆ  రాకంగా మణిత్ కి బుద్ధి చెప్పటానికి,ఆవుల ఆకలిని తీర్చటానికి పనికొచ్చాయి .

నేర్చుకోవలసిన విషయము:

మానసికంగా, శారీరకంగా , ఆర్ధికంగా ఇంకొకరికి సహాయ  పడే స్థితిలో వున్నపుడు  తప్పక సహాయం చెయ్యాలి. దానివల్ల అతనికి, ఇతరులకి కూడా ఉపయోగదాయకం. ఏ పనైనా సరే సరైన సమయంలో చేస్తేనే అది అర్ధవంతం అవుతుంది. దాని ప్రయోజనము నెరవేరుతుంది. తప్పక నిర్వహించవలసిన   కర్తవ్యములను రేపు, రేపంటూ వాయిదా వేయవద్దు. ఆలస్యము చేయవద్దు. తగిన సమయంలో చెయ్యాలి . సాక్షత్ యుగ పురుషులైన   భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు  ఇలా అన్నారు,” మ్రొక్కను వంచవచ్చు ,అదే చెట్టును వ్రంచితే  అది విరిగి పోతుంది. పిల్లలు యువకులుగా పరివర్తన చెందే కాలంలో  వారు  ప్రపంచ ఆకర్షణ , ఉద్యోగం ,  కుటుంబ విషయములలో పూర్తిగా నిమగ్నం అవుతారు. చిన్నతనం లోనే పిల్లలను, మానవతా విలువలను బోధిస్తూ పెంచితే  వారు పెరిగిన కొద్దీ ప్రపంచ ఆకర్షణలకు లొంగి  దారిని  తప్పినా కూడా ,మళ్ళి ఖచ్చితంగా చిన్నప్పటి మంచి దారికే  వస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ  తప్పని సరిగా  దైవ  ప్రార్ధన చెయ్యాలి ,భగవంతునికి కృతజ్ఞతలను సమర్పిస్తూ ఉండాలి.

ఇలాంటి  అలవాటును చిన్నప్పటినుండి ఎవరు అనుసరిస్తారో , వారు వారి వయస్సు పెరుగుతున్నకొద్దీ, ఎంతో   నిబ్బరంగా  ప్రశాంతంగా  ఉంటూ ,జీవితంలో  ఎదురయ్యే ఒడిదుడుకులను ,ఒత్తిడిని  ఎదురుకొనగలుగుతారు.  అటువంటివారు భౌతిక సుఖములు ,ఆధ్యాత్మిక పురోగమనం పొందుతారు.

 

 

 

బాలగోవిందం -ఆరవ శ్లోకము

ఆరవ  శ్లోకము

శరీరం కేవలం ఒక పరికరమేనని గుర్తించాలి

bg6

 

యావత్-పవనో నివసతి దేహే

తావత్-పృచ్ఛతి కుశలం గేహే |

గతవతి వాయౌ దేహాపాయే

భార్యా బిభ్యతి తస్మిన్ కాయే.

భజగోవిందం భజగోవిందం || 6 ||

అనువాదం                                    

ఆడేదాకా వంట్లో ప్రాణం

అడిగెదరింట్లో అంతా కుశలం

హంస లేచెనా శవమునుచూడగ

భార్యకునయినా భయ భీతాహం

భజగోవిందం భజగోవిందం || 6 ||

తాత్పర్యము:

శరీరంలో ప్రాణం ఉన్నంతవరకు ఇంట్లో అందరు క్షేమాన్ని అడుగుతుంటారు. ప్రాణం పోగానే దేహం పతనము అవుతుంది.  ఆ కళేబరాన్ని చూసి భార్య కూడా భీతి చెందుతుంది. గోవందుని భజించు . గోవిందుని కీర్తించు. ఓమందమతీ గోవిందుని సేవించు.

 

విద్యార్థులకొరకు కథ :

విలువ :ప్రశాంతత

ఉపవిలువ : వైరాగ్యము.

bg6a

 

ఒక రాజ్యం లో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను ఆ రాజభవంతి దగ్గరలో ఉంటూ రోజూ, ఆ భవంతిలోని రాజుగారిని దూరం నుండి చూస్తూ  ఉండేవాడు. ఒకరోజు రాజుగారు అందరికీ  విందు ఇస్తున్నారు అనేవార్త  విన్నాడు. అంతేకాదు రాజు లాగా తయారైన వారెవరైనా సరే విందుకు రావచ్చట అని తెలుసుకున్నాడు. ఇది విన్న ఆ బిచ్చగాడికి ఒక ఆశ పుట్టింది.  తన దుస్తులు చూసుకున్నాడు అన్ని చిరిగిపోయాయి.  ఎలాగైనా రాజుగారి దుస్తులలాంటివి సంపాదించాలని అనుకున్నాడు.

రాజభవనము  దగ్గరకి వెళ్లి కాపలా వారిని బ్రతిమిలాడి, దర్బారులోకి ప్రవేశము సంపాదించాడు. ఎంతో ధైర్యం కూడగట్టుకొని , చాలా  వినయంగా రాజు దర్భారులోకి ప్రవేశించాడు. అతన్ని చూడగానే రాజు. “నీకేమి కావాలి” అని అడిగాడు .దానికి ఆ బిచ్చగాడు రాజు గారికి వంగి వంగి దండాలు పెడుతూ ఇట్లా అన్నాడు. “రాజా! నాకు  మీరు ఇస్తున్న విందుకు రావాలని వుంది. దయచేసి తమ పాత  దుస్తులు ఇప్పిస్తే అవి ధరించి విందుకు వస్తాను. నా  దగ్గర చినిగిన బట్టలు మాత్రమే ఉన్నాయి.

రాజుగారు వెంటనే తన పాత  దుస్తులను  తెప్పించి బిచ్చగాడికిస్తూ “ఈ దుస్తులు చినిగిపోవు, మాసిపోవు వాటిపై దుమ్ము పడదు ,ఎందుకంటే ఇవి ఎంతో ప్రత్యేకమైనవి. నీవు ఎప్పటికి వీటిని ధరించవచ్చు”.  అన్నాడు.  బిచ్చగాడి ,కళ్ళ వెంట నీరు రాగా రాజుగారికి ధన్యవాదములు చెప్పాడు. ఆ దుస్తులు తన గదికి తెచ్చుకొని  ధరించి  అద్దములో చూచుకొని  మురిసిపోయాడు బిచ్చగాడు . అయితే రాజు గారు ఎంత చెప్పినా, బిచ్చగాడికి ఆ రాజూ గారి  దుస్తులు చినిగిపోతే ఎట్లా అనే భయం పట్టుకొంది . ఎందుకైనా మంచిదని పాతదుస్తులన్నీ ఒక మూట కట్టి తనవెంట త్రిప్పేవాడు. రాజా దుస్తులు చినిగితే తన పాత దుస్తులు ధరించవచ్చు అని.  రాజుగారిచ్చిన విందు భోంచేస్తున్నంతసేపు  ఆనందంగా  లేదు.  బైట  ఎక్కడో దాచిన తన పాత  దుస్తుల మూట ఎవరన్నా  ఎక్కడన్నా   పారవేస్తారేమో అని భయం. క్రమంగా  రాజుగారి మాటలలోని సత్యం తెలిసివచ్చింది . ఎన్ని రోజులు ధరించినా  దుమ్ము పడలేదు . కొత్తవిగానే వున్నాయి. కానీ తన పాత  దుస్తులపై  మమకారంతో  ఆ మూట వదిలేవాడు కాదు. అతని తోటి వారు అతనిని చూసి, ధరించిందేమో రాజు దుస్తులు మోసేదెమో  పాత గుడ్డలు అని హేళన చేస్తూ ,  “పీలిక గుడ్డల మనిషి ” అని పేరు పెట్టారు.  చివరగా ఆ బిచ్చగాడు చనిపోవుటకు సిద్ధముగా ఉండి  మంచం పై నుండి లేవలేక పోయేవాడు రాజుగారికి ఈ సంగతి తెలిసి బిచ్చగాడిని చూడటానికి  వచ్చాడు. బిచ్చగాడు అవసాన దశ లో వున్నాడు . రాజును  చూసి కన్నీరు  కార్చి  అతి కష్టం మీద నమస్కరించాడు.

bg6b

రాజుగారు అతని తలగడ దగ్గర ఉన్న  పాతబట్టల మూటను చూశారు.  అది చూసి, ఎంత విలువైన  చిరగని ,తరగని  దుస్తులు ధరించినా కూడా  బిచ్చగాడికి ,ఆ పాత బట్టల మూటపై వ్యామోహం పోలేదు. వాటి  సంరక్షణ కోసమే జీవితం అంతా గడిపి , ఏ రోజూ సంతోషమును పొందలేదు గదా !  అని రాజు గారు బాధ పడ్డారు.

నేర్చుకోవలసిన విషయము:

ఇది ఒక బిచ్చగాడి కథ మాత్రమే కాదు! మనం  అందరమూ కూడా ఈ  అనుభవాల మూటలను పట్టుకొని, వదలకుండా  మోస్తూ ఉంటాము . అవి ఏమిటంటే  శత్రుత్వము, ఈర్ష్య ,ద్వేషము ,కోపము ,తన భాధలు మొదలగునవి ఎన్నో జ్ఞాపకాలు . అంతే కాదు ఈ భావనలతో మాటి  మాటికీ దుర్గుణాలను, దుఃఖాన్ని  గుర్తుతెచ్చుకుంటూ  జీవితంలోని అందమైన ,సంతోషమైన  వాటిని   అనుభవించలేము , గుర్తించలేము కూడా !ఎపుడో ,ఎక్కడో జరిగిన సంఘటనలను  ఎక్కడకిక్కడ ,ఎప్పటికప్పుడు  వదలకుండా ఒక పెద్ద పనికిరాని పాతబట్టల మూట లాగా ,ఆ జ్ఞాపకాల బరువును మోస్తూ  ఉండటమే  అనేక  బాధలకు , అశాంతికి   కారణము.

రాజభవనంలోని వారు  బిచ్చగాళ్ళ  లాగా జీవిస్తారు. అనాధ ఆశ్రమాల్లో కొందరు రాజులాగా జీవిస్తారు. ఇదంతా  బాహ్యంగా కనపడేది కాదు . అంతరంగ దృక్పదమే  మూలకారణము.  మనం ఎప్పుడూ గడిచిన భాదాకరమైన  అనుభవాలను  మళ్ళీ  మళ్ళీ  గుర్తుచేసుకుంటూ,,ఎపుడూ  నిరాశతో అనేక  పనికిరాని  వస్తువులపై  మమకారంపుచుకుని  వాటిని  వదిలించుకోలేక  జీవితం పై  విరక్తి భావనతో నిర్జీవంగా  గడుపుతాము .  ఈ  మానసిక భాదలు పడటం అలవాటు అయితే  దేనిమీదా శ్రద్ధ లేకుండా నిరాశావాదిగా ఉంటూ  చేయవలసిన  కర్తవ్య పాలనపై మనసు  పెట్టము. ఈ   విధంగా జీవితం  అంతా  వృధా చేసుకుంటూ ఇల్లే కాదు మనస్సుని అనవసర వ్యర్ధ ఆలోచనలతో   నింపిన చెత్తబుట్ట  చేస్తాము.  సంతోషమునకు  కారణం అక్కర్లేదు. మనం  అహంకారాన్ని పెంచి పోషిస్తూ  జీవితంలో ఎన్నో బంగారం లాంటి అవకాశములను  పోగొట్టుకుంటాము .  దుఃఖపడటం అహకారం లో ఒక భాగమే . అందువల్ల  ప్రతి సంఘటన  బరువుతో, నరాలుతెగుతాయేమో అన్నంత ఉద్విగ్నతతో, ఎంతో ఆందోళనతో , బావోద్వేగాలతో , అహంకార పూరిత  మనసుతో ఎపుడూ  నిప్పుల  మీద నడకలాగా  ఉంటుంటాము . అహంకారము , ప్రశాంతత  కలసివుండవు .

ఒక కాకి  ఒక మాంసపు  ముక్కని నోట కరుచుకొని  ఎగురుతుంటే ఆ ముక్క కోసం మిగతా పక్షులు  దాని వెంట పడసాగాయి .  దీనితో విసిగిన ఆ కాకి ఆ మాంసపు ముక్కను వదిలేయగా , మిగతా పక్షులు ఆ కాకిని  తరమటం  మానేసి మాంసం  ముక్కవైపు వెళ్లాయి . అపుడు ఆ కాకి అనుకుంది ఈ చిన్న మాంసం  ముక్క వదిలేసి,  మళ్ళీ ఆకాశంలో  నా స్వేచ్ఛ నేను అనుభవిస్తున్న గదా అని.

ఎక్కడికక్కడ మానసిక అశాంతి కలిగించే ఆలోచనలు వదిలేసి భగవంతుని శరణాగతి చెయ్యాలి . మనం యువకులుగా ఎదుగుతున్న సమయంలో మన తల్లి తండ్రుల మాటలకంటే, స్నేహితుల సలహాలకు ఎక్కువ విలువ యిస్తుంటాము. నా స్నేహితులు అనే భావన పెంచుకొని , ఎప్పుడు వారి  స్నేహం నిలబెట్టుకోవటంలోనే తపిస్తూవుంటాము . మన స్నేహితులు వేరే వారితో ఎక్కువ స్నేహంగా ఉంటే భరించలేము.  ఈ భావన స్నేహితులతో మాత్రమే కాదు ,బంధువుల విషయంలో కూడా ఇంతే . కొన్ని  స్నేహాలు చిరకాలం ఉంటాయి ,కొన్ని తక్కువ రోజులే ఉంటాయి . పరిస్థితుల ప్రభావంతో స్నేహితులు, బంధువులు, దూరమవుతారు . మనం ఎంత ప్రయత్నించి పట్టుకొని వున్నా కూడా దూరమవుతారు . అందువల్ల ఎంతో బాధ పడతాము . ఆ  విషయం పై   బాధపడటం అనేది తరగనిది .  ఎవరితో నైనా ఎంతో ప్రేమగా స్నేహం చేయవచ్చు. బంధువులతో నైనా  సరే ఆ బంధం పై  అతి మమకారం పెంచుకొని, వారిమీద ఆధారపడితే  తప్పకుండా మనల్ని మనము భాదించుకున్నట్లే .

అందుకని  రోజులో కొంత సమయం మౌనంగా  కూర్చుని ,భగవంతుని ధ్యానిస్తూ ,ఆయన మనకిచ్చిన ఎన్నో విషయాలకు కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే భగవంతుని  ఆశీర్వచనము  వలననే  మనం ఈ రోజు ఈ విధంగా వున్నాము. ఈ విధంగా నిరంతర భగవత్ చింతన , ధ్యానం  వల్ల మానసిక శక్తి పెరుగుతుంది. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జరుగుతున్న సంఘటనల వల్ల  మనము  ఏమి నేర్చుకున్నాము?, అని ఆలోచించుకోవాలి. మానసిక ప్రశాంతత అలవర్చుకోవాలి.

 

 

భజగోవిందం-బాలగోవిందం-నాల్గవ శ్లోకము

 

నాల్గవ శ్లోకము -ఉనికి యొక్క అనిశ్చితత్వాన్ని అర్థం చేసుకోవాలి.

bg4

నళినీ దళగత జలమతి తరళం
తద్వజ్జీవిత మతిశయ చపలమ్ |
విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం
లోకం శోకహతం చ సమస్తమ్
భజగోవిందం భజగోవిందం || 4|| .

 

 
తాత్పర్యము: “ఓ మందబుద్దీ!; తామరాకు మీద నీటి బొట్టు ఎలా చలిస్తుంటుందో అలాగే జీవితం కూడా, ఎంతో చంచలమైనది, అశాశ్వతమైనది. లోకమంతా రోగాలతో, బాధలతో, శోకంతో బాధపడుతూ ఉంటే, లోకులంతా దేహాభిమానం వదలక బాధపడుతూ ఉంటారు. కనుక భగవంతుని చేరి, గోవింద గానం చేస్తూ జీవితం గడపరా!

 

 విద్యార్థులకొరకు కథ   

bg5

ప్రేమను పెంచు — ద్వేషము తెంచు.  

విలువ : సత్ప్రవర్ధన

ఉప విలువ : క్క్షమించుట ,క్షమాగుణము .

 

ఒక కిండర్ గార్డెన్ టీచర్ క్లాస్ లో పిల్లలతో తాను ఒక కొత్తరకం ఆట ఆడిస్తాను అని చెప్పింది .    

      పిల్లలతో ,క్లాస్ లో తమకు ఎవరైతే ఇష్టం లేదో వారి పేరు ఒక అలుగడ్డ మీద వ్రాసి ,ఎంత మంది ఇష్టం లేదో అన్ని అలూగడ్డలు ఒక కవర్  లో వేసి తీసుకురమ్మని చెప్పింది.  మరునాడు టీచర్ చెప్పిన విధంగానే పిల్లలు  అలుగడ్డల కవర్లతో వచ్చారు. కొంతమంది 3,5,7 ఇట్లా వారికిష్టం లేనివాళ్ళ  పేర్లతో అలుగడ్డలు మరియు అవి ఉన్న కవర్లతో వచ్చారు.

టీచర్,ఆ రోజు నుంచి ఆట మొదలు అవుతుందని ,వారం తరువాత ముగుస్తుందని చెప్పింది.కానీ పిల్లలు వాళ్ళ (బ్యాగులు ) ఆలుగడ్డ కవర్లు   వారు ఎక్కడకి వెళ్లినా వారితో తీసుకోని వెళ్ళాలి . ఇంటికి , స్కూల్ కి, స్కూల్ లో టాయిలెట్ కి వెళ్లినా సరే వాటిని విడిచి వెళ్లకూడదని చెప్పింది. రోజులు గడిచే కొద్దీ పిల్లలు మెల్ల-మెల్లగా ఆలుగడ్డలు, కుళ్ళిన వాసన వస్తున్నాయని కంప్లైంట్ చేయసాగారు . అంతే కాదు, ఎక్కువ ఆలుగడ్డలు  ఉన్న కవర్లు మోయటం కూడా వారికి బరువుగా ఉందని చెప్పారు. వారికి ఎక్కువమంది నచ్చని వాళ్ళున్నారు కాబట్టి. దాని వలన , ఆలుగడ్డల బరువు మరియు వాటి నుండి వచ్చిన కుళ్ళిన వాసన భరించలేక పోయారు.

   మొత్తానికి అనుకున్న  రోజు, రానే వచ్చింది . పిల్లలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూడసాగారు. ఆలుగడ్డ కవర్లు  ప్రక్కన పెట్టి ,ఒక్కక్కరు వారు పడ్డ బాధ చెప్పసాగారు . టీచర్ ఎంతో ఓర్పుగా శ్రద్ధగా వారందరూ  చెప్పేది విన్నది .

తరువాత టీచర్ పిల్లలతో ,        

     “ఎవరిమీద అయినా  మీరు ద్వేషం పెంచుకుంటే ఇలాగే జరుగుతుంది. మీ హృదయం లోపల వారి పట్ల కలిగే  ద్వేషం, మీ హృదయాన్ని మలిన పరచి, మీరు ఎక్కడకి వెళితే అక్కడ కుళ్ళిన ఆలుగడ్డ  లాగా వెంట వస్తుంది . ఒక వారం రోజులకే క్రుళ్ళిన వాసనను , బరువును మీరు ఓర్చుకోలేక కష్టపడ్డారు గదా ! అదే జీవితమంతా భరించాలంటే ఎట్లా ఉంటుంది ?”కాబట్టి  ఇతరుల ఎడల ద్వేషం వద్దు .నచ్చకపోతే స్నేహం చేయవద్దు ,అంతేకాని ఎవరినీ ద్వేషించవద్దు” హితవు పలికారు .

 

 నేర్చుకోవలసిన విషయము:  

   మీ హృదయంలో ఎవరిపైన అయినా  ద్వేషం ఉంటే వెంటనే తీసి బైట పడేయండి . దానివల్ల ఆ మాలిన్యం ,బరువు  జీవితాంతం ఉండదు . ఎవరైనా తప్పు చేసినా, వారిని క్షమించే గుణం ఉంటే చాలు . నిజమైన ప్రేమ మంచి వాళ్ళని ప్రేమించటమే కాదు .సరిగా లేని వారిపై కూడా ప్రేమ కలిగి ఉండటం.

                పిల్లలు భగవంతుని ప్రతిరూపాలు . వారు అమాయకులు.  స్వభావ రీత్యా ,ఎపుడూ సంతోషంగా ఉంటారు . 5,6 ఏళ్ళ వరకు పిల్లలు వాళ్లలో వాళ్ళు పోట్లాడుకున్నా , -వాళ్లలో ఎవరన్నా పడితే ,అంతకుముందు వైరం మరచిపోయి వెంటనే ఒకటైపోతారు . ఒకళ్ళనొకళ్ళు  పడ్డ వాళ్ళని లేవదీసి ,జాలి చూపి వారికి చేతనైన మాటలతో ఓదారుస్తారు . కోపంలో తిట్టుకున్నవి ,కొట్టుకున్న విషయాలు తొందరగా మర్చిపోతారు . అంతలో కొట్టుకుంటారు, వాదించుకుంటారు .మళ్ళీ అంతలోనే  కలుస్తారు, ఆడతారు ,సంతోషంగా ఉంటారు. వాళ్ళకి ఆ వయసులో పగ ,ప్రతీకార చర్యలు చేపట్టాలనే ఆలోచనా ,ఇవేవీ ఉండవు.

               వయసు పెరుగుతున్న కొద్దీ బుద్ధి ,తెలివితేటలు  పెరుగుతూ వస్తాయి . అపుడు బైట ప్రపంచం చూసి రియాక్ట్ అవటం నేర్చుకొని ఇగో (అహంకారం) పెంచుకుంటారు . గమ్మత్తుగా ప్రవర్తిస్తూవుంటారు .కొన్ని కావాలని కొన్ని వద్దని అంటారు, తోటి విద్యార్ధి  పై ప్రేమ, ద్వేషం మొదలు అవుతాయి . అంటే మన నిజతత్వం నుండి దూరంగా వెళుతుంటాము. మన నిజతత్వం ఏమిటి? మనము శాంతి స్వరూపులము , ఆనందరూపులము. కానీ ఈ వ్యతిరేక భావనలు పెంచుకుంటూపోతాము . కష్టాలు ఎదురుకుంటూ ఉన్నప్పుడు కూడా, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ” ఇది  కూడా తొలగి పోతుంది అనుకోవాలి” . ఏదైనా టెంపరరీ(తాత్కాలికం) .ఈ కష్ట- సుఖాలు శాశ్వతంగా నిలిచేవి కాదు. “

 

   “మనం పిల్లలుగా ,యువతగా ,పెద్దగా మార్పు చెందుతున్నప్పుడు ,ఎన్నో విషయాలను  మర్చిపోతాము “. క్రమ క్రమంగా మనకు తెలీకుండానే శారీరక ,మానసిక మార్పులొస్తాయి. అన్నీ  టెంపరరీ . ఎందుకు కక్షలు పెంచుకోవాలి?గడిచిన కాలపు జ్ఞాపకాల బరువును జీవితాంతం మోస్తూవుంటాము.  ఎందుకు? ప్రతిదీ మారుతూవుంటుంది .ఏదీ శాశ్వతం కాదు “. ఈ భావాలను చిన్నప్పటినుండీ, పిల్లలకి ఎరుక పరిస్తే వారికి పెరుగుతున్న కొద్దీ ఒక నిర్దుష్టమైన మార్గం కనపడి జీవితం లోని సవాళ్ళను  ధైర్యంగా ఎదురుకుంటారు .

 

భజగోవిందం-బాలగోవిందం:మూడవ శ్లోకము

మూడవ శ్లోకము

భ్రమ ,మాయ నుడి బయట పడాలి.
BG3

నారీ స్తనభర నాభీదేశం

దృష్ట్వా మా గా మోహావేశమ్ |

ఏతన్మాంస వసాది వికారం

మనసి విచింతయా వారం వారమ్

భజగోవిందం భజగోవిందం || 3|| .

 

తాత్పర్యము

ఓ బుద్ధిహీనుడా! స్త్రీ శరీరంలోని అందాలు చూసి మోహ పరవశుడివి కావద్దు. శరీరము మాంసము,కొవ్వు,రక్తములతో తయారయినది.ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకో. భౌతిక శారీరక అందములు అశాశ్వతము. శాశ్వతమైన ఆనందం కోసం గోవిందుడిని భజించు.

విద్యార్థుల  కొరకు కధ :

నమ్మకము వలన కలిగే శక్తి .

 విలువ : ఆశావాదము  

ఉపవిలువ :ఆత్మవిశ్వాసము

ఒక వ్యాపారస్తుడు  తన వ్యాపారంలో చాలా నష్టాలు వచ్చి అప్పులపాలు అయ్యాడు . బయిటకు పడే మార్గం లేక నిరాశవాది అయ్యాడు. పార్కుకు వచ్చి బెంచీ మీద దిగులుగా కూర్చున్నారు . తనను ఎవరైనా ఈ కష్టము నుంచి బైట పడేస్తారా అని విచారిస్తూ కూర్చున్నాడు .

ఇంతలోనే  ఒక ముసలాయన వచ్చి అతను దిగులుగా వుండటం చూసి విషయం ఏంటని అడిగి, సంగతి తెలుసుకున్నాడు . తరువాత ముసలాయన ఇలా  అన్నాడు .

“నేను  నీకు సహాయపడగలనని అనుకుంటున్నాను. ” వెంటనే  తన జేబు లో ఉన్న చెక్ బుక్ తీసి వ్యాపారి పేరు అడిగి కొంత పైకం చెక్ మీద వ్రాసి దాన్ని,  వ్యాపారి చేతిలో పెడుతూ ఇలా అన్నాడు .”ఈ డబ్బు తీసుకో! సరిగ్గా , ఏడాది తరువాత మనము ఇదే పార్కులో ఈ బెంచీ దగ్గరే  కలుసుకుందాం . అపుడు నా ధనం చెల్లించుదువు గాని ” అన్నాడు . వెంటనే ఆ పెద్దమనిషి అక్కడనుంచి వెళ్ళిపోయాడు . 

    ఆ చెక్ పై 5000,000 డాలర్స్ అమౌంట్ వేసివుంది. క్రింద సంతకం, ప్రపంచ ప్రఖ్యాత ధనవంతుడైన రాక్ ఫెల్లర్   అని ఉంది . వ్యాపారి “నా బాధలు ఇప్పుడీ నిమిషంలో తీరిపోతాయి “అని అతనికి ఆస కలిగింది.కానీ,అతడు ఆ చెక్ ని వాడదలుచుకోలేదు . తన పెట్టలో భద్రంగా దాచుకున్నాడు.”   “ఈ చెక్ నాకు అవసరం అయినప్పుడు వాడతాను . ” ఈ చెక్ వున్నదని నమ్మకమే నా ఆలోచనా ధోరణి మార్చివేసింది . నాకు ధైర్యము వచ్చింది .

                   ” నా శక్తి మీద నాకు నమ్మకంకలిగింది.”అని  అనుకున్నాడు. తన వ్యాపారం నిలుపుకునే మార్గాల గురించి  చేయవలసిన పనుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎంతో ఆశతో , ధృడ  సంకల్పంతో , ఆత్మవిశ్వాసంతో ,ఎన్నో కొత్త ప్రతిపాదనలు రూపొందించి ఆ దిశగా పని ప్రారంభించాడు . క్రమంగా కొన్ని నెలలు తిరగాక ముందే వ్యాపారంలో లాభాలు చవిచూశాడు. అప్పులు తీర్చాడు. రాబడి ఎంతో  పంచుకున్నాడు,స్థిరపడ్డాడు.   సరిగ్గా ఒక సంవత్సరం  తర్వాత , అదే రోజున తను ఉపయోగించకుండా  దాచిన చెక్ ను ఆ పెద్దమనిషికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో పార్కులో ,ఆయనను కలవాలిసిన బెంచ్ మీద కూర్చొని అతని కోసం నిరీక్షించసాగాడు.  

                             సరిగ్గా అక్కడకి  ఆ పెద్దమనిషి వచ్చాడు.వ్యాపారి చెక్ తిరిగి అతని చేతిలో పెడుతుండగా, వెనుక నుంచి నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా  పట్టుకుంది . ” హమ్మయ్యా దొరికాడు,మిమ్మల్ని ఏమి కష్టపెట్టలేదు కదా? ఈయన హాస్పిటల్ నుంచి తప్పించుకొని వచ్చాడు.తాను ప్రపంచంలో గొప్ప ధనవంతుడైన జాన్ రాక్ ఫెల్లర్  అనే భ్రమ లో ఉంటాడు.”అంటూ ఆ పెద్దమనిషి చెయ్యి పట్టి లాకెళ్తున్నట్టు వడివడిగా అక్కడినుండి వెళ్ళిపొయంది .

వ్యాపారి ఒక్కసారిగా దిగ్భ్రాంతి  చెందాడు. ఆ చెక్ డబ్బులు ఉన్నాయిలే అనే ధైర్యంతో ఎన్నో ప్రతిపాదనలు చేశాడు. కొన్ని కొన్నాడు ,అమ్మాడుకూడా . క్రొత్త పద్ధతులు ప్రెవేశపెట్టాడు. దివాలా  తీసిన పరిస్థితులనుంచి బైట పడి పూర్వం కంటే గొప్ప ధనవంతుడయ్యాడు. తరువాత ఆలోచిస్తూ ఇలా అనుకున్నాడు. నిజానికి, ఆ చెక్ చెల్లదు .తన పురోగమనవృద్ధికి ఆ డబ్బు కారణం కాదు. ఆతను ఆ చెక్కు ని ఉపయోగించి విజయవంతుడు అవ్వలేదు. ఆ చెక్కు మీద నమ్మకంతో వచ్చిన ఆత్మవిశ్వాసము వల్లనే  విజయాన్ని సాధించగలిగారు. తనకు ఆ సామర్ధ్యము ముందునుంచే ఉంది. కానీ, కృంగిపోయిన మనస్సుతో ఏ ప్రయత్నము చేయలేదు. తనమీద తనకున్న నమ్మకమే తన ఆత్మవిశ్వసాన్ని పెంచి వ్యాపారం లో తిరిగి ధనవంతుడిని చేసింది. తనపై తనకు నమ్మకామూ మరియు శక్తే దీనికి కారణం అనుకున్నాడు.

 నేర్చుకోవలసిన విషయము:  ఎవరికైనా వారిపై వారికి విశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యము కలది. మనమీద మనకి నమ్మకం లేకపోతే ఎవరూ మనకేమీ  చేయలేరు. చాలా  సార్లు, మనం మానని  మన స్నేహితులతో పోల్చుకుంటాం. అందమైన వారిని ,పేరుప్రఖ్యాతలున్న వారిని చూసి వారిని అనుకరించటానికి ప్రయత్నిస్తాం .ఎందుకంటే మనమీద మనకు నమ్మకం ఉండదు. మనకంటే అవతలి వారు గొప్పవారనుకుంటాము. మనలని మనం తక్కువగా భావిస్తాము’. బైట కనపడేదంతా నిజం అనుకుంటాం. అది అన్ని సార్లు కరెక్ట్ కాదు. చిన్నప్పటినుంచీ మనమీద మనకి నమ్మకం ఉండాలి.            

ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం మనలో మంచి లక్షణాలను పెంచుకుంటూ ఉండాలి . ఎంతో మనోనిబ్బరంగా, గట్టిగా  ఉండాలి. బాహ్య ఆకృతి వయసు పెరిగే కొద్దీ మార్పు చెందుతుంది.

 కానీ మనలో ఉన్న  ఆత్మవిశ్వాసం ,ఆత్మగౌరవం మన మానసిక శక్తి వయసుతో పాటు వృద్ధి చెందుతాయి. క్రమంగా అంతరంగ పరివర్తన లో మార్పుకలిగి “నేను” అనేది ఏమిటో తెలిసుకొంటాం .

 

భజగోవిందం రెండవ శ్లోకము!

22E5FD2A-26D1-48DE-B504-96E96C7FBD4E
మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మానస వితృష్ణాం
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం

అనువాదం
ఇంకా ఇంకా సిరి కావాలని
ఎందుకు యావ ?మందా అది విడు!
చేయి సన్మతి చేసిన పనికి
చిక్కిన దేదో చాలు,తృప్తి పడు

భావము : ఓ మూఢుడా ఏ విధంగానైనా సరే డబ్బు వచ్చి పడాలన్నకోరికను విడిచిపెట్టు. కోరిక లేకపోవడం అనే సద్బుద్ధిని అలవరచుకో. నీ చేతల వల్ల నీకు న్యాయంగా ఎంత ధనం లభిస్తే దానితో తృప్తి పడు. గోవిందుడిని ఆశ్రయించు.

 

కోతి మరియు పల్లీల కథ

9E515047-9026-44B9-8B07-4BFECA2B4A61

 

కథ

 

ఈ కథ కోతులను పట్టుకునేవాడు ఏ ఉపాయంతో పట్టుకుంటాడో తెలిపే కథ.

కోతులను పట్టుకునేవాడు ఒకరోజు చెట్టు మీద చాలా కోతులను చూసాడు. అతనికి కోతులకు వేరుశనగ పప్పులంటే చాలా ఇష్టమని తెలుసు. కొన్ని వేరుశనగ పప్పులను తెచ్చి, కోతులు చూస్తుండగా వాటిని ఒక కూజాలో పోసి , ఆ కూజాని చెట్టుకింద పెట్టి వెళ్ళిపోయి దూరంగా ఉండి గమనించసాగాడు.

అతను వెళ్ళిపోగానే ఒక కోతి కూజా దగ్గరకు వచ్చి దానిలోకి చెయ్యి పెట్టి చేతి నిండా పట్టినన్ని పప్పుల్ని పిడికిట్లోకి తీసుకుంది. కూజా మూతి ఇరుకుగా ఉన్నందువల్ల, చేతి నిండా ఉన్న పప్పులతో దాని చేయి కూజా మూతిలోనుండి పైకి తియ్యలేకపోయింది. ఎంత ప్రయత్నించినా చెయ్యి రాలేదు. పప్పులను వదిలేసి చెయ్యి తీస్తే తేలికగా బయటకు వచ్చేది. కాని కోతి వేరుశనగపప్పు మీది వ్యామోహంతో, మమకారంతో పప్పులను వదలలేకపోయింది. ఈ లోపల కూజా పెట్టిన మనిషి వచ్చి కూజాతో పాటు కోతిని పట్టుకుని తీసుకు వెళ్ళిపోయాడు. దాని జీవితం కష్టాల పాలయింది.

సారాంశము

ఆదిశంకరులు మన జీవితాల గురించి ఈ విధంగా చెప్తున్నారు. ఒక అవగాహన, ఎరుక కలిగిఉండాలి. ప్రతి మనిషికి ధనము చాలా అవసరము. ధన సంపాదన నిజాయితీగా, సక్రమ మార్గంలో సంపాదించాలి. మనకు లభించిన దానితో తృప్తి చెందాలి.` మన జీవితంలో భ్రమలను, గుడ్డి నమ్మకమును, మమకారమును వదిలించుకోవాలి. డబ్బు మీద వ్యామోహం వదులుకోవాలి. మనం మమకారం పెంచుకుని, వైరాగ్యభావం తెచ్చుకోకపోతే వలలో పడిపోతాము.

ఒక సామెత ఉంది” ప్రతివాని అవసరాలకు తగినంత ఉంది కానీ ప్రతివాని దురాశకు సరిపడా లేదు”. దురాశ మనిషిని తప్పుడు మార్గాల ద్వారా సంపాదించడానికి ప్రోత్సహించి, ఇతరులకు సహయపడనివ్వదు. అదే ధనార్జన ప్రేమతో, నిజాయితీగా, చిత్తశుద్ధితో చేస్తే ఆత్మసంతృప్తి ఇస్తుంది.

శంకరులు ఈ విధంగా చెప్తున్నారు” ఓ మందబుద్దీ; వైరాగ్యాన్ని పెంచుకో. నిజాయితీగా జీవించు. గోవిందుని పాదాలను ఆశ్రయించు”.
https://saibalsanskaar.wordpress.com/2016/09/29/bhaja-govindam-verse-2/

http://www.facebook.com/neetikathalu