Archives

అరుణి భక్తి

విలువ     :    ధర్మ 

ఉప విలువ :   గురువు పట్ల శిష్యునికి ఉండవలసిన ప్రేమ ,భక్తి . 

                        పూర్వం పాంచాల దేశంలో ధౌమ్యుడు అనే ఒకఋషికి  ఆరుణి అనబడే అంకిత భావం గల మంచి శిష్యుడు ఉండేవాడు. ఆరుణి  గురువు ఆశ్రమంలోనే  ఉంటూ నిత్యం ఆశ్రమం లో జరిగే కార్యక్రమములు  అన్నింటిలో పాల్గొని తన సేవలను అందిస్తూ గురువుగారి వద్ద దివ్యజ్ఞానమును పొందాలని అభిలషించేవాడు. 

                    ఒక రోజున చలి చాలా తీవ్రంగా ఉన్నది. ఆ రోజన ఆరుణి అడవి నుంచి సేకరించిన  కట్టెలను ఆశ్రమానికి తీసుకొస్తున్నాడు .  ఆశ్రమంలో తన గురువుగారి పొలం పక్కనుంచి వస్తూ పొలం గట్టున ఉన్న కాలువ ఒడ్డుకు గండి పడటం గమనించాడు . అలా గండి పడటం వలన

 పొలంలో నీరంతా బయటకు పోతున్నది. అలా మొత్తం నీరంతా పొతే నీరు లేక పొలం ఎండిపోతుంది ,పంట పూర్తిగా నష్టమైపోతుంది.  ఆరుణి ఈ విధంగా ఆలోచించాడు“ఇపుడు నేను ఏమి చేయాలి? నేను గండి పూడ్చటం కోసం ఇక్కడ ఉండిపోతే ఆశ్రమానికి కట్టెలు చేర్చలేను. కట్టెలు అందించలేకపోతే హోమం  లేక, ఆశ్రమం లో  అంతా చల్లగా అయిపోతుంది. అందువల్ల నేను త్వర,త్వరగా ఆశ్రమానికి వెళ్ళి  కట్టెలు ఇచ్చేసి మళ్ళీ  తిరిగి వచ్చి ఈ కాలువ గట్టును బాగు చేస్తాను.” 

                     ఈ లోగా ఆశ్రమంలో గురువుగారు పిల్లలకు పాఠాలు నేర్పటానికి సిద్ధంగాకూర్చుని ఉన్నారు . ఆరుణి  పాఠం నేర్చుకోవటానికి ఇంకా రాలేదు. ఇంతలో ఆరుణి హడావుడిగా వచ్చి ఆశ్రమంలో కట్టెలు అందచేసి గురువుగారికి కాలువ గండి పడిన విషయాన్ని చెప్పి వెంటనే తిరిగి పొలం దగ్గరకి వెళ్ళాడు.  అంత  భాద్యత గల శిష్యుడిని చూసి గురువు ధౌమ్యుడు చాలా ఆనందించాడు. 

                   వేగంగా పొలానికి తిరిగి వెళ్ళిన   ఆరుణి కాలువకు పడిన గండిని పూడ్చడానికి కొన్ని కట్టెలను  ,మట్టిని అడ్డుపెట్టాడు. అయినాకాని  నీరు కారిపోవడం ఆగలేదు. నీరు బాగా వేగంగా,ఉధృతంగా   ఉండటం వలన ఆరుణి కట్టిన తాత్కాలిక ఆనకట్ట కొట్టుకు పోయింది. 

ఆరుణికి ఏం చేయాలో తోచలేదు.  సమయం వ్యవధి తక్కువగా ఉంది. ఆ నీటిని ఆపటం ఎలాగో ఆరుణికి అర్థం కాలేదు. అతనికి వెంటనే ఒక ఆలోచన స్ఫురించింది  . నీరు కాలువ నుండి బయటికి పోకుండా ఆపటానికి  అతనికి ఒక ఉపాయం తోచింది. ఇంతలో సాయంకాలం అయింది, చీకటి పడింది. ఆరుణి  ఇంకా ఆశ్రమానికి తిరిగి రావకపోవటంతో ఆశ్రమంలో అందరూ కంగారు పడసాగారు. ధౌమ్యుడు తన శిష్యులందరితో కలిసి ఆరుణి ని వెదకటానికి బయలుదేరాడు. పొలం వద్దకు వెళ్ళి  “ఆరుణి !” అంటూ గట్టిగా  ధౌమ్యఋషి పిలిచారు. అప్పుడు ఆయనకు  బలహీనంగా ఉన్న ఒక గొంతు “ఇక్కడ ఉన్నాను గురువుగారు”అనటం వినిపించింది. అందరూ ఆ ధ్వనివినపడిన వైపుగా పరిగెత్తారు. తీరా చూస్తే నీరు బయటకు పోకుండా ఆరుణి ఆ కాలువ గండికి అడ్డముగా పడుకునున్నాడు. నీటిని ఆపటం అసాధ్యం కావటంతో , తానే  స్వయంగా  గండికి  అడ్డంగా పడుకున్నాడు అని గురువుగారికి అర్ధమైంది . శిష్యులంతా కలిసి ముందుగా, ఆరుణిని ఆ గడ్డ కట్టించే ఆ చల్లని నీటి నుండి  బయటకు  లాగేసారు.  కాలువ  గండిని  మనం కలిసి  పూడ్చివేద్దాం …  విచారించవద్దు “ఆరుణి “ అన్నారు  శిష్యులంతా .           

                 ఆరుణితో “,  బిడ్డా ! ఈ పంట కంటే నీవే విలువైనవాడివి”,అని  అన్నారు గురువుగారు . ఆరుణిని ఒక కంబళి లో వెచ్చగా చుట్టి ఆశ్రమానికి తీసుకొచ్చారు . ఆరుణి ని దగ్గరకు తీసుకుని  అతనిని  ఆశీర్వదిస్తూ ధౌమ్యుడు ,”గురువు పట్ల నీకు గల సాటిలేని భక్తి వినమ్రత నీకు శాశ్వత కీర్తిని ప్రసాదిస్తాయి” అన్నారు . 

నీతి :  గురువు అనుగ్రహాన్ని పొందటం కోసం ఆరుణి తన గురువు పట్ల చూపిన భక్తి , వినయం  సాటిలేనివి . గురువు మెచ్చుకునే  గుణాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎటువంటి గట్టి ప్రయాతాన్ని చేయాలో  దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. ఇటువంటి గుణానికి  నిదర్శనం ,ఉదాహరణ ఏమిటంటే మన తల్లి తండ్రులను ,గురువులను గౌరవించటం . 

https://saibalsanskaar.wordpress.com/2016/06/02/arunis-devotion/

మనం చేసుకొనే స్నేహం

  

విలువ :      ధర్మము

ఉప విలువ :విచక్షణ

ఒకానొకప్పుడు ఒక హంస ,ఒక కాకి స్నేహం గా ఉండేవి. ఒక రోజున కాకి హంసను తన ఇంటికి తీసుకోని వెళ్ళింది. ఒక ఎండిన చెట్టు మోడుపై అవి కూర్చున్నాయి. ఆ ప్రేదేశమంతా పేడ మాంసము ,ఎముకలు అన్ని చెల్లా చెదురుగా పది ఉండి దుర్వాసన వస్తున్నది. హంస కాకితో సోదరా ! ఇటువంటి మురికి ,దుర్గంధ ప్రదేశం లో నేను క్షణికాలం కూడా ఉండలేను. నన్ను ఏదయినా పవిత్రమైన ప్రదేశానికి తీసుకెళ్ళు అని అడిగింది.

అందువల్ల కాకి హంసను రాజుకు చెందిన ఒక చెట్టు తొర్రలో రహస్యంగా కూర్చోబెట్టి తాను కూడా హంస పక్కనే కూర్చుంది. క్రిందికి చూస్తే హంసకి రాజుగారు చెట్టుకింద కూర్చొని ఉండటం ఆయనకి తలకి బాగా ఎండతగులుతూ ఉండటం కనిపించింది. సాదు స్వభావం కల హంస ఎంతో దయతో తన రెక్కలు విప్పి రాజుకు ఎండతగలకుండా నీడను కల్పించింది. దానివల్ల రాజు కి కాసేపు సుఖం కలిగింది. ఈ లోగా కాకి తన సహజ నిర్లక్ష్య స్వభావంతో రెట్ట వేసింది. అది సరిగ్గా రాజు గారి తలమీద పడింది. రాజు కోపంతో వెంటనే పైకి బాణం వేసేసరికి అది హంసకి తగిలి అది క్రింద పడిపోయంది. 

                                      హంస చనిపోతూ ఓ రాజా ! నీపైన రెట్ట వేసింది కాకి నేను కాదు.  ఎప్పుడు నిర్మలమైన స్వచ్ఛమైన నీటిలో జీవించే హంసను నేను .కానీ చెడ్డ కాకితో చేసిన స్నేహం వలన నా జీవితం కూడా నాశనం అయిపోయింది అని ధుఃకించింది. 
            నీతి : మంచితనము ప్రజలను ఎంతగా ప్రభావితం చేస్తుందో అదే విధంగా చెడ్డతనం కూడా మనుషులను ప్రభావితం చేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు మంచివారితో మాత్రమే స్నేహం చేసి సత్సాగత్యం లో మెలగాలి. మంచివారితో సాంగత్యం మనుషులపై మంచి ప్రభావాన్ని కలిగిస్తుంది. చెడ్డవాతావరణం లో తిరిగే మంచి వారి లోని మంచి గుణాలను ఎవరు గుర్తించరు. చెడ్డవ్యక్తి తోటి స్నేహం వలన మంచివారు కూడా చెడుఫలితాలను అనిభవించవలసి వస్తుంది. 

https://saibalsanskaar.wordpress.com/2016/04/06/the-company-one-keeps/

అహంకారం అతి పెద్ద శత్రువు

విలువ:  ధర్మం, సత్ప్రవర్తన
అంతర్గత విలువ : అహంకారం లేకుండా ఉండడం

images
ఒకప్పుడు ఇద్దరు అబ్బాయిలు చాలా స్నేహంగా ఉండేవారు.  పెరిగి పెద్దయిన తరువాత జీవితంలో స్థిరపడడానికి ఎవరి దారిన వారు వెళ్ళిపోయేరు.  ఒక అబ్బాయి తన కాలాన్నంతా ఆధ్యాత్మిక సాధనలో గడిపి ఋషిగా మారి ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు.  ఇంకొక అబ్బాయి   బాగా డబ్బు సంపాదించి ధనవంతుడై విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.

 ఒకసారి ఈ ధనవంతుడికి తన మిత్రుడు ఎలా ఉన్నాడో , ఎక్కడ ఉన్నాడో  తెలుసుకోవాలి అనిపించింది.  ఎంతో ప్రయత్నం చేసి చివరకు వివరాలు సంపాదించాడు. తన మిత్రుడు తపస్సు చేసి ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడని తెలుసుకుని ఎంతో సంతోషించాడు.  ఋషిగా మారిన మిత్రుణ్ణి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ఋషి కూడా అందుకు అంగీకరించాడు.

ధనవంతుడు తన మిత్రుడు వస్తున్నాడని ఆనందంతో ఇల్లంతా అలంకారం చేయించాడు.  నడవడానికి సౌకర్యంగా ఉండేలా ఇల్లంతా ఖరీదైన తివాచీలు పరిచాడు.  ఋషి వచ్చి ఈ ఏర్పాట్లు అన్నీ చూసి ఆశ్చర్యపోయాడు.  సంతోషంతో లోపలికి వస్తుండగా ఒక వ్యక్తి వచ్చి ఋషితో, మీ మిత్రుడు తనకి డబ్బు ఉందని అహంకారంతో, మిమ్మల్ని అవమానించడానికే  ఇవన్నీ చేసాడు అని చెప్పాడు.  ఈ మాట విన్న ఋషికి చాలా కోపం వచ్చింది.  వెంటనే రోడ్డు మీదకి వెళ్ళి మురికి కాలువలో కాళ్ళు పెట్టి వచ్చి ఆ మురికిని తివాచీల నిండా అంటించాడు.  ధనవంతుడు తన స్నేహితుడిని సాదరంగా ఆహ్వానించాడు. కానీ ఋషి, ధనవంతుడితో నీకు ఎంతో డబ్బువుండవచ్చు కానీ, నాకున్న జ్ఞానం చాలా గొప్పది. ఏ  విధంగా చూసినా నేనే నీకంటే గొప్పవాడిని అన్నాడు. కావాలనే నీ తివాచీలకు మురికి అంటించాను అని చెప్పాడు. 


అది విన్న ధనవంతుడు ఓ స్నేహితుడా; నిన్నుచూసి నేను చాలా గర్వపడ్డాను. నా స్నేహితుడు ఇంత జ్ఞానం సంపాదించాడు అని సంతోషించాను. కానీ ఎంత జ్ఞానం ఉన్నా కోపాన్ని జయించలేకయావు. నేను ధనవంతుడిని కాబట్టి డబ్బు సంపాదించానన్న గర్వం ఉండడం సహజం కానీ ఋషి అంటే ఇంద్రియాలను జయించి, మనసుని గెలిచినవాడు అని అర్థం కదా. ఇన్ని  సంవత్సరాలు సాధన చేసి కూడా నీ మనసులోని వ్యతిరేక భావాలకు లొంగిపోయావు  అంటే నీవు  నిజమైన ఋషివి  కాదు అన్నాడు. 

   నీతి: మనకున్న జ్ఞానం, సంపద అంతా భగవంతుడి దయ వలన వచ్చినవే.  ఆ విషయం గుర్తు పెట్టుకుని భగవంతుడి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. అహంకారం అనేది అతి పెద్ద శత్రువు. మనమే అన్నీ చేసాము అనుకోవడమే అహంకారం. ఇతరులను చూసి అసూయ పడకుండా మనకి ఉన్నదానితో తృప్తిగా ఉండాలి. భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యవంతమైన శరీర,మనసు, ఆత్మల వల్ల  మాత్రమే మన జీవితం సాగించగలుగుతున్నాము.

మూడు రకాల మనుషులు

 

EE8F1EE1-DC1F-426B-A4BA-DAE5DF00F5CD.jpeg

విలువ: సత్యము

అంతర్గత విలువ: నమ్మకము, వినయము 

ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యార్థికి 3 బొమ్మలు ఇచ్చి వాటిలో గల తేడాలు కనిపెట్టమన్నారు. ఆ 3 బొమ్మలు ఆకారం,పరిమాణంలో చూడడానికి ఒకేలా ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించిన తరువాత ఆ బొమ్మలలో  రంధ్రాలు ఉన్నాయని గమనించాడు ఆ విద్యార్థి. మొదటి బొమ్మకు రెండు చెవులలో రంధ్రాలు ఉన్నాయి. రెండవ బొమ్మకు ఒక చెవిలో మరియు నోటిలో రంధ్రాలు ఉన్నాయి. మూడవ బొమ్మకు ఒక చెవిలో మాత్రమే రంధ్రం ఉంది.
                                       ఆ విద్యార్ధి ఒక సన్నని పుల్ల తీసుకుని మొదటి బొమ్మ  చెవిలో దూర్చాడు. ఆ పుల్ల ఆ బొమ్మ రెండవ చెవిలో నుండి బయటకు వచ్చింది. రెండవ బొమ్మ చెవిలో పుల్ల దూర్చి చూసాడు. అది బొమ్మ నోటిలో నుండి బయటకు వచ్చింది.మూడవ బొమ్మ చెవిలో పుల్ల దూర్చి చూసాడు. అది బయటకు రాలేదు.
అదంతా గమనించిన ఉపాధ్యాయుడు విద్యార్థికి ఈ విధంగా వివరించారు. ఈ మూడు బొమ్మలు మనచుట్టూ ఉండే మనుషుల వ్యక్తిత్వాలను తెలియజేస్తున్నాయి. మొదటి బొమ్మ చెవిలో పుల్ల దూరిస్తే రెండవ చెవిలో నుండి బయటకు వచ్చింది, అంటే కొంతమంది మనం చెప్పేది వింటున్నట్టే ఉంటారు, కానీ అదేమీ పట్టించుకోకుండా ఒక చెవితో విని, రెండవ చెవితో వదిలేస్తుంటారు. ఇలాంటి వాళ్ళతో అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి.
          రెండవ బొమ్మ చెవిలో పుల్ల దూరిస్తే నోటిలో నుండి బయటకు వచ్చింది. వీళ్ళు మనం చెప్పేది అంతా  విని ఇతరులకు మన విషయాలు చెప్పేస్తూ ఉంటారు. వీళ్ళని నమ్మి సొంత విషయాలు చెప్పడం ప్రమాదకరం.
                        మూడవ బొమ్మ చెవిలో పుల్ల దూరిస్తే అది బయటకు రాలేదు. ఈ రకం మనుషులు నమ్మకస్తులు. వీరు విన్నదానిలో ఏది అవసరమో అదే మాట్లాడతారు, మనకు హాని కలిగిచే విధంగా ఎక్కడా మాట్లాడరు.
నీతి:  
ఎల్లప్పుడూ మంచివారితో ఉండే ప్రయత్నం చెయ్యాలి. నమ్మకంగా మరియు నిజాయితీగా ఉండేవాళ్ళ  మద్య ఉంటే మన ప్రవర్తన మెరుగుపరచుకోవచ్చు మరియు అవసమైన సమయాల్లో ఇలాంటివాళ్ళు మనకు సరైన సలహాలిచ్చి దారి చూపించగలుగుతారు.

గర్భవతి అయిన ఒక జింక కథ !

విలువ: ధర్మం

అంతర్గత విలువ: ఆలోచనల్లో స్పష్టత, శరణాగతి

ఒక అడవిలో గర్భవతి అయిన  జింక ఉంది. దానికి ఏ సమయంలో అయినా ప్రసవం జరుగవచ్చు, అది ప్రసవానికి అనువైన స్థలం కోసం వెతుకుతూ అడవిలో తిరుగుతోంది. ఒక నది ఒడ్డున దట్టంగా గడ్డి ఉన్న ప్రాంతం కనిపించింది. అదే తగిన చోటు అని భావించి అక్కడికి  చేరుకుంది. ఇంతలో లేడికి పురిటి నెప్పులు మొదలయ్యాయి. అకస్మాత్తుగా ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకుని, ఉరుములు,మెరుపులు రాసాగాయి అడవిలో నిప్పు అంటుకుని మంటలు మొదలయ్యాయి. లేడి తన ఎడమవైపు చూస్తే ఒక వేటగాడు తనకి బాణం గురిపెట్టి ఉన్నాడు.  కుడివైపు చూస్తే ఆకలితో ఉన్న సింహం లేడి వైపే వస్తోంది. ఆ జింకకి చాలా భయం వేసింది. ఇప్పుడు ఏమి చెయ్యాలి అని ఆలోచించుకుంది. ఒక వైపు వేటగాడు, సింహం ఇద్దరూ తనని చంపడానికి సిద్ధంగా ఉన్నారు.  తాను బిడ్డకు జన్మనిచ్చినా అడవిలో అంటుకున్న మంటలకి తట్టుకోలేక ఆ జింక పిల్ల బ్రతుకుతుందో లేదో తెలీదు. ఇన్ని ఆలోచనల మధ్య జింక తన ప్రస్తుత కర్తవ్యం జింకపిల్లకు జన్మనివ్వడం కాబట్టి ఆ పని మీదే దృష్టి పెట్టాలి అని నిర్ణయించుకుంది.

                     ఆకాశంలో మెరుపుల  వెలుగుకి వేటగాడి బాణం గురి తప్పింది. అది జింకకి బదులు దూరంగా ఉన్న సింహానికి తగిలి అది చనిపోయింది. చాలా పెద్ద వర్షం రావడంతో అడవిలో మంటలు ఆరిపోయాయి. జింక తన బిడ్డకు క్షేమంగా జన్మనిచ్చింది.

నీతి:పై కథలో జింక ఎదుర్కొన్నలాంటి  పరిస్థితులు మనకి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. రకరకాల సమస్యలు మనని చుట్టుముట్టినప్పుడు, వాటిని అధిమించే ప్రయత్నం లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. దానికి తోడు ప్రతికూల ఆలోచనలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన చేతిలో లేని వాటిని వదిలిపెట్టి మనం చెయ్యవలసిన పని మీద దృష్టి పెట్టి చేసుకుంటూ పోతే మిగిలిన సమస్యలకు కూడా పరిష్కార మార్గాలు వాటంతటవే దొరుకుతాయి.  

 

https://saibalsanskaar.wordpress.com/2015/09/30/the-pregnant-deer/

ఒక మహా యుద్ధము

 

విలువ : ధర్మ

ఉప విలువ : పరనింద,పరదూషణ మానుట

 

wizard

అనగనగా ఒక దుష్ట మాంత్రికుడు ఉండేవాడు.అతడు, ఒకరోజు ఒక ఊళ్ళో దూరి, అక్కడ నివసించే ఒక వెయ్యిమంది నాలుకులను కోసుకుని వచ్చాడు. తన మంత్రం శక్తితో ఆ నాలుకలు ఇక మీట పరుల గురించి చెడు మటుకే మాట్లాడగలవని శాసించాడు .తరువాత అతని మాయలోపడి గాఢ నిదురపోతున్న వారికి వారి నాలుకలను తిరిగిచ్చేశాడు . ఎవరికీ ఏ అనుమానము కూడా రాలేదు.

రానున్న రోజుల్లో “వీడిలా చేశాడు , ఆమె అలా చేసింది , ఆతను ఒక సుత్తి మనిషి ఇతను ఒక మొద్దు “ వంటి పరనింద, పరదూషణలతో ఆ ఊరంతా హోరెత్తింది.ఎక్కడ విన్నా , ఇవే మాటలు.దాంతో ఒకరి పై ఒకరికి కోపం పెరిగిపోయింది.ఇదంతా చూసి ఆ దుష్ట మాంత్రికుడికి అంతులేని ఆనందం కలిగింది .
అప్పుడు ఊరిని బాగు పరచాలన్న ఉద్దేశంతో ఒక మంచి మాంత్రికుడు తన మంత్ర శక్తితో వారి చెవులు ఇక మీట ఇతరుల గురించి చెడు విన్నప్పుడల్లా మూతబడాలి అని ఆదేశించాడు.దాంతో నాలుకలుఇతరుల గురించి చెడు పలికినప్పుడల్లా చెవులు గట్టిగా మూసుకుపోయేవి .

ఈ విధంగా నాలుకలు చెవులకు మధ్య ఒక పెద్ద యుద్ధము మొదలైంది.ఇందులో ఎవరు గెలిచారు?

ఏముంది, కాలం గడిచిన కొద్దీ , నాలుకలు చెవులు చేస్తున్న అవమానమును
తట్టుకోలేకపోయాయి. అవి పలికే చేదుమాటలను చెవులు అలక్ష్యం చేయడంతో నాలుకలు మంచి మాటలను పలకడం మొదలుపెట్టాయి.దాంతో చెవులు తిరిగి నాలుకలు పలికే మాటలను వినటం
మొదలుపెట్టాయి. ఇక నాలుకలు పరదూషణ,పరనిందలు పూర్తిగా మానేసి హాయిగా మంచి మాట్లాడటం మొదలు పెట్టాయి.

చెడు ప్రభావం వల్ల ప్రపంచమంతటా పరనింద ,పరదూషణ ఎక్కు అయిపోయింది . ఈ కథలోలాగా మంచితనంతో మనం ఇతరుల గురించి చెడు మాట్లాడటం గాని వినటం కాని మాని, పరనిందను అరికట్టాలి.
నీతి :
మంచి మాటలను వినండి, మంచి మాటలను పలకండి. నిత్య జీవితంలో పరనింద చేసేవారు ఎదురవుతూనే ఉంటారు. వారినుండి మనము తప్పించుకోలేకపోవచ్చు కాని,
పర దూషణలను పట్టించుకోకపోవటం ,తిరిగి అదే పని మనము చేయకపోవటం మన చేతుల్లోనే ఉంది.

 

https://saibalsanskaar.wordpress.com/2015/10/07/the-great-battle/

ఉద్ధవ గీత :శ్రీ కృష్ణ- ఉద్ధ వుల మధుర సంభాషణ

విలువ :ధర్మం ,విశ్వాసము
ఉప విలువ : శరణాగతి

 

krishna

ఉద్ధవుడు శ్రీ కృష్ణుడికి చిన్ననాటి నుంచే ఎన్నో సేవలు చేసేవాడు. ఆయనే కృష్ణుడికి రథసారధి కూడా . కాని ,తను చేసే సేవలకు ఎప్పుడూ ఏ ప్రతిఫలము ఆశించలేదు.

ద్వాపర యుగంలో తన అవతారం చాలించే ముందు, శ్రీ కృష్ణుడు ఉద్ధవుడిని పిలిచి ,”ఉద్ధవా! నా అవతార కాలంలో ఎంతో మంది నా నుంచి ఎన్నో వరాలను ,బహుమతులను పొందారు. కాని ,నీవు ఎన్నడూ నన్ను ఏదీ కోరలేదు . కనుక నీకు ఏదన్నా ఇవ్వాలని ఉంది ,ఏమి కావాలో కోరుకో ?” అని ప్రేమగా అడిగారు.

అప్పుడు ఉద్ధవుడు ,”దేవా! నీ లీలలను అర్ధం చేసుకోవటం మా తరం కాదు, నాకు ఏ వరము వద్దు కాని,నిన్ను ఓక ప్రశ్న అడుగుదాము అనుకుంటున్నాను,అడుగవచ్చునా? “,అని వినయంగా ఇలా అడిగాడు ,“కృష్ణా !నీవు మా అందరికీ జీవించటానికి ఇచ్చిన సందేశము ఒకటి కాని నీవు జీవించిన విధానము మరొకటి.మహాభారత యుద్ధములో,నీవు పోషించిన పాత్ర ,తీసుకున్న నిర్ణయములు ,చేపట్టిన పనులు నాకేమి అర్ధం కాలేదు.దయచేసి నా సందేహములను తీర్చి నన్నుఅనుగ్రహించండి అని కోరుకున్నాడు.

దానికి కృష్ణుడు ,” “ఉద్ధవా ! ఆనాడు యుద్ధభూమిలో అర్జునుడికి గీతను బోధించాను. ఈ నాడు నీకు ఉద్ధవ గీతను బోధించటానికి ఈ అవకాసాన్ని కలిపిస్తున్నాను. నన్ను ఏమి అడగాలనుకుంటున్నావో
తప్పకుండా అడుగు.” అని ఉద్ధవుడిని ప్రోత్సహించాడు.ఇక ఉద్ధవుడు తన ప్రశ్నలను అడగటం మొదలు పెట్టాడు.”కృష్ణా పాండవులు నీ ప్రాణ స్నేహితులు కదా!నిన్ను గుడ్డిగా నమ్మారు కూడా . నువ్వు వారి వర్తమానము ,భవిష్యత్తు తెలిసినవాడివి . అటువంటప్పుడు వారిని జూదము ఎందుకు ఆడనిచ్చావు?మంచి మిత్రుడు అలాంటి వ్యసనములను ఎక్కడన్నా ప్రోత్సహిస్తాడా ?” పోని, ఆడనిచ్చావే అనుకో ,కనీసం వారిని గెలిపించి ఆ కౌరవులకి బుద్ధి చెప్పి ఉండ కూడదా ? అది కూడా చెయ్యలేదు. ధర్మజుడు ఆస్తంతా పోగొట్టుకుని వీధినపడ్డాడు . ఆఖరికి తన తమ్ముళ్లను కూడా ఓడిపోయాడు. అప్పుడైనా నీవు అడ్డుపడి వాళ్ళని కాపాడుండచు కదా?

కౌరవులు దుర్బుద్ధితో పరమ సాధ్వి అయిన ద్రౌపదిని, జూదంలో మోసం చేసి గెలిచారు.
కనీసం అప్పుడైనా నువ్వు నీ మహిమతో పాండవులని గెలిపించలేదు… ఎప్పుడో ఆవిడ
గౌరవానికి భంగం కలిగినప్పుడు ,ఆమెను ఆఖరి క్షణంలో అనుగ్రహించావు.సమయానికి ఆదుకున్న ఆపద్భాందవుడవని గొప్ప పేరుపొందావు. కాని ముందే నీవు కలుగచేసుకుని ఉంటే ఆమెకి
నిండు సభలో జరిగిన అవమానం తప్పేది కదా .సమయానికి ఆదుకునేవాడే మంచి మిత్రుడని పించుకుంటాడు . నీవు చేసినదేమిటి స్వామి?, అని ఉద్ధవుడు ఎంతో బాధతో కృష్ణిడిని తన ఆంతర్యమేటో తెలుపమని ప్రార్ధించాడు.

నిజానికి ఈ సందేహములు మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారందరికీ కలుగుతాయి. కనుక కృష్ణుడు ఎంతో ప్రేమతో ఉధవుడి ద్వారా మనందరికీ ఉద్ధవ గీతను ఈ క్రింది విధంగా బోధించాడు.“ఉద్ధవా! ప్రకృతి ధర్మ ప్రకారం అన్ని విధాలా జాగ్గ్రత్త పడేపది తగిన చర్యలను తీసుకునే వాడే గెలుపుకు అర్హుడు. దుర్యోధనుడికి జూదములో ప్రావీణ్యము లేకపోయినా ఆస్తిపరుడు. కనుక తన అర్హత ప్రకారం ఆస్తిని పణంగా పెట్టాడు.ఎంతో తెలివిగా తన మామ చేత పందెమును వేయించాడు., ధర్మరాజు మాత్రం , పందెములను నా చేత వేయించాలి అని అనుకోలేదు ,నా సహాయమును కోరలేదు.

శకుని , నేను ఆడి ఉంటె జూదము ఎవరు గెలిచేవారు? నేను కోరిన పందెమును శకుని వేయగలిగేవాడా? లేక అతను చెప్పిన పందెము నాకు పడేది కాదా ? నీవే చెప్పు ?సరే ఇదిలా ఉంచు, ధర్మరాజు అజ్ఞానంలో మరొక క్షమించరాని నేరం చేశాడు. అదేమిటంటే, “నేను చేసుకున్న కర్మ వలన ఈ ఆటలో ఇరుక్కున్నాను . కృష్ణుడికి ఈ సంగతి తెలియకూడదు ,ఇటువైపు ఎట్టి పరిస్థితిలో కూడా కృష్ణుడు రాకూడదు.” అని ప్రార్ధించాడు. దాంతో ఏమీ చేయలేక చేతులు కట్టుకుని ,తన పిలుపుకోసం ఎదురు చూస్తూ నిలబడిపోయాను.ధర్మజుడు సరే భీముడు,అర్జునుడు,నకుల సహదేవ్వులు కూడా ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారేకాని ఏ మాత్రము నా సహాయము కోరలేదు. అలాగే ద్రౌపది కూడా. దుస్సాసనుడు తనను సభలోకి ఈడ్చినప్పుడు కూడా నన్ను స్మరించకుండా నిండు సభలో అందరితో తనకు న్యాయం చెయ్యమని వాదించింది. తన బుద్ధి కుశలతలనే నమ్ముకుంది.

చివరికి తన ప్రయత్నములన్నీ విఫలమయ్యాక గొంతెత్తి నన్ను పిలిచింది, సంపూర్ణ శరణాగతితో నన్ను శరణు వేడింది. అప్పుడు వెంటనే ప్రత్యక్షమయ్యి నేను ద్రౌపదిని ఆ నాడు రక్షించలేదా? అని కృష్ణుడు ఉద్ధవుడిని తిరిగి ప్రశ్నించాడు.కృష్ణిడి సమాధానములకి ఉద్ధవుడు భక్తితో చెలించి ,కృష్ణా !అలాగైతే మాలాంటి సామాన్యులు సంగతి ఏంటి ? మేము చేసే కర్మలలో కూడా నీవు కోరితే కల్పించుకుని సహాయం చేస్తావా?అవసరమైతే మమల్ని చేదు కర్మలు చేయకుండా కాపాడుతావా? అని చక్కటి ప్రశ్న వేశాడు ఉద్ధవుడు .దానికి శ్రీ కృష్ణుడు చిన్నగా నవ్వుతూ ,”ఉద్ధవా ! మానవ జీవితం, వారు చేసుకున్న కర్మల ద్వారా సాగుతుంది. నేను వారి కర్మలను నిర్వర్తించను , వాటిలో కలుగ చేసుకోను. కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటాను అదే భగవంతుని ధర్మము “ అని వివరించాడు.

ఉద్ధవుడు ఆశ్చర్య చెకితుడై “ అయితే కృష్ణా ! మేము తప్పుదారి పట్టి పాపములను మూట కట్టుకుంటుంటే నువ్వలా దగ్గెరుండి చూస్తూ ఉంటావా? మమ్మల్ని అడ్డుకోవా ,ఇదెక్కడి ధర్మము అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు “ఉద్ధవా ! నీ మాటలను నీవే జాగ్రత్తగా గమనించు . నీకే అర్ధమవుతుంది.భగవంతుడు నీతోనే ,నీలోనే ఉన్నాడని , నిన్ను దగ్గెరుండి గమనిస్తున్నాడని గుర్తించినప్పుడు, నీవు తప్పులు ఎలా చేయగలుగుతావు చెప్పు ?”ఈ సత్యాన్ని మరిచినప్పుడే మానవుడు తప్పు దారి పడతాడు అనర్ధాలని కొని తెచ్చుకుంటాడు . ధర్మరాజు జూదము గురించి నాకు తెలియదనుకోక పోవడమే తాను చేసిన మొదటి తప్పు. నేను అంతటా ఉన్నాను అని అతను గుర్తించి ఉంటే ఆట పాండవులకు అనుగుణంగా సాగేది “ అని ఉద్ధవుడికి చక్కగా బోధించాడు శ్రీ కృష్ణుడు.కృష్ణుడు బోధించిన మధురమైన గీతను విని ఉద్ధవుడు ఎంతో ఆనందించి తన సంశయములన్నిటినీ తీర్చినందుకు కృతజ్ఞతా భావంతో కృష్ణుడిని నమస్కరించాడు.

నీతి:

పూజలు ,ప్రార్థనలు భగవంతుడి సహాయమును కొరటానికి చేసే కర్మలే కదా! కాని, సంపూర్ణ విశ్వాసము వీటికి తోడైతే అంతటా ఆయనే కనిపిస్తాడు. భగవద్ గీతలో కూడా శ్రీ కృష్ణుడు ఇదే బోధించాడు .

యుద్ధములో అర్జునిడికి కృష్ణుడు రథ సారధిలా వ్యవహరించి అతనికి కర్తవ్యమును బోధ చేసాడే కాని , అతని బదులు స్వయంగా యుద్ధము చేయలేదు . అలాగే మనలో ఉన్న భగవంతుడిని గుర్తించి ఆయనని మన జీవిన రథసారధి చేసుకుంటే మనకి కూడా అర్జునిడిలా అన్నిట్లో తప్పక విజయం కలుగుతుంది. మన మంచి చెడులను ఆ భగవంతుడే చూసుకుంటాడని నమ్మాలి. ఆ నమ్మకమే మనని అన్ని వేళలా కాపాడుతుంది!
http://patriotsforum.org/uddhav-gita-illuminative-dialogue-between-uddhav-and-shri-krishna-why-he-did-not-protect-pandavs/

https://saibalsanskaar.wordpress.com/2015/09/29/uddhava-gita-beautiful-conversation-between-krishna-and-uddhava/

పాడు బడ్డ దేవాలయము

 

విలువ: ధర్మము
ఉప విలువ : ఐకమత్యము

 

temple.png

అనగనగా ఒక పాడుబడ్డ గుడిలో ముగ్గురు సన్యాసులు కూర్చుని ఆ మందిరము అంత జనసంచారము లేకుండా మూలబడి ఉండటానికి కారణం ఏమై ఉంటుందో అని చర్చించుకుంటున్నారు .

మొదటి సన్యాసి “ఇక్కడి పూజారులు భక్తి శ్రద్ధలతో పూజలు చేయకపోవటం వల్ల దేవతలకు ఆగ్రహం కలిగి వారి మహిమలను చూపటంలేదేమో. అందుకే భక్తులు గుడికి రావటం మానేసుంటారు!” అని అన్నారు.

రెండవ సన్యాసి ,” దేవాలయ అధికారులు గుడిని పట్టించుకోటం మానేసుంటారు, దాంతో గుడి పరిస్థితిని చూసి భక్తులు రావటం తగ్గించుంటారు” అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు .

ఇక మూడవ సన్యాసి ,” ఇక్కడ నివసించే అర్చకులకి అధికారులకి పడకపోవటం వలన , విధి నిర్వహణ క్రమంగా సాగకపోవటం వలన ఎవరూ రావటం లేదేమో !” అన్నారు.

ఈ విధంగా కొంత వాదన జరిగిన తరువాత , వారు అక్కడే కొన్నాళ్ళు నివసించి వారిలో ఎవరి అభిప్రాయం సరైనదో తేల్చుకుందామని నిశ్చయించుకున్నారు. మొదటి సన్యాసి భక్తి శ్రద్ధలతో పూజలని , విధులని క్రమం తప్పకుండా భక్తి , శ్రద్ధలతో చేయటం మొదలు పెట్టారు. రెండవ సన్యాసి తగిన మరమ్మత్తులు చేయించి గుడిని శుభ్రపరిచారు . ఇక మూడవ సన్యాసి గుడి గురించి ప్రచారం చేయటం మొదలు పెట్టారు. కొంత కాలానికి దేవాలయం చుట్టు పక్క ప్రాంతాలలో ప్రసిద్ధి పొందింది.భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో రావటం మొదలు పెట్టారు.

దాంతో ముగ్గురు సన్యాసులలో మళ్ళీ అభిప్రాయ బేధాలు మొదలయ్యాయి. ఒక సన్యాసి తన సేవలను మెచ్చి దేవతలు అనుగ్రహించారని , కాదు నా శ్రమ వలనే గుడి వైభవం తిరిగి వచ్చిందని మరొక సన్యాసి ,కానే కాదు తను చేసిన ప్రచారాల వలనే గుడి ఇంత ప్రసిద్ధిని పొందిందని, ఇలా ఎవరికి వారు తమ గొప్పలు చెప్పుకోటం మొదలు పెట్టారు .ఇలా వారిలో వారు కొట్టుకుంటూ గుడిని మళ్ళీ పట్టించుకోవటం మానేశారు. క్రమంగా మందిరం మళ్ళీ పాడు బడ్డ దేవాలయంలా తయారైంది.

ఈ విధంగా సన్యాసులు దీనంతటికీ కారణం, ఆలయ అధికారుల మధ్య ఐకమత్యము లేకపోవటమే అని తెలుసుకున్నారు.
నీతి :
అహంకారము ఐకమత్యాన్ని ,సామరస్యాన్ని దూరం చేస్తుంది. దాని వలన మానవ సంబంధాలు దెబ్బతింటాయి. బంధాలకంటే అహంకారానికి ,సొంత లాభములకి విలువను ఇచ్చినప్పుడు మనకి దగ్గెరయిన వారు దూరమవుతరారు.ఈ కథలో లాగా ఐకమత్యం లేకుండా చేసే పనులకి సార్థకత ఉండదు. అందుకని పంతాలని,పట్టింపులని పక్కన పెట్టి కలిసి మెలిసి ప్రేమతో జీవిస్తూ ఆనందాన్ని పంచుదాము.

https://amritham99.wordpress.com/page/6/

https://saibalsanskaar.wordpress.com/2015/09/29/the-neglected-temple/

గణపతి మరియు కార్తికేయుని కథ

విలువ: ధర్మం
ఉప విలువ : గౌరవము

 

ఒక రోజు శ్రీ గణపతి మరియు వారి తమ్ముడు కార్తియులవారు ఆడుకుంటున్నారు . అప్పుడు వారికి దేవతలు ఒక ఫలమును ప్రసాదించారు. చిన్నతనం వల్ల వారు పండు పంచుకోటానికి సిద్ధంగా లేరు. అప్పుడు వారి తలిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు ,వారిలో ఎవరైతే ఈ విశ్వాన్ని మూడు సార్లు చుట్టి వస్తారో వారు ఈ ప్రత్యేక ఫలము వల్ల కలిగే లాభములను పొందుతారు అని నిర్ణయించారు. అ లాభములేమిటి అంటే ‘అమరత్వము, మరియు ‘బ్రహ్మ జ్ఞానము’. పందెము గురించి వినగానే కార్తికేయులవారు, ఫలమును గెలవటం కోసం ఈ విశ్వాన్ని పరిక్రమించటానికి వారి వాహనమైన నెమలి మీద ఉత్సాహంగా బయలుదేరారు. కాని , గణపతి , వారి శరీర పరిస్థితి వల్ల,మరియు నెమలి వలె రెక్కలు లేని ఎలుక వాహనముగా ఉండటం వల్ల చింతూస్తూ ఉండిపోయారు.

shiva-parvati
తరువాత తన బుద్ధికుశలతతో గణపతి ఒక నిర్ణయం తీసుకున్నారు. తమ తల్లిదండ్రుల అనుమతి తీసుకుని , వారిని విశ్వముగా భావిస్తూ వారి చుట్టూ మూడు సార్లు తిరిగారు. ఈ విధంగా గణపతి పందెమును తెలివిగా గెలిచి పండును దక్కించుకున్నారు.

నీతి:
బుద్ధిని సరైన సమయములో సరైనచోట ఉపయోగించి విజయాన్ని సాధించవచ్చు. తలిదండ్రులని ఎప్పుడూ గౌరవించాలి. మన జీవితంలో వారికంటే ప్రత్యేకమైనవారు ఎవ్వరూ ఉండరు.

http://www.momjunction.com/articles/lord-ganesha-stories-kids_00101242/

అసూయ పతనానికి హేతువు

విలువ : ధర్మం
ఉప విలువ : నిస్స్వార్ధ సేవ

 

pumpkin

అనగనగా ఒక ఊరిలో మాధవ ,కేశవ అని ఇద్దరు రైతులుండేవారు. మాధవ తెలివైన వాడు ,కష్ట జీవి కూడా. ఎప్పుడూ తృప్తిగా ,ఆనందంగా ఉండేవాడు. కాని ,కేశవ బద్ధకిష్టుడు . ఎప్పుడూ విచారిస్తూ బాధగా ఉండే వాడు. కేశవ మాధవుడిని చూసి ఎప్పుడూ అసూయ పడుతూ ఉండేవాడు. అతనిని విసికించటమే కాకుండా , భగవంతుడిని అతను పతనం కావాలని ప్రార్ధించే వాడు.

కాని ,మాధవ ఊరిలో ఉన్నవారందరి బాగు కోరుకునే వాడు . అందువల్ల భగవంతుడి అనుగ్రహమును దండిగా పొందగలిగాడు. ఎన్నో ఏళ్ళు కష్టపడి అతను చక్కటి “గుమ్మడికాయల” పంటను పండించాడు. ఆ గుమ్మడికాయలు ఇంద్రధనస్సులోని రంగులతో చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి. మల్లెపూల వాసన వెదజల్లుతూ ,తేనె వలె ఎంతో తియ్యగా ఉన్నాయి. అంతేకాకుండా అవి నాలుగు , కాళ్ళు,తొండము మరియు తోకతో ,చూడటానికి వింతగా, ఏనుగులా ఉన్నాయి.

elephants-9a

ప్రత్యేకంగా ఉన్న ఈ గుమ్మడికాయను మాధవ,రాజుగారికి బహుమానంగా ఇద్దాముకున్నాడు. రాజధానికి వెళ్ళి రాజుగారికి ఈ గుమ్మడికాయను ఎంతో వినయంతో సమర్పించాడు . రాజుగారు మాధవ తనకు ఇచ్చిన బహుమానాన్ని మెచ్చి అతనికి నిజంగానే ఒక ఏనుగును బహూకరించారు.
ఇది విన్న కేశవ చాలా అసూయ పడ్డాడు. అతనికి ఆ రాత్రంతా అస్సలు నిద్ర పట్టలేదు. తాను కూడా రాజుగారి నుండి ఇంకా ఎంతో విలువైన బహుమతిని పొందాలనుకున్నాడు. రాజు గారికి ఉత్తి గుమ్మడికాయ ఏనుగుని ఇచ్చి మాధవ నిజమైన ఏనుగుని పొందినప్పుడు… నిజమైన ఏనుగుని రాజుగారికి బహుమానంగా ఇచ్చి ఏకంగా ఒకటో రెండో ఊళ్ళని రాజుగారి నుండి బహుమానంగా పొంది గొప్పజమీందారు అయిపోదామనుకున్నాడు,కేశవ.

ఆ మరునాడే తన పొలాన్ని,ఆవుల్ని,గొర్రెలని ,మేకలని అమ్మేశాడు. దానివల్ల వచ్చిన డబ్బుతో ఒక పెద్ద ఏనుగును కొని రాజుగారి వద్దకి తీసుకుని వెళ్ళాడు. ఒక సాధారణమైన రైతు అంత ఖరీదైన బహుమానాన్ని ఇవ్వటం ,రాజుగారిని ఆశ్చర్యపరిచింది. అతనిపై అనుమానం కలిగిన రాజుగారు తన మంత్రిని అసలు విషయమేంటో కనుక్కుని అతనికి తగిన బహుమతిని ఇచ్చి పంపమని ఆదేశించారు. కేశవతో కొంత సేపు ముచ్చటించగానే ,అతనికి మాధవ పట్ల ఉన్న అసూయే దీనంతటికి కారణమని గ్రహించాడు మంత్రి.”మహారాజా ! మీరు నిన్న ఒక గుమ్మడికాయకి బదులుగా ఆ రైతుకి ఒక ఏనుగుని బహూకరించారు కదా ,అదే విధంగా ఈ రైతుకి కూడా అతను మీకిచ్చిన ఏనుగుకి బదులుగా మంచి గుమ్మడికాయను బహూకరించండి”, అని చక్కటి సలహాను ఇచ్చాడు,తెలివైన ఆ మంత్రి.

ఈ విధంగా అసూయ కారణంగా తన ఆస్తంతా కూలిపోయిన కేశవ బాధతో కుమిలిపోయాడు

నీతి:“అసూయ “అనబడే దుర్గుణము పతనానికి దారి తీస్తుంది. కాని, నిస్స్వార్దంతో చేసే ఏ పనైనా గుర్తింపును పొందుతుంది.
మూలము: బాలవికాస్ గ్రూప్ 2-గ్రంథము