బాలగోవిందం -ఆరవ శ్లోకము

ఆరవ  శ్లోకము

శరీరం కేవలం ఒక పరికరమేనని గుర్తించాలి

bg6

 

యావత్-పవనో నివసతి దేహే

తావత్-పృచ్ఛతి కుశలం గేహే |

గతవతి వాయౌ దేహాపాయే

భార్యా బిభ్యతి తస్మిన్ కాయే.

భజగోవిందం భజగోవిందం || 6 ||

అనువాదం                                    

ఆడేదాకా వంట్లో ప్రాణం

అడిగెదరింట్లో అంతా కుశలం

హంస లేచెనా శవమునుచూడగ

భార్యకునయినా భయ భీతాహం

భజగోవిందం భజగోవిందం || 6 ||

తాత్పర్యము:

శరీరంలో ప్రాణం ఉన్నంతవరకు ఇంట్లో అందరు క్షేమాన్ని అడుగుతుంటారు. ప్రాణం పోగానే దేహం పతనము అవుతుంది.  ఆ కళేబరాన్ని చూసి భార్య కూడా భీతి చెందుతుంది. గోవందుని భజించు . గోవిందుని కీర్తించు. ఓమందమతీ గోవిందుని సేవించు.

 

విద్యార్థులకొరకు కథ :

విలువ :ప్రశాంతత

ఉపవిలువ : వైరాగ్యము.

bg6a

 

ఒక రాజ్యం లో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను ఆ రాజభవంతి దగ్గరలో ఉంటూ రోజూ, ఆ భవంతిలోని రాజుగారిని దూరం నుండి చూస్తూ  ఉండేవాడు. ఒకరోజు రాజుగారు అందరికీ  విందు ఇస్తున్నారు అనేవార్త  విన్నాడు. అంతేకాదు రాజు లాగా తయారైన వారెవరైనా సరే విందుకు రావచ్చట అని తెలుసుకున్నాడు. ఇది విన్న ఆ బిచ్చగాడికి ఒక ఆశ పుట్టింది.  తన దుస్తులు చూసుకున్నాడు అన్ని చిరిగిపోయాయి.  ఎలాగైనా రాజుగారి దుస్తులలాంటివి సంపాదించాలని అనుకున్నాడు.

రాజభవనము  దగ్గరకి వెళ్లి కాపలా వారిని బ్రతిమిలాడి, దర్బారులోకి ప్రవేశము సంపాదించాడు. ఎంతో ధైర్యం కూడగట్టుకొని , చాలా  వినయంగా రాజు దర్భారులోకి ప్రవేశించాడు. అతన్ని చూడగానే రాజు. “నీకేమి కావాలి” అని అడిగాడు .దానికి ఆ బిచ్చగాడు రాజు గారికి వంగి వంగి దండాలు పెడుతూ ఇట్లా అన్నాడు. “రాజా! నాకు  మీరు ఇస్తున్న విందుకు రావాలని వుంది. దయచేసి తమ పాత  దుస్తులు ఇప్పిస్తే అవి ధరించి విందుకు వస్తాను. నా  దగ్గర చినిగిన బట్టలు మాత్రమే ఉన్నాయి.

రాజుగారు వెంటనే తన పాత  దుస్తులను  తెప్పించి బిచ్చగాడికిస్తూ “ఈ దుస్తులు చినిగిపోవు, మాసిపోవు వాటిపై దుమ్ము పడదు ,ఎందుకంటే ఇవి ఎంతో ప్రత్యేకమైనవి. నీవు ఎప్పటికి వీటిని ధరించవచ్చు”.  అన్నాడు.  బిచ్చగాడి ,కళ్ళ వెంట నీరు రాగా రాజుగారికి ధన్యవాదములు చెప్పాడు. ఆ దుస్తులు తన గదికి తెచ్చుకొని  ధరించి  అద్దములో చూచుకొని  మురిసిపోయాడు బిచ్చగాడు . అయితే రాజు గారు ఎంత చెప్పినా, బిచ్చగాడికి ఆ రాజూ గారి  దుస్తులు చినిగిపోతే ఎట్లా అనే భయం పట్టుకొంది . ఎందుకైనా మంచిదని పాతదుస్తులన్నీ ఒక మూట కట్టి తనవెంట త్రిప్పేవాడు. రాజా దుస్తులు చినిగితే తన పాత దుస్తులు ధరించవచ్చు అని.  రాజుగారిచ్చిన విందు భోంచేస్తున్నంతసేపు  ఆనందంగా  లేదు.  బైట  ఎక్కడో దాచిన తన పాత  దుస్తుల మూట ఎవరన్నా  ఎక్కడన్నా   పారవేస్తారేమో అని భయం. క్రమంగా  రాజుగారి మాటలలోని సత్యం తెలిసివచ్చింది . ఎన్ని రోజులు ధరించినా  దుమ్ము పడలేదు . కొత్తవిగానే వున్నాయి. కానీ తన పాత  దుస్తులపై  మమకారంతో  ఆ మూట వదిలేవాడు కాదు. అతని తోటి వారు అతనిని చూసి, ధరించిందేమో రాజు దుస్తులు మోసేదెమో  పాత గుడ్డలు అని హేళన చేస్తూ ,  “పీలిక గుడ్డల మనిషి ” అని పేరు పెట్టారు.  చివరగా ఆ బిచ్చగాడు చనిపోవుటకు సిద్ధముగా ఉండి  మంచం పై నుండి లేవలేక పోయేవాడు రాజుగారికి ఈ సంగతి తెలిసి బిచ్చగాడిని చూడటానికి  వచ్చాడు. బిచ్చగాడు అవసాన దశ లో వున్నాడు . రాజును  చూసి కన్నీరు  కార్చి  అతి కష్టం మీద నమస్కరించాడు.

bg6b

రాజుగారు అతని తలగడ దగ్గర ఉన్న  పాతబట్టల మూటను చూశారు.  అది చూసి, ఎంత విలువైన  చిరగని ,తరగని  దుస్తులు ధరించినా కూడా  బిచ్చగాడికి ,ఆ పాత బట్టల మూటపై వ్యామోహం పోలేదు. వాటి  సంరక్షణ కోసమే జీవితం అంతా గడిపి , ఏ రోజూ సంతోషమును పొందలేదు గదా !  అని రాజు గారు బాధ పడ్డారు.

నేర్చుకోవలసిన విషయము:

ఇది ఒక బిచ్చగాడి కథ మాత్రమే కాదు! మనం  అందరమూ కూడా ఈ  అనుభవాల మూటలను పట్టుకొని, వదలకుండా  మోస్తూ ఉంటాము . అవి ఏమిటంటే  శత్రుత్వము, ఈర్ష్య ,ద్వేషము ,కోపము ,తన భాధలు మొదలగునవి ఎన్నో జ్ఞాపకాలు . అంతే కాదు ఈ భావనలతో మాటి  మాటికీ దుర్గుణాలను, దుఃఖాన్ని  గుర్తుతెచ్చుకుంటూ  జీవితంలోని అందమైన ,సంతోషమైన  వాటిని   అనుభవించలేము , గుర్తించలేము కూడా !ఎపుడో ,ఎక్కడో జరిగిన సంఘటనలను  ఎక్కడకిక్కడ ,ఎప్పటికప్పుడు  వదలకుండా ఒక పెద్ద పనికిరాని పాతబట్టల మూట లాగా ,ఆ జ్ఞాపకాల బరువును మోస్తూ  ఉండటమే  అనేక  బాధలకు , అశాంతికి   కారణము.

రాజభవనంలోని వారు  బిచ్చగాళ్ళ  లాగా జీవిస్తారు. అనాధ ఆశ్రమాల్లో కొందరు రాజులాగా జీవిస్తారు. ఇదంతా  బాహ్యంగా కనపడేది కాదు . అంతరంగ దృక్పదమే  మూలకారణము.  మనం ఎప్పుడూ గడిచిన భాదాకరమైన  అనుభవాలను  మళ్ళీ  మళ్ళీ  గుర్తుచేసుకుంటూ,,ఎపుడూ  నిరాశతో అనేక  పనికిరాని  వస్తువులపై  మమకారంపుచుకుని  వాటిని  వదిలించుకోలేక  జీవితం పై  విరక్తి భావనతో నిర్జీవంగా  గడుపుతాము .  ఈ  మానసిక భాదలు పడటం అలవాటు అయితే  దేనిమీదా శ్రద్ధ లేకుండా నిరాశావాదిగా ఉంటూ  చేయవలసిన  కర్తవ్య పాలనపై మనసు  పెట్టము. ఈ   విధంగా జీవితం  అంతా  వృధా చేసుకుంటూ ఇల్లే కాదు మనస్సుని అనవసర వ్యర్ధ ఆలోచనలతో   నింపిన చెత్తబుట్ట  చేస్తాము.  సంతోషమునకు  కారణం అక్కర్లేదు. మనం  అహంకారాన్ని పెంచి పోషిస్తూ  జీవితంలో ఎన్నో బంగారం లాంటి అవకాశములను  పోగొట్టుకుంటాము .  దుఃఖపడటం అహకారం లో ఒక భాగమే . అందువల్ల  ప్రతి సంఘటన  బరువుతో, నరాలుతెగుతాయేమో అన్నంత ఉద్విగ్నతతో, ఎంతో ఆందోళనతో , బావోద్వేగాలతో , అహంకార పూరిత  మనసుతో ఎపుడూ  నిప్పుల  మీద నడకలాగా  ఉంటుంటాము . అహంకారము , ప్రశాంతత  కలసివుండవు .

ఒక కాకి  ఒక మాంసపు  ముక్కని నోట కరుచుకొని  ఎగురుతుంటే ఆ ముక్క కోసం మిగతా పక్షులు  దాని వెంట పడసాగాయి .  దీనితో విసిగిన ఆ కాకి ఆ మాంసపు ముక్కను వదిలేయగా , మిగతా పక్షులు ఆ కాకిని  తరమటం  మానేసి మాంసం  ముక్కవైపు వెళ్లాయి . అపుడు ఆ కాకి అనుకుంది ఈ చిన్న మాంసం  ముక్క వదిలేసి,  మళ్ళీ ఆకాశంలో  నా స్వేచ్ఛ నేను అనుభవిస్తున్న గదా అని.

ఎక్కడికక్కడ మానసిక అశాంతి కలిగించే ఆలోచనలు వదిలేసి భగవంతుని శరణాగతి చెయ్యాలి . మనం యువకులుగా ఎదుగుతున్న సమయంలో మన తల్లి తండ్రుల మాటలకంటే, స్నేహితుల సలహాలకు ఎక్కువ విలువ యిస్తుంటాము. నా స్నేహితులు అనే భావన పెంచుకొని , ఎప్పుడు వారి  స్నేహం నిలబెట్టుకోవటంలోనే తపిస్తూవుంటాము . మన స్నేహితులు వేరే వారితో ఎక్కువ స్నేహంగా ఉంటే భరించలేము.  ఈ భావన స్నేహితులతో మాత్రమే కాదు ,బంధువుల విషయంలో కూడా ఇంతే . కొన్ని  స్నేహాలు చిరకాలం ఉంటాయి ,కొన్ని తక్కువ రోజులే ఉంటాయి . పరిస్థితుల ప్రభావంతో స్నేహితులు, బంధువులు, దూరమవుతారు . మనం ఎంత ప్రయత్నించి పట్టుకొని వున్నా కూడా దూరమవుతారు . అందువల్ల ఎంతో బాధ పడతాము . ఆ  విషయం పై   బాధపడటం అనేది తరగనిది .  ఎవరితో నైనా ఎంతో ప్రేమగా స్నేహం చేయవచ్చు. బంధువులతో నైనా  సరే ఆ బంధం పై  అతి మమకారం పెంచుకొని, వారిమీద ఆధారపడితే  తప్పకుండా మనల్ని మనము భాదించుకున్నట్లే .

అందుకని  రోజులో కొంత సమయం మౌనంగా  కూర్చుని ,భగవంతుని ధ్యానిస్తూ ,ఆయన మనకిచ్చిన ఎన్నో విషయాలకు కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే భగవంతుని  ఆశీర్వచనము  వలననే  మనం ఈ రోజు ఈ విధంగా వున్నాము. ఈ విధంగా నిరంతర భగవత్ చింతన , ధ్యానం  వల్ల మానసిక శక్తి పెరుగుతుంది. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జరుగుతున్న సంఘటనల వల్ల  మనము  ఏమి నేర్చుకున్నాము?, అని ఆలోచించుకోవాలి. మానసిక ప్రశాంతత అలవర్చుకోవాలి.

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s