ఈశ్వరుడే ఐశ్వర్యానికి కారకుడు

ఐశ్వర్యానికి కారకుడు ఈశ్వరుడు
విలువ : ప్రేమ
అంతర్గత విలువ: వినయం

img_9950

ఈశ్వరుడి(శివుడు) అనుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహంకారం కలిగింది. అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలి అనుకున్నాడు.దేవతలందరినీ ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళేడు. “శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు, నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్య పోతాడు. ఎంత బాగుందో! “అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతలలో నా కీర్తి పెరుగుతుంది అనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు.

శివుడు సర్వాంతర్యామి. అందరి ఆలోచనలను గ్రహించగలడు. కుబేరుడి పిలుపులో ఉన్న ఆంతర్యాన్ని పసిగట్టాడు.పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్థం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి, మహాదేవా! మీరు , పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తానుకూడా రానన్నది పార్వతీ దేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే ‘అమ్మా! ఆకలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు’ అన్నాడు గణపతి. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి ‘కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు’ అనగా, శివుడు ‘ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు’ అన్నాడు పరమశివుడు.

“ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకోచ్చేది!”ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని
అలకాపురిలో ఉన్న తన భవనంలోకి తీసుకెళ్ళి,అక్కడ ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపించసాగాడు.”ఇవన్నీ వ్యర్థం! ఆహారం పెట్టండి “అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారిని ఆజ్ఞాపించాడు.

వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్ధలు, పానీయాలు, కూరలు, పండ్లు గణపతికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞాపించాడు.సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు.

వంటవారికి ఆహారం వండడం, గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. విషయం కుబేరునికి తెలిసింది. తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్ అంటూ పలికాడు. కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్నీ ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.

శివా! శంకరా! నీవే దిక్కు. ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు “కుబేరా! నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకుని, అహంకారం విడిచి, చేసిన తప్పు ఒప్పుకుని పరమ భక్తితో గణపతికి సమర్పించు ” అన్నాడు.
కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు.

నీతి:మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. కుబేరుడి అహకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని అహకారాన్ని కూడా పటాపంచలు చెయ్యాలని కోరుకుందాం.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s