Archive | May 2015

మనస్సును గెలవగలిగితే ప్రపంచాన్నే గెలవగలం, విలువ- ప్రేమ, అంతర్గత విలువ—భక్తి

గుజరాత్ రాష్ట్రంలో మెషో నదీ తీరంలో మహూడియా ప్రాంతంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు పేరు జీవన్ భాయ్. అతడు ఆ నది మధ్యలో తనకు గల కొద్దిపాటి లంక భూమిలో చిభాడియా పండ్లతోటను పెంచాడు. అతని భార్య కేసరి భాయ్ కుమారుడు షాలుక్ ఆ తోటను పెంచడంలో అతనికి ఎంతగానో సహాయ పడ్డారు. ఒకరోజున షాలుక్ తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా మన తోటలో ఒక పండు తీసుకొని వెళ్లి షిరిజీ మహారాజ్ స్వామీజీ కి సమర్పిస్తాను. ఆ పండు తిని ఆయన ఎంతో సంతోషిస్తారు. ఆయన నేనిచ్చిన పండు రుచి చుస్తే మనం చాలా అదృష్ట వంతులం అన్నాడు.  తల్లితో ఇలా చెప్పి షాలుక్ మరునాడు ఉదయమే ఒక పండు తీసుకొని స్వామీజీ వద్దకు  బయలు దేరాడు. కొంచెం దూరం వెళ్ళే సరికి షాలుక్ కి నోరు ఊరడం మొదలైంది.  ఆ పండు తినాలని షాలుక్ కి కోరిక పెరుగుతూ వచ్చింది.

నిజంగా నేనిచ్చే ఈ చౌక రకం పండు స్వామీజీ తీసుకుంటారా? ఆయనకు పెద్ద పెద్ద వాళ్ళు చాలా ఖరీదైన తిను బండారాలు సమర్పిస్తారు కదా అనుకున్నాడు. ఆ పండు తనే తినెయ్యాలని కోరిక ఎక్కువ కాసాగింది. ఒక చెట్టు క్రింద కూర్చొని తన సంచిలో చాకు తీసుకుని ఆ పండును ముక్కలుగా కోయాలని అనుకున్నాడు. ఇంతలో షాలుక్ కి ఎవరో ఇలా చెప్పి నట్లనిపించింది. ఓ షాలుక్ నీకు అసలు నిగ్రహం లేదు. స్వామీజీ కి అని తెచ్చిన పండు నీవెలా తింటావు. స్వామీజీ మీద నీ భక్తి ఏమైంది?  ఈ ఆలోచన రాగానే మనస్సును చిక్క బట్ట్టుకుని  పండును స్వామీజీకి సమర్పించాలని నిర్ణయించుకుని మళ్ళీ నడవడం మొదలు పెట్టాడు. మరి కొంత దూరం వెళ్లేసరికి షాలుక్ కి విపరీతంగా దాహం వేసింది. మళ్ళీ అతనికి ఇలా అనిపించింది. ఓరీ మూర్ఖుడా ఆకలి, దాహం తీర్చుకుని ఇంటికి పో. స్వామీజీకి గొప్పవాళ్ళు రుచికరమైన ఖరీదైన పళ్ళు సమర్పిస్తారు. నీవిచ్చే పండు ఏ మూలకు? ఈ చౌకబారు పండు స్వామీజీకి అసలు ఇష్టమే ఉండదు. ఈ ఆలోచన రాగానే మళ్ళీ పండు తినడానికి సిద్ధపడ్డాడు.

అతడు చెట్టు కింద కూర్చుని పండు ముక్కలు గా కోయడానికి సిద్ధపడే సరికి  నీవు నిజంగా స్వామీజీ భక్తుడవే ఐతే వెళ్లి ఆ పండు స్వామీజీకి సమర్పించు. అని చెప్పినట్లనిపించింది.  ఈసారి ఆ పండు తాను తినకూడదని స్వామీజీకే సమర్పించాలని గట్టిగా నిర్ణయించుకుని మహారాజ్ స్వామి నారాయణ్ కీ జై, మహారాజ్ స్వామినారాయణ్ కీ జై అని అనుకుంటూ స్వామీజీ ఆశ్రమానికి బయలు దేరాడు. షాలుక్ ఆశ్రమానికి వెళ్లేసరికి స్వామీజీ భక్తుల మధ్యలో కూర్చుని ఉన్నారు. ఆయన కీర్తనలు పాడుతున్నారు. స్వామీజీ దివ్యమైన ఆకారాన్ని చూసి షాలుక్ ముగ్ధుడై పోయాడు. స్వామీజీ షాలుక్ మనస్సులోని ఆలోచనలన్నీ గమనించారు. షాలుక్ ను తన దగ్గరకు రమ్మని సంజ్ఞ చేసారు. షాలుక్ ఆశ్చర్య పడుతూ తన చేతిలోని పండు స్వామీజీ కి సమర్పించేడు;. నీ చేతి సంచి లోని చాకు కూడా ఇయ్యి దీనిని నేను కోసుకుతింటాను అన్నారు. ఒక్కొక్క ముక్కనే కోసుకుని స్వామీజీ ఆ పండును పూర్తిగా తినేసారు. ఇది చూసి భక్తులంతా ఆశ్చర్యపోయారు. స్వామీజీ షాలుక్ చేతిలో బర్ఫీలతో నిండి ఉన్న ఒక పాత్రను పెట్టి మరొకసారి షాలుక్ తో పాటు అందరినీ ఆశ్చర్యం లో ముంచేశారు. తరువాత భక్తులతో ఇలా చెప్పారు.

Clipart-Of-A-Hand-Carrying-A-Shopping-Basket-Full-Of-Orange-Fruit-Royalty-Free-Vector-Illustration-10241250889ఈ పిల్లవాడు నాకోసం ఈ పండు తీసుకొని వస్తూ త్రోవలో అనేక రకమైన ఆలోచనలతో సతమత మయ్యాడు. ఎంతో మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నాడు. ఓటమిని అంగీరించక చివరకు తన మనస్సుతో పోరాడి గెలిచాడు. భగవంతుడూ, సత్పురుషులూ ఎప్పుడూ మనస్సుకు లొంగకుండా మనస్సును జయించడానికి ప్రయత్నించేవాళ్లకు సహాయ పడతారు.

స్వామీజీ ఆ పండు మీద కోరికతో దాన్ని తినలేదని షాలుక్ హృదయ పూర్వకమైన భక్తికి ముగ్ధులై మాత్రమే దాన్నితిన్నారని అక్కడ ఉన్నవాళ్ళంతా గుర్తించారు. అందరూ షాలుక్ ని మెచ్చుకున్నారు.

 

 

నీతి : మనం మన మనస్సును జయించగలిగితే ప్రపంచాన్నే జయించగలం.

 

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

Advertisements

మిణుగురు పురుగు, కాకి : విలువ : అహింస, అంతర్గత విలువ: సమయస్పూర్తి

అనగనగా ఒక అడవిలో ఒక మిణుగురు పురుగు వుండేది. అడవిలో సంతోషంగా తిరుగుతూ వుండేది. ఒక రోజు ఒక కాకి వచ్చి ఆ మిణుగురు పురుగును తినబోయింది.

979739-A-single-funny-little-green-smiley-grasshopper-Stock-Vector-cricket-grasshopper-insectనోరు తెరిచిన కాకి తనను మింగేలోపు, “ఆగు! నా మాట వింటే నీకే మేలు” అని అరిచిందా పురుగు.

కాకి “ఏమిటది” అని అడిగింది.

“నీకు నా లాంటి చాలా పురుగులున్న  చోటు ఒకటి  చూపిస్తాను. నన్ను తినేస్తే నీకేమీ లాభం లేదు” అన్నదా పురుగు. కాకి అత్యాశతో ఒప్పుకుంది.

ఆ పురుగు కొంత మంది మనుషులు చలిమంట కాసుకుంటున్న చోటుకు తీసుకు వెళ్ళింది. నిప్పురవ్వలను చూపించి అవన్ని మిణుగురు పురుగులని చెప్పింది.

 
Crow  కాకి ఆ అని నోరు తెరుచుకొని ఆ నిప్పు రవ్వలను మింగేసింది.  నోరు కాలింది. బాబోయి,     ఈ మిణుగురు పురుగలను మనం తినలేమని ఎగిరిపోయింది.

ఆ పురుగు “బలం కన్నా బుద్ధి గొప్పది ” అని తన సమయస్ఫూర్తిని తనే మెచ్చుకుంది.

 

 

 

నీతి:  సమయస్ఫూర్తి  అనేది ఒక కళ. దీనిని అవసరమైనప్పుడు మరియు ఆత్మరక్షణకు ఉపయోగించుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళాలి కాని తెలివితేటలు ఉన్నాయి కదా అని అహంకారంతో మన తోటివారిని ఇబ్బంది పెట్టకూడదు.

 

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

భగవంతుడిని నిజంగా చూడగలమా, విలువ: ధర్మము, అంతర్గత విలువ : దుర్గుణములను అరికట్టుట

ఒక  సూఫీ గురువు కొండపైన  నివసించేవాడు. నెలకి  ఒకసారి  కిందకి దిగి  ఊరికి  వెళ్ళేవాడు.

అలా   ఒకసారి ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ సూఫీని   ఒక వ్యక్తి”   నాకెందుకు భగవంతుని దర్శనం కావట్లేదు .   నేను  ఎందుకు   దేవుడిని చూడలేకున్నాను? మహాత్మా ,  మీరు  నాకు ఈ విషయంలొ సహాయం చేయగలరా అని వినయంగా అర్ధిస్తాడు.

సూఫీ , “తప్పక చేస్తాను నాయనా ” కానీ , దానికి బదులుగా నీవు నాకు ఒక సహాయం చేయాలి  చేస్తావా ? అని అడుగుతాడు. తప్పక   చేస్తానండి ఇంతకీ  ఏమి  చేయాలి అని అన్నాడు ఆ వ్యక్తి

సూఫి , నాయనా నీవు సమాన  పరిమాణంలొ ఉన్న ఐదు రాళ్ళను కొండపైకి ,నేను నివసించే చోటికి తేగలిగితే అక్కడ నా ఆశ్రమానికి బయట ఒక చిన్న అరుగు కట్టుకుందాము అనుకుంటున్నాను తెఛ్ఛిపెట్టగలవా ? అని  కోరతాడు.  దానికి సాధకుడు అంగీకరిస్తాడు.

సరే ఇక   ఇద్దరూ ఒకేసారి  కొండపైన ఉన్న సూఫి ఆశ్రమానికి బయలుదేరతారు. దారిలోనే  ఆ రాళ్ళ  బరువుకి ఆ వ్యక్తి అలిసిపోతాడు.

అది గమనించిన సూఫి “ఒక రాయిని ఇక్కడే వదిలెయ్యి నాయనా కొంత బరువు తగ్గి , నడక  సులువు అవుతుంది  అని సలహా ఇస్తాడు. సాధకుడు సూఫి మాటవిని ఒక రాయి వదిలేసి ముందుకు నడుస్తాడు. అయినా  కూడా కొంతదూరానికే అతను  అలసిపోతాడు. మళ్ళీ సూఫి సలహా మేరకు రెండవ రాయిని కూడా దారిలో వదిలేసి ముందుకి సాగుతాడు. ఇలా అలిసిపోయినప్పుడల్లా , ఒక్కొరాయిని పడేసుకుంటూ అన్ని రాళ్ళని కొండపైన ఉన్న ఆశ్రమానికి చేరకుండానే మార్గ మధ్యంలో వదిలేస్తాడు.

 

అప్పుడు ఆ సూఫి సాధకునితో “ఇప్పుడు నీకు నేను భగవంతుడుని  చేరేందుకు సులువు మార్గాన్ని చూపించాను” అని తెలుపుతాడు.

ఇది  విన్న సాధకుడు వెంటనే ఆశ్చర్యంతో   “నాకేమి దేవుడు కనిపించలేదే మరి?” అని నిరుత్సాహంగా జవాబు చెప్తాడు.

 

Guru-and-disciple-thumb-297x300అప్పుడు సూఫి ,”నాయనా నేను నిన్ను ఆశ్రమానికి తెమ్మన్న అయిదు రాళ్ళు –కామ, క్రోధ ,లోభ,కోరికలు, అహంకారములకు  సంకేతాలు.

వీటిని  ముందు అరికట్టే ప్రయత్నం చెయ్యి. అయితే  ముందుగానే  నేను నిన్ను హెచ్చరించాలి. నేను చెప్పే అయిదు దుర్గుణములను అణిచివేయటం అంత తేలికైన విషయం కానేకాదు. నీవంతు కృషి ఏ లోపం లేకుండా  చేస్తే నేను కూడా నావంతు సహాయం చేస్తాను అని మా ట ఇస్తున్నాను.

 

ఏనాడైతే నీవు ఈ దుర్గుణములను జయిస్తావో , అప్పుడు నీకు భగవంతునికి మధ్య ఉన్న తెరలు వీడిపోయి ,చాలా సునాయసంగా నీకు భగవంతుని దర్శనం లభిస్తుంది. సాధకుడిని సూఫి నేర్పిన గుణపాఠం  బాగా ప్రభావితం చేసింది. తిరిగి ప్రశ్నించకుడా అతడు సూఫి అడుగుజాడలలో తన ప్రయాణాన్ని కొనసాగించాడు.

 

నీతి: మనలోనే దాగి ఉన్న కామ,క్రోధ ,లోభ , మోహ ,మద ,మాశ్చర్యములనే దుర్గుణములను మనం జయించగలిగితే తప్పక దైవాన్ని సులభంగా దర్శించగలుగుతాము. తద్వారా చక్కటి దివ్యానుభూతిని  ,ఆనందాన్ని పొందగలుగుతాము.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu