భగవద్గీత వైశిష్ట్యం, విలువ:- నిజాయితీ, అంతర్గత విలువ:- పరివర్తన

 

ఒక ముసలివాడు తన మనుమని తో కలసి తన పొలంలో నివాసం ఉంటున్నాడు. ఆ ముసలివాడు ప్రతి రోజు ఉదయం లేవగానే వంటింట్లో తన టేబుల్ వద్ద కూర్చుని భగవద్గీతను శ్రద్ధతో చదువుతూ ఉండేవాడు. మనుమడు తాతను అన్నివిధాల అనుకరిస్తూ ఆయనలాగే ఉండాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఒకరోజు పిల్లవాడు తాత దగ్గరికి వెళ్లి, తాతా; నేను నీలాగే భగవద్గీత చదవాలని ప్రయత్నం చేస్తున్నాను. కాని నాకు ఒక్క ముక్క కూడా అర్ధం కావడం లేదు. ఏ కొంచెమైనా అర్ధమైనా పుస్తకం మూసివేసేసరికి మరిచిపోతున్నాను అని అడిగాడు. మౌనంగా పొయ్యిలో బొగ్గులు వేస్తున్న తాత వెనుకకు తిరిగి బొగ్గులు పొయ్యి లో వేసిన తరువాత ఖాళీ అయిపోయిన బుట్టను మనవడికి ఇచ్చి ఈ బుట్టతో నదికి వెళ్లి నీళ్ళు పట్టుకురా అని పిల్లవాడితో చెప్పాడు.

boy waterపిల్లవాడు నీళ్ళు ముంచుకుని తిరిగి వచ్చాడు. వచ్చే సరికి బుట్టలోని నీళ్లన్నీ కారిపోయాయి. మళ్ళీ వెళ్లి మళ్ళీ తెచ్చాడు. మరల నీళ్ళు కారిపోయాయి. ఖాళీ బుట్ట మాత్రము మిగిలింది. తాత పిల్లవాడిని చూసి నీవు ఇంకొంచెం తొందరగా తిరిగి రావాలి. అని చెప్పాడు. పిల్లవాడు పరుగు పెట్టుకుంటూ తిరిగి నీళ్ళు పట్టుకువచ్చాడు. ఈసారి కూడా ఖాళీ బుట్ట మాత్రమే మిగిలింది. బుట్టతో నీళ్ళు తేవడం అసాధ్యం అని పిల్లవాడికి అర్ధమైంది. బాల్చీతో తెద్దామని బాల్చీ కోసం వెళ్ళాడు. తాత పిల్లవాడిని చూసి నాకు కావలసింది బుట్టతో నీళ్ళు కాని బాల్చీతో కాదు అని చెప్పాడు. బుట్టతో నీళ్ళు తేవడం అసాధ్యం అని తాతకు తెలియచెప్పాలని పిల్లవాడు నిర్ణయించుకొని మళ్ళీ నదికి వెళ్లి నీళ్ళు పట్టుకుని వేగంగా తిరిగి వచ్చాడు. ఈ సారి కూడా ఖాళీ బుట్ట మిగిలింది. నీళ్ళు పూర్తి గా కారిపోయాయి. బుట్టతో నీళ్ళు తేవడం సాధ్యం కాదు ఇది ఉపయోగం లేని పని నీకు తెలియడం లేదా అని పిల్లవాడు తాతను అడిగాడు.

అప్పుడు తాత పిల్లవాడితో ఒకసారి బుట్ట వైపు సరిగా చూడు అని చెప్పాడు. పిల్లవాడు బుట్టకేసి చూసి  ఇంతకు  ముందు కంటే బుట్ట తేడాగా కనిపిస్తోందని గమనించాడు. అసహ్యంగా ఉన్న ఆ బొగ్గుల బుట్ట లోపల, పైన కూడా శుభ్రంగా ఉంది. అప్పుడు తాత పిల్లవాడితో ఇలా చెప్పాడు. నీళ్ళతో కడిగితే ఆ బుట్ట ఎలా శుభ్రపడిందో అలాగే భగవద్గీత చదవడం వల్ల నీకు అది అర్ధం అయినా కాకపోయినా, గుర్తు ఉన్నా లేకపోయినా, బయట, లోపల నీలో పరివర్తన కలుగుతుంది. భగవద్గీతను మనకు ప్రసాదించి శ్రీకృష్ణుడు మన జీవితాలలో తెచ్చే మార్పు ఇదే. ఇలా తాత వివరించి చెప్పేసరికి పిల్లవాడికి కనువిప్పు కలిగింది.

నీతి:- గొప్పవాళ్ళ ఉదాత్తమైన బోధనలు, భగవద్గీతలాంటి ఉదాత్తమైన మత గ్రంధాలు సంఘంలో మనం ఎలా మసలుకోవాలో, ఆధ్యాత్మిక విలువలని ఎలా పెంపొందించుకోవాలో మనకు తెలియ జెప్పి ప్రతివారు తమను ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారుగా తీర్చిదిద్దుకోవడానికి ,తోటివారిని ఆవిధంగా తీర్చిదిద్దడానికి సహకరిస్తాయి.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

Leave a comment